బాసర త్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకెన్నాళ్లు?

by Ravi |   ( Updated:2024-11-23 00:45:08.0  )
బాసర త్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకెన్నాళ్లు?
X

బాసర ట్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యలకు కేరాఫ్‌గా మారింది. 2008లో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆత్మహత్యలతో చాలా కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. యూనివర్సిటీ లోపాలే ఈ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. యూనివర్సిటీ ఏర్పాటు అయిన నాటి నుండి ఇప్పటివరకు 28 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ రెండు సంవత్సరాల కాలంలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్నారు. వీరిలో 8 మంది మైనర్ విద్యార్థులే.

విజ్ఞానం విలసిల్లే చోట ఇలాంటి సంఘటనలు జరగడం అత్యంత బాధాకరం. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. విశ్వవిద్యాలయం స్థితిగతులు మెరుగుపడటం లేదు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో విద్యా సంస్థల్లో సుమారుగా 42 మంది విద్యార్థులు చనిపోయారు.

ఎన్నో ఆశలతో అడ్మిషన్ సాధిస్తే..?

మొత్తం బాసర త్రిబుల్ ఐటీలో సుమారుగా 6000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు దీనిలో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే పేద విద్యార్థుల అధికంగా ఉన్నారు. ప్రధానంగా విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసిన తర్వాత బీటెక్ పూర్తి వరకు అంటే అరేళ్లు ఈ క్యాంపస్‌లో చదువుకోవాలి. ఇక్కడ 300 మందితో రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాలి. కానీ కేవలం 190 మంది ఫ్యాకల్టీతో నడుస్తుంది. విద్యార్థులకు పూర్తి స్థాయిలో హాస్టల్ భవనాలు లేవు. పీయూసీ రెండు సంవత్సరాలు తాత్కాలిక భవనాలలో ఉంటున్నారు. దీనిలో సరైన డోర్‌లు కూడా లేవు. బాత్రూమ్‌లకి డోర్ లేకపోతే బకెట్‌లు అడ్డం పెట్టుకొనే దయనీయమైన పరిస్థితి దాపురించింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ ఇవ్వాలి. ఇప్పటికీ కల్పించలేదు. అకడమిక్ వాతావరణం దెబ్బతిన్నది. విద్యార్థులు ఎన్నో ఆశలతో అడ్మిషన్ సాధిస్తే ఇక్కడి సమస్యలు పరిస్థితులు వలన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

గత ప్రభుత్వం ఒక్క హామీనీ తీర్చలే..!

గతంలో క్యాంపస్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులందరూ ఐక్యంగా సుమారుగా నెల రోజుల పాటు శాంతియుత పద్ధతిలో క్లాసులు బాయ్‌కాట్ చేసి నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఆనాటి విద్యాశాఖ మంత్రి ప్రభుత్వ ప్రతినిధులు విద్యార్థులతో అనేకసార్లు చర్చలు జరిపారు. చివరికి కేటీఆర్ వచ్చి 45 రోజుల్లో త్రిబుల్ ఐటీ సమస్యలు పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. పైగా బాసర ఐటి హబ్‌గా డెవలప్ చేస్తానని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి ట్రిపుల్ ఐటీ సందర్శిస్తానని చెప్పి అరు నెలలు గడిచినా రాలేదు. ఆయన ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది.

ఈ ప్రభుత్వమైనా పట్టించుకోవాలి..!

నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేటి ముఖ్యమంత్రి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మాట్లాడి భరోసా కల్పించారు. మేము అధికారంలోకి వస్తే బాసర ట్రిపుల్ ఐటీ భవిష్యత్తు మారుస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి దాదాపుగా ఒక సంవత్సరం అవుతుంది. కానీ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల స్థితిగతులు మారలే. ఆ త్రిబుల్ ఐటీని ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే గాని ఎవరు కూడా తొంగి చూడలే. విద్యార్థుల ఆత్మహత్యలు ఆగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని నింపే కౌన్సిలర్ అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం తక్షణమే మంత్రుల బృందం వెళ్లి బాసర త్రిబుల్ ఐటీని సందర్శించాలి. విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్లకు భరోసా కల్పించాలి. తక్షణమే త్రిపుల్ ఐటీ సమస్యలను పరిష్కారం కోసం వేయి కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలి. ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. బాసర త్రిబుల్ ఐటీ‌తో పాటు గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ సంఘటనలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య బలోపేతంకై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. విశ్వ విద్యాలయాల అభివృద్ధి‌పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

అర్.ఎల్.మూర్తి

ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర అధ్యక్షులు

82476 72658

Advertisement

Next Story

Most Viewed