మానవ హితం - రమజాన్ ఆశయం

by Ravi |   ( Updated:2023-03-23 22:30:43.0  )
మానవ హితం - రమజాన్ ఆశయం
X

మాజంలో అందరూ ఒకేలా ఉండరు. ఒకే చేతికున్న ఐదేళ్ళూ సమానంగా లేనట్లే, మానవ జాతికి చెందిన మనుషులంతా ఒకేలా లేరు. కొందరు సంపన్నులు, కొందరు నిరుపేదలు, కొందరు విద్యావంతులు, కొందరు నిరక్షరాస్యులు, కొందరు దాతృస్వభావులు, కొందరు పిసినారులు, కొందరు బుద్ధిమంతులు, కొందరు బుద్ధిహీనులు, కొందరు అమీర్లు, కొందరు గరీబులు. ఇదేవిధంగా కొందరు సమఉజ్జీలు కూడా ఉంటారు. అందరినీ దేవుడు పరీక్షిస్తున్నాడు. ఒకరోజు అందరినీ సమావేశపరిచి లెక్క తీసుకుంటాడు.

ఎవరికి ఏ స్థితి ప్రాప్తమైనా, వారు అదే స్థితిలో పరీక్షకు గురవుతున్నారు. ఇదేవిధంగా దైవం వారికి బాధ్యతలు కూడా పంచాడు. విధులనూ నిర్ణయించాడు. అందులో భాగంగానే సదఖ, ఫిత్రా, ఖైరాత్, జకాత్ లాంటి వివిధ రూపాల్లో సమాజంలోని పేదసాదల చేయూతకు ఏర్పాట్లు చేశాడు. సమాజంలో అందరూ నిండు సంతోషంతో జీవితం గడపాలంటే, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. దానికో క్రమబద్దమైన నియమం, నిబంధనావళి ఉండాలి.

అందుకే దైవం సంవత్సరానికొకసారి ఒక నెలరోజుల పాటు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశాడు. రమజాన్ నెలరోజులూ మనిషి పగలంతా ఉపవాసం పాటిస్తాడు. దాదాపు పద్నాలుగు, పదిహేను గంటలపాటు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా దీక్షపాటిస్తాడు. దీనివల్ల ఆకలిదప్పుల బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఫలితంగా ఒక్కపూట అన్నానికి సైతం నోచుకోని అసంఖ్యాక నిరుపేదలపట్ల మనసులో సానుభూతి భావాలు వికసిస్తాయి. ఏదో ఒక రూపంలో అలాంటి వారిని ఆదుకోవాలన్న బలమైన ఆలోచన మనసులో జనిస్తుంది.

అందుకే రమజాన్ నెలలో అధికంగా దానధర్మాలు చేస్తారు. ఫిత్రాలు చెల్లిస్తారు. జకాత్ ఇస్తారు. రమజాన్ నెల చివరిరోజుల్లో, పండుగ నమాజుకు ముందు కుటుంబ సభ్యులందరి తరఫున ఒక నిర్ణీత కొలతలో ధాన్యంగాని, రొక్కంగాని చెల్లించడాన్ని ఫిత్రా అని, సంవత్సరానికొకసారి తమనిల్వ ఆదాయంలోనుండి నూటికి రెండున్నర శాతం చొప్పున తీసి మానవ హితంకోసం ఖర్చుచేయడాన్ని జకాత్ అనీ అంటారు. సమాజంలో అందరూ సుఖసంతోషాలతో జీవితం గడపాలన్నది ఈ ఫిత్రా, జకాత్ , సదఖ, ఖైరాత్ తదితర దానాల అసలు ఉద్దేశ్యం.

రమజాన్ మాసంలో సత్కార్యాల పుణ్యఫలం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోతుంది కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కో సత్కార్యానికి 10 నుండి 700 వందల రెట్ల వరకు పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాదు, మనసులోని ఆర్తి, చిత్తశుద్ధిని బట్టి ఈ పుణ్యఫలం అసంఖ్యాకంగా పెరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దైవం బాహ్య ఆచరణలను అంతగా పట్టించుకోడు. అంతరంగంలోని ఆర్తిని, చిత్తశుద్ధిని మాత్రమే ఆయన చూస్తాడు.

అందుకని దేవుడు మనకు కల్పించిన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ, సమాజంలోని సాటి మానవ సమూహం పట్ల, ముఖ్యంగా పేదసాదలు, బడుగు బలహీన వర్గాల పట్ల బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదే రమజాన్ ఉపవాసాల ద్వారా మనకు లభిస్తున్న సందేశం.

(నేడు రమజాన్ మాసం ప్రారంభం)

-యండి. ఉస్మాన్ ఖాన్

99125 80645

Advertisement

Next Story

Most Viewed