ఎట్లా అర్ధమైతది తెలంగాణ బాధ‌!

by Ravi |   ( Updated:2023-06-16 00:30:33.0  )
ఎట్లా అర్ధమైతది తెలంగాణ బాధ‌!
X

ఇంకా తెలవార‌దేమి? ఈ చిక‌టి విడిపోదేమి పాట హ‌మ్ చేస్తూ ‘ఒక్కటే జ‌న‌నం! ఒక‌టే మ‌ర‌ణం! జై బోలో తెలంగాణ! జ‌న‌ఘ‌ర్జన‌లా జ‌డివాన‌! అంటున్న రిథ‌మ్‌తో మంట‌ల జెండాల నెత్తిన తెలంగాణ ద‌శాబ్ధాల తండ్లాట 2014, జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కొత్త చ‌రిత్రకు నాంది ప‌లికింది. స్వరాష్ట్ర ఉషోద‌యం ఉద్యమ‌కారుల గుండెల్లో కోటి కాంతులు నింపింది. స్వరాష్ట్ర ఆకాంక్షల ఆత్మగౌర‌వ ప‌తాకం కురియ‌న్ నోటా మాట‌తో తెలంగాణ అమ‌రుల స్థూపం సాక్షిగా ఉద్యమ స్ఫూర్తితో నిండిన ప్రభుత్వంతో క‌వాతు తొక్కుతుంద‌ని ఆశ‌ప‌డినాం. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఉభ‌య స‌భ‌ల్లో ‘ది బిల్‌ఈజ్ పాస్డ్‌’ అని స్పీక‌ర్ మూడు సార్లు ధ్వనించిన‌ప్పుడు ఉద్యమం న‌డిపిన ప్రతి యోధుడి గుండే 56 ఇంచులు ఉప్పొంగింది. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రం ఈ నేల మ‌ట్టి బిడ్డలకు, అట్టడుగు వ‌ర్గాల ప్రజ‌ల‌కు అంకిత‌మ‌ని, కేసీఆర్ అంట‌డ‌ని ఎంతో అమాయ‌కంగా ఎన్నో త‌ల‌లు ఎదురుచూసిన‌య్‌. పాల‌కుడిగా మారే స‌మ‌యం వ‌స్తుంద‌ని అంచ‌నాకు వ‌చ్చిన అధినాయ‌కుడు ‘టీఆర్‌ఎస్ ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు.. ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అన‌గానే విప్పారిన క‌ళ్ళు తెప్పరిల్లక నేల కూలిన‌య్‌. విరుచుకున్న చ‌ప్పన్ ఇంచ్ చాతీ ట‌ప్పన్ అయ్యింది.

ఆ బాధ సాధార‌ణ పాల‌క పార్టీలోంచి వ‌చ్చిన ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కుడు, కేసీఆర్‌కు ఇప్పుడు ఆయ‌న క్యాబినెట్‌లో ఊరేగుతున్న తెలంగాణ ద్రోహుల‌కు ఎప్పటికి అర్ధం కాదు. ‘ఎట్ల చెపితే అర్ధమ‌యిత‌ది తెలంగాణ బాధ‌! ఏ మీట‌ర్ల పోస్తే లెక్క దొరుకుత‌ది మా గాయాల తెలంగాణ గాధ‌? ఇది తెలంగాణ మ‌లిద‌శ లొల్లి మొద‌ల‌యిన‌ప్పుడు నాలాంటి వాళ్ళు రాసుకున్న క్షత‌గాత్ర బాధ స‌ప్తప‌ది అక్షరాల మాల‌. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్‌మెంట్ ద‌శాబ్ది ఉత్సవాల డిజిట‌ల్ సౌండ్‌, లేజ‌ర్ గ్రాఫిక్స్ మ‌ద్య వెంటిలేట‌ర్ మీద ఉన్న తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి దృశ్యం క‌న‌బ‌డ‌దు.

ఎవ‌డికున్నది తెలంగాణ సోయి?

