అతడు - ఆమె

by Harish |   ( Updated:2023-05-01 18:45:33.0  )
అతడు - ఆమె
X

జీతానికి జీవితాన్ని తగిలేసి

అతను వెళ్ళిపోయాడు

ఎదురుచూపులను వాకిట్లో

విసిరేసి ఆమె వెళ్ళిపోయింది

వారసత్వంగా వచ్చిన ఆకలితో

వారిద్దరు సహజీవనం చేస్తున్నారు

ఓ వెన్నెల రాత్రి

చెమట కంపు కొడుతున్న

అతని దేహం మీద

ప్రేమ పరిమళం వేస్తున్న

అతడి గుండె దగ్గర తలవాల్చి

ఇద్దరూ వసంతాన్ని కలగంటారు

చిరిగిన చీరను కుట్టేసినట్టే

ఆమె ఆకలిని చిరునవ్వుతో చెరిపేస్తూ

అతడికి అన్నం పెట్టింది

తింటూ తింటూ కాసింత మిగిల్చి

అతను వెళ్ళిపోయాడు

రాలి పడిన ఆమె కన్నీళ్లను కంచంలో

మిగిలిపోయిన అన్నం చదవగలిగింది

అచ్చం ఆకలి లాగే

ఆమె కాలాన్ని మోసింది

అతడి కోసం కాసింత మిగిల్చేది,

అతను అంతే..

ఏది ఎట్లా ఉన్నా సరే

అలసిపోవడాన్ని ఆస్తిగా మిగిల్చుకొని

రేపటి మీద ఆశతో ఉన్న అతడిని చూసి ఆమె

భరించడాన్నే ఆభరణంగా ధరించి

నవ్వగలిగే ఆమెను చూసి అతను

ఒకరికొకరు ఓదార్పు గీతాలై

ఎదురు పడుతూ ఉంటారు

అతడు శూన్యాలను కలగంటున్నప్పుడల్లా

ఆమె వేకువ గీతం అవుతుంది

ఆమె శిశిరమవుతున్నప్పుడల్లా

అతను వసంతాన్ని ఆలపిస్తాడు

జీవితం వెలివేస్తున్నంత కాలం వలస పోయారు

బ్రతుకు ఎదురుదెబ్బ తీసిన ప్రతిసారీ

నిలకడగా నిలబడగల్గిన వారు

శ్రమ, ప్రేమ కలుషితమయ్యయని తెలిసి

దుఃఖాన్ని పారపెడుతూ వెళ్ళిపోయారు

ప్రేమ పట్ల మీకున్న అర్థాలను చేరిపేస్తూ

తాజ్ మహల్ పునాదిరాళ్లలో పాతుకుపోయో

భాగ్యనగరపు నడివీధుల్లో గాలికి కొట్టుకుపోయో

ఏ నగరపు తీరాల్లో పాతుకుపోయిన గుడిసెల్లో

ఎవరూ చదవలేని చరిత్రలో

వాళ్లవైనా ఆనవాళ్లను మిగులుస్తూ

అనామకులై వెళ్ళిపోయారు.

పి.సుష్మ

9959705519

Advertisement

Next Story

Most Viewed