- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎస్సీలకు వర్గీకరణ శాశ్వత పరిష్కారమేనా..!?

రాష్ట్రంలో వర్గీకరణ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. గత మూడు దశాబ్దాలుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో తమకు న్యాయంగా రావలసిన వాటా కోసం ఉద్యమం చేసిన వారికి ఆ ఫలాలు అందుకునేందుకు కొద్ది దూరంలో ఉన్నారు.. అయితే ఎస్సీ వర్గీకరణ అమలవుతేనే దళితుల సమస్యపరిష్కారం అవుతుందా? ఇది కేవలం ప్రభుత్వ రంగానికే పరిమితమైతే వారికి ఏ మేరకు ప్రయోజనం చేకూరు తుంది? అనే కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి.
ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాలకు అనుగుణంగా పాలకులు ప్రైవేట్ రంగానికి (కార్పొరేట్) పెద్దపీట వేస్తున్న తరుణంలో ఏ మేరకు న్యాయం జరుగుతుంది? అనాదిగా అణచివేతకు గురవుతున్న సాధారణ దళితుల జీవితాల్లో ఏ మాత్రం వెలుగు వస్తుంది? వారికి శాశ్వత పరిష్కారం కోసం పోరాట ప్రణాళిక ఏదైనా ఉన్నదా? పాలక వర్గాల వాగ్దానాలకు, నినాదాలకు, ఆకర్షణీయ పథకాలకు లొంగకుండా, నాయకత్వం తమ కులాల, వర్గాల ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని నడపగలిగితేనే పోరాటం విజయం సాధించగలుగుతుంది. త్యాగాలకు సిద్ధపడినప్పుడే విముక్తి సాధ్యమౌతుంది.
సాటి సోదరులపై ద్వేషం వద్దు!
దళితవాదం అంటేనే మనువాద, మతోన్మాద సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకం. అందుకే జాగ్రత్తగా దళితులలో ఐక్యత దెబ్బతినకుండా, సోదర భావం పెంచుకుంటూ, చైతన్య పరుస్తూ గమ్యాన్ని చేరవలసిన అవసరమున్నది. అయితే ప్రస్తుత పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనపడుతున్నది. వర్గీకరణ మాల, మాదిగ కులాల మధ్య శత్రుత్వంగా మారడం పౌర సమాజంలో ఆందో ళన కలిగిస్తున్న అంశం. ఇది ఏ స్థాయికి వెళ్లిం దంటే, దళితులపై వేల సంవత్సరాల నుండి నేటికీ అత్యాచారాలకు పాల్పడుతున్న, అగ్రకుల బ్రాహ్మ ణ, కమ్మ, వైశ్య, రెడ్లనైనా నమ్ముతాం/ గౌరవి స్తాం. కానీ సోదర కులాల వారిని నమ్మం అనే స్థాయికి వెళ్లడం విచారకరం. నేటికీ కుల అహంకారాన్ని, అభిజాత్యాలను వదులుకోలేని వారు, కులాంతర వివాహాలను సహించలేని వారు, హత్యలకు పాల్పడే వారు మాల, మాదిగలో మధ్య నెలకొన్న వివాదంలో ఇంత క్రియాశీలంగా వ్యవహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవశ్యం. అవకాశాలను అందిపుచ్చుకోవడం, నాటి సామాజిక, రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. విద్యా అవకాశాలు, ఆర్థిక స్థితిగతులు కూడా ప్రభావితం చేసే అంశాలు.. దీని వలన అసమ అభివృద్ధి జరిగే అవకాశం లేకపోలేదు. అంత మాత్రాన తోటి సోదరులపైన అంతలా ద్వేషం పెంచుకోవాల్సిన పనిలేదు. దీని వలన పాలక వర్గాలు మీ ఐక్యతను విడగొట్టి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అవ కాశం లభిస్తుంది. ఈ సున్నితమైన విషయాన్ని అందరూ గ్రహించాలి.
కార్పొరేట్ భూతం తరుముకొస్తోంది..
ప్రస్తుతం పాలక వర్గ పార్టీలు అమలుపరుస్తున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉన్నది. దేశం ప్రైవేటీకరణ దిశలో వేగంగా పరుగులు తీస్తున్న తరుణమిది. ఆ దిశగా పావులు కదుపుతున్న సందర్భం కూడా. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ఒక్కటొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. భవిష్యత్ అంతా కార్పొరేట్ రంగం చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయం. ప్రైవేటు రంగ సంస్థలలో రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్లు ఉండా లనే డిమాండ్ కూడా బలంగా వినిపించడం లేదు. రాజకీయంగా కూడా జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు, రిజర్వేషన్లు అమలు కావడం లేదు. రాజకీయ అందలం దక్కడం సంగతి అటుంచి, సాధారణ దళిత, గిరిజన, బహుజనుల స్థితిగతులలో ఏడు పదులు దాటిన స్వతంత్ర భారతంలో కూడా పెద్ద మార్పు ఏమీ రాలేదు. ప్రధానంగా భూ సమస్య పరిష్కారం కాలేదు. కొత్త పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి పథకాల పేరిట ఆదివాసీలకు, దళితులకు, బహుజనులకు కేటాయించిన/ పంచిన భూములు కూడా తిరిగి లాక్కుంటున్నారు.