ప్రతిది రాజ‌కీయ ప్రయోజ‌నం కోసం చేసే మాస్టర్ స్ట్రాట‌జిస్టు కేసీఆర్, ఉద్యమ స‌మ‌యంలోను ‘అరే దివానో! ముజే ప‌హ‌చానో’ అంటూ బ‌రితెగించి కొన్ని రంగులు చూపినా, ఆ సంద‌ర్భంలో చింత‌మ‌డ‌క దొర తెలంగాణ చింత‌లు తొల‌గించే గార‌డీగాడ‌యి అంజ‌నం వేసిన‌ట్లు వ‌శీక‌ర‌ణ మంత్రం చ‌దివితే వివ‌శుల‌మ‌య్యింది మ‌న‌మే. నానా అవ‌కాశ‌వాద‌, స్వీయ అస్తిత్వ చింత‌న‌లో మునిగి తేలింది మ‌న‌మే. ద‌శాబ్ధాల ఉద్యమం ఒక కొలిక్కి వ‌చ్చే వేళ ఎందుకు కొత్త పంచాయితీలు... కొత్త దుకాణాల‌ని తెలంగాణ జేఏసిలు ఏర్పడినంక అంతా బారాఖూన్ మాఫీ అయ్యింది. ఏ క్షణం, ఏ చ‌ర్య, ఏ విషాదం, ఏ చైత‌న్యం, ఏ హృద‌యాంత‌రం స్రవించిందో, ద్రవించిదో పెప్పర్ స్ప్రేలు, మోకాళ్ళు అడ్డుపెట్టడాలు దాటి, క‌బ‌డ్డి బేర మీద చెయ్యి ప‌డ్డట్టు తెలంగాణ టీమ్ అంతా గెలిచిన‌ట్లు రాష్ట్ర అనుకూల ప్రకట‌న‌తో సంతోషం వెళ్ళి విరిసింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ, జ‌త క‌లిసిన పార్టీ ఢిల్లీలో మంత‌నాలు పూర్తి చేయ‌క‌మందే గుర్రాలు, ఏనుగులు, పూల వ‌ర్షంతో అబ‌ద్దాల రాజు హైద‌రాబాద్‌లో ఊరేగిండు. శ‌వాలు, శివాలు మ‌ధ్య, భూతు పురాణాల మ‌ధ్య, వ్యక్తిగ‌తంగా దుమ్మెత్తిపోయ‌డం మ‌ధ్య, ‘గ‌త‌పాల‌కుల‌ త‌ప్పిదాల లెక్కల గ‌తిత‌ర్కం మ‌ధ్య, ముంత మ‌ర‌చి, కేంద్రం పాల‌పుంత ప‌గ్గాలు చేప‌డ‌తామ‌న్న యావ మ‌ధ్య, తెలంగాణ గుండెల‌య విన‌ప‌డ‌కుండా చేసిన సౌండ్ ఇంజ‌నీర్ ఎవ‌డో? నిట్టాడంత దాపు, చెట్టంత నీడ ఒక్కసారి ఏ గాలివాన‌కు కొట్టుకుపోయిందో? ద‌శాబ్ధాలు ప‌లువ‌రించి స్వరాష్ట్రం సాకార‌మ‌యి ఎందుకింత క‌ల‌వ‌ర‌ప‌డుతున్నదో? ఎవ‌డు దుశ్‌మ‌న్‌? ఎవ‌డు జానేమన్‌? ఎవ‌డు సాబ్దారి? ఎవ‌రితో సోప‌తి? ఎవ‌డికున్నది తెలంగాణ సోయి? ఎందుక‌య్యింది తెలంగాణ స్పంద‌న లేని రాయి?

14 ఏండ్ల మానవ, రాజకీయ సంబంధాలు తోడు వచ్చే తెలంగాణ రాష్ట్రంలో వ‌న‌రుల దోపిడి, సామాజిక ఆధిప‌త్యం కోసం క‌దిపిన పావులు కేసీఆర్‌ను తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రిగా ఉంచి ద‌శాబ్దిలోకి ప్రవేశింపచేశాయి. అబ‌ద్దాల‌కు ప‌రాకాష్టగా శ‌తాబ్ది అభివృద్ది అంతా ద‌శాబ్దికి ముందే అన్నాడు కేసీఆర్‌. కానీ ఐదున్నర ల‌క్షల కోట్ల అప్పుతో, 2 ల‌క్షల కోట్లు వృధా, అవినీతిక‌ర ప్రణాళిక‌తో రాబోయే శ‌తాబ్ధి ఉత్సవాల్లో తెలంగాణ ఉద్యమ‌కారుడు, అణ‌గారిన వ‌ర్గాల‌వాడు ఆగ‌మాగం అయ్యి పుట్టెడు దఃఖంలో ఉన్నాడు.

పదేళ్ళలో.. వందేళ్ళ అభివృద్ధి...

మొగులు మీద ఉన్న దేవుడితోనైనా క‌ల‌బ‌డి నా గుంట జాగ కాపాడుకుంటాన‌ని భూమి కోసం కొట్లాడిన తెలంగాణ కేసీఆర్ దొర దోర‌ణి, ‘ధ‌ర‌ణి’గా వ్యవ‌స్తీకృతం కావ‌డంతో విల‌విల‌లాడుతున్నది. కేజీ టూ పీజీ ఉచితం చ‌దువులంటే..ప్రతి ఇల్లు స‌ర‌స్వతీ నిల‌య‌మై కొలువుల బారులో నిల‌బ‌డత‌ది అనుకుంటే చ‌దువు పిర‌మ‌యి, పెద్ద స‌దువులు భార‌మ‌య్యి, తెలంగాణ యుధ్ధ భూముల‌యిన విశ్వవిద్యాల‌యాలు దుస‌ర క్షేత్రాల‌యి అధ‌మ స్థాయి చేరి, ప‌రీక్ష ప‌త్రాల లీకేజీలో గొల్లున ఏడుస్తున్నది. నిరుద్యోగికి, ఉద్యమకారుడికి, ఆదివాసీకి భరోసా లేదు.. రైతు బంధు భూస్వాముల‌కు గుడ్‌విల్ పే చేస్తుంది. స్వీట్ రివెంజ్‌లో దొర‌లు, స్వెట్ క‌క్కుతూ కౌలుదారులు! అనుభ‌వ‌దారులు ఉన్నారు. ద‌ళిత‌బంధు స్థానిక ఎమ్మేల్యే క‌రుణా క‌టాక్షాలతో, కొత్త దేవుడి రాజ్యంలో రాజ‌కీయ బానిస‌ల‌కు కానుక‌ల చ‌దివింపు అయ్యింది. గిరిజ‌న బందు, బీసీ బందు, మైనారిటీల బందు మధ్య నిరుపేద‌ల హక్కులు ఎక్కడికో పాతాళానికి చేరాయి. కోవర్ట్ ఆపరేషన్ పేర అన్ని ‘బందులు’ కొత్త బంధమై కొత్త సంఘం పెట్టినయి. ‘బతుకమ్మ’కు పేటెంట్ గా చెప్పుకునే కవిత లిక్కర్ స్కాం కేసు, కార్తీక మాసం సీరియల్ లెక్కన నడుస్తూనే ఉంది. ఈడీల‌తో మోషా, పీడీ యాక్ట్‌తో కేసీఆర్‌, తెలంగాణ చైత‌న్యాన్ని రాజ‌కీయ క‌క్షల‌తో కొత్త ‘క‌క్ష్య’లోకి ప్రవేశింపజేస్తున్నారు.

