ఇప్పటికైనా మాదిగల కల తీరేనా?

by Ravi |   ( Updated:2023-11-10 01:00:27.0  )
ఇప్పటికైనా మాదిగల కల తీరేనా?
X

ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ఈనాటిది కాదు. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తొలి దశాబ్దంలోనే ఈ సమస్య ప్రారంభం అయ్యింది. ఈ అంశంపై రాజకీయ నాయకుల హామీలు, ఉద్యమ ప్రస్థానం అటుంచితే, ఈ అంశంపై అధికారికంగా నివేదించిన విషయాలు, కోర్టుల వ్యాఖ్యలు, కమిటీల గురించి ఓ సారి చూస్తే ఎందుకు ఈ వర్గీకరణ ముఖ్యమో తెలుస్తుంది. ముందుగా, వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చిట్టచివరి తీర్పులోని వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిస్తే ‘వర్గీకరణను వ్యతిరేకిస్తే, అసమానులను సమానులుగా చూపుతూ- సమానత్వం అనే హక్కే ఓడిపోతుంది’ అని పంజాబ్ రాష్ట్ర విషయమై తీర్పు వెలువరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పులోనే 2004లో సుప్రీంకోర్ట్‌లో కొట్టివేయబడ్డ ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) ఎస్సీల వర్గీకరణ అంశంపై తమ తీర్పును పున:పరిశీలన చేసుకోవాలని భావిస్తున్నట్టు, దీనిపై 7 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాన న్యాయమూర్తిని కోరింది సుప్రీం ధర్మాసనం.

తొలి దశాబ్దంలోనే అసమానతలు..

స్వతంత్రం వచ్చిన తొలి దశాబ్దంలోనే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వచ్చినప్పటికీ... సంఖ్యాపరంగా అధికంగా, రాజకీయంగా అవగాహన ఉన్న ఒకటి రెండు కులాలు, తెగలు మాత్రమే ఆయా రాష్ట్రాల్లో అత్యధికంగా లబ్దిపొందుతున్నాయనే వాస్తవాలు బయటికొచ్చాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల జాబితా సవరణకు నాడు లోకూర్ కమిషన్ (1965)ను నియమించింది. ఈ కమిషన్ అన్నీ పరిశీలించి ‘తక్కువ వృద్ధి సాధించిన షెడ్యూల్ కులాలు, తెగలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించారు’. ఈ కమిషన్ తన నివేదిక తయారు చేసే ముందు అనేక మంది ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలను కలిసింది. ఆ సందర్భంలోనే దళితుల్లో అందరికంటే ముందున్న కొన్ని కులాలను జాబితా నుండి తొలగించాలనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. అందులో ఆంధ్రాలో మాలలు, మహారాష్ట్రలో మహార్లు, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్ మధ్య ప్రదేశ్‌లో చమార్లు ఉన్నారు. కారణాలేవైనా నాడు ఆ తొలగింపులు జరగలేదు. పరిష్కరించబడని ఏ సమస్యనైనా నిరంతరం రగులుతూనే ఉంటుంది.

1986-87 సంవత్సర వార్షిక నివేదిక (కమిషనర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్&ట్రైబ్స్)లో ఈ అసమానతల విషయం మరింత స్పష్టం అయింది. ఆ నివేదిక ప్రకారం ‘అఖిల భారత స్థాయిలో రిజర్వ్డ్ ఖాళీల భర్తీ, అసమానుల మధ్య పోటీలా తయారయ్యింది. రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, అభివృద్ధి చెందిన వారితో పోటీ పడి ఈ అవకాశాలు పొందడంలో వెనుకబడ్డ వారు అసంతృప్తితో ఉన్నారని స్పష్టం చేసింది. స్వతంత్రం వచ్చిన తొలి దశాబ్దంలోనే బయటపడ్డ ఈ అసమానతలు గుర్తించినా, ఏ మార్పుని కోరుకోని పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ ఆ అసంతృప్తి దళిత కులాలు, గిరిజనుల్లో నెలకొని ఉంది.

పాలకుల నిర్లక్ష్యం వల్ల..

ఉమ్మడి ఏపీలో రామచంద్రరాజు కమిషన్ (రాష్ట్రం), ఉషా మెహ్రా కమిషన్ (కేంద్రం), కర్ణాటకలో సదాశివం కమిషన్, మహారాష్ట్రలో సాల్వే కమిషన్ అభివృద్ధి కోరుతున్న దళిత కులాల కోసం ప్రభుత్వానికి 82 రికమెండేషన్స్ ఇచ్చింది. అందులో వర్గీకరణ కూడా ఒకటి. కానీ ప్రభుత్వం 68 ప్రతిపాదనలకు ఓకే అన్నది. ప్రభుత్వాలు వర్గీకరణ డిమాండ్ నెరవేర్చలేక ‘అన్నా భాహు సాఠే- ఫైనాన్షియల్ కార్పొరేషన్’ (లోక్ సాహిర్ బిరుదాంకితులు) పేరుతో ఏర్పాటు చేశాయి. కానీ నిధులు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కమిటీలు వేసినా వర్గీకరణ అనుకూల నివేదికలే వస్తున్నాయి. కానీ పాలకవర్గ నిర్లక్ష్యం ఫలితాన్ని ఆలస్యం చేస్తోంది. ఫలితంగా 75 ఏళ్లుగా దళిత గిరిజన సమాజంలోనే ఒక ‘అంతర్గత అసమ సమాజాన్ని సృష్టించింది’.

