సంకీర్తన స్వరం ఆగిన వేళ…

by Ravi |   ( Updated:2025-03-11 00:46:11.0  )
సంకీర్తన స్వరం ఆగిన వేళ…
X

భావమే మేటిగా పలుకుతూ, పాడేటప్పుడు శ్రుతి, లయ, భావం, స్పష్టత కలిసిన ఒక పూర్ణత్వం ఉంటే ఆ పాట పది కాలాలు నిలిచిపోతుంది. అన్నమయ్య పదకవితాకృతికి స్వరాకృతి చేకూర్చి వినరో భాగ్యం అంటూ విష్ణు కథను కర్ణామృతంగా శ్రోతలకు అందించి, నారాయణ నీ నామమే గతి అంటూ సద్గతిని పొందిన గాయకుడు, వేయికి పైగా అన్నమయ్య కీర్తనలకు స్వరకల్పన చేసి తన జీవితాన్ని శ్రీవారికే అంకితం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్. ఆయన మొన్న తిరుపతిలోని తన స్వగృహంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.

మలుపు తిప్పిన భక్తి రంజని

గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ 1948 నవంబర్‌ 9న రాజమండ్రిలో జన్మించారు. తండ్రి నరసింహారావు వాగ్గేయకారులు. తల్లి కృష్ణవేణి కర్నాటక సంగీత విద్వాసురాలు. వయలెన్‌ కళాకారిణి కూడా. ఒకవైపు చదువుకుంటూనే లలిత సంగీత సాధన చేశారు. 16వ ఏట తొలి కచేరీ ఇచ్చారు. 1976లో ఆకాశ వాణిలో పాడేందుకు పాలగుమ్మి విశ్వనాథం నుంచి పిలుపు వచ్చింది. మహా విద్వాంసులు నేదునూరి కృష్ణ మూర్తి సారథ్యంలో జరుగుతున్న భక్తిరంజని కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. 1978లో తిరుపతిలో అన్నమయ్య ప్రాజెక్టులో చేరారు. అప్పటి నుంచి 2006 వరకు అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేస్తూ స్పెషల్‌ గ్రేడ్‌ ఓకల్‌ ఆర్టిస్ట్‌ స్థాయికి ఎదిగారు. ఆ నాలుగు దశాబ్దాల కాలంలో సంగీత రంగంలో అద్భుతాలు చేశారు.

భక్తి తీరాలకు తీసుకెళ్లే బాణీలు..

నిరంతరం అన్నమయ్య సాహిత్యాన్ని చదువుతూ ఆస్వాదిస్తూ అందులోని అతి సూక్ష్మమైన లలితమైన బిందువు నుండి అనంతమైన భక్తి తీరాలకు తీసుకెళ్ళే బాణీలను అందజేశారు. ఆయన ఎన్నుకున్న కొన్ని రాగాలు, సాహిత్యాన్ని తాళానికి వదిలే పద్ధతి చూసినప్పుడు ఎంత ప్రత్యేకమైన పోకడకి ప్రయత్నించారో తెలుస్తుంది. కొన్ని బాణీలు పూర్తి కావడానికి నిమిషాలు తీసుకుంటే, మరికొన్ని బాణీలు పూర్తి అయ్యేందుకు కొన్ని సంవత్సరాలు పట్టిన సందర్భాలు ఉన్నాయి. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి లోపల సంగీత జ్ఞానం దీపం వెలిగించిన గురువు స్పూర్తిప్రదాత కీ.శే.నేదునూరి కృష్ణమూర్తి. 'అన్నమయ్య పాటల ప్రచారానికి ప్రత్యేకంగా ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారు. అందులో చేరమని ఆయన సూచించారు. అలా సద్గురువు నన్ను వేలుపట్టి అన్నమయ్య వద్దకు, వేంకటేశ్వరుని సన్నిధికి నడిపించారు. నాటి నుంచి నేటి వరకు అన్నమయ్యతో, శ్రీనివాసునితో ఏర్పడిన అనుబంధమే నన్ను ఈ స్థితికి చేర్చింది. ఆ శ్రీనివాసుడే నా జీవితంలో అడుగడుగునా వెన్నంటి నన్ను నడిపించారు. నా గురువు నేదునూరి కృష్ణమూర్తిగారు, ఆ శ్రీనివాసుడు లేనిదే నా జీవితమే లేదు' ఆని వినమ్రంగా గురుభక్తిని చాటుకున్నాడు.

యాదగిరి గుట్టలో గానామృతం

ఈ నెల 6న యాదగిరిగుట్టలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో సైతం తన గీతాలాపనతో ఆధ్యాత్మికతను పంచిన మధుర సంగీత విద్వన్మణి ఆయన. నిరంతరం అన్నమయ్య సాహిత్యాన్ని చదువుతూ, ఆస్వాదిస్తూ అందులోని సూక్ష్మమైన లలితమైన బిందువు నుండి అనంతమైన భక్తి తీరాలకు తీసుకెళ్ళే బాణీలను ఆందజేశారు. అన్నమయ్య పాటలోని వెన్నెల ద్వారా సదా ఆ శ్రీనివాసుడనే చందమామ వైపు అందరి చూపును మరల్చి కీర్తన కౌముదిని పంచిన వాగ్గేయ కారుడు ఆయన. ఆయన గానం వెన్నెల ప్రవాహం. మాట మృదుమధురం. 5 దశాబ్దాలుగా శాస్త్రీయ, లలిత సంగీతాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తున్న ఆయన సంగీత ప్రియులకు చిరపరిచితులు. ఈ తరానికి అన్నమాచార్య కీర్తనలను చేర్చేందుకు ఎంతో తపించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు.

- వాడవల్లి శ్రీధర్

99898 55445



Next Story