జననాడి: నివురుగప్పిన నిప్పు

by Ravi |   ( Updated:2023-04-04 00:30:35.0  )
జననాడి: నివురుగప్పిన నిప్పు
X



ప్రాంతీయ అసంతృప్తులు, అసహనాలు పాలకుల అలక్ష్యాలు, నిర్లక్ష్యాల ఫలితమే! ఆయా పరిస్థితులను దీర్ఘకాలం సాగనీయటం వల్ల అసమానతలు పెరగటం, ఉద్యమాలుగా బలపడటం కళ్ల ముందరి వాస్తవం. మొన్న చరిత్ర చెప్పిందదే. నిన్నా- ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో వెలువడ్డ సంకేతాలూ అవే! నివురుగప్పిన నిప్పును గుర్తించి, సత్వర ఉపశమన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత పాలకులదే! వివక్ష వీడి, సమస్యల్ని తెలుసుకొని, పరిష్కారాలకు చిత్తశుద్ది చూపితే... అంతా సజావుగానే సాగుతుంది. ప్రజలెప్పుడూ ఉదారస్వభావులే! కానీ, రంగులు మార్చేది రాజకీయపక్షాలే! విపక్షంలో ఉండి గొంతెత్తిన వారు అధికారం చేపట్టాక బధిరాంధులు కావటం, పాలనలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి ప్రతిపక్షంలోకి రాగానే ఉద్యమాలకు ఊపిరులూదటం ప్రజల దౌర్భాగ్యం! రాయలసీమ మళ్లీ రగులుతోంది... ఎందుకు? ఉత్తరాంధ్ర ఉద్యమరాగానికి... కారణమేంటి? దక్షిణ తెలంగాణ దగా పడ్డాననుకుంటోంది... బాధ్యులెవరు? అసమానతలు తొలగించే సమవర్తిత్వంలో పాలకులే కాదు ప్రతిపక్ష పార్టీలూ బాధ్యతాయుతంగా ఉండాలని ప్రజానాడి కోరుకుంటోంది.

రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రధాన క్షేత్రాలుగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను పాలక వైఎస్సార్‌సీపీ తేలికగా తీసుకోవచ్చు. కానీ, ఆయా ప్రజాక్షేత్రాలు వెలువరించిన సంకేతాలను గ్రహించకుంటే అది రాజకీయ తప్పిదమే అవుతుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు సాధారణ, సమ్మిళిత ప్రజానీకం కాకపోయినా... స్థానికుల మనోభావాలకు ఈ ఫలితాలు సంకేతమే!

లోలోపల సీమ రగులుతోంది..

రాజకీయ ఉద్దండులు, సామాజిక సాహసికులు ఉద్యమించిన నేల రాయలసీమ! వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఎమ్వీ రమణారెడ్డి, మైసూరారెడ్డి వంటి రాజకీయ నేతలతో పాటు సీమ విద్యావంతులు, ఇతర మేధావులు, జర్నలిస్టుల వంటి వృత్తిపరుల నుంచి సామాన్యుల వరకు పాదయాత్రలు, పోరాటాల్లో పాల్గొన్నారు. అస్తిత్వం నుంచి రాజకీయ అవకాశాల దాకా, తాగు-సాగు నీళ్ల నుంచి తమ వాటాల డిమాండ్‌ దాకా ఉద్యమాల‌ బాటలో ఓ అర్ధశతాబ్ది నలిగింది. ఎన్ని విషయాల్లో, ఎన్నెన్ని ఉద్యమాలు రాయలసీమలో జరిగాయో! పలు పోరాటాల నేపథ్యం దాటి దాదాపు దశాబ్దకాలం ప్రశాంతత తర్వాత... ఇపుడు సీమ మళ్లీ రగులుతోంది. ఏదో తెలియని అసంతృప్తి. ‘ఆశించిందొకటి, కడకు జరుగుతున్నదొకటి’ అన్న బాధ సీమ హృదయాల్లో వ్యక్తమౌతోంది. పాలకపక్షాన్ని నమ్మి తాము మోసపోయామని, కనీస ఆదరణకు నోచుకోలేకపోతున్నామని ‘రెడ్ల’తో సహా కొన్ని ఆధిపత్య సామాజిక వర్గాలు న్యూనపడుతున్నాయి. ‘సీఎస్డీఎస్‌ సంస్థ’ సర్వే ప్రకారం గత ఎన్నికల్లో 86 శాతం ‘రెడ్డి’ సామాజిక వర్గం వైసీపీకి ఓటేస్తే, 8 శాతం మాత్రమే టీడీపీ వైపు మొగ్గారు. ‘కమ్మ’ సామాజికవర్గం 61 శాతం టీడీపీకి దన్నుగా ఉన్నా, 34 శాతం మంది వైసీపీకి ఓట్లేశారు. ఇపుడు జనం ఎందుకు వ్యతిరేకమౌతున్నారు? భావోద్వేగాలను దాచుకోజాలని యువతరం ఎక్కడికక్కడ నోరిప్పుతున్నారు. మొన్న అనూహ్యంగా చంద్రబాబు సభలకు పెద్ద ఎత్తున జనం వస్తే కొట్టిపారేసిన వారు కూడా... నిన్నటి ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత మౌనం వహిస్తున్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ నుంచి నిందలు, విమర్శలు మోస్తూ కూడా సీమ ప్రయోజనాలను పరిరక్షించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను జనం గుర్తుచేసుకుంటున్నారు. ఆయనలాగే ‘సీమ మట్టి బిడ్డ’ అని తనకు తాను, ప్రజాక్షేత్రం సహితం భావించే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, తమ ఆకాంక్షల్ని నెరవేర్చలేకపోతున్నారనే భావన నెమ్మదిగా బలపడుతోంది. సాగునీటి ప్రాజెక్టులు పడకేసిన తీరును సీమజనం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపాదనే లేదని సుప్రీంకోర్టు ముందు ప్రభుత్వం వినిపించిన తాజా వాదన తర్వాత, ‘కర్నూలు న్యాయ రాజధాని’ విషయంలోనూ భంగపోయామేమోనన్న వ్యధ సీమ జనాన్ని వెంటాడుతోంది. రాజధాని, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ వంటి విషయాల్లోనూ జనంలో అసంతృప్తి గుడుకట్టుకుంటోంది.