కనిపించని నాలుగో సింహం మా నాన్న కేసీఆర్ అంటూ చెప్పిన కవిత, కేటీఆర్ చెప్పాలి మూడు సింహాల ఊపిరిని మీ నాన్న ఎందుకు మింగుతున్నాడో! వ్యవ‌స్థల‌ను ఎందుకు బ్రష్టు ప‌ట్టిస్తున్నాడో! ధర్మగంట ధర్నచౌక్‌లో మోగితే ధర్మం చౌరస్తాలలో మోగి సెక్రటేరియట్‌కు వినబడాలే కదా? కానీ అంబేద్కర్ సాక్షిగా పేదవాడికి దొరకని భూమి, మీ పార్టీ స్థలాలకు, హెటిరో పార్థసారథి రెడ్డి, మై హోమ్ వారికి, మెగా వారికి వేల ఎకరాలు అప్పనంగా ఎలా ముట్టచెప్పబడుతున్నాయో అమరుల స్మృతివనం స్టీల్ ఫలకాల్లో స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. డొల్ల కంపెనీలతో వేల ఎకరాల అడవులు నరికేస్తున్న మాఫియాతో గ్రీన్ ఛాలెంజ్ పేర బుడి బుడి చెట్లకు నీళ్ళు స్ప్రింకిల్ చేస్తూ ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటుంటే’,‘ హౌ ఐ వండ‌ర్ వాట్ యూ ఆర్’ అన‌డం ఉద్యమకారుల వంతయ్యింది. పేదలకు అందుబాటులో ఉన్న దవాఖానాల జాగాలను గ్యారెంటి కింద పెట్టి బహుళ అంతస్తులతో కలర్ ఫొటోలతో ప్రజల్ని రంగుల కలల్లో విహారింపజేసే ఈ నాటక ప్రయోక్తలు పదేళ్ళలో వందేళ్ల అభివృద్ధి చిన్న అబద్ధమే!

ఏ తెలంగాణ ఆకాంక్షలతో ఉన్నాము!

న‌య‌వంచ‌న చేసి అంచెలంచెలుగా ఎదిగి, అన్ని కంచెలు దాటి సింగిల్ విండో, సింగిల్ ఫ్యామిలీ, సింగిల్, జంగిల్ రాజ్ సామాజిక వ‌ర్గాలుగా వేళ్ళూనుకొని ‘హ్యాట్రిక్ కోసం’ అర్రులు చాస్తున్నప్పుడు కేసీఆర్ నాతో అన్న మాట‌లు గుర్తుకొస్తున్నాయి. సుధాక‌ర‌న్న! ఒక్క చాన్స్‌! ఒక్కసారి అధికారంలోకి వ‌స్తే శివ‌సేన న‌థింగ్, వుయ్ ఆర్ స‌మ్‌థింగ్ ఎల్స్ ఎస్‌! దే యార్ స‌మ్‌థింగ్ ఎల్స్ మ‌న‌మే... మోస‌పోయిన‌వాళ్ళం, గోస‌ప‌డ్డవాళ్ళం, ప‌రాజితులం, చాలా ప్రశ్నల్ని అద్దం ముందు అబ‌ద్దం ముఖాన్ని నిల‌బెట్టిన‌ట్లు మొఖాబ్లా చెయాలి. ఈ మొఖాబ్లాకు ఉద్యమ మొఖాలు కావాలి. ఇప్పుడు ఏ రాజ‌కీయ పార్టీకైన డ‌బ్బు సంచుల‌, ఆదిప‌త్య వ‌ర్గాల ప్రతినిధులు కావాలి. తెలంగాణ ఉద్యమం దారి త‌ప్పలేదు కానీ. రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ లేక ప్రబావ‌శీలి కాలేక‌పోతున్నది. కేసీఆర్‌ను దించుదాం అనుకున్న వాళ్ళకు రాజ‌కీయ దింపుడు క‌ల్లం ఆశ‌నే కానీ, ఒక్క స‌జీవ‌మైన తెలంగాణ వ్యక్తీక‌ర‌ణ లేదు. ఒక్క న‌మ్మబ‌లికే కార్యాచ‌ర‌ణ లేదు, ఒక్క ఆత్మీయ స్పర్ష లేదు, జై తెలంగాణ అని నిన‌దించిన గొంతుల‌కు శృతి, ల‌య జ‌త చేయ‌ని అప‌శృతిలో తెలంగాణ రాజ‌కీయ ప‌క్షాలు ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీని, సోనియ‌మ్మను త‌క్కువ చేయ‌డం కోసం ఇట్లా అన‌డం లేదు. తెలంగాణ మ‌హాస‌భ జ‌నస‌భ స్ఫూర్తిని ప్రస్తుత పాల‌క‌, ప్రతిప‌క్ష పార్టీల్లో వెత‌క‌డం త‌ప్పు కాద‌నే, తొర్రూర్ ఐల‌న్నతో పాటు ఎన్‌కౌంట‌ర్‌లో ప్రాణాలు పోవాల్సిన కుసుమ జ‌గ‌దీష్‌లాంటి ఎంతో మంది అమ‌రుల్ని, 1969 శ్రీ‌ధ‌ర్‌రెడ్డి లాంటి గొప్ప కాంగ్రెస్ నాయ‌కుల్ని గుర్తు చేసుకుంటూ జ‌ల్లెడ ప‌డుతున్నాను. ఏది నిమ్మలంగా లేద‌ని తెల‌సి, అంతా బాగానే ఉంది. ఎవ్వని ఎవ్వని పెయ్యికి నొప్పి లేదు, గుండెకు రంది లేద‌ని బుకాయిస్తే, ఎవ‌ని సుద్ది ఎత్తకుండా తెలంగాణ స‌బ్బండ‌వ‌ర్ణాల‌కు, ఉద్యమ‌కారుల‌కు మ‌త్తడి దుంకేంత మేలు చేయాల‌ని ఉంద‌ని చెబితే వాజ్ బీ అయిత‌దా! మీరే చెప్పండి.

