పీఆర్సీ అమలుకు ఇంకెన్నాళ్లు?

by Ravi |   ( Updated:2025-02-07 01:00:51.0  )
పీఆర్సీ అమలుకు ఇంకెన్నాళ్లు?
X

వేతన జీవులు ప్రభుత్వం నుండి ఆశించేవి ఆరు నెలలకోసారి ఇచ్చే డి.ఏ, ఐదు సంవత్సరాల కొకసారి ప్రకటించే పీఆర్సీ. అయితే మొదటి పీఆర్సీ గడువు 2023 జూలై నాటికే ముగిసిపోయినా నేటికీ పీఆర్సీ ప్రకటించే దిశగా ప్రభుత్వం చర్యలు ఏమీ కనిపించకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 అక్టోబర్‌లో రెండో పీఆర్సీ అమలుకు కమిటీ నియమించబడినా, వేతన సవరణ కమిటీకి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతిపాదనలను సమర్పించినా నేటికీ పీఆర్సీ ప్రకటించకపోవడం శోచనీయం.

పీఆర్సీని ఆలస్యం చేస్తూ..

గత పీఆర్సీ కమిటీ ప్రతిపాదనలు స్వీకరించిన అనంతరం 33 నెలల సుదీర్ఘ కాలం తదుపరి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మరీ ప్రస్తుతం నియమించిన కమిటీ నివేదిక సమర్పించడానికి ఇంకెంత సమయం కావాలో అంతు చిక్కడం లేదు. ప్రభుత్వం కేవలం ఐదు శాతం మధ్యంతర భృతిని ప్రకటించి పీఆర్సీని ఆలస్యం చేయడం సమంజసంగా లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అందుకే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించాలని సంవత్సన్నర కాలంగా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నా ప్రభుత్వ పెడచెవిన పెట్టడం పట్ల ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. గత ప్రభుత్వం 30 శాతం ఫిట్మెం ట్‌తో 2018 లో రావాల్సిన పీఆర్సీని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పోరాటాల ఫలితంగా తాపీగా 2020లో ప్రకటించింది. మరీ రెండో పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే 18 నెలల సమ యం గడిచిపోయింది. ఇంకెప్పుడు ప్రకటిస్తారో తెలియని సందిగ్ధ పరిస్థితి నేడు నెలకొని ఉంది.

వేతనాలు.. ఒకటో తారిఖు ఇస్తే సరిపోదు!

ప్రభుత్వం ఇప్పటికే నాలుగు డి.ఏలను పెండింగ్‌లో పెట్టింది. వాటిని విడుదల చేసి పీఆర్సీ ఫిట్మెంట్‌ను మంజూరు చేస్తే ప్రయో జనం ఉంటుందని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుగా డి.ఏలను ప్రకటించాలని ఎప్పటి నుండో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రాతినిధ్యాలు చేస్తూ వస్తున్నాయి. కానీ ఆ ప్రాతినిధ్యాలను ప్రభు త్వం బుట్ట దాఖలు చేయడంతో సంఘాలు ఉద్యమబాట పట్టే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మరోవైపు పీఆర్సీ మాట దేవుడెరుగు ముందు పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నీ చెల్లిస్తే అదే మహాభాగ్యమన్న అభిప్రాయాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. కేవలం నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తే సరిపోదు.. మిగిలిన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. గత అక్టోబర్‌లో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి పిలుపునిద్దామని కార్యాచరణ రూపొందిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని కొద్దికాలం వేచి చూడాలని కోరగా సంఘాలు ఉద్యమాన్ని విరమించుకున్నాయి.

పరిష్కరించకపోతే ఉద్యమ బాట తప్పదు!

గత పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి 7.5 శాతం ఫిట్మెంట్‌ను సిఫారసు చేయగా నిర్ఘాంతపోయిన ఎస్టీయూ అలాంటి పీఆర్సీ నివేదిక ప్రతులను చింపి నిరసన వ్యక్తం చేయగా ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి 30 శాతం ఫిట్మెంట్‌తో పీఆర్సీని ప్రకటించిన సంగతి మనకందరికీ విదితమే. ఇప్పటికైనా ప్రభుత్వం పెరిగిన ధరలకనుగణంగా మెరుగైన ఫిట్మెం ట్‌తో వెంటనే పీఆర్సీని ప్రకటించాలి. గత పీఆర్సీలో 33 నెలల బకాయిలు కోల్పోయిన ఉద్యోగులు.. 2వ పీఆర్సీలో కూడా అటువంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే తక్షణం పీఆర్సీ అందివ్వాలని కోరుతున్నారు. గత పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి సూచించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇంకా కొన్ని జీవోలు విడుదల చేయలేదు. ప్రస్తుత కమిటీ ఏ మేరకు సంఘాల సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు సమర్పిస్తుందో వేచి చూడాలి. ఇక అన్ని సంఘాలు మూకుమ్మడిగా ప్రతిపాదించిన విషయం సీపీఎస్ విధానం రద్దు. దీనిని కమిటీ అన్ని సంఘాలతో ఒక సమావేశాన్ని నిర్ణయించి చర్చించిన తదుపరి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తే గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఉంటాయని సంఘా లు అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నాయి. ప్రభు త్వం తమ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమబాట పట్టక తప్పదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఏదీ ఏమైనా వెంటనే ప్రభుత్వం నివేదికను తెప్పించుకుని మెరుగైన పిట్మెంట్‌తో పీఆర్సీని ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం.

సుధాకర్ ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747



Next Story

Most Viewed