- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భవిష్యత్ ఇంగ్లీష్‌దే దీనిని నిర్లక్ష్యం చేశారో..?

గతంలో పిల్లల మీద విద్యాసంస్థల్లో భయంకరమైన శిక్షలు ఉండేవి. విద్యాహక్కు చట్టం రూపొందించడంతో విద్య పిల్లల ప్రాథమిక హక్కు అయింది. ఆ కారణంగా ఈ హక్కుకి అడ్డువచ్చే ప్రతి ఒక్కటి ప్రభుత్వం నియంత్రణలోకి వెళ్లింది. పిల్లలపై భౌతిక, మానసిక శిక్షలు కూడా పిల్లల విద్యకు అఘాతంగా మారాయి. కాబట్టి, విద్యావ్యవస్థలో పిల్లలపై శిక్షలు నిషేధించారు. కానీ, మరోవైపు డిజిటల్ ప్రపంచంలో వచ్చిన అనూహ్యమైన మార్పులు పిల్లలకు మరో కొత్త ప్రపంచాన్ని అందించాయి. జియో ఉచిత ఇంటర్నెట్ సేవలు దీన్ని మరింత సులభతరం చేశాయి.
ఫలితంగా, విద్యార్థులు, యువత మొబైల్‌లోని హింసాత్మక గేమ్స్, చూడకూడని యూట్యూబ్ వీడియోలు ఇన్ స్టాగ్రాం ఒకటేమిటి చేతివేళ్లలో మొత్తం ఒక కొత్త ప్రపంచాన్ని చూడడం ఆరంభం అయింది. అలా మన సామాజిక వ్యవస్థ మార్పు చెందింది.
ఎన్ని ప్రయోగాలు చేసినా..
సామాజిక వ్యవస్థ మార్పు చెందడంతో అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయుల్లో, పిల్లల్లో అనూహ్యమైన మార్పుల్ని చూస్తున్నారు. వీరు పిల్లలలో వచ్చిన ఈ వింత మార్పుకి సమిధలవుతున్నారు. ఒక వైపు ఏ విధమైన శిక్షలు లేని విద్యా విధానానికి తోడు సరైన సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు లేని ప్రభుత్వ విద్యాలయాలు.. ఇక మధ్యాహ్నం భోజనం, ఇతర ప్రభుత్వ పథకాలతో బిజీ అయిపోయిన ఉపాధ్యాయులు, నాణ్యమైన విద్యను అందించడానికి వీలు కానీ విద్యా వ్యవస్థ. ఇదంతా కూడా ఒక కొత్త రకం సమస్యను తీసుకొచ్చింది.
కొత్త రకం ప్రణాళికలు ఆవశ్యం!
మన భారతదేశంలోని విద్యా వ్యవస్థలో 1950 నుంచి ఈరోజు వరకూ ప్రయోగాలే నడుస్తున్నాయి. కానీ, ఇప్పటికీ ఫిన్‌లాండ్ దేశాల స్థాయికి కనీసం పదో వంతు కూడా వెళ్లలేకపోతున్నాం సరి కదా నేడు మరింత విషమ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు పడిపోయారు. ఇలా పిల్లల్లో కొట్టొచ్చినట్టు కనిపించే కొత్త రకం ప్రవర్తనలతో ఒకవైపు ఉపాధ్యాయులు నిరాశకు గురవుతున్న తరుణంలో, మరోవైపు పిల్లలకు శారీరకంగా, మానసికంగా ఏ రకమైన శిక్షను అంగీకరించని చట్టాలు పరిస్థితుల్ని అస్తవ్యస్తంగా మార్చేశాయి. కాబట్టి, విద్యావ్యవస్థలో మూస పద్ధతిలో, మార్కుల పద్ధతిలో, ర్యాంకుల పద్ధతిలో ప్రోగ్రెస్ రిపోర్ట్ పద్ధతుల్లో వెళ్లిపోకుండా పిల్లల్లో సంస్కరణకు కొత్త రకం ప్రణాళికలు విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు ఎవరికి ఎలా వీలైతే అలా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోతున్న సమాజం మరింత శిధిలమైపోకుండా ఉండాలంటే ఈ భావి భారత పౌరులను సరైన పద్ధతిలో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉపాధ్యాయులకు ఉంది.