మ‌నం సోనియ‌మ్మను త‌ల‌చినా, సుష్మా స్వరాజ్‌ను జ్ఞప్తి తెచ్చుకున్న, బ‌హెన్‌జీ మాయావ‌తిని క‌ళ్ళ ముందు నిలుపుకున్నా... ఇప్పుడు తెలంగాణ‌లో ఏ రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌లో ఉన్నాము!? ఏ తెలంగాణ ఆకాంక్షల కొన‌సాగింపులో ఉన్నాము. పాల‌క‌, ప్రతిపక్షాలుగా విడిపోయిన జెండాల మద్య తెలంగాణ ఎజెండా ‘అయ్యో! ఎవ‌ర‌న్నా నన్ను ప‌ట్టించుకునేవాడు ఉన్నాడా! అని బేల‌గా, ఆర్తిగా భంగ‌ప‌డ్డ ప్రతి తెలంగాణ అమ‌రుల, ఉద్యమ‌కారుల దీక్షా స్థలం వ‌ద్ద వెతుకులాడుతున్నది. బంగారు తెలంగాణ మాత్రమే కాదు... సామాజిక న్యాయం, అమ‌రుల ఆకాంక్షలు వొట్టి డొల్ల మాట‌లే కాని ఆచ‌ర‌ణ రూట్ మ్యాప్ కాన‌ప్పుడు, అబ‌ద్దాల చ‌క్రవ‌ర్తి అభివృద్ది గురించి వ‌దురుతూనే ఉంటాడు. ఇప్పుడు అబ‌ద్దాన్ని తెలంగాణ చౌర‌స్తాలో అద్దంలా ప‌గుల‌గొట్టాల‌నుకుంటే బెల్లి ల‌లిత‌నో, శ్రీ‌కాంత‌చారినో, చాక‌లి ఐల‌మ్మనో, మారోజు వీర‌న్ననో... అమ‌రుడి క‌ర‌ స్పర్శనో ఆవ‌హిస్తే కాని సాధ్యం కాదు. నువ్వు ఏ రాజ‌కీయ పార్టీ అయినా, ప్రజాసంఘ‌మ‌యినా, ఏ రంగు జెండా అయినా, ఎవ‌రికి జై కొట్టినా కోట్ల గొంతుల ఆకాంక్షల‌ను వొడిసిప‌ట్టి అమ‌రుల స్మృతివ‌నంపై సింగిడి పూయించాలి.

డా. చెరుకు సుధాక‌ర్‌

9848472329

Advertisement

Next Story