- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
India vs Bharat: మారాల్సింది పేర్లు కాదు.. పేదల బతుకులు!
భవిష్యత్తు బాగుపడుతుందని, బతుకు మారుతుందని అజ్ఞానంతోనో, అమాయకత్వంతోనో, న్యూమరాలజీపైన విశ్వాసంతోనో పేరు మార్చుకునేవారు చాలామంది ఉన్నారు. భాషాభిమానం, సంస్కృతి లాంటి కారణాలతో నగరాల పేర్లు కూడా ముంబై, చెన్నై, కోల్‌కతా, గురుగ్రామ్‌గా మారిపోయాయి. ఇప్పుడు ఆ వరుసలో దేశం పేరు కూడా ఇండియా నుంచి భారత్‌గా మారుతున్నది. తొలిసారి రాష్ట్రపతి ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కనిపించడంతో ఒక్కసారిగా దేశంలో చర్చ చోటుచేసుకున్నది. జై కొట్టినవారు కొందరైతే విమర్శించేవారు ఇంకొందరు. భారత్ అని మార్చడం రాజ్యాంగ బద్ధమా, విరుద్ధమా అనేది వేరే చర్చ.
చంద్రయాన్, మంగళ్‌యాన్, గగన్‌యాన్ లాంటి శాస్త్రీయ ప్రయోగాలతో దేశానికి అంతర్జాతీయ స్థాయిలోనే గుర్తింపు వచ్చింది. కరోనా వ్యాక్సిన్‌ను కనుగొన్న ఖ్యాతి కూడా దక్కింది. ఇండియా, భారత్ అనే పేర్లతో సంబంధం లేదు. ఇప్పుడు ఇండియా అనే పదాన్ని తీసేసి భారత్ అని తగిలించినంతమాత్రాన అదనంగా వచ్చేదేమీ లేదు. పేరు మార్పుతో పేదల బతుకులు బాగుపడతాయనుకుంటే, దేశం అభివృద్ధి చెందుతుందంటే స్వాగతించాల్సిందే. వలస పాలనకు చిహ్నమనో, కాంగ్రెస్ కూటమికి ఇండియా పేరు పెట్టుకున్నారనో, వేద కాలం నుంచీ దేశం పేరు భారత్‌గానే ఉండిందనో.. ఇలాంటి కారణాలతో మార్చడం సమంజసం అనిపించుకోదు.
భారత్ నామకరణం ఇక లాంఛనమే..
జీ-20 సమావేశాలకు హాజరయ్యేందుకు అనేక దేశాల నుంచి అతిథులు వస్తున్న సమయంలో అధికారికంగానే భారత్‌గా మారడం యాధృచ్ఛికమో, అనాలోచితమో కాదు. ఆతిథ్యం ఇచ్చేందుకు అతిథులకు రాష్ట్రపతి పంపిన ఇన్విటేషన్లపై మొదటిసారి ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని దర్శనమిచ్చింది. పేరు మార్పును విపక్షాలు వ్యతిరేకించాయి. క్రీడాకారులు, సినీనటులు, సెలెబ్రిటీలు వారిదైన శైలిలో జై కొట్టారు. కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే ఈ విధానానికి శ్రీకారం చుట్టిందనేది నిర్వివాదాంశం. పేరు మార్పులో లీగల్ చిక్కులు, రాజ్యాంగ స్ఫూర్తి సంగతెలా ఉన్నా తాజా పరిణామం సరికొత్త వివాదానికి కారణమైంది.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక పథకాల పేర్లు మారాయి. నగరాల పేర్లూ మారాయి. దేశ రాజధాని ఢిల్లీలోని పలు వీధుల పేర్లూ మారాయి. పనిగట్టుకుని ముస్లిం పేర్లన్నింటినీ హిందు పేర్లలోకి మారుస్తున్నదనే విమర్శలూ ఉన్నాయి. యోగి ఆదిత్యనాధ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక జిల్లాల పేర్లు మారిపోయాయి. పేర్ల మార్పుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అనేక సెటైర్లు విసిరారు. కావాల్సింది నేమ్ ఛేంజర్లు కాదు.. గేమ్ ఛేంజర్లు అంటూ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పీఠికలో భారత్ అనే పదమే లేదని, ఇప్పుడు కొత్తగా ఎలా చేరుస్తారంటూ విపక్షాల నుంచి ప్రశ్నలూ వచ్చాయి.
ఇండియా బదులు భారత్ డిమాండ్
ఇండియాకు బదులుగా భారత్ అనే పేరు పెట్టాలంటూ బీజేపీ ఎంపీల నుంచి దీర్ఘకాలంగానే డిమాండ్ ఉన్నది. పార్లమెంటు ఉభయ సభల్లో అనేక ప్రైవేటు బిల్లుల్నీ పెట్టారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల గౌహతిలో దేశం పేరు మార్పు జరగాలని పట్టుబట్టారు. ఎన్నో ఏండ్లుగా దేశం పేరు భారత్‌గానే ఉన్నదంటూ ఉదహరించారు. తెరవెనుకగా జరుగుతున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయనేదానికి ఇలాంటి కామెంట్లు ఇండికేషన్ కాబోలు! లేదా కేంద్ర సర్కారుపై ఒత్తిడి పెంచే ఉద్దేశం కావచ్చు. దేశం పేరు భారత్ అనీ, సందేహం అవసరం లేదంటూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమర్ధించుకోవడంతో ఇక మార్పు లాంఛనమనేది స్పష్టం.
బ్రిటీషు హయాంలోనే ఇండియాగా మారిందని, దానికి పూర్వం వేలాది సంవత్సరాలు భారత్‌గానే ఉన్నదని బీజేపీ ఎంపీ నరేశ్ బన్సల్ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మరింతమంది ఆ పార్టీ నేతలు వేడి పెంచుతారేమో! విపక్షాల లాజిక్ మరోలా ఉన్నది. కాంగ్రెస్ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టుకోవడంతో బీజేపీ వెన్నులో పుట్టిన చలి ప్రభావమనే సెటైర్లు వినిపించాయి. భవిష్యత్తులో మా కూటమికి ‘భారత్’ అనే పేరు పెడితే దేశం పేరును మళ్ళీ మారుస్తారా అంటూ ఒకరిద్దరు ప్రస్తావించడం గమనార్హం. పేర్ల మార్పు వెనక రాజకీయ ప్రయోజనం ఉండడమే ఇక్కడ వివాదంగా మారింది.
మోడీ హయాంలో పేర్ల మార్పు సహజం
మోడీ ప్రధాని అయిన తర్వాత దాదాపు 30 కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మారాయి. ఇందిరా ఆవాస్ యోజన పేరు ప్రధాని ఆవాస్ యోజనగా మారింది. నిర్మల్ భారత్ అభియాన్ పేరు స్వచ్ఛ భారత్ అయింది. ఆప్టికల్ ఫైబర్ నెట్ పేరు భారత్ నెట్, జాతీయ ఉత్పత్తి విధానం పేరు మేక్ ఇన్ ఇండియా, రాజీవ్ ఆవాస్ యోజన పేరు సర్దార్ పటేల్ అర్బన్ హౌజింగ్, నేషనల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ పేరు బేటీ పఢావో.. బేటీ బచావో, నేషనల్ ఈ-గవర్నెన్స్ స్కీమ్ పేరు డిజిటల్ ఇండియా, జవహర్‌లాల్ నెహ్రూ అర్బన్ రెన్యూవల్ మిషన్ పేరు అమృత్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పేరు జన్‌ధన్ యోజన.. ఇలా అనేకం మారిపోయాయి.
ఢిల్లీ సిటీలోని ఔరంగ్‌జేబ్ రోడ్డు పేరు డాక్టర్ అబ్దుల్ కలామ్ రోడ్డుగా మారింది. ఫిరోష్ షా కోట్ల స్టేడియం పేరు అరుణ్ జైట్లీ స్టేడియం, రాజ్‌పథ్ పేరు కర్తవ్యపథ్, రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్ పేరు అమృత్ ఉద్యాన్, ఢిల్లీ యూనివర్శిటీలోని మొఘల్ గార్డెన్ పేరు గౌతమ్‌బుద్ధ సెంటెనరీ గార్డెన్‌గా మారిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లో ఫైజాబాద్ పేరు అయోధ్యగా, అలహాబాద్ పేరు ప్రయాగ్‌రాజ్‌గా, ముఘల్‌సరాయ్ రైల్వే స్టేషన్ పేరు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్‌గా మార్పుచెందాయి. ఇదే వరుసలో ఇకపైన ఆగ్రాను ఆగ్రావన్‌గా, ముజఫర్‌నగర్‌ను లక్ష్మీనగర్‌గా, ఫిరోజాబాద్ జిల్లా పేరును చంద్రానగర్‌గా, ఆజామ్‌గఢ్ పేరును ఆర్యన్‌గఢ్‌గా మార్చే ప్రతిపాదనలూ ఉన్నాయి.
ముస్లిం పేర్లపైనే ఫోకస్
బానిస మనస్తత్వంతో ఉన్న అనేక పేర్లు మారిపోయాయంటూ ఎర్రకోట వేదికగా ప్రధాని మోడీ ప్రస్తావించారు. దీంతో ఇకపైన కూడా అనేక పేర్లు రూపాంతరం చెందుతాయనే సందేశమిచ్చారు. బ్రిటీషు కాలంలో చెలామణిలో ఉన్న పేర్లతో పాటు దానికంటే ముందు మొఘల్ చక్రవర్తుల కాలం నాటి పేర్లను కూడా మార్చడానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు వెనకాడలేదు. ఢిల్లీలోని సుమారు 40 ప్రాంతాలు ముస్లింల పేర్లతో ఉన్నాయని, వాటిని కూడా మార్చాలంటూ ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆదేశ్ గుప్త ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో బీజేపీ సర్కారు ఏర్పడిన తర్వాత మారుతాయి కాబోలు!
పేర్లు మారిస్తే చరిత్ర మారిపోతుందా?