కులం వలన వచ్చే లాభాలు ఎవరివి?
దశాబ్దాలు, శతాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములను సైతం కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. దేశ ఖనిజ సంపదను బహుళజాతి సంస్థలకు కట్టబెట్టేందుకు అటవీ ప్రాంతాలలో మారణహోమం సృష్టిస్తున్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి మరీ బాహాటంగా ఉల్లంఘిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా జరగాల్సిన ఉద్యమాల నిర్మాణం కూడా నామమాత్రంగానే ఉన్నది. ఆదివాసీలకు అండగా దళిత బహుజనులు కదిలి రావడం లేదు. దళితులపై దాడులకు నిరసనగా బహుజనులు ఉద్యమించడం లేదు. మైనారిటీలపై దాడులు ఎవరికీ పట్టడం లేదు. అన్నిటికంటే ప్రధానంగా సాధారణ ప్రజానీకం గమనించాల్సింది ఏమిటంటే, కులం వలన వచ్చే లాభాలు, ఆ కులంలోని ధనవంతులు, నాయ కులు మాత్రమే లబ్ది పొందుతున్నారు. కష్టాలు, నష్టాలు, అవమానాలు ఆయా కులాలలోని సామాన్యులు అనుభవిస్తున్నారు. డాక్టర్ అంబే ద్కర్ రచించిన రాజ్యాంగం ఏ మాత్రం అమలు చేసినా నిమ్న వర్గాలకు ఇంత అన్యాయం జరిగేది కాదు.
సంపదల గుత్తాధిపత్యంపై ఆలోచించరా?
ఇవాళ వేదనను అనుభవిస్తున్నది కేవలం దళి తులు, ఆదివాసీలు, బహుజనులు, మైనారిటీలు మాత్రమే కాదు. పీడిత ప్రజలంతా. దేశ సంపద అంతా కొద్దిమంది వ్యక్తుల (కార్పొరేట్ శక్తుల) కబంధ హస్తాలలో చిక్కుపడడమే ఇందుకు ప్రధాన కారణం. దేశ సంపద / హక్కులు ప్రజలందరికీ సమానంగా పంపిణీ జరగకపోవడమే ప్రధాన సమస్య. ఈ విషయాలపై సమగ్ర అవగాహనతో చైతన్య పరుస్తున్న/ పోరాడుతున్న వారిపై నిర్భంద చట్టాలను ప్రయోగిస్తున్నారు. అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బూటకపు ఎన్‌కౌంటర్‌లలో హతమారుస్తున్నారు. తమ కులానికి అన్యాయం జరిగిందని గొంతు ఎత్తుతున్నవారు, తమ వర్గం వారి పైన జరుగుతున్న పాశవిక దాడుల పట్ల సరైన రీతిలో స్పందించడం లేదు. ఫలితంగా పాలకుల ఆటలు కొనసాగుతున్నాయి.
అదొక్కటే పరిష్కారం కాదు!
వర్గీకరణ మాత్రమే దళితుల సమస్యకు పరి ష్కారం కాదు. మతోన్మాదం, ఫాసిజం భయంకరంగా కోరలు చాస్తున్న వేళ కారంచేడు, కంచికచర్ల, చుండూరు, పదిరికుప్పం ఘటనల సంద ర్భంలో మాదిరి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలి. మహిళలపైన, విద్యార్థుల పైన, ఆదివాసులపైన, మైనారిటీల పైన, దళితుల పైన, కార్మికులపై, కర్షకుల పైన, బహుజనుల పైన జరుగుతున్న దాడులు ఆధిపత్య వర్గాలు చేస్తున్నవే. ఇకనైనా పీడిత, తాడిత శక్తులన్నీ ఒక్కటిగా కదలాలి. రాజకీయ లబ్ధి కోసం నాయకులు ఇచ్చే ఐక్యతా నినాదాల వెనుక వున్న కుట్రలను గ్రహించగలగాలి.
పాలక వర్గ పార్టీల నినాదాలు వేరుగా కనపడినా, అధికారం చేజిక్కించుకోవడం, నిలుపుకోవడం, ప్రజాధనాన్ని/సంపదను దోచుకోవడం, దాచుకోవడమే వారి అంతిమ లక్ష్యమని గుర్తించాలి. ఈ విషయాలను సూక్ష్మ దృష్టితో పరిశీలించి, నిల దీసి ప్రశ్నించే చైతన్యం రానంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. పాలక వర్గాల ఆటలు కొనసాగుతూనే ఉంటాయి. పీడితులు మరింత బానిసత్వంలోకి నెట్టివేయబడుతూనే ఉంటారు. పాలక వర్గాలు ప్రలోభ పెట్టే మోసపూరిత వాగ్దానాలకు, కుట్రపూరిత నినాదాలకు, ఆకర్షణీయ పథకాలకు లొంగకుండా, నాయకత్వం తమ కులాల, వర్గాల ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని నడపగలిగితేనే పోరాటం విజయం సాధించ గలుగుతుంది. త్యాగాలకు సిద్ధపడినప్పుడే విముక్తి సాధ్యమౌతుంది. ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త!
- రమణా చారి
99898 63039