కాలేజీ అనుమతితో అకాడమీ ఫీజుల దోపిడీ

by Ravi |   ( Updated:2024-05-15 00:46:00.0  )
కాలేజీ అనుమతితో అకాడమీ ఫీజుల దోపిడీ
X

తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు కొత్త దందాకు తెరలేపాయి. ఇంటర్ తరగతులు నడుపుతునే ఇంటర్ బోర్డు అనుమతులు లేకుండా అకాడమీ పేరుతో ఇంటర్ తరగతులు నడుపుతున్నారు. నీట్, జేఈఈ, ఎంసెట్ పేరుతో కోచింగ్ ఇస్తామని చెబుతూ లక్షల రూపాయల వివిధ కోర్సుల పేర పేరెంట్స్ నుండి దండుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా రహస్యంగా అపార్ట్మెంట్స్‌లో తరగతులూ నడుపుతూ సరైన వసతులు కల్పించకుండా డే స్కాలర్ కోసం ఒక ఫీజు, హస్టల్స్ కోసమైతే మరొక ఫీజు వసూలు చేస్తున్నారు.

హైదరాబాద్ మహానగరంతో పాటు ప్రధాన నగరాల్లో అనేక రకాల పేర్లతో రాష్ట్రంలో 600 పైగా అకాడమీలను నడుపుతూ లక్షలాది రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. కోచింగ్ సంబంధించి సరైన అనుమతులు లేకుండా ఇంటర్ బోర్డుకు కోట్ల రూపాయలు గండి కొడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఆశలు చూపి వారి ఆశలనే పెట్టుబడిగా కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.

కళ్ళు మూసుకుంటున్న ఇంటర్ బోర్డు

జూనియర్ కళాశాల అని పేరు పెట్టుకుంటే కళాశాల అనుమతులు, సిబ్బంది, లెక్చరర్లు, ఫైర్ సేఫ్టీ, శానిటేషన్, అధ్యాపకులు అంటూ వివిధ సెక్షన్ల అనుమతులు కావాలంటే 3 లక్షల వరకు పర్మిషన్ కోసం ఖర్చు అవుతుంది. కొర్పొరేట్ కాళాశాలలు ఈ ఫీజును తప్పించుకోవడానికి ఎక్కడా బోర్డు లేకుండా అపార్ట్మెంట్స్‌లో అకాడమీ పేరుతో తరగతులు నడిపి కోచింగ్ పేరుతో కోట్లు సంపాదిస్తున్నారు. కనీసం సరైన సౌకర్యాలు కల్పించకుండా వందలాది మందిని పెట్టి వెలుతురు లేని, గదులు ఇరుకుగా ఉండే వాతావరణంలో పిల్లలకు తరగతులు నిర్వహిస్తున్నారు. అక్కడ సరిపడా టాయిలెట్స్ వసతి కూడా ఉండదు. పైగా ఆ అకాడమీలోనే వారు పబ్లిష్ చేసిన పుస్తకాలే కొనుక్కొవాలంటూ ఒత్తిడి చేసి వాటి ద్వారా మరింత తల్లితండ్రుల నుంచి దోచుకుంటున్నారు.

అకాడమీలు అంటే ఉదయం, సాయంత్రం మాత్రమే ట్యూషన్ చెప్పాలి. కానీ నీట్, జేఈఈ, ఎంసెట్ కోచింగ్ అంటూ, ఇదివరకు మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను బూచిగా చూపి తమ అకాడమీ అయితే మంచి ర్యాంకు వస్తుందని ప్రచారం చేస్తున్నారు. దీనికోసం మార్కెటింగ్ బృందాలు, పి.ఆర్.ఓ.లు, స్కాలర్ షిప్ టెస్టులు, రాయితీలు అంటూ ప్రచారం ఉదరగొడుతున్నారు. అకాడమీల పేరుతో కార్పొరేట్ కళాశాలలు ఇన్ని చేస్తున్న ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం కళ్ళు అప్పగించి చూస్తున్నారు తప్ప తనిఖీలు చేసి చర్యలు తీసుకోవడం లేదు.

లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ..

ఈ అకాడమీలు ప్రచారానికి ఎక్కడ తీసిపోకుండా దేశంలో ఏ అకాడమీలో ర్యాంకులు వచ్చిన తమదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ర్యాంకులను టీవీలు, పత్రికలు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి వాటి ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఏదో ఒక్క ఇంటర్ కాలేజీ తమ కళాశాలగా పెట్టుకొని అకాడమీలో తరగతులు చెప్పి కనీసం తల్లిదండ్రులకు ఏ కళాశాల నుండి హాల్ టికెట్ వస్తుందో కూడా చెప్పకుండా వారిని మోసగిస్తున్నారు. అకాడమీలో సీట్లు సాధించాలంటే ఫీజులో రాయితీలు ఇస్తామని దీనికోసం ఆన్ లైన్‌లో స్కాలర్ షిప్ టెస్టు అని ముందే జాయిన్ అయితే రాయితీ, సీట్లు అయిపోతున్నాయని ప్రచారం చేస్తూ ముందుగానే ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక లాంగ్ టర్మ్, షాట్ టర్మ్ పేరిట, డే స్కాలర్ అయితే 2 లక్షలు, రెసిడెన్షియల్ అయితే 4 లక్షల వరకు ఫీజులు పెంచి నిర్బంధంగా వసూళ్లు చేస్తున్నారు.

మానసిక ఒత్తిడిలో విద్యార్థులు

అయితే, ఈ అకాడమీలో చదివే విద్యార్థులకు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు పాఠాలు, టెస్టులు, రివిజన్, అంటూ విద్యార్థులని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. వీరికి సెలవులు, పండుగలు ఏమి ఉండవు ఎంబీబీఎస్, ఐఐటీలు, అడ్మిషన్లు రావాలంటే కష్టపడి చదవాలనే ట్యాగ్ లైన్ పెట్టి వారిలో మానసికంగా ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక అకాడమీలలో విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇందుకు రాజస్తాన్‌లోని కోటా కోచింగ్ సెంటర్లు మంచి ఉదాహరణ. అందుకే ఈ అకాడమీలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ విద్యా సంవత్సరమైన ఇంటర్ బోర్డు తనిఖీలు నిర్వహించి అక్రమ పద్ధతిలో నడుస్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలి. వీటన్నింటినీ ఇంటర్ బోర్డు పరిధిలోకి తెచ్చి ఫీజుల నియంత్రణ చేయాలి. కోచింగ్ పేరుతో మానసికంగా వేధింపులకు గురి చేయకుండా ప్రత్యేక చట్టం చేయాలి. తల్లిదండ్రులకు ఆశలు చూపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టి మరే ఇతర అనుమతులు ఇవ్వకుండా నిషేధించాలి. అప్పుడే ఈ దందా బంద్ అవుతుంది.

టి.నాగరాజు

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి.

9490098292

Advertisement

Next Story