డీఎస్సీ జరపాల్సిందే..!

by Ravi |   ( Updated:2024-11-15 01:15:27.0  )
డీఎస్సీ జరపాల్సిందే..!
X

"లంఖణానికి పెడితేగానీ పథ్యానికి రాదు" అనే సామెత పాత తరానికి ఎంతగా తెలుసో డీఎస్సీ రాసే భావి ఉపాధ్యాయులకు తెలియాల్సి వుంది. ప్రభుత్వం తరఫున ఎవరు ప్రకటన ఇచ్చినా దానికి చట్టబద్ధత ఉండి తీరాలి. ప్రభుత్వంలో ఎవరున్నా, మానవ శరీరంలో గుండెకు వున్నంత గొప్ప బాధ్యతతో మసలుకోవాలి.

రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఉపాధ్యాయ నియామకాల్లేవు. మెగా డీఎస్సీ అంటే ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి విద్యా ప్రమాణాల పెంపుకు అవసరమైనంత మంది బోధనా సిబ్బందిని నియమిస్తారని అందరూ ఎదురు చూశారు. అయితే స్వల్పకాలిక శిక్షణతో ఉద్యోగం పొందొచ్చనే ఆశలపై నీళ్లు చల్లుతూ డీఎస్సీ షెడ్యూల్ ప్రకటనకు ముందే వాయిదా వేసే దిశగా ప్రభుత్వం సంకేతాలిచ్చింది.

ప్రకటన.. వెంటనే వాయిదా ఎందుకు?

కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెనువెంటనే కొలువుల విందు చకచకా జరిగిపోతుందని లక్షలాది నిరుద్యోగులు విస్తర్లు వేసుకుని ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్లుగానే మెగా డీఎస్సీ అంటూ ప్రకటన అయితే విడుదలైంది. లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసుకుని కోచింగ్ సెంటర్లు కిక్కిరిసిపోయాయి. స్వల్పకాలిక శిక్షణతో ఉద్యోగం పొందొ చ్చనే ఆశలపై నీళ్లు చల్లుతూ డీఎస్సీ షెడ్యూలు ప్రకటనకు ముందే వాయిదా వేసే దిశగా ప్రభుత్వం సంకేతాలిచ్చింది. మూడు దశాబ్దాలకు పైగా నలుగుతున్న ఒక రాజకీయ సమస్యతో బట్టతలకు మోకాటి వెంట్రుకలతో ముడిపెట్టి వాయిదాకు నిర్ణయించేసారు.

ఈ నియామకాలు జీతాలకు కాదు..

ఉపాధ్యాయ నియామకాలు కేవలం నిరుద్యోగులకు జీతాలిచ్చి సంతృప్తి పరచడం కోసం మాత్రమే కాదు. విద్యారంగంలో బోధనా కొరతను అధిగమించడం కోసం. సర్కారు బడిని నమ్ముకొని తమ పిల్లలను పంపుతున్న బడుగుల జీవితాల్లో వెలుగులు నింపడం కొసం. దిగజారిపోతున్న విలువలను పునరుద్ధరించడం కొసం పడిపోతున్న ఫలితాలను పూటీ పెట్టి లేపడం కోసం. వేలం వెర్రిగా ప్రయివేటు పాఠశాలలకు తరలిపోతున్న బడి ఈడు పిల్లలకు ప్రభుత్వ బడిని పరిచయం చేయడం కోసం. బంగారు భవిష్యత్తును పోగొట్టుకొని పశువుల కాపర్లు, బాల కార్మికులుగా మారుతున్న భావితరాలకు భరోసా కల్పించడం కోసం. ఇలా ఎన్నో లక్ష్యాల నేపథ్యం ఉంది. ఉపాధ్యాయ నియామకాల వెనుక ఆ లక్ష్య సాధనకు నిర్ధిష్ట కార్యాచరణ ఉండాలి. ఇల్లలకగానే పండగవుతుందా? డీఎస్సీ ప్రకటన చేస్తేనే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందా? నిరుద్యోగుల్లో నిరాశా నిస్పృహలను పారద్రోలే చర్యలు ఇప్పుడు తక్షణ కర్తవ్యం.

నియామక ప్రక్రియ జరపాలి!

భారత రాజ్యాంగంలోని వివిధ నిబంధనల కింద ఉచిత, నిర్బంధ విద్యకు పిల్లల హక్కు చట్టం, 2009 ప్రకారం, 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ప్రాథమిక హక్కుగా అందించబడాలి. మరి ఉపాధ్యాయుల కొరతతో రాజ్యాంగ లక్ష్యాల సాధన సాధ్యమా? ఇపుడు పాలకులు చేస్తున్నవి కొత్తగా సృష్టించబడిన ఖాళీలు కావు. ఎంతో కాలంగా భర్తీకి నోచుకోబడినవనే సంగతి మర్చిపోకూడదు. బడ్జెట్ కేటాయింపులు గల పోస్టులను భర్తీ చేయడానికి ముహూర్తాలు పెట్టుకుంటున్న ప్రభుత్వాలు పోలీసు నియామకాలకు ఆ నియమాలు నిర్దేశించుకోవా? తమిళనాడులో కేవలం 45 రోజుల్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తవుతుంది. అందుకోసం వారు అనుసరిస్తున్న విధానంపై పరిశీలన జరపాలి. విద్యా సంవత్సర కాలం వృధా కాకుండా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

తరగతికో ఉపాధ్యాయుడు తప్పనిసరి!

32వేల పైచిలుకు ఉండాల్సిన ఉపాధ్యాయ ఖాళీలు ప్రభు త్వాలు అనుసరిస్తున్న తిరోగమన విధానాలు విద్యారంగానికి మరణశాసనం అయ్యాయి. ప్రాథమికోన్నత పాఠశాలలకు జవసత్వాలు నