- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నీ అదానీ పరమేనా?
ఇటు రాష్ట్రం, అటు కేంద్రం 21 ఏండ్లుగా బొగ్గు సంస్థలకు ఒక్క పైసా బడ్జెట్ ఇవ్వలేదు. కేటాయింపులు లేవు. ఇదీ ప్రభుత్వ రంగంలోని సింగరేణి, కోల్ ఇండియా పరిస్థితి. బొగ్గు గనుల ప్రాంతం కార్మిక యూనియన్లు, ప్రజాప్రతినిధులు ఒక్కటిగా ఉండి కోల్ ఇండియా, సింగరేణిని కాపాడుకోవాలి. బడ్జెట్‌లో కేటాయింపులు ఉండాలి. గుర్తించిన బొగ్గు బ్లాక్‌లను దేశంలోని 12 బొగ్గు నిక్షేపాలు ఉన్న రాష్ట్రాలలో గతంలోని పద్ధతులలో కేటాయించాలి. ఎంప్లాయిమెంట్ జనరేట్ చేయాలి. ఖాళీలను భర్తీ చేయాలి. అప్పుడు 2040 నాటికన్నా ముందే దేశానికి అవసరం ఉన్నంతగా బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశాలు ఉంటాయి. ఆ దిశన కేంద్రం ఆలోచించి, అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకొని రావాలి. లేదా అదానీలాంటి ఐదారుగురు కార్పొరేట్లు బొగ్గు, విద్యుత్ రంగాన్ని సంపూర్ణంగా కబ్జా చేసేస్తారు. వందలో పది ఉద్యోగాలు కూడా రావు. మిగలవు. బుద్ధిజీవులు అప్రమత్తం కావాలి.
భారతదేశంలో బొగ్గు నిక్షేపాలకు కొరత లేదు. మరో 200 ఏండ్లు తీసినా తరగని నల్లబంగారం ఉంది. దీంతో ఇప్పటికే బొగ్గు, విద్యుత్ వ్యాపారంలో ఉన్న అదానీ కన్ను మొత్తంగా బొగ్గు, విద్యుత్ రంగం మీద పడింది. ప్రభుత్వ రంగాలను అదానీ, అంబానీ ఇప్పటికే మింగేస్తున్న సంగతి తెలిసిందే. అదానీ విదేశీ, స్వదేశీ అంతా తానే అనే ప్రమాదం పొంచి ఉంది. మన దేశంలో 18 ఏండ్లలో బొగ్గు, విద్యుత్ అవసరాలు పెరగనున్నాయి. డిమాండ్ డబుల్ కానుంది.
దేశంలో అప్పటికి డిమాండ్‌కు తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరుగని పక్షంలో 350 మిలియన్ టన్నుల వరకు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది.బొగ్గు కొరతతో ఇప్పటికే దేశంలో మూడు వేల రూపాయలకు టన్ను లభించే బొగ్గు విదేశాలలో 25 వేల నుంచి 30 వేల రూపాయలకు కొనే పరిస్థితి ఉంది. ఇప్పటికే కోల్ ఇండియా 12 మిలియన్ టన్నులు బయటి నుంచి కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. సింగరేణి విద్యుత్ వినియోగదారులకు ఒప్పందం ప్రకారం రోజూ లక్షా 55 వేల నుంచి లక్షా 60 వేల టన్నుల బొగ్గు సరఫరా చేస్తున్నది. ఉత్పత్తి చేస్తున్న లక్షా 90 వేల టన్నుల బొగ్గులో విద్యుత్ సంస్థలకు పోను, మిగిలిన బొగ్గును సిమెంట్ తదితర ఇతర సంస్థలకు సరఫరా చేస్తున్నది. బొగ్గు సరఫరా ఒప్పందం ప్రకారం సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు.
రాష్ట్రం బకాయి ఉన్నా
తెలంగాణ జెన్‌కో నుంచి 10 వేల కోట్ల రూపాయలకు పైగా సింగరేణికి బకాయిలు రావాల్సి ఉన్నా, బొగ్గు సరఫరాతో పాటు సింగరేణి విద్యుత్ సరఫరా ను కూడా ఆపలేదు. సింగరేణి జైపూర్ వద్ద గల 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నుంచి 1,100 మెగావాట్ల కన్నా ఎక్కువ విద్యుత్ రాష్ట్రానికి ఇస్తున్నది. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. దేశంలో విద్యుత్ డిమాండ్ 3,75,000 మెగావాట్లు ఉంది. రాష్ట్రంలో 17 వేల నుంచి 18,000 పీక్ డిమాండ్ ఉంది. రాష్ట్రానికి ప్రస్తుతానికి ఏ కొరతా లేదు. దేశంలో గత ఏడాది 750 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగగా, 2020-21లో 777 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. మన అవసరాలు 1000 మిలియన్ టన్నుల వరకు ఉన్నాయి. గతంలో 200 మిలియన్ టన్నుల వరకు దిగుమతి చేసుకునేవాళ్లం.
కొవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో విదేశీ బొగ్గు ధరలు పెరగడంతో దిగుమతి భారీగా తగ్గింది. దేశంలో ప్రైవేట్ మైనింగ్‌వారు లక్షా 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. బొగ్గు కొరతను కేంద్రం కొంత కృత్రిమం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. 500 బొగ్గు బ్లాక్‌ల వేలం నిర్ణయం, కోల్ ఇండియా, సింగరేణిలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా బ్లాక్‌లు కావాలంటే ప్రైవేట్ మాదిరే వేలంలో ఫీజులు కట్టి పాల్గొనాల్సిందే అనే నిబంధనలు తెచ్చారు. ఇవి ప్రభుత్వ రంగంలో బొగ్గు గనుల విస్తరణకు, ఉద్యోగాల జెనరేషన్‌కు కొంత అడ్డంకి అయ్యాయి. కేంద్రం విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా బందులు, సమ్మెలు జరిగినా పార్లమెంట్‌లో విపక్షాలు మొత్తుకున్నా, పోరు ఒత్తిడి పెరగని కారణంగా ఫలితం జీరోగానే ఉంది.
అంతా ఆయన పరిధికే
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో బొగ్గు గని ఉండి, దేశంలో కూడా బొగ్గు వ్యాపారం 100 మిలియన్ టన్నుల వరకు, పోర్టులు కూడా ఉన్న అదానీకి బొగ్గు కొరత సంక్షోభం భారీగా లాభాలు గడించే అవకాశం వచ్చింది. ఆయనకు పవర్ ప్లాంట్‌లు కూడా ఉన్నాయి. ఈ కారణంగా అదానీ వద్ద బొగ్గు సర్‌ప్లస్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటి కోల్ క్రైసెస్ ఆయనకు డబ్బు సంపాదనకు మంచి అవకాశం. 'అతని కోసమే ఇదంతానా అంటే, పరిస్థితులు అంతే' అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉన్నది ముందు వరుసలో అతనే కాబట్టి సహజంగానే 30 వేల టన్నుకు బొగ్గు కొనుగోలు చేసినా అతని వద్దే కదా కొనేది.అందుకే రేపు వచ్చే కాలంలో బొగ్గు సరఫరాలో మరింత కీలకం అదానే అవుతాడు. ఇందులో అనుమాన పడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో బొగ్గు సంస్థలు ఎంత కాలం ఉంటాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది.
2040 నాటికి అంటే 18 ఏండ్లలో దేశంలో 3000 బిలియన్ యూనిట్ థర్మల్ విద్యుత్ అవసరం ఉంటుంది. ఇందుకోసం 1500 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్వయంగా చెప్పారు. ఈ విషయాలన్నింటినీ పరిశీలిస్తే ప్రభుత్వ రంగంలోని బొగ్గు సంస్థలు భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని స్పష్టమవుతోంది.
ఈ సంస్థలను కాపాడుకోవాలి
కోల్ ఇండియా, సింగరేణి 20 ఏండ్లుగా యేటా లక్ష్యాలను సాధిస్తూ భారీ లాభాలలో ఉన్నాయి యేటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల పన్నులు, రాయల్టీలు చివరికి సీఎస్‌ఆర్ నిధులు, డీఎంఎఫ్‌టీ నిధులు ఆయా ప్రాంతాల అభివృద్ధికి చెల్లించడం మాత్రమే కాదు, డివిడెండ్‌లు కూడా చెల్లిస్తున్నారు. నిన్నటికి నిన్న రామగుండంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీకి సింగరేణి 500 కోట్ల రూపాయలు ఇచ్చింది. అయినా, ఇటు రాష్ట్రం, అటు కేంద్రం 21 ఏండ్లుగా బొగ్గు సంస్థలకు ఒక్క పైసా బడ్జెట్ ఇవ్వలేదు. కేటాయింపులు లేవు. ఇదీ ప్రభుత్వ రంగంలోని సింగరేణి, కోల్ ఇండియా పరిస్థితి.
బొగ్గు గనుల ప్రాంతం కార్మిక యూనియన్లు, ప్రజాప్రతినిధులు ఒక్కటిగా ఉండి కోల్ ఇండియా, సింగరేణిని కాపాడుకోవాలి. బడ్జెట్‌లో కేటాయింపులు ఉండాలి. గుర్తించిన బొగ్గు బ్లాక్‌లను దేశంలోని 12 బొగ్గు నిక్షేపాలు ఉన్న రాష్ట్రాలలో గతంలోని పద్ధతులలో కేటాయించాలి. ఎంప్లాయిమెంట్ జనరేట్ చేయాలి. ఖాళీలను భర్తీ చేయాలి. అప్పుడు 2040 నాటికన్నా ముందే దేశానికి అవసరం ఉన్నంతగా బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశాలు ఉంటాయి. ఆ దిశన కేంద్రం ఆలోచించి, అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకొని రావాలి. లేదా అదానీలాంటి ఐదారుగురు కార్పొరేట్లు బొగ్గు, విద్యుత్ రంగాన్ని సంపూర్ణంగా కబ్జా చేసేస్తారు. వందలో పది ఉద్యోగాలు కూడా రావు. మిగలవు. బుద్ధిజీవులు అప్రమత్తం కావాలి. 'ఆజ్ నహీతో కల్ కుచ్ భీ నహీ' దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో ఉన్నది. ప్రభుత్వ రంగాలలో కోల్ ఇండియా, సింగరేణి పరిస్థితి చాలా బాగుంది. అయినా కేంద్రం చిన్న చూపు చూస్తుంది. సింగరేణికి మరో 150 ఏండ్ల భవిష్యత్తు ఉంటుంది. అందుకే మన బొగ్గు బ్లాక్‌లను మనకే ఉచితంగా కేటాయించాలి.
ఎండీ. మునీర్
జర్నలిస్ట్, కాలమిస్ట్
99518 65223