పాఠం నేర్వని ప్రతిపక్షం

‘పాలక వైసీపీని ప్రజలు కాదంటే, ఇక ఉన్నది మేమే....’ అన్న ధీమా తప్ప, సీమలో జన హృదయాలను టీడీపీ కొత్తగా గెలిచిందేమీ లేదు. రెండు దశాబ్దాలుగా తమ రాజకీయ పరిస్థితి ఇక్కడ ‘ఎందుకిలా ఉంది’ అని ఆత్మవిమర్శ చేసుకోవడంలో తెలుగుదేశం విఫలమైంది. 52 అసెంబ్లీ స్థానాలున్న రాయలసీమలో... నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో టీడీపీకి17 స్థానాలు (కాంగ్రెస్‌కు 32) లభిస్తే, తాను అధికారం కైవసం చేసుకున్న 2014 లో 22 (వైసీపీ 30) స్థానాలే దక్కాయి. ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం 2.7 శాతంగా (వైసీపీ 47.36, టీడీపీ 44.66) నమోదైంది! ఇలాంటి గండి పూడ్చుకోవడానికే, జనసేనతో పొత్తును ఇప్పుడు టీడీపీ కోరుకుంటోంది. ఇక 2019లో, సీమలో టీడీపీకి దక్కింది 3 స్థానాలే (వైసీపీ 49) ! అంతటి ప్రజాదరణ వైసీపీకి క్రమంగా సన్నగిల్లుతున్న సంకేతాలు మొదలై చాన్నాళ్లే అయింది. ‘పీపుల్స్‌ప‌ల్స్‌’ సర్వే సంస్థ గత సెప్టెంబరు మాసంలో రాయలసీమ అంతటా తిరిగినపుడు, పాలకపక్షంపై వ్యక్తమైన జనం అసంతృప్తి, ఆ తర్వాతి టీడీపీ సభల్లోను, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిబింబించింది. ఎన్టీఆర్‌ ప్రభంజనలో తప్ప మరెప్పుడూ తెలుగుదేశం పార్టీకి పెద్ద దన్నుగా నిలువని రాయలసీమలో రాజకీయ సమీకరణాలెందుకు మారుతున్నాయి అనే పరిశీలన, సమీక్ష వైసీపీ నాయకత్వం చేయటంలేదు. సీమ మట్టిబిడ్డనని (సన్‌ ఆఫ్‌ ది సాయిల్‌) చంద్రబాబు ఎప్పుడూ చెప్పుకోలేదు, ప్రజలూ అలా స్వీకరించనూ లేదు. కానీ, జగన్మోహన్‌రెడ్డిని మాత్రం, ఆయనకు మల్లె సీమ కూడా ‘తమ మట్టిబిడ్డ’గానే పరిగణించింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ, టీడీపీ మధ్య ఓట్ల వ్యత్యాసం 10 శాతం. కానీ, రాయలసీమలో ఇది 17 శాతానికి పైబడి (55.12-38.08 శాతాలు) ఉండింది. దానికి భిన్నంగా సీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన ‘రాయలసీమ తూర్పు’, ‘రాయలసీమ పశ్చిమ’ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. వైఎస్‌ కుటుంబానికి రాజకీయ గుండెకాయ వంటి పులివెందులకు చెందిన వ్యక్తి, ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొందారు. ఈ పరిణామాలకు మూలాలు వెతకడం లేదు.

ఉత్తరాంధ్రను ఉపేక్షిస్తే....

ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు గణనీయ సంఖ్యలో ఉన్న ఉత్తరకోస్తాను విస్మరిస్తే రాజకీయంగా దెబ్బతింటామనే స్పృహ పాలకపక్షంలో కొరవడింది. కార్యనిర్వాహక రాజధాని విశాఖలో ఏర్పాటు చేస్తున్నామన్నా.... పట్టభద్రుల నియోజకవర్గపు ఎమ్మెల్సీ స్థానంలో, పెద్ద ఓట్ల వ్యత్యాసంతో ఓడిపోవడాన్ని ఎలా స్వీకరించాలి? అన్ని ప్రాంతాల అభివృద్దికే మూడు రాజధానులని సర్కారువారు ఎంత చెప్పినా, జన హృదయాలు గెలవడానికి విశ్వసనీయతే ముఖ్యమని గ్రహించాలి. బీజేపీ వారి కర్నూలు డిక్లరేషన్‌ ఏమైంది? ఏపీలో ఆ పార్టీ ఉనికి, అస్తిత్వం నిలబెట్టుకునే పోరాటంలోనే ఉంది. విపక్షాలతో పోలిస్తే పాలకపక్షానిది భిన్నమైన పరిస్థితి! అన్ని ప్రాంతాల పట్ల నిజమైన వాత్సల్యం, సమదృష్టితో ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం పాలకపక్షానిది. అది కొరవడిందనే భావన ఉత్తరాంధ్రలో బలపడుతుండటమే, అక్కడ తాజా ప్రాంతీయ పోరాట పురిటినొప్పికి కారణం. క్రియాశీల రాజకీయ శక్తులు, విద్యావంతులు, మేధావివర్గం మళ్లీ చైతన్యమౌతోంది. ‘ఉత్తరాంధ్ర ఏం కోరుతోంది’ అనే సదస్సులు ఇటీవలే మొదలయ్యాయి. నిర్దిష్ట డిమాండ్లతో జనాభిప్రాయాన్ని సానుకూలంగా మలిచే సన్నాహాల్లోనే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఫలితం పాలకపక్షాన్ని వెక్కిరించింది. 30 లక్షల సాగుయోగ్యమైన భూమి ఉంటే, సగం భూమికి మాత్రమే నీటిపారుదల ఉంది. మిగతా భూములకు నీరివ్వాలని, గోదావరిలో తమ వాటా తేల్చి, అందుబాటులోకి తేవాలనే డిమాండ్‌ బలపడుతోంది. కొణతాల రామకృష్ణ వంటి నాయకుల నేతృత్వంలో 2014-19 మధ్య దేశ రాజధానికి ‘రైలు దీక్ష’ వంటివి చేపడితే నవ్వినవారే ఇప్పుడు తోడు నిలుస్తున్నారు. ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కల్పించాలని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్రత్యేక నిధి కావాలని, ఏజెన్సీ ప్రాంతాలున్నందున అటవీ హక్కుల రక్షణ కల్పించాలనీ అడుగుతున్నారు. ఏడు అంశాలతో ‘సప్త సూత్ర పథకం’ తెరపైకి వస్తోంది. అస్తిత్వ, ప్రాంతీయ పోరు ఉత్తరాంధ్రలో బలపడుతోంది.

‘దగా’ ఫీలవుతున్న దక్షిణ తెలంగాణ

ప్రాంతీయ అసమానతలు, అస్తిత్వ వాంఛల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రాంతీయ వివక్ష కొనసాగుతోందనే అభియోగం ఉంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రగతికి పాలకులు శ్ర‌ద్ధ‌ చూపడం లేదనే వాదన బలపడుతోంది. వివక్ష రెండు రకాలుగా సాగుతోందని వివిధ ప్రాంతాలు, జిల్లాల వారు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ-బంధువర్గం ప్రాతినిధ్యం వహించే మూడు జిల్లాల క్లష్టర్‌లో జరిగే అభివృద్ది ఇతర జిల్లాల్లో జరగటం లేదనేది ప్రథమ విమర్శ. ఉత్తర తెలంగాణ జిల్లాల మీదున్న ప్రత్యేక శ్రద్ధ, దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్‌నగర్‌, న‌ల్గొండ‌, రంగారెడ్డిలపై లేదనేది తర్వాతి అభియోగం. తాజా ఎమ్మెల్సీ (ఉపాధ్యాయ నియోజకవర్గం) ఎన్నికల్లో పాలకపక్షం ఓటమి ఇందుకు సంకేతమంటున్నారు. ‘మేం ఏ అభ్యర్థినీ పోటీకి దించలేదు, సమర్ధించలేదు’ అని పాలకపక్షం చెబుతున్నా, విపక్షమైన బీజేపీ అధికారిక అభ్యర్థి గెలుపు కాదనలేని సత్యం! ఇక, అంతకు ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలోనూ చావుతప్పి కన్ను లొట్టబోయిందన్న చందంగా, పాలకపక్ష అభ్యర్థి పోటాపోటీ ఆధిక్యతతో నెగ్గడాన్ని ఇందుకు బలమైన సంకేతంగా ఉదహరిస్తున్నారు.

ప్రాంతీయ మనోభావాలను మన్నించి, వివక్ష-అంతరాలు లేకుండా, అభివృద్ధి సమవర్తిగా వ్యవహరించడం పాలక-విపక్షాల బాధ్యత!

-దిలీప్‌రెడ్డి,

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

[email protected].

9949099802

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story

Most Viewed