పరమ పవిత్రం రంజాన్ మాసం

by Ravi |   ( Updated:2023-03-23 22:45:55.0  )
పరమ పవిత్రం రంజాన్ మాసం
X

త సామరస్యానికి, భక్తి భావానికి ప్రతీకగా నిలిచే విశిష్టమైన పర్వదినం రంజాన్. నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. అల్లాకు ప్రీతికరమైన ఈ నెలలో ముస్లింలు కేవలం దేవున్ని ధ్యానిస్తూ పుణ్యకార్యాలకే పరిమితమవుతారు. దాన ధర్మాలు, నమాజ్ చేస్తూ ఖురాన్ పఠిస్తూ ఎంతో నిష్టగా ఉంటారు. ఈ నెల రోజుల్లో పేదలకు సాయం చేయాలని చెబుతుంటారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ అల్లాకి ప్రార్థనలు చేస్తూ కఠిన ఉపవాస దీక్షలతో రంజాన్ నెల జరుపుకుంటారు. రంజాన్ పండుగ మానవాళికి హితాన్ని అందిస్తుంది. ముస్లింలు చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల రంజాన్ పండుగ జరుపుకుంటారు.

పవిత్రంగా ఉపవాసం చేస్తూ..

చాంద్రమానాన్ని అనుసరించి రంజాన్ పండుగ జరుపుకోవడానికి గల కారణం ఆ మాసంలో ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఆవిష్కృతం కావడమే. అందుకే ఈ నెలలో రంజాన్ పండుగకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఖురాన్‌లో రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాస వ్రతం. ముస్లింలు ఈ నెల మొత్తం కఠినమైన ఉపవాసం చేస్తారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు తిని రోజంతా ఉపవాసం ఉంటారు. ఉపవాసాన్ని సూర్యాస్తమయం తర్వాత విరమిస్తారు. మంచిపనులతో అల్లాను మెప్పించేందుకు ప్రయత్నిస్తారు. ఎలాంటి చెడు తలంపులూ మనసులోకి రానివ్వకూడదని నమ్ముతారు. కల్మా తయ్యిబా చదవడం, పాపాల గురించి పశ్చాత్తాపం, స్వర్గప్రాప్తి కావాలనే కోరిక, నరకాగ్ని నుంచి కాపాడమనే విన్నపం చేస్తూ అల్లాను వేడుకుంటారు. ముస్లింలు ఉపవాస సమయంలో ఎలాంటి పరిస్థితులలో కూడా తమ దృష్టిని చెడు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటిస్తారు. వారి దృష్టి మొత్తం ఆ భగవంతుడుపై ఉంచాల్సి ఉంటుంది. అలాగే ఖురాన్‌లో సంపాదించిన డబ్బుతో ఇఫ్తార్ విందు ఇవ్వకూడదనే కఠిన నియమం ఉంది. అబద్దాలు చెప్పడం, చాడీలు చెప్పడం, అనవసర కబుర్లతో కాలయాపన, నోటిదురుసు లాంటివీ ఉపవాస స్ఫూర్తికి విరుద్ధమని ఖురాన్లో రాసి ఉంది. అలాగే పరోక్షనింద వల్ల ఉపవాసం భంగం కలుగుతోంది. ఉపావాసం ప్రారంభించాక నోటిలో వచ్చే ఉమ్ము కూడా మింగకూడదు. అంత పవిత్రంగా, కఠినంగా ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఈ మాసంలో పేదవారికి జకాత్ చెల్లిస్తారు. జకాత్ అంటే పవిత్రత, రంజాన్ మాసంలో ఉపవాసలతో పాటు జకాత్ చెల్లించడం తప్పనిసరి. ధనికుడు తాను పవిత్రుడు అయ్యేందుకు ఏడాదికి ఒకసారి అతని సంపద నుంచి రెండున్నర శాతం పేదలకు దానంగా అందిస్తారు. ఇందులో ధనం, బంగారం, వస్తువులు సైతం ఇస్తారు. ఈ జకాత్ చెల్లిస్తే పుణ్యం వస్తోందని నమ్ముతారు. ఈ పండగను పేదోడు, ధనికుడనే తేడా లేకుండా పవిత్రంగా జరుపుకుంటారు.

ఉత్తమ గుణాలు అలవాటు చేసేందుకు..

జకాత్‌తో పాటు ఫిత్రా దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడు పూటలా తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు, అభాగ్యులకు, సంపన్నులైన ముస్లింలు పండగ సందర్భంలో దానం చేయాలని, ఇస్లాం మతం బోధిస్తోంది. ఉపవాస వ్రతాలు విజయవంతం కావడానికి, దేవుని పట్ల కృతజ్ఞతగా, పేదలకు ఫిత్రా దానం చేయడం సదాచారం. ఫిత్రా దానాన్ని విధిగా నియమించడానికి కారణం, ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు భావనలు, తలంపులు, ఆలోచనలు, నోటి నుండి వెలువడే అసత్యాలు, అనాలోచిత పొరపాటు అన్నీ క్షమించపడతాయని మహమ్మద్ అనుచరుడు అబ్దుల్లా బిన్ మసూద్ ఉవాచ. రంజాన్ మాసంలో జరుపుకునే ఇఫ్తార్ విందులో, ఆత్మీయ స్వభావాలు ప్రస్ఫుటం అవుతాయి. సామూహిక జీవన విధానానికి, విశాల ఆలోచన దృక్పథానికి, ఇఫ్తార్ విందులు నిదర్శనాలు. పవిత్ర ఆరాధనలకు, ధార్మిక చింతనకు, దైవభక్తికి, క్రమశిక్షణకు, ఇంద్రియ నిగ్రహమునకు, స్వీయ నియంత్రణకు, దాతృత్వానికి, ఆలవాలమైన రంజాన్ మాసం, మనిషి సత్ప్రవర్తన దిశలో సాగడానికి, మార్గాన్ని సుగమం చేస్తుంది. మానవుడిలో ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, కర్తవ్య పరాయణత్వం, సహనం, దాతృత్వం, పవిత్ర జీవనం, న్యాయమార్గానుసరణం, ఆర్థిక సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం మొదలైన ఉత్తమ గుణాలు అలవాటు చేసేందుకు సర్వశక్తి, సర్వవ్యాప్తి, సర్వసాక్షి అయిన అల్లాహ్ రంజాన్ మాసాన్ని ప్రసాదించాడని విశ్వసిస్తారు.

యాసర్ హుస్సేన్

9052239669

Advertisement

Next Story