- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ దాడులకు..మూలమేది!
కేంద్ర ప్రభుత్వం విపక్షాలను బెదిరించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏదో ఒక సాకుతో, ఆరోపణలు తెరపైకి తెచ్చి విపక్ష నేతల ఇంటిపైకి ఉలి గొల్పుతుంది. విపక్ష నేతలపై ఒకేసారి వందల మంది అధికారుల మోహరింపుతో సోదాలు నిర్వహించి, 8-11 గంటల పాటు విచారణ పేరుతో విపక్ష నాయకుల గుండెల్లో భయోత్పాతాన్ని సృష్టించడమే బీజేపీ ఎత్తుగడ. అయితే ఇటీవల ఈ దాడులన్నీ కేంద్రమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరుగుతున్నాయమోనని ఇటీవలి పరిణామాలు చూస్తే అనుమానమొస్తోంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉండి, కేంద్ర మంత్రి ఆ రాష్ట్ర పర్యటన చేస్తే, ఆ రాష్ట్రంలో ఈ సంస్థలు దాడులు చేస్తున్నాయి.
ఆయన పర్యటనకు ముందో.. వెనకో!
ఉదాహరణకు తమిళనాడులో ఇటీవల అమిత్ షా రాష్ట్రంలో పర్యటించిన రెండు రోజులకే, ఈడీ ఆ రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీపై ఆయన సన్నిహితులపై దాడులు చేసి సెంథిల్ ను అరెస్టు చేసింది. అలాగే, తెలంగాణలో అమిత్ షా, బుధవారం 14 న తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉండగా, ఆ ఉదయమే ఐటీ విభాగం బీఆర్ఎస్ ప్రతినిధులనే లక్ష్యంగా దాడులు సాగించింది. వారి ఆస్తుల, వ్యాపార సంస్థల కార్యాలయాల్లో సోదాలు జరిపింది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 14న, అమిత్ షా పర్యటించారు. అదే రోజు సీబీఐ ఆ రాష్ట్ర ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన కేసులో ఎమ్మెల్యే, ఎంపీల సన్నిహితులపై దాడి చేసింది. అలాగే బీహార్‌లో ఫిబ్రవరి 25న అమిత్ షా పర్యటిస్తే, మార్చి 10న ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజశ్రీ యాదవ్, సన్నిహితుడైన సయ్యద్ అబు దోజానా ఇళ్లల్లో సోదాలు జరిపింది. అలాగే ఏప్రిల్ 2వ తేదీన మరోసారి అమిత్ షా బీహార్ పర్యటిస్తే అప్పుడు కూడా దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయి. అలాగే, జార్ఖండ్‌లో ఫిబ్రవరి 4వ తేదీన అమిత్ షా పర్యటిస్తే, ఫిబ్రవరి 21న, గ్రామీణ అభివృద్ధి శాఖలో అక్రమాలు జరిగాయంటూ ఈడీ దాడులు చేపట్టింది. మార్చి 4 న, మే 30వ తేదీన వివిధ కేసుల్లో ఈడీ రైడ్ జరిపింది. ఇలా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపైనే, పైగా రాష్ట్రంలో అమిత్ షా పర్యటన ముందో, వెనకో ఈ దాడులు జరుగుతుండటంతో ప్రతిపక్ష నాయకులు అమిత్ షా అధ్వర్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని విమర్శిస్తున్నాయి. కేజ్రీవాల్ దర్యాప్తు సంస్థలకు ‘బీజేపీ సైన్యం’ అని పేరు పెట్టాలని విమర్శించారు. పైగా ఈ నెల 23న జరగనున్న విపక్షాల సమావేశాన్ని దెబ్బతీయడానికి ఈ దాడులను కేంద్రం ఉసిగొలుపుతున్నదని ఆరోపిస్తున్నాయి. బీజేపీ నాయకులపై మాత్రం ఒక్క దాడి జరగట్లేదు. ఆ పార్టీ నేతల అవినీతిపై ఆధారాలతో సహా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేసినా వారిపై ఎలాంటి చర్యలను తీసుకోవట్లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి.
