ఏనుగులు పీనుగలవుతున్నయ్

by Ravi |   ( Updated:2022-09-03 16:45:28.0  )
ఏనుగులు పీనుగలవుతున్నయ్
X

ఇప్పుడు మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మకు బహుమతిగా వచ్చిన శంకర్ ఏనుగు స్వేచ్ఛకు అనుకూలంగా కోర్టు తీర్పు వస్తే చాలా మార్పులకు కారణమవుతుంది. భారతదేశంలో బందీగా ఉన్న, ఉచ్చులకు బలవుతున్న అన్ని ఏనుగులకు ఆ తీర్పుతో రక్షణ కలుగుతుంది. ఏనుగుల్లాంటి తెలివైన జంతువులను కూడా బంధీగా ఉంచడం సరైనదేనా అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరుకుతాయి. కోర్టు తీర్పు విరుద్ధంగా వస్తే మాత్రం భారతదేశంలో ఏనుగులు పీనుగలవుతూనే ఉంటాయి.

భారతీయ సంస్కృతిలో ఏనుగులకు ఉన్నత హోదా ఉంది. దేశ చరిత్రలో భాగమైన వాటికి ప్రత్యేక స్థానం ఉంది. అయినా, వాటి మీద పాలకులు శ్రద్ధ చూపుతున్నట్టు కనిపించడం లేదు. దేశంలో అవి దుర్భర పరిస్థితులలో బందీగా ఉంటూ, తీవ్ర హింసకు గురవుతున్నాయి. ఏనుగుల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన పాలకులు వాటి రక్షణను ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోని చాలా ఏనుగులను మతపర కార్యక్రమాలలో వాడుకుంటున్నారు. వాటితో బరువులు మోయిస్తున్నారు. భిక్షాటనకు కూడా ఉపయోగిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మకు బహుమతిగా జింబాబ్వే ప్రభుత్వం పంపించిన ఏనుగు కూడా ఇప్పుడు తీవ్ర హింసకు గురవుతోంది.

ఇరవై ఐదేండ్ల కిందట శంకర్ అనే పేరున్న పిల్ల ఏనుగును ఆఫ్రికా నుంచి విమానంలో భారత రాజధాని ఢిల్లీలోని ఒక 'జూ'కు తరలించారు. దుర్భర పరిస్థితిలో ఉన్న ఆ ఏనుగును ఇప్పుడు తిరిగి ఆఫ్రికాకు పంపించాలని కోరుతూ 'యూత్ ఫర్ యానిమల్స్' స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు నిఖితా ధావన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆఫ్రికా జాతికి చెందిన ఈ మగ ఏనుగు ఏండ్ల తరబడి జూలో ఒంటరిగా నివసిస్తోందని, దానిని జంతు ప్రదర్శనశాల నుంచి తప్పించి, మిగితా ఆఫ్రికా ఏనుగులు నివసించే వన్యప్రాణి అభయారణ్యానికి తరలించాలని ఆమె పిటిషన్‌లో డిమాండ్ చేశారు. సదరు ఏనుగు పట్ల 'జూ' నిర్వహణాధికారులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆమె పిటిషన్‌లో ఆరోపించారు. ‛శంకర్'తోపాటు మరో ఆఫ్రికన్ మగ ఏనుగు కర్ణాటకలోని మైసూర్ 'జూ'లో బందీగా ఉంది. ఈ రెండు ఏనుగులతోపాటు 'బొంబై' అనే మరో ఏనుగును కూడా 1998లో భారత్‌కు తీసుకువచ్చారు.

అవి ప్రత్యేకమే

ఆసియా ఏనుగులతో పోల్చి చూస్తే ‛శంకర్'తోపాటు మైసూర్ ‛జూ'లో బందీగా ఉన్న ఏనుగులు పెద్దగా, చాటంత చెవులతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. 2005లో 'బొంబై' అనే ఏనుగు మరణించింది. దాని మరణానికి కారణాలు ఇప్పటికీ తెలియలేదు. ‛శంకర్'ను ఉక్కు స్తంభాలు, లోహపు కంచెలున్న చీకటి ఎన్‌క్లోజర్‌లో ఒంటరిగా ఉంచారు. మనుగడకు అనువుగా లేని పరిసరాలలో ఉంచారు. అడవులలో నివసించే ఏనుగులు ఒకదానితో ఒకటి సన్నిహిత బంధాలను ఏర్పరుచుకుంటాయి. ఇరుకైన ఎన్‌క్లోజర్‌లలో ఉంచడంతో వాటి మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎన్నో ఏండ్లుగా ‛శంకర్' అనుభవిస్తున్న క్లిష్ట పరిస్థితులు జంతు న్యాయవాద సమూహాలు, సహాయక బృందాల దృష్టిని ఆకర్షించినా భారత ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు.

ఎక్కడో యూకేకు చెందిన ఆస్పినల్ ఫౌండేషన్ మాత్రం ‛శంకర్'కు ఆఫ్రికాలోని తగిన ప్రదేశంలో పునరావాసం కల్పించడానికి అయ్యే ఖర్చును భరించడానికి ముందుకొచ్చింది. అయినా ప్రభుత్వం మాత్రం దానిని ‛జూ' నుంచి విడుదల చేసేందుకు ఇంకా నిర్ణయం తీసుకోవడంలేదు. ఏనుగులు జంతుప్రదర్శనశాలలో అభివృద్ధి చెందలేవని ప్రపంచవ్యాప్తంగా చాలా నివేదికలు ధ్రువీకరిస్తున్నాయి. వాటిని అసహజ ప్రదేశాలలో బంధించడం హింసించినట్టే అవుతుంది. జూలలో ఏనుగుల ప్రదర్శనను 2009లో 'సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా' నిషేధించింది. ఆరు నెలలకు పైగా ఏనుగును ఒంటరిగా ఉంచడాన్ని నిషేధించింది. అయినా 'శంకర్' వంటి ఏనుగుల పరిస్థితిలో మార్పు రాకపోవడం బాధాకరం.

అక్కడే తీవ్ర హింస

కేరళలోని ఆలయాలు సుమారు ఆరు వందల ఏనుగుల కాళ్లు విరగ్గొట్టి, హింసించి, తిండి పెట్టకుండా చంపాయి. ఏనుగుల యజమానులు వాటికి ఇన్సూరెన్స్ చేయించి, ఆ తర్వాత కావాలనే వాటిని నీటిలో ముంచి, తుప్పుపట్టిన మేకులు గుచ్చి చంపారని, త్రిచూర్‌లోని కూడల్‌మాణిక్యం గుడిలో ఓ ఏనుగు నాలుగు కాళ్లను నాలుగు మూలలకు కట్టేసి హింసించారని బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ ఆరోపించారు. కేరళలోని మలప్పురం ఇలాంటి ఘటనలకు పేరు పొందింది. అక్కడ ఒకేసారి 300-400 పక్షులు, కుక్కలను చంపేందుకు రోడ్లపై విషం చల్లుతుంటారు. కేరళలో ప్రైవేటు వ్యక్తుల వద్ద 507 ఏనుగులు ఉన్నాయి.

వీటిలో 2017 లో 17, 2018 లో 34, 2019లో 14 ఏనుగులు చనిపోయాయి. 2007 నుంచి 2018 వరకూ క్రూరత్వం కారణంగా 14 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. కేరళలో నీలంబూర్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఏనుగుకు కొందరు పేలుడు పదార్థాలు నింపిన అనాస పండును తినిపించడంతో చనిపోయింది. సుమారు 14-15 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ ఏనుగు గర్భంతో ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఆ ఏనుగు గాయపడిన తరువాత వెల్లియార్ నదిలో మూడు రోజులుగా తల్లడిల్లుతూ పడి ఉంది. దానిని బయటకు తీసుకురావడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. అది తొండంతో సహా నీటిలో కూరుకుపోయి మరణించింది. నీలంబూర్ అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులు మనుషుల మధ్య పోరు ఎప్పటినుంచో కొనసాగుతోంది.

పగ పెంచుకున్నారా?

పేలుడు పదార్థాలతో ఏనుగును అంతమొందించడం చూస్తే ఏనుగులపై తీవ్ర పగ పెంచుకున్నారని తెలుస్తుంది. వాటిపై అంత కర్కశత్వం ఎందుకో అర్థం కావడం లేదు. ఆధిపత్యవర్గాలే ఏనుగులను అంతమొందిస్తున్నాయి. కనుక ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఏనుగు ప్రపంచంలోనే బలమైన జంతువులలో ఒకటి. అది అత్యంత సామాజిక జంతువు. దానికి అద్భుత జ్ఞాపకశక్తి ఉంటుంది. అది స్వచ్ఛతకు చిహ్నం. సౌమ్యానికి మారుపేరు. నిజాయితీకి నిదర్శనం. తల్లి ప్రేమకు తార్కాణం. అభివృద్ధికి ప్రతీక.

ఏనుగు ఇతర జంతువుల సమూహానికి సహాయంగా నిలబడుతుంది. అది సహాయం చేసిన వారిని గుర్తుంచుకునే మనస్తత్వం కలది. ఏనుగు ఎంతటి బరువునయినా లేపగలదు. ఎంతటి శక్తినయినా ఓడించగలదు. నమ్ముకున్నవాళ్ల కోసం ఎంతటి సాహసమైనా చేయగలదు. ఏనుగు సున్నితత్వం, జ్ఞానం, స్థిరత్వం, విధేయత, తెలివితేటలు, శాంతి, విశ్వసనీయత కలిగి ఉండడంతో బుద్ధుడు దానిని ఆదర్శంగా చూపుతూ ఎన్నో ఉపదేశాలు ఇచ్చారు. ఏనుగు ఆపదలో ఉన్న సమూహానికి రక్షణగా నిలబడుతుంది కనుకనే రాజ్యాధిపతి దాని నుంచి నేర్చుకోవాలి. అది బాధ్యత, విధేయత, ప్రశాంతత, సహనానికి నిలువెత్తు నిదర్శనం కనుకనే మానవాళికి అది పాఠంగా నిలుస్తుంది.

శాంతికి ప్రతిరూపాలు

ఏనుగు సంఘర్షణ, పోరాటం లేని ప్రశాంత జీవితాన్ని ఇష్టపడుతుంది. తన మంద, పిల్లలు ప్రమాదంలో లేకపోతే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. విధ్వంసకరంగా ఉండడం ఏనుగు స్వభావం కానే కాదు. అది బెదిరింపులకు గురైతే మాత్రం దేనినైనా నాశనం చేయగలదు. దాని అద్భుత శక్తితో ఇతర జాతులపై ఆధిపత్యం చెలాయించగలదు. బహుజనులు ప్రేమించిన ఇంత గొప్ప జంతువైన ఏనుగును ఆర్యులు దేవాలయాలలో బందీని చేసి హింసించడం మొదలుపెట్టారు. బౌద్ధులు ఆదరించిన ఏనుగులను అంతమొందించడమే ఆర్యుల లక్ష్యమైంది. అది వారి రహస్య ఎజెండాలో భాగం కావడంతో వారి వారసుల చేతులలో ఏనుగులు విగతజీవులవుతున్నాయి.

ఇందులో ఏనుగుల అంతంతోపాటు వాటి అవయవాలతో ధనాన్ని కూడా ఆర్జించే కుట్ర ఉంది. ఫలితంగా అత్యంత శక్తివంత ఏనుగు తీవ్ర హింసకు గురవుతూ అంతమైపోతోంది. ఇప్పుడు మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మకు బహుమతిగా వచ్చిన శంకర్ ఏనుగు స్వేచ్ఛకు అనుకూలంగా కోర్టు తీర్పు వస్తే చాలా మార్పులకు కారణమవుతుంది. భారతదేశంలో బందీగా ఉన్న, ఉచ్చులకు బలవుతున్న అన్ని ఏనుగులకు ఆ తీర్పుతో రక్షణ కలుగుతుంది. ఏనుగుల్లాంటి తెలివైన జంతువులను కూడా బంధీగా ఉంచడం సరైనదేనా అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరుకుతాయి. కోర్టు తీర్పు విరుద్ధంగా వస్తే మాత్రం భారతదేశంలో ఏనుగులు పీనుగలవుతూనే ఉంటాయి.

మేకల ఎల్లయ్య

99121 78129

Advertisement

Next Story