- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉచితాలు…అభివృద్ధికి అవరోధాలు
ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకొని, ఓట్లు రాబట్టుకొనేందుకు నేడు నాయకులు సంక్షేమం పేరుతో అంతులేని, అలవికాని ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారు. ఒక పార్టీకి మించి మరోపార్టీ, ఎవరికి తోచిన విధంగా వారు మ్యానిఫెస్టోల్లో వీటిని గుప్పిస్తున్నారు. రానురాను ఈ పోకడలు మితిమీరి పోతున్నాయి. నేడు పార్టీలన్నీ ప్రలోభాలతోనే ప్రభంజనాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి.
ప్రభుత్వాలు జనాన్నిఉచితాల ఆశల తాత్కాలిక లబ్ధి కలిగించే పథకాలతో ఏమార్చుతున్నాయి. సాధ్యాసాధ్యాలు, యోగ్యాయోగ్యాలు పరిశీలించకుండా ప్రకటించే ఈ పథకాలు రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థలను నిర్వీర్యంచేసి, భవిష్యత్తులో విధిగా జరగాల్సిన అభివృద్ధి పనుల్ని కుంటుపరుస్తాయనే విషయాన్ని పాలకులు విస్మరిస్తున్నారు. అవి సమాజ పురోగతికి దోహదపడే నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను గాలికొదిలేసి, కొన్ని వర్గాలకు తాత్కాలిక ప్రయోజనాలను కల్పిస్తే అది అభివృద్ధి అవుతుందా? నేడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం ఉన్నాయి. విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, రహదారుల వంటి మౌలిక వసతులు కరువై నానా ఇక్కట్లు పడుతున్నారు. పాలకులు వీటిపై దృష్టి సారించకుండా కేవలం ఉచిత పథకాలకే ప్రాధాన్యం కల్పించడం ఎంతవరకు సబబు?
తాయిలాలతో ఊరడిస్తూ..
ప్రజలకు ముఖ్యంగా కావల్సింది నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, తాగునీరు. దేశంలో తాగడానికి మంచినీరు లేని గ్రామాలు నేటికీ 30శాతం ఉన్నాయి. వేసవి కాలంలో నీటి కటకట చాలా ప్రాంతాల్లో ఏటికేడు పెరిగిపోతోంది. రోడ్లు పరిస్థితి చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అధ్వానంగా ఉంది. సరియైన రహదారులు, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు పడే ఇబ్బందులు చెప్పనలవికాదు. కొన్ని గిరిజన ప్రాంతాల్లో అయితే వైద్యం కోసం పది, పదిహేను కిలోమీటర్ల దూరం వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్ళాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర అనారోగ్య పరిస్థితులలో కూడా ఆంబులెన్స్‌లు సైతం రాక ప్రజలు మృత్యువాత పడుతున్నారు. కానీ ఇవేవి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు చేపట్టాల్సిన దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ఉంటే, వాటిని పక్కనపెట్టి ప్రజలను తాత్కాలిక తాయిలాలతో ఊరడిస్తున్నారు పాలకులు.
సమన్యాయం లేని సంక్షేమం
నిరుపేదలకు, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు సామాజిక పింఛన్లు ఇవ్వడమనేది సహేతుకమైన చర్యే. అది సామాజిక భద్రతా పథకాల్లో భాగంగా ప్రభుత్వం విధిగా నిర్వర్తించాల్సిన కర్తవ్యం కూడా. అలాగే అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలకు కల్పించే పథకాలూ హేతుబద్ధమైనవే. వీటిని ఎవ్వరూ కాదనలేరు. కానీ, ఓట్ల కోసం కులాలు, మతాలు, వృత్తులు, మహిళల వారీగా రకరకాల పేర్లతో ఉచిత నగదు పథకాలను రూపొందించి అమలు చేయడం, ప్రభుత్వ నిధులను ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టడం హర్షణీయం కాదు. దీనివల్ల ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ సమంగా దాఖలుపడాలన్న రాజ్యాంగ స్ఫూర్తి మధ్యతరగతి ప్రజల విషయంలో నీరుగారిపోతోంది. కష్టార్జితంలో కొంత భాగాన్ని పన్నుల రూపంలో చెల్లిస్తున్న సామాన్య పౌరులకు సంక్షేమం దక్కకుండా పోతోంది. పైగా పెరిగే ధరలు, కరెంట్ చార్జీలు, ఇంటిపన్నుల వంటి భారాలతో మధ్యతరగతి ప్రజలు సతమతమవుతున్నారు. వీరి ఆర్థిక అభ్యున్నతిని ప్రభుత్వాలు విస్మరిస్తే, వీరికి సంక్షేమ ఫలాలు దక్కేదెలా?
పెరిగే ఆర్థిక భారం
ఒక పద్ధతి, క్రమంలేని నిర్హేతుక ఉచిత పథకాలను అమలు చేయడం ప్రభుత్వాలకు తలకు మించిన భారం అవుతోంది. ఇవి ఆర్థిక వనరులను హరించేసి, ప్రభుత్వాలను అప్పులపాలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలను గమనిస్తే, ఇక్కడ గడచిన పదేళ్ళలో లక్షల కోట్లు వివిధ ఉచిత పథకాలకోసం వెచ్చించారు. ఇష్టానుసారంగా అప్పులు చేసి, రాష్ట్రాన్ని రుణభారంలోకి నెట్టివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పన్నుల ద్వారా మరియు కేంద్రం నుంచి వచ్చే జీఎస్టీ వాటాల ద్వారా జమకూడే ఆర్థిక వనరులే గాకుండా రకరకాల మార్గాల్లో అప్పులు తెచ్చి సింహభాగం ఉచిత పథకాలకే వెచ్చించి, తీవ్రమైన ఆర్థిక భారంతో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్టాడుతోంది.
పాలకుల తీరు మారాలి
నేడు విద్యా వైద్యాల పరంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత సేవలు ప్రభుత్వరంగంలో లభించడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందక ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్య సేవలు అభివృద్ధిలో భాగంగా అందించాల్సిన బాధ్యత పాలకులపై ఎంతైనా ఉంది. ప్రతి మండల, జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం అత్యాధునిక వసతులతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించితే, పేదలను ఆరోగ్యశ్రీ పథకాల వంటిద్వారా కార్పొరేట్ ఆసుపత్రులకు పంపించాల్సిన అవసరం ఉండదు. తద్వారా ప్రభుత్వాలకు కోట్లాది రూపాయిలు ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన భారమూ ఉండదు. ప్రజలు ఆర్థికంగా అభ్యున్నతి చెందాలంటే విద్య, వైద్యాలతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా పెంపొందించాలి. దానికిగాను విరివిగా పరిశ్రమలు ముఖ్యంగా తయారీ రంగంలో నెలకొల్పాలి. తయారీరంగం అభివృద్ధి చెందితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు అధిక సంఖ్యలో పెరుగుతాయి. దాంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే గాక, ప్రభుత్వాలకు పన్నుల రూపేణా ఆదాయం కూడా పెరుగుతుంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించి, ఉపాధి కల్పించి, ప్రజలు అభివృద్ధి సాధించే దిశగా సంక్షేమ చర్యలు ఉండాలిగాని అప్పులు చేసి, పన్నులు పెంచి ఉచితాల రూపంలో పంచే పథకాలు కాదని పాలకులు గ్రహించాలి.
పి.వి.ప్రసాద్,
94401 76824