1994లో హర్యానాలో ఎస్సీ రిజర్వేషన్లు బ్లాక్ -ఏ, బ్లాక్- బీగా విభజన చేశారు. తమిళనాడులో అరుంధతీయులకు 3% ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించబడింది. ఇప్పటికీ అమలవుతుంది కూడా! ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, వంటి రాష్ట్రాల్లో ఈ అంశంపై న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు ప్రజలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో వర్గీకరణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ప్రజల ఒత్తిడి తట్టుకోలేక, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో దళితులను దళిత్స్, మహా దళిత్స్ (బాగా వెనుకబడ్డ వారు)గా విభజించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అయితే, ఇవన్నీ సమస్య తీవ్రత తగ్గించడానికి ఆయా రాష్ట్రాలు తమ పరిధిలో తీసుకున్న నిర్ణయాలు. వాటితో కొంతమేర ఫలితాయి దక్కినా, ఆ ఫలితాలు ఇంకా శాశ్వతం కాలేదు.

అందరి మద్దతు ఉన్నా..

75 ఏళ్ల స్వతంత్ర దేశంలో 8 లక్షల ఆదాయం ఉన్న అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అందాయి. ఒకనాడు అసమంజసంగా ఉన్న బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత లభించింది. దేశ స్థాయిలో బీసీల వర్గీకరణకు మార్గం సుగమం అవుతుంది. కేంద్రం దీనిపై కమిషన్ వేసి కసరత్తు చేస్తుంది. మైనార్టీలకు రిజర్వేషన్లు లభిస్తున్నాయి. కానీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి మార్పూ లేదు. ఒకటే మూస ధోరణి. సుప్రీంకోర్టు తన తీర్పులో, ‘రిజర్వేషన్లు, రిజర్వ్డ్ కులాల్లోనే అసమానతలు సృష్టిస్తున్నప్పుడు, వాటిని న్యాయంగా వర్గీకరించి అందరికీ న్యాయం అందించే బాధ్యత రాజ్యానిదే’ అని స్పష్టం చేసింది. కానీ రాజ్యం నిర్లక్ష్య ఫలితం, ఒక అట్టడుగు వర్గంలో మరొక అణగారిన సమాజం. ఏ మార్పూ చెందని సమాజం ఒక బండరాయి వంటిది. కదలిక లేని చోట తిష్ట వేసేది కష్టమే. రాజకీయ పార్టీలలో అందరి మద్దతు ఉన్న వర్గీకరణ ఎందుకు కావడం లేదో, అది కోరుకునే సామాన్య ప్రజానీకానికి అర్థం కాదు. ఈ అంశంపై ఎన్ని కేసులు వేసినా, అవి వాయిదా పడుతూనే ఉన్నాయి. ఒక వైపు పాలక సమాజం, మరోవైపు కోర్టులు న్యాయాన్ని ఎంత ఆలస్యం చేస్తున్నాయో చెప్పడానికి ఇవే ఉదాహరణలు.

2013లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వర్గీకరణ పట్ల సానుకూలంగా స్పందించారు మోడీ, కానీ చర్యలు శూన్యం. అది జరిగి దశాబ్దం దాటిపోయింది. ఇటీవల కర్ణాటక ఎన్నికల సందర్భంగా వర్గీకరణకు సై అన్న బీజేపీ, ఆ అంశాన్ని ఎన్నికల్లో విరివిగా ప్రస్తావించారు. మాదిగలు తమ కోరికను అన్ని రకాలుగా దేశ పాలకులకు తెలియజేసారు. ఇక బాధ్యత పాలకులదే. తెలంగాణా ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ఈ నెల 11న రాష్ట్రానికి రానున్నారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మాదిగల విశ్వరూప మహాసభ‌కు మోడీ హాజరుకానున్నారు. దేశ ప్రధానే సభకు వస్తుండటంతో ఇకనైనా సమస్య పరిష్కారం అవుతుందని మాదిగ సమాజం ఆశగా ఎదురు చూస్తుంది.

(నవంబర్ 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మాదిగల విశ్వరూప మహాసభ)

- పచ్చల రాజేష్

83318 23086

Advertisement

Next Story