ఇప్పటికే పాఠ్యపుస్తకాల్లో మొఘల్, ఇస్లాంకు సంబంధించిన అనేక పాఠ్యాంశాలను తొలగించిందంటూ బీజేపీ విమర్శలను ఎదుర్కొంటున్నది. పేర్లు మార్చినంతమాత్రాన చరిత్రను అందించకుండా ఆపగలరా అని చరిత్రకారులు ప్రశ్నించారు. హిందుత్వ భావజాలంతోనే ఇస్లాం వ్యతిరేక స్వభావాన్ని ఈ రూపంలో అమలుచేస్తున్నదంటూ సెక్యులర్ పార్టీలు తూర్పారబట్టాయి. భవిష్యత్ తరాలు చరిత్రను తెలుసుకోకుండా చేసే ఇలాంటి ప్రయత్నాలు ఫలిస్తాయా అనే చర్చ జరుగుతున్నది. మేం అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను కర్నావటిగా మారుస్తామంటూ బీజేపీ నేతలు ఓపెన్‌గానే ప్రకటన చేశారు.
నిజానికి ఈ పేర్లు మార్చినంతమాత్రాన మొఘల్‌ల, బ్రిటీషు చరిత్ర భావితరాలకు తెలియకుండాపోదు. చరిత్రను అధ్యయనం చేయడంలో భాగంగా ఎవరి హయాంలో పేర్లు మారాయో, ఎందుకు జరిగిందో కూడా రికార్డవుతుంది. దేశ తొలి ప్రధాని నెహ్రూ పేరుమీద ఉన్న మెమోరియల్ లైబ్రరీ పేరు సైతం ఇటీవల మారిపోయింది. వలస పాలన నాటి అవశేషాలను, మొఘల్ కాలంలోని చారిత్రక ప్రాధాన్యతలేకాక కాంగ్రెస్ పేటెంట్‌గా చెప్పుకునే నెహ్రూ ఆనవాళ్ళను (లెగసీ)ని లేకుండా చేసే ప్రయత్నం ఒక పథకం ప్రకారమే జరుగుతున్నదంటూ ఇప్పటికే మోడీ నిందలు మోస్తున్నారు. ఆ వరుసలోకి ఇప్పుడు ఇండియా పేరు మార్పు సైతం చేరిపోయింది.
పేర్ల మార్పుతో బతుకులు మారుతాయా?
ఒక ఎజెండా ప్రకారం పేర్లు మార్చుకునే ప్రక్రియ తొమ్మిదేళ్లుగా జరుగుతూనే ఉన్నది. పేర్లు మారినంత మాత్రాన చరిత్ర మాసిపోదు. పథకాల పేర్లు మార్చినంతమాత్రాన లబ్ధిదారుల జీవితాల్లోనూ మార్పు రాదు. మౌలికమైన అవసరాలను తీర్చకుండా, పాలనా విధానంలో మార్పు రాకుండా ఎన్ని పేర్లు మార్చినా ప్రయోజనం ఉండదు. ఒకవైపు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తయిందని గొప్పగా చెప్పుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని ఉత్సవాలు చేసుకుంటున్నాం. అదే సమయంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) వర్గాల సంక్షేమం, పేదరిక నిర్మూలనా పథకాలను కొనసాగిస్తూ ఉన్నాం.
ప్రజల పాకెట్ మనీలో సింహభాగం విద్య, వైద్యానికే ఖర్చవుతున్నదని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నదని లేబర్ సర్వే చెప్తున్నది. కనీస వైద్యం అందక పేదలు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇన్ని సమస్యలు తాండవిస్తూ ఉంటే వాటికి శాశ్వత పరిష్కారం చూపలేని ప్రభుత్వాలు హిందు, ముస్లిం, బానిసత్వ చిహ్నాల సాకుతో పేర్లను మార్చడంతో వచ్చే ప్రయోజనమేమీ లేదు. పాలకులు వారి ఎజెండా కోసం, తమదైన ముద్ర కోసం పేర్లు మార్చుకోవడం ఆనవాయితీగా మారింది. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ లాంటి చట్టాలకూ భారతీయ అనే పదం వచ్చి చేరుతున్నది.
ప్రజల బతుకులను మార్చలేని ఈ పేర్ల మార్పుతో ప్రయోజనం శూన్యం. ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నికైనవారు, దేశాన్ని పాలించే నేతలు, ప్రజల ఓట్లతో అధికార పీఠాన్ని ఎక్కిన ప్రజలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడనంతకాలం, వారి బతుకుల్లో మార్పు లేనంతకాలం దేశం మొదలు గల్లీ వరకు ఎన్ని పేర్లు మార్చినా, ఏ పేరు పెట్టినా ఒరిగేదేమీ ఉండదు. ఎన్నికల సమయంలో ఎమోషన్స్ కోసం చేసే ఇలాంటి ప్రయోగాల వెనక రాజకీయ ప్రయోజనం ఉన్నదనేది సుస్పష్టం.
-ఎన్. విశ్వనాథ్
99714 82403