వలస బాటలో యువత...

by Ravi |   ( Updated:2024-04-27 01:00:44.0  )
వలస బాటలో యువత...
X

మన దేశంలో యువత పెరుగుదల రేటు శాతంకు, ఉపాధి అవకాశాల పెరుగుదల రేటుకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. అందువల్లే మన యువత విదేశీ బాట పట్టాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో యువతపై ఆధారపడవలసి వస్తున్న వృద్ధతరం భీతిల్లుతోంది. అందుకే యువతను మన దేశ ఆర్థిక అభివృద్ధిలో క్రియాశీలకంగా పాలుపంచుకునేలా చేయడమే పరిష్కారం.

ఏ ప్రభుత్వానికైనా యువతకు ఉద్యోగాల కల్పన, పని అవకాశాలు కల్పించడమే ప్రధమ ప్రాధాన్యతగా ఉండాలి. ప్రపంచ బ్యాంకు ప్రకారం భారతదేశం జనాభా నిధిని సద్వినియోగం చేసుకోవడం లేదు. పేరుకేమో యంగ్ ఇండియా అయితే, ఈ యంగ్ యువత విదేశాల పాలవుతున్నది. జనాభాలో యువత ఎక్కువగా ఉంటే జనాభా నిధి అని అంటారు. మనదేశంలో చాలామందికి భూమిగానీ, పెట్టుబడులు గానీ, స్థిరాస్తులు గానీ లేవు. 90 శాతం ప్రజలకు వారి శ్రమే వారి జీవనాధారం. అతి తక్కువ ఆదాయాలతో ఉద్యోగ భద్రత లాంటివి లేని అభద్రతాభావంతో బ్రతుకు లాగుతున్న యువత... ఈ దేశంలో మనకు ఏముందిలే, ఎక్కడికో పోయి బ్రతుకుదాములే అనుకుంటూ, ఈ దేశ ఉత్పత్తి ప్రక్రియలో తమను ఉపయోగించుకునే వారే లేరని తీవ్ర నిరాశతో ఉన్నది.

తక్కువ స్థాయిలో పొదుపు..

2014 ఎన్నికల్లో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట ఏమైందో గానీ ఉన్న ఉద్యోగాలు పోయాయి. మన దేశ జీడీపీలో కుటుంబాల అప్పులు 2022-2023లో 40 శాతానికి చేరుకున్నది. ప్రజల పొదుపు శాతం మాత్రం ఐదు శాతానికి పడిపోయింది. ఇంత తక్కువ స్థాయిలో పొదుపు ఉండడం గత 47 సంవత్సరాల కాలంలో ఎప్పుడు లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేస్తున్నది. 2011-12, 2019-20 మధ్య కాలంలో సగటున దేశ ప్రజల పొదుపు జీడీపీలో 7.6 శాతంగా ఉండేది. ప్రజల ఆదాయాలు క్రమంగా తగ్గిపోవడం వలన పెరుగుతున్న వినియోగ వ్యయం ఆదాయాల స్తబ్దత వలన మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు అంటుతుండడం వలన పేదల వాటా జీడీపీలో క్రమంగా తగ్గిపోతున్నది. ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారి ప్రకారం 34 వంతు ప్రజలు పోషక ఆహార లోపంతో ఉన్నందువలన గత్యంతరం లేక మన పాలకులు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం, 50 కోట్ల మందికి ఉచిత ఆరోగ్య కార్డులు ఇవ్వాల్సి వస్తోంది.

1.80 కోట్ల వలసలు..

మన యువతకు మన దేశంలోనే ఉద్యోగాలు దొరకకపోవడం వల్లనే కదా విదేశాలకు పరుగులు తీస్తున్నారు. మన పాలకులు మాత్రం ఓట్ల కోసం కోట్లు కోట్లు అప్పులు చేసి ఉచితాలపై రాయితీలపై సబ్సిడీలపై వ్యయం చేస్తున్నారు ఐక్యరాజ్య సమితి ప్రపంచ వలస రిపోర్టు 2022 ప్రకారం 1990 నుండి 2020 వరకు మన దేశం నుంచి 1.80 కోట్ల మంది వలసపోయారు. 2020 నాటికి ఒక్క అమెరికాలోనే 27 లక్షల మంది మనవారు స్థిరపడ్డారు. అమెరికాలో 45 లక్షల మంది, 25 లక్షలు, సౌదీలో 34 లక్షల మంది భారతీయులు స్థిరపడ్డారు, వీరు అధికంగా ఆయిల్ నిక్షేపాలున్న యునైటెడ్ అరబ్ దేశాల్లో పనిచేస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం 3.2 కోట్ల మంది భారతీయులు విదేశాలకు వెళ్లిపోయి ఓవర్సీస్ ఇండియన్స్‌గా ఉన్నారు. ప్రతి సంవత్సరం 25 లక్షల మంది భారతీయులు విదేశాలకు వలస పోతున్నారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద వలస అని చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు దేశ ఆర్థిక అభివృద్ధి ఎలా జరుగుతుంది?

