కాలాతీత కవి... మన వేమన

by Ravi |   ( Updated:2023-01-19 02:10:15.0  )
కాలాతీత కవి... మన వేమన
X

యన యోగమంతా అన్వేషణ, ఆ అన్వేషణలో అందివచ్చిన అనుభవాలను ఆటవెలదుల్లో అలవోకగా లోకానికందిచాడా మహానుభావుడు. ఆయన సూక్తి ఆయన అంతర్యక్తికి అద్దంపట్టిన అభివ్యక్తి ఆయన అంతస్సాధన ఆయనకు ముక్తినిచ్చిందో లేదో కానీ, సూక్తిలోని శక్తి మాత్రం జాతికొకనూత్న వ్యక్తిత్వాన్ని ప్రసాదించింది' అంటారు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం. వేమన సాధకుడు. సాధనకు భక్తి-విశ్వాసం బలం. కానీ వేమన భక్తి కన్నా వివేకాన్ని నమ్ముకున్నాడు. విశ్వాసంపైన ఆయనకు 'విశ్వాసం' లేదనేవారున్నారు. భక్తి, విశ్వాసాలు ఆచార సంప్రదాయాల వెనకుంటాయి. తరతరాలుగా దేవుడు, భక్తి విశ్వాసం, సంప్రదాయాలలో కొన్ని మంచి, చెడుగులున్నాయనే విశ్వాసులున్నారు. కానీ... మితిమీరిన విగ్రహారాధన, అవివేకంతో కూడిన సంప్రదాయాలు, పాటింప వీలులేని, కేవలం కొన్ని వర్గాలకే పరిమితమైన 'విజ్ఞానం' వంటివి వేమనకు నచ్చలేదు.

వేదం చదివామని చెప్పేవారిలో 'వివేకం' శూన్యమవటం వేమనకు తెలుసు. దేవాలయాల ముసుగులో జరిగిన దారుణాలు, వ్యాపారాలు నాటి సమాజంలో ఓ చీకటి దృశ్యాలను చిత్రించటం ఆయన చూశారు. స్త్రీలను పురుషాధిక్యతతో దేవదాసీలుగా చిత్రించటం వెనుక స్వార్థపరుల కుట్రలు వేమన గ్రహించారు. వేశ్యల వెనుకపడి 'విత్తం' పోగొట్టుకొని వెర్రివారయిన విటుల జీవితాలు, వారి కుటుంబాల లోని విషాదం ఆయన గ్రహింపుకొచ్చిన అంశం. స్త్రీ ఔన్నత్యాన్ని చెప్పే శాస్త్రాలు ఆమెనో భోగవస్తువుగా పరిగణించిన విషాదం, నాటి సమాజపు 'సహజరీతి'గా చలామణి కావటం వేమన గర్హించాడు. కనుకనే ఆయన తన పద్యాల్లో ఆచార సంప్రదాయాలను 'గొప్పవిగా' అంగీకరించలేకపోయాడు. కారణం... ఆనాటి సమాజంలోని ఒక వర్గపు ఆధిపత్యపోరు. కుహనా సంప్రదాయవాదుల విలాసవంతమైన జీవితాల వెలుగు ఆయన్ను ఆలోచింపజేసాయి. వేమన దృష్టిలో మనిషే దేవుడు. ఆయన మతం - మానవతావాదం 'బాపడనగనేమి? భక్తుడనగనేమి?/జోగియనగనేమి? సొంపులేక/ఎన్ని పేరులైన ఇనజుడు (యముడు) పనితీర్చు' అనే పద్యం ఈ వాదాన్ని బలపరుస్తుంది.

ఆచారాలు పాటించేవారిలో చిత్తశుద్ది శూన్యతను వేమన గమనించాడు. నేటి సమాజంలో కూడా ప్రచారం కోసమే భక్తి ఆచారాలు పాటించేవారున్నారు. డబ్బు, ఖర్చును బట్టి తమ స్థాయికి తగిన పూజలు, భజనలు చేస్తున్న భక్త శిఖామణులున్నారు. ఇటువంటి వారి కోసమే ఆత్మ శుద్ధి లేని ఆచార మదియేల/భాండ శుద్ధి లేని పాకమేల/చిత్తశుద్ధి లేని శివపూజలేలరా? అని ప్రశ్నించారు. వేదం చదినవారు వివేకులుగా ప్రవర్తించక అనైతిక కార్యాలు చేయటం వేమన చూసాడు కనుకనే 'వేదవిద్యలెల్ల వేశ్యల వంటివి/భ్రమల పెట్టి తేటపడగనీవు/ గుప్త విద్య యొకటే కులకాంత వంటిద'న్నారాయన.

ఆనాటి కర్మకాండలలోని డొల్లతనాన్ని వేమన నిరసించాడు. ఇవన్ని పురోహితుల భుక్తి కోసమేమనని ఆయన తెలుసుకున్నాడు. 'పిండములను జేసి పితరుల దలపోసి/కాకులకును పెట్టు గాడ్దెలార/పియ్యితినెడి కాకి పితరు డెట్టాయెనో' అని ప్రశ్నించడం వెనుక 'దోపిడిదారుల' వ్యాపారా సూత్రాల సంకెళ్ళను ఆయన ఆవేదనతో చాటి చెప్పారు. ఇందుకు కారణం కూడా ఉంది. ఆనాటి సంఘంలో యజ్ఞయాగాలు చేసేటప్పుడు యజమాని భార్య, తాను వ్యభిచరిస్తే ఎంతమందితో సంబంధంలోకి పోయిందో సూచించడానికి అన్ని గడ్డిపోచలను పెట్టాలని ఓ ఆచారం. ఇది సమంజసమా? ఇటువంటి ఆచారాలను వేమన వ్యతిరేకించాడు. దేవుడంటే ఎవరు? ఎక్కడున్నాడు. కనిపించని దేవుడిని గొప్పగా కీర్తించి, కనిపించే మనిషిని జాతి, కుల, మత వివక్షలతో, ఆర్థిక అసమానతలతో వేధించే మనుషులను వేమన దూషించాడు, ద్వేషించాడు. అసలు దేవుడెక్కడున్నాడని నిలదీశాడు. 'దేవుడనగ వేరె దేశమందున్నాడె? / దోషితోడ నెవుడు దేహమందే /వాహనములనెక్కి పడి దోలుచున్నాడు. మనిషిని నడిపించే జీవచైతన్యమే దేవుడు. పాడి, పంట, రైతు, తల్లి, తండ్రి, మానవత్వం ఇవే దైవస్వరూపాలుగా వేమన సిద్ధాంతీకరించాడు.

వేమన కాలం నాటి అనేక ఆచారాల్ని నమ్మకాల్ని వేమన దుయ్యబట్టాడు. ఈ అంతరంగం వెనుక ఆంతర్యం అమాయకులైన ప్రజలను పేదవారుగా మార్చి, వారిని ఆకలి చావులకు గురిచేసే మతాధికారుల మౌఢ్యపు చేష్టల తిరస్కారం ఆయనది. స్వర్గంపై మమకారం కన్నా రంభాదులపైన ఆశ నాటి మత పెద్దలు చెప్పే బోధనలలో ఎక్కువగా ఉండేది. యజ్ఞం చేసిన తండ్రి, తనయుడు మరణిస్తే, ఇద్దరికి ఒకేసారి రంభ సంపర్కం లభిస్తే... అప్పుడు వాళ్ళిద్దరూ వావివరసలు తప్పి పాపం చేయరా? ఇదేమి ఆచారమని వేమనవాదం 'తల్లితో రమించే తండ్రి యజ్ఞము చేసి/తనయుడట్టె రంభ దసర గూడె/తల్లిని రమియింత్రు దబ్బర విప్రులు' అని ఎత్తి చూపాడు వేమన. 'ఒక సత్కార్యం నిమిత్తం స్వార్థ త్యాగం కన్నా ఉత్తమమైన బలిదానం ఏమున్నది? అనేది వేమన ప్రతిపాదన. యజ్ఞయాగాదుల ఫలంను గురించి భగవద్గీత, వేదాలు చెప్పిన సారాంశాలను పక్కన పెట్టి 'స్వంత పైత్యాలను' ప్రచారం చేసుకొని, వాటినే సత్సంప్రదాయాలుగా, ఆనాదిగా వస్తున్న ఆచారాలుగా పేర్కొన్న కుహానా పండితులపైనే వేమన ధ్వజమెత్తారు. 'సోమయాజి బట్టి సోడ్ల వ్రేసెను రంభ/యొందె సోమయాజినొంగబెట్టి/క్రతువు జేయు ఫలము కల్గెరా చేజేత' అని విమర్శించిన వేమనను తప్పు పట్టలేం కదా? ఈ రోజుల్లో 'కట్నం' తీసుకోవడం ఓ 'సామాజిక స్థాయి'గా భావించే మగవారున్నారు. అదేవిధంగా ఆ రోజుల్లో 'ఓలి' ఇచ్చే ఆచారం ఉండేది. (ఇప్పటికీ తక్కువ కులాల్లో ఓలి ఆచారం - ఉందేమోనంటారు ఆరుద్ర. 'లోభము చేత శుల్కం తీసుకుంటే మనిషి బిడ్డలను అమ్ముకున్నటే కదా' (3-51). వేమన ఇదే తాత్పర్యాన్ని 'పేదవాడైనా సరే 'పిల్లనిస్తాను' అని చెప్పి పరుషంగా పైడి అడగకూడదని చెప్పారు.

పైడి అడిగితే బిడ్డను (చెర) బట్టినట్టె' అన్నాడు. కలిమిజూచియియ్య కాయమిచ్చినయట్లు/ సమునకియ్య నదియు సరసతనము/ పేదకిచ్చు మనువు పెనవేసినట్టుందు' అంటారు వేమన. ఆచార్య వ్యవహారాల్లో 'శకునముల'కు ప్రాధాన్యత ఇస్తారు. విధవలు ఇందుకు పనికిరారు. వేమన ఇక్కడ కూడా తన పదునైన విమర్శనాస్త్రములు సంధిస్తారు. శకునం అనగా పక్షి అని అర్థం. పక్షులకు శకునాలకు సంబంధం ఉంది. ఇది వేరే విషయం. 'శకునశాస్తం' కూడా ఉంది. శకునాలు ఆరు రకాలుగా విభజించారు. వీటిని నిరసించిన వేమన 'మంచి శకునములనెయెంచక పెండ్లాడు/వారలొకరు వేరు వసుధలోన/జనుల కర్మములను శకునముల్‌ నిల్పునా' అంటాడు. జాతకాలు, అటు ఆరు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెండ్లాడిన వారు కొట్టుకొని విడిపోయి, కోర్టుగుమ్మాలు ఎక్కుతున్న వర్తమాన కాలంలో దేనిని నమ్మాలి? ఈ విషయాన్ని సూటిగా 'విపులెల్ల కూడి వెర్రి కూతలు కూసి/సతిని పతిని గూర్చు సమ్మతముగా/మును ముహుర్తముంచ ముండెట్లు మోసెరా అని ప్రశ్నించిన వేమనకు 'సమాజం' సమాధానమివ్వలేదు.

వేమనది వితండవాదం కాదు. మానవతావాదం. మనిషే దైవం మనిషిని సేవించడమే దైవదర్శనం అన్నాడాయన. ఆరుద్ర తన 'వేమన్న వేదం' లో చెప్పిన వ్యాఖ్యానం గమనించదగ్గది. 'శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గంథకోటిఖి:/పరోపకర; పుణ్యాయ పాపయ పరపీడనం 'కోటి గ్రంథాల్లో చెప్పిన దాన్ని నేను అర్ధశ్లోకంలోనే చెప్తాను. పరులకు ఉపకారం చేయ్యడమే పుణ్యం. పరపీడనమే పాపం అనే శ్లోకార్ధం వేమన జీవిత సందేశం. వేమన భాష స్వచ్ఛమైనది. వాడిగలది. శైలి సరళం సాటిలేనిది. ఆయన ఉపమలు, పోలికలు సహజంగా సరికొత్తగా, గంభీరంగా, వియత్తలాన్నంతా వెలిగించే మెరు తీగల్లాగా ఉంటాయి. కొన్ని విషయాలను గూర్చి ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలు నాటి కాలానికే కాదు... ఆధునిక కాలానికి కూడా వర్తించేటట్లుగా ఉంటాయి. 'తెలుగు ప్రజలు వేమన కవిత్వాన్ని అధికంగా అభిమానిస్తారన్న డా. పోప్‌ వ్యాఖ్యానం అక్షరసత్యం. తెలుగు భాష వేమనకు రుణపడి ఉంది.

ఆధార గ్రంథాలు;

1. వేమన శతకం - టి.టి.డి ప్రచురణ 1999

2. వేమన్నవేదం - ఆరుద్ర - విశాలాంధ్ర ప్రచురణ - 2011

8. నార్ల రచనలు (4వ భాగం నార్ల కుటుంబం 2004

భమిడిపాటి గౌరీశంకర్‌

94928 58395

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read....

860 ఏళ్ల వేయిస్తంభాల గుడి


Advertisement

Next Story