దేశ పౌరులపై మిలటరీ దాడి చేయడం న్యాయమేనా? ఆపరేషన్ కర్రి గుట్టలులో జరుగుతుందేంటి?

by Ravi |   ( Updated:2025-04-26 01:16:04.0  )
దేశ పౌరులపై మిలటరీ దాడి చేయడం న్యాయమేనా? ఆపరేషన్ కర్రి గుట్టలులో జరుగుతుందేంటి?
X

వారం పది రోజులుగా పౌర సమాజంలో నానుతున్న పేరు కర్రి గుట్ట. చర్చ అంతా తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న ఈ సువిశాలమైన గుట్టలపైనే. దండకారణ్యానికి జల్లెడ పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మిలటరీ, వివిధ రకాల పోలీసు బలగాలు ఈ గుట్టలను మావోయిస్టుల స్థావరాలుగా గుర్తించి దాడులు జరుపుతున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు వాడుతూ గుట్టలను అణువణువు పరిశీలిస్తున్నారు. అలాగే అన్నిదారులూ మూసివేస్తూ, ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ ఆదివాసులను కట్టడి చేస్తున్నారు. కర్రి గుట్టల ఆక్రమణే కార్యాచరణలా కొనసాగుతున్నది.

చత్తీస్‌గఢ్ ప్రభుత్వం చాలా కాలంగా చర్చల విషయం ఎజెండాపై ఉంచింది. కాకపోతే కొన్ని నిబంధనలు పెట్టింది. విశాలమైన రోడ్ల నిర్మాణానికి, ఖనిజాల వెలికితీత తరలింపులో ఆటంకం లేకుండా చూడడం, ఆయుధాలు వదిలేయడం వంటివి కీలకమైనవి. ఇలా అంటూనే అన్ని వైపులా మిలిటరీ బలగాలను, పోలీసులను పంపిస్తూ, విచక్షణా రహితంగా దాడులు, కాల్పులు జరుపుతూ ఆదివాసులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. వారిని గూడేల నుండి తరిమివేసే ప్రక్రియ వేగంగా కొనసాగిస్తున్నారు. వీలైన చోటల్లా, ఇన్‌ఫార్మర్లతో సమాచారం సేకరించి మావోయిస్టు నాయకత్వాన్ని నిర్మూలిస్తూనే ఉన్నారు. చర్చల్లో కీలకంగా ఇబ్బంది కలిగించే అంశాలతో ఆటంకాలు కలిగిస్తూనే, శాంతి వచనాలు వల్లిస్తున్నారు.

శాంతి చర్చలకు ఇంకా తావుందా?

దేశంలో శాంతి చర్చల అనివార్యతను గుర్తించిన తెలంగాణ పీస్ కమిటీ, మావోయిస్టులు, ప్రభుత్వం కాల్పుల విరమణ పాటించి ప్రజల రక్షణ కోసం చర్చలకు రావాలని పిలుపునిచ్చింది. పౌర సమాజ పిలుపుకు స్పందించిన మావోయిస్టు పార్టీ ఈ ప్రతిపాదనకు బహిరంగంగానే అంగీకరించింది. కేంద్రం మాత్రం దీనిని పట్టించుకోలేదు, పెడచెవిన పెట్టింది. భేషరతుగా ఆయుధాలను వీడాలనే విజ్ఞప్తిని పలు వేదికలపై స్పష్టం చేస్తూ వచ్చింది. ఇదిలా జరుగుతుండగానే ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తూ, మిలటరీ కేంద్రాలుగా మార్చేం దుకు కేంద్రం ప్రణాళిక రూపొందించుకుంది. అందులో భాగమే ఆపరేషన్ కర్రి గుట్టలు. శాంతి కోసం పౌర సమాజం చేస్తున్న కృషిని పాలకవర్గాలు పట్టించుకోకుండా అణచివేత నిర్మూలనే పరిష్కారంగా ముందుకు వెళ్తున్నాయి. ఇంత జరుగుతుంటే శాంతి చర్చలకు ఇంకా తావెక్కడిది?

ఖనిజ సంపద దోపిడీనే లక్ష్యం

ఒరిస్సా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, జార్ఖండ్, బెంగాల్‌లలో విస్తరించి ఉన్న అపార ఖనిజ సంపద, వనరుల దోపిడీ లక్ష్యంగా జరుగుతున్న దాడి ఇది. ఇంకా చెప్పాలంటే దక్షిణాదిపై, ఉత్తరాది పాలకులు ఆధిపత్యం కోసం అమలు చేస్తున్న పక్కా ప్రణాళిక. నాడు త్రేతా యుగంలో రాముడి కాలం నుండి ద్వాపర యుగంలో పాండవులను కలుపుకొని ఉత్తరాది పాలకులు దండకారణ్యంపై దాడి చేసి అక్కడి మూలవాసులను రాక్షసులుగా చిత్రీకరిస్తూ మారణకాండ కొనసాగించిన వారే. నేడు దేశభక్తి ముసుగులో, దేశ పౌరుల గుండెలపై గన్ను పెట్టి సాగిస్తున్నది మానవ హననమే. శాంతి చర్చలు చేస్తే మావోయిస్టులు బలపడతారనే నెపంతో, పౌర సమాజ సూచనలు ఉల్లంఘిస్తూ, అమాయక ప్రజలపై హింసకాండను కొనసాగిస్తూ అంతర్యుద్ధానికి తెరలేపుతున్న పాలక పార్టీల వైఖరి అప్రజాస్వామికం.

సైనికీకరణే పరిష్కారమా?

తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాట సందర్భంలో, తెలంగాణను భారత్ యూనియన్‌లో కలుపుతూ పటేల్ సైన్యం కమ్యూనిస్టు పార్టీలపై మిలటరీ చర్య చేపట్టింది. దేశ పౌరులపై మిలిటరీ దాడులు చేయడం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాబట్టి, దాన్ని పోలీస్ చర్యగా ప్రకటించింది. ఇప్పుడు దండకారణ్యాన్ని మార్చి 26 నాటికి మావోయిస్టు రహిత ప్రాంతంగా మారుస్తామంటూ ఆదివాసులను బలవంతంగా అక్కడి నుండి తరలించి వేస్తోంది. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ న్యాయ సూత్రాల అమలు సమస్య చర్చల్లో లేకపోవడం శోచనీయం. శాంతి చర్చలు కేవలం మావోయిస్టుల సమస్య కాదు. దేశ భద్రత సమస్య, దేశ సంపద సమస్య, ఆదివాసీ జాతుల మనుగడ సమస్య. దక్షిణాది రాష్ట్రాలకు ఊపితిత్తుల్లా ఆక్సిజన్ అందిస్తున్న, పర్యావరణాన్ని కాపాడుతున్న దండకారణ్య రక్షణ సమస్య ఇప్పుడు అత్యంత ప్రధానంగా మారింది. అక్కడ అంతర్జాతీయ న్యాయస్థానాల సూచనలు, సూత్రాల ఉల్లంఘన యథేచ్చగా జరుగుతున్నా గొంతు పెగలడం లేదు. పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయాలు, పరిశీలనలు, రిపోర్టుల ఆచూకీ లేదు. శాంతిభద్రతల సమస్య ఏర్పడిన ప్రతీచోట పాలకుల, దోపిడీదారుల రక్షణ కోసం పోలీస్/ సైనికీకరణే పరి ష్కారంగా అడుగులు వేస్తున్నారు.

ప్రజలను సమాయత్తం చేద్దాం!

దేశ ప్రధాన సమస్య ఆదివాసుల మనుగడ, రక్షణ. అంతేగాని వారికి అండగా నిలిచి, దేశ ఖనిజ సంపాదన వనరులను రక్షిస్తున్న మావోయిస్టులది కాదు. ఈ కీలకాంశాన్ని ప్రజలు గుర్తించేలా చేయడం బుద్ధి జీవుల సామాజిక బాధ్యత. అప్రకటిత ఎమర్జెన్సీతో దేశ పౌరులపై చేస్తున్న ప్రకటిత యుద్ధాన్ని ఆపేందుకు పౌర సమాజం చేస్తున్న కృషిని అర్థం చేసుకోవాలి. ప్రస్తుత తరుణంలో జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు, ప్రజలు ప్రజాస్వామిక వాదులు, కవులు కళాకారులు, కార్మికులు, రైతాంగం, విద్యార్థి, యువత ఐక్యంగా దేశ సంపద రక్షణ కోసం, ఆదివాసుల ప్రాణాలను కాపాడడం కోసం తమ వైఖరిని ప్రకటించి, పాలకుల దుర్మార్గ వైఖరిని సరైన రీతిలో అడ్డుకునే కార్యాచరణకు ముందడుగు వేయడం అత్యవసరం.

రమణా చారి

99898 63039



Next Story

Most Viewed