వారిపై ఖర్చుచేసే వారేరి?

సాధారణంగా తమ పిల్లలను బాగా చదివించగలిగితే తమ కుటుంబాలు బాగుపడతాయని తల్లిదండ్రులు భావిస్తారు. అయితే వారి ఆదాయ స్థాయి అంతంత మాత్రమే. అటువంటప్పుడు ప్రభుత్వాలే యువతకు కావలసిన సౌకర్యాలపై అంటే విద్య వైద్యం సాంకేతిక పరిజ్ఞానం తదితర వాటిపై ఖర్చుపెట్టి వీరిని దేశాభివృద్ధికి ఉపయోగించుకోవాలి. 2040 నాటికి మన జనాభాలో 59 శాతం మంది యువకులే ఉంటారు. మీరు మన దేశ అభివృద్ధికే కాకుండా ప్రపంచ దేశాల అభివృద్ధికి కూడా తోడ్పడుతూ, ప్రపంచానికే మెరిసే స్టార్స్ లాగా ఉంటారు. అయితే వారికి కావాల్సిన విద్య, వైద్య, ఆహారం తదితర వాటిపై ఖర్చు చేసే వారేరి. ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం భారతదేశంలో పని చేసే వయసు వారు (15-59) 2011లో 61 శాతం ఉండగా 2021 నాటికి 64 శాతానికి పెరిగింది. మన యువతలో ప్రతి సంవత్సరం 8 మిలియన్ల మంది ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు. అయితే ఆర్థిక కార్యకలాపాలలో వీరి శాతం 2011లో 52 శాతంగా ఉండగా, 2021 నాటికి 37 శాతానికి పడిపోయింది. 2022 లో నిరుద్యోగ యువత మొత్తం నిరుద్యోగులలో 82.9 శాతం అని ఈ నివేదిక తెలియజేసింది.

నిరాశ నిస్పృహలతో యువత

జనాభాలో పనిచేసే వయసులో ఉన్న వారి శాతం పెరుగుతుంటే యువశక్తి పెరుగుదలకు చిహ్నం. ఆర్థిక అభివృద్ధిలో క్రియాశీలకంగా పాలుపంచుకునేది దేశాన్ని మునుముందు నడిపించేది యువతే. అటువంటిది వారే నిరాశ నిస్పృహలతో పని పాట లేకుండా ఉంటే ఈ దేశానికి దిక్కెవరు? పాలకులు నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేస్తున్నందున యువత జాతి నిర్మాణంలో భాగస్వాములు కాలేకపోతున్నారు. మన పాలకులు వ్యవహరించే విధానాల వలన కోట్లకొలది యువతీ యువకులు నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీనివల్ల కుటుంబం సమాజం దేశం అశాంతికి గురవుతోంది. యువతలో నూతన ఉత్సాహం నింపి జీవితం పట్ల ఆశలు రేకెత్తించే అలాంటి విధాన కార్యక్రమాలు రూపొందించి చేపడితే, పాలకులు త్రికరణ శుద్ధిగా యువతీ యువకులను అధునాతన ప్రపంచంలో మమేకం చేయగలిగితే, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కాలాన్ని మించిన వేగంతో యువత పరిగెత్తగలదు. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువత వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న వైనం పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. జనాభా నిధిగా ఉన్న యువతను మన దేశ ఆర్థిక అభివృద్ధిలో క్రియాశీలకంగా పాలుపంచుకునే విధంగా చేయనిదే ప్రపంచ దేశాలలో మనదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావడం అసంభవం.

డా. ఎనుగొండ నాగరాజ నాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్, తిరుపతి,

98663 22172

Advertisement

Next Story