అభివృద్ధి నమూనా మార్చుకోకపోతే..

by Ravi |   ( Updated:2024-08-08 00:45:32.0  )
అభివృద్ధి నమూనా మార్చుకోకపోతే..
X

కేరళ, తమిళనాడు కర్ణాటక మూడు రాష్ట్రాల కూడలిలో వయనాడ్ అందమైన పర్యాటక ప్రాంతం. అందుకే దేశ దేశాల నుండి వచ్చే పర్యాటకులకు అనువుగా వసతులను పెంచి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనీ, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని భావించారు పాలకులు. ఈ ఆకాంక్ష కూడా సహజమే. కానీ, పర్యావరణం రీత్యా అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఇష్టారీతిగా నిర్మాణాలు చేపట్టి, యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసం సాగిస్తే అది మొదటికే మోసం అన్న ఇంగిత జ్ఞానం లేకుంటే ఎలా?

మరుభూమిగా వయనాడ్!

ప్రకృతితో సహజీవనం మరచి ఇటు చట్టబద్ధంగానూ, అటు చట్టవిరుద్ధంగానూ గనుల తవ్వకాలకు అనుమతిస్తే అన్ని రకాలుగా విలయమే తప్ప వికాసం జరుగు తుందా? మనుషుల భద్రత కన్నా మాయదారి వ్యాపారం ఎక్కువా? వయనాడ్ విలయం కేవలం ప్రకృతి సృష్టించింది కాదు. మనుషుల దురాశకు ఫలితం. అభివృద్ధి పేరట మనం సాగిస్తున్న ప్రకృతి వినాశనం తాలూకు విపరిణామం. దాదాపు 350కి పైగా దారుణ మరణాలకు కారణమైన ఈ దుర్ఘటనలో కేరళలోని వయనాడ్ జిల్లా అంతా మరుభూమిగా మారింది. గత నెల 29-30 తేదీల్లో వయనాడ్ ప్రాంతంలో అసాధారణమైన వర్షం కురవడం, కొండ చరియలు విరిగిపడంతో ఊళ్లకు ఊళ్లు బురదలో కూరుకుపోయాయి. ఈ విపత్తులో చిక్కిన బాధితుల ఆర్తనాదాలతో వయనాడ్ కొండలు మొత్తం ప్రతిధ్వనిస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన ఈ విపత్తు నుండి ప్రజలను కాపాడేందుకు యుద్ధ ప్రాతి పాదికపై సహాయక చర్యలు చేపట్టారు.

సిఫార్సులు కష్టంగా ఉన్నాయని..

కేరళ సహా పడమటి కనుమలు వ్యాపించిన ప్రాంతమంతా ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని కొన్నేళ్లుగా పర్యావరణ నిపుణులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. 2011లోని కేంద్రం పడమటి కనుమల పరిరక్షణకై పర్యావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ సారధ్యంలో నిపుణుల కమిటీ వేసింది. అరుదైన జీవజాలానికి ఆవాసమైన దట్టమైన అరణ్యాలు ఉన్నందువల్ల గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళకు విస్తరించిన పడమటి కనుమల్లో 75 శాతం విస్తరించిన ప్రాంతాన్ని పర్యావరణ రీత్యా సున్నితమైనదిగా ప్రకటించాలని గాడ్గిల్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చి 13 ఏళ్లు దాటింది. కానీ వరుసగా రాష్ట్రాల ప్రభుత్వాలు వాణిజ్యపరంగా లాభాలను ఆశించి సిఫారసులు కఠినం గా ఉన్నాయని, ఆర్థిక అభివృద్ధికి, ప్రజల జీవనోపాధికి నష్టం కలుగుతుందని సాకులు చెప్పాయి. పైగా అభివృద్ధి రేసులో పడి కొండలను తొలిచి టూరిస్టుల ఆకర్షణకు భారీగా ఎతైన హోటళ్లు, లాడ్జ్‌లు ఇతర నిర్మాణాలను చేపట్టాయి. జల విద్యుత్ కేంద్రాలు చేపట్టాయి. కేరళలో టూరిస్ట్ రిసార్ట్స్ కల్చర్ భారీగా పెరిగింది. అక్రమ తవ్వకాలకు అంతే లేదు. సున్నిత పర్యావరణ ప్రాంతంలోని ఈ తప్పుడు అభివృద్ధి నమూనాను ఇకనైనా మార్చుకోకపోతే భవిష్యత్తు ఇంకా దుర్భరమవుతుంది. వయనాడ్‌లో జరిగిన ఘటనపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ప్రస్తుతం రాజకీయాలకు ఇది తరుణం కాదు. ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కలిసి పనిచేయాలి. దేశంలో ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉమ్మడిగా దీన్ని జాతీయ విపత్తుగా భావించి ఎదుర్కోవాలి. కేరళ రాష్ట్రానికి అన్ని విధాలా తక్షణ సహాయం అవసరం.

డా. కిశోర్ ప్రసాద్

9849328496

Advertisement

Next Story