దేవాదాయ శాఖలో అనైతికులు..

by Ravi |   ( Updated:2024-08-08 01:00:36.0  )
దేవాదాయ శాఖలో అనైతికులు..
X

దేవుని పైన, దేవుని మహిమలపైన అచంచల విశ్వాసమున్న భక్తులూ, దేవాలయ దైనందిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలనే సదుద్దేశంతో దాతలు దేవాలయ వ్యవస్థకు ఆస్తులను సమకూర్చారు. ఇదే భావనతో నేటికీ భక్తులు దేవాలయాల హుండీలను కానుకలతో నింపుతున్నారు.

వాస్తవంగా దేవాదాయ శాఖలో పనిచేసే చాలామంది ఉద్యోగులలో ధర్మనిరతి, దైవభక్తి, దైవభీతి, ధార్మిక కార్యక్రమాలపై విశ్వాసం మచ్చుకైనా కనిపించదు. ఆ శాఖలో పైరవీలు పోలీసు, రెవెన్యూ శాఖలను మించిపోయాయంటే అతిశయోక్తి కాదేమో!

ఉద్యోగినిని పావుగా ఉపయోగించుకుని..

ప్రస్తుతం దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శాంతి వ్యవహారం రాష్ట్రంలో పెద్ద న్యూస్‌గా దుమారం రేపుతుంది. ఈ వ్యవహారంలో రాజకీయ కోణం, సామాజిక కోణం కలగలిసి ఉన్నాయి. మానసిక దౌర్బల్యం మెండుగా ఉన్న నిమ్నవర్గాల మహిళా ఉద్యోగిని రాజకీయ నాయకుల అవసరాలకు ఎలా పావుగా ఉపయోగపడుతుందో ఈ ఉదంతం రుజువు చేసింది. ఆమె నియామకమే అక్రమం అనే ఆరోపణ కూడా ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఇది వాస్తవమైతే ఆమె గత ప్రభుత్వ నాయకులు చెప్పినట్లు విధులు నిర్వహించినట్లు ఒప్పుకొని తీరాలి! తనపై అధికారి పుష్ప వర్ధన్‌పై ఇసుక చల్లి, దాడికి దిగడం మామూలు విషయం కాదు. ఎరుకల కులానికి చెందిన ఒక మహిళ ఇంత సాహసానికి ఒడిగట్టడం వెనుక ప్రభుత్వంలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ప్రమేయం లేదని చెప్పలేం. దేవాలయ ఆస్తులను అడ్డగోలుగా లీజుకు ఇవ్వడంలో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఎంత ఉందో నేటి ప్రభుత్వం లోతుగా విచారణ చేయాలి. అదే విధంగా డిప్యూటీ కమిషనర్ హర్షవర్ధన్ దేవాలయ శాఖలోని తన కింది ఉద్యోగులను వేధించాడనే శాంతి ఆరోపణలపైన లోతైన విచారణ కూడా జరగాలి.

ఇంటి గుట్టును రచ్చకీడ్చితే ఎలా?

ఇక సామాజిక కోణంలో పరిశీలిస్తే, శాంతి కుటుంబంలో నైతిక విలువల పతనం స్పష్టంగా గోచరిస్తుంది. ఇందుకు శాంతి, ఆమె భర్త మదన్మోహన్ ఇద్దరు కారణమే. శాంతి భర్త మదన్మోహన్ మీడియా ముందు తన భార్య వ్యక్తిగత విషయాలను నిస్సిగ్గుగా బహిరంగపరచడం, పైగా నాకు దేశభక్తి ఉందని, సామాజిక భక్తి ఉందంటూ డబ్బా కొట్టుకోవడం బట్టి చూస్తే, అతడు చెప్పే విషయాలు నమ్మబుద్ధి కావడం లేదు. ఇతని వెనుక ఎవరో ఉండి, ఇలా మాట్లాడిస్తున్నట్లు అనుమానం కలుగకమానదు. తన కులంలోని పెద్దలు, శ్రేయోభిలాషులు, కూర్చుని మాట్లాడకుండా డైరెక్ట్‌గా మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయడం వల్ల తన ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

తప్పులకు కులాన్ని అడ్డుపెట్టుకుంటే...!

ఇక శాంతి వ్యవహారం చూస్తే, కుటుంబ గౌరవం, ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు, సమాజంలో తనకు ఎదురయ్యే ఏహ్యభావం ఇలాంటి విషయాలను గురించి ఆమె ఆలోచించిన దాఖలాలు కనబడలేదు. తాను ఒక ఎస్టీ మహిళ అయినందుకే ఇలా జరిగిందని, ఎస్టీలు బాగా ఎదగడం కొందరికి ఇష్టం లేక ఇలా జరిగిందని వాపోవడం హాస్యాస్పదంగా ఉంది. దేశంలో ఎంతోమంది నిమ్న కులాల మహిళలు ఎంతో హుందాగా, నిజాయితీగా, గౌరవప్రదంగా, ఎటువంటి మానసిక దౌర్భాల్యాలకు గురికాకుండా తమ తమ విద్యుక్త ధర్మాలను నిర్వహించి, గౌరవ, ఆదరాభిమానాలను పొందడం లేదా?

రాజకీయం ఇంతగా భ్రష్టుపట్టిందా?

ఇక చివరగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సిద్ధాంతాల స్థానంలో వ్యక్తిగత విషయాలు, కుటుంబాలలోని స్త్రీల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజకీయ నాయకులు ప్రవర్తించడం సిగ్గుచేటు. శాంతి వ్యవహారం ఈ నికృష్ట రాజకీయాలతో ముడిపడి ఉంది. ఇటువంటి వ్యవహారాలను అడ్డం పెట్టుకొని, రాజకీయాలు చేసే రాజకీయ నాయకులను ఎన్నికల్లో ఓటర్లు ఎన్నుకోవడం మరింత దురదృష్టం. గత ప్రభుత్వంలోని కొంతమంది రాజకీయ నాయకులు బరితెగించి ఎదుటివారి కుటుంబాలలోని స్త్రీల గురించి జుగుప్సాకరంగా మాట్లాడడం ప్రపంచమంతా చూసింది, విన్నది. ఇటువంటి వ్యక్తులను సమాజం అన్ని విషయాలలో బహిష్కరిస్తే, భవిష్యత్తు సమాజమైనా విలువలతో బతుకుతుంది. ధర్మ హీనులు, లంచగొండులు, అవినీతిపరులు, సామాజిక విలువల పట్ల నిష్టలేనివారు దేవాలయాలలో ఉద్యోగులుగా ఉంటే, దేవాలయాల వ్యవస్థ పైన భక్తులకు విశ్వాసం సన్న గిల్లడం ఖాయం. ఈ సమస్యకు ప్రధాన కారణం దేవాలయ వ్యవస్థ ప్రభుత్వ స్వాధీనంలో ఉండడమే! ఈ విషయంపై సమాజ హితాన్ని కోరే ప్రజలు తీక్షణంగా యోచించవలసిన అవసరం ఉంది.

ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

94417 37877

Advertisement

Next Story

Most Viewed