విద్యావిధానంలో నిత్య సంశయం
ఇప్పటికీ మన విద్యా విధానం దేశానికి, ప్రపంచానికి అవసరమైన విధంగా రూపొందించుకోలేకపోయాం. ఇంగ్లీష్ విషయంలోనే ఇప్పటికీ కూడా సరైన నిర్ణయాన్ని మన విద్యా వ్యవస్థ తీసుకోలేకపోయింది. పిల్లలకు ఇంగ్లీషు అవసరం అని ఒకసారి అంటారు. ఇంగ్లీషు అవసరం లేదు. మన భారతీయ భాషలే అభివృద్ధి చేసుకోవాలని మరోసారి అంటారు. దీంతో యువతరం ఎటుపోవాలో తెలియని సందిగ్ధంలో కొట్టుకుపోతుంది. ఈ వేళ ఆర్ఎస్ఎస్ సంస్థ కూడా పిల్లలకు ఇంగ్లీషు కెరియర్ భాషగా అవసరం అని కొత్త స్లోగన్ అందించింది. అయితే ఇప్పటికప్పుడు ఇంగ్లీషు విధానానికి సంబంధించి సరైన శాస్త్రీయమైన ఆలోచనలు విద్యా వ్యవస్థలో అందించే పరిస్థితులు కనిపించడం లేదు.
పార్టీ అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తే..
ఒకవైపు ప్రపంచీకరణ కారణంగా ఆంగ్లం తెలియకపోతే, అందులో స్కిల్స్ రాకపోతే ఏ రకమైన పరిశ్రమలో కూడా పనికి రాని పరిస్థితులు ఉన్నాయి. దేశంలోని ప్రైవేటు పరిశ్రమలో, ఐటీ రంగంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి, యువతకు ఉపాధి కావాలంటే కనీసం హై స్కూల్ స్థాయిలోనే ఆంగ్లంలో అవసరమైన అవగాహన, నైపుణ్యం అందించే విద్యా విధానం ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. విద్యా విధానంలో రాజకీయాలు కలిసిపోతాయి. ఏ పార్టీ పాలనలోకి వస్తే ఆ పార్టీ తన అవసరాలకు అనుగుణంగా లేదా తన ఎన్నికల సామ్రాజ్యాన్ని తనకోసం నిలుపుకోవడానికి ఏ రకమైన స్లొగన్స్ అవసరమైతే వాటిని ముందుకు నడిపే విధంగా విద్యా విధానం కొనసాగుతుంది. చాలాసార్లు విద్యా విధానం విద్యావేత్తల కంటే రాజకీయ నాయకులు శాసించే దయనీయమైన పరిస్థితి మన దేశ విద్యా వ్యవస్థలో ఉంది.
ఇంగ్లీష్‌పై చిన్నచూపు ప్రమాదకరం!
యువతరానికి కొత్త ఆర్థిక ప్రణాళికల వల్ల ఉపాధి ఇవ్వలేని పరిస్థితి దేశంలో ఇప్పటికే ఉంది. ప్రభుత్వం చేతుల్లో ఉన్న చాలా రంగాలు ఉద్యోగాలను తగ్గించేసుకొని ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఫలితంగా, విపరీతమైన నిరుద్యోగం ఉంది. కనీసం యువతరం ప్రైవేటు కంపెనీల్లో అయినా ఏదైనా ఉపాధి సంపాదించుకోవాలి అంటే అక్కడ అవసరమైన ఇంగ్లీష్ నైపుణ్యం తనకు లేదని భావితరం యువత తెలుసుకుంటారు. మాతృభాష చాలా అవసరం. అది తల్లి భాష అని రాజకీయ నాయకులు ఇప్పటికే ఆంగ్లం మీద చిన్నచూపు చూపుతూ ఈ యువతకు ఆంగ్లం అంటే నిరసన, భయం కలిగించే విధంగా తయారు చేసి ఉంటారు. మరి ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలు ఇంగ్లీషులో ఉంటాయి. ఇంగ్లీష్ పేపర్లు కూడా అక్కడ చేయాల్సి ఉంటుంది. ఆ పేపర్ కూడా పోటీ కారణంగా, ఏరివేత కారణంగా మరింత కఠినంగా ఉంటుంది. ఇతర పాఠ్యాంశాలలో అపారమైన మేధ స్సు ఉన్న విద్యార్థి అయినా సరే ఇక్కడ ఇరకాటంలో పడతాడు. కాబట్టి సరైన విద్యా విధానం కూడా మనం రూపొందించుకోవాలి.
- కేశవ్
ఆర్థిక సామాజిక విశ్లేషకులు
98313 14213