అర్బన్ నక్సలైట్లంటూ...
బీజేపీ చేస్తున్న ఈ దాడులను తట్టుకోలేక వారు బీజేపీలో చేరుతున్నారు విపక్ష నాయకులు. బీజేపీ తమ పార్టీ సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి, విపక్షాలను బలహీన పరచటానికి బీజేపీ ఎంచుకున్న ఒక అక్రమ వికృత రాజకీయ క్రీడగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అందుకు రాజ్యాంగ బద్ధమైన దర్యాప్తు సంస్థలను విచక్షణా రహితంగా ఉపయోగించటం ఒక ఉన్మాద చర్య అని విమర్శిస్తున్నారు. ఇప్పటికే, దేశంలో వున్న అవినీతిపరులు, నల్లధన కుబేరులు అంతా బీజేపీలో గంపగుత్తగా చేరిపోయారు. ఇప్పుడు వారిపై ఎలాంటి వేధింపు చర్యలూ ఉండక, వారంతా ఒక్కసారిగా పునీతులు అయిపోతారు. నిజానికి రాజ్యాంగ సంస్థలు చట్టబద్ధంగా, నిష్పాక్షికంగా సోదాలు చేస్తే ఎవరూ తప్పుపట్టరు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ ప్రేరణతో దాడులు, వేధింపులు చేస్తేనే, ఈ రాజ్యాంగ సంస్థల ప్రతిష్ట దెబ్బతింటుంది.
దేశంలో బీజేపీ ఫాసిస్టు పాలన సాగిస్తుంది. వీరి పాలనలో ప్రజల ఆర్థిక, సామాజిక సమస్యలపై మాట్లాడితే అపరాధం. ప్రజాస్వామిక హక్కుల గురించి మాట్లాడితే నేరం., పౌరహక్కుల అణిచివేతపై ఉద్యమిస్తే తీవ్రవాది. వారిని అర్బన్ నక్సలైట్లు అంటూ ముద్ర వేస్తుంది. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వంలోని లోపాలను ఎండగట్టే మీడియాపై అక్రమ ఆంక్షలు పెట్టింది. ఇప్పటికే యూనివర్సిటీ ప్రొఫెసర్లపై, మేధావులపై, జర్నలిస్టులపై, కవులు, కళాకారులపై అక్రమ కేసులు పెట్టి వారిని జైళ్ళలో నిర్బంధించింది. నిజానికి ప్రభుత్వ లోపాలను తెలిపే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. కానీ లోపాలను లేవనెత్తితే దేశభక్తి లేదంటుంది. వారిపై బ్రిటిష్ వారి పాలనా కాలంలో రూపొందించిన దేశద్రోహ, రాజద్రోహ చట్టాలను బూజు దులిపి, కొత్త హంగులు కలిపించి ప్రయోగిస్తుంది. ఇలా క్రమంగా దేశాన్ని ఫాసిస్ట్ దిశగా బీజేపీ ప్రభుత్వం తీసుకుపోయి అప్రకటిత ఎమర్జెన్సీని విధిస్తుంది.
ఈ దేశ పౌరులుగా మన దేశ పాలన, భారత రాజ్యాంగ ప్రకారమే , ప్రజాస్వామ్య పంథాలో నడవాలని కోరుకునే హక్కు, బాధ్యత మనకు వుంది. ప్రజలు, పౌర సంఘాలు, విద్యార్థులు, మేధావులు, ప్రతిపక్షాలు, కార్మిక, కర్షక సంఘాలు ప్రజాస్వామిక చైతన్యంతో శాంతియుత మార్గంలో ముందుకు నడవాలి. ఉమ్మడి, ఐక్య కార్యాచరణతో ఉద్యమాలు, పోరాటాల ద్వారానే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక హక్కులను మనం కాపాడుకోగలం.
డా. కోలాహలం రామ్ కిశోర్
98493 28496