- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈజీ మనీ అంత ఈజీ కాదు

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు యువతను అప్పుల ఊబిలోకి నెట్టి, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి, ఉద్యోగంలో స్థిరపడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన యువకులు ఈ యాప్‌ల వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నారు. "సులభంగా లక్షలు సంపాదిస్తాం" అనే ఆశతో మొదలైన ఈ ప్రయాణం, చివరకు అప్పులు, ఒత్తిడి, ప్రాణత్యాగంతో ముగుస్తోంది.
సమాజంపై ప్రభావం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ యాప్‌లు విస్తృతంగా వ్యాప్తి చెందాయి. టెలిగ్రామ్ గ్రూప్‌ల ద్వారా లింక్‌లు పంపించి మొదట్లో ఆట గెలిచి డబ్బు రెండింతలు పెరిగేలా ఆశ చూపిస్తాయి. ఆ తర్వాత పెద్ద మొత్తాలు పెట్టమని ఒత్తిడి చేసి, డబ్బు సరిపోకపోతే లోన్ యాప్‌లను ప్రమోట్ చేస్తాయి. ఒక యూజర్ గెలిచినట్లు కనిపించినా, యాప్ డిజైన్ కంపెనీ లాభాలకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఓడిపోవడం ఖాయం. ఉదాహరణకు, నిజామాబాద్ లో 2024 అక్టోబర్‌లో ఒక కుటుంబంలోని ముగ్గు రు రూ.30 లక్షల బెట్టింగ్ అప్పు వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో నిరక్షరాస్యత, ఉద్యోగాల కొరత, కష్టపడే మనస్తత్వం లేకపోవడం వల్ల యువత ఈ "ఈజీ మనీ" ఉచ్చులో పడుతోంది. ఈ యాప్‌ల వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయి. అన్నీ తెలిసినా ఈ దారిలోకి వెళ్తున్నారు. ఇది వ్యక్తి గత నష్టంతో పాటు సమాజానికి కూడా ముప్పు.
చట్టాలు ఉన్నా నియంత్రణ కష్టం
భారత ప్రభుత్వం 2023 డిసెంబర్ నాటికి 581 యాప్‌లను నిషేధించింది. 174 బెట్టింగ్ యాప్‌లు, 87 లోన్ యాప్‌లు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69A ద్వారా ఈ చర్యలు తీసుకుంటోంది. తెలంగాణలో, తెలంగాణ గేమింగ్ (సవరణ) చట్టం, 2017 ఆన్‌లైన్ జూదాన్ని నిషేధిస్తుంది. అయినప్పటికీ, VPN (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్), సైడ్‌లోడింగ్ (APK ఫైల్స్ ద్వారా డౌన్‌లోడ్) వంటి టెక్నాలజీలతో ఈ యాప్‌లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఈ సర్వర్లు విదేశాల్లో ఉండటం వల్ల ప్రభుత్వ నియంత్రణ సవాలుగా మారింది. కొన్ని ప్రైవేట్ కంపెనీలు అనధికారికంగా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్‌లతో తక్కువ ఖర్చుతో ఈ యాప్‌లను తయారు చేయించి. గూగుల్ ప్లే స్టోర్‌లో చట్టబద్ధంగా లభ్యం చేయడం ఖర్చుతో పాటు చట్టవిరుద్దం కాబట్టి, వీరు ఇతర వెబ్‌సైట్‌ల ద్వారా వినియోగదారులను చేరుతున్నారు. పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ మోసాలను గుర్తిస్తున్నప్పటికీ, పూర్తి నిర్మూలన కష్టంగా ఉంది.
ఈ ఆశ వదిలేయండి!
బెట్టింగ్ యాప్‌ల వల్ల అప్పులపాలై ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదు. బలవన్మరణం వద్దు.. బతికి సాధించడమే ముద్దు. బెట్టింగ్ లేదా లోన్ యాప్‌ల వల్ల ఇబ్బంది పడితే, టోల్ ఫ్రీ నంబర్ 155260 లేదా డయల్ 100కు కాల్ చేయాలని ఐపీఎస్ అధికారి సజ్జనార్ విజ్ఞప్తి సూచించారు. ముందుగా యువత టెలిగ్రామ్ లింక్‌లు, APK ఫైల్స్‌ను నమ్మవద్దు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన వదిలేయండి. అప్పులు, ఒత్తిడి ఉంటే కుటుంబం లేదా స్నేహితులతో చెప్పండి. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయండి. మన యువత మన దేశ భవిష్యత్తు. ఈ బెట్టింగ్ యాప్‌ల నుంచి వారిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
- నవీన్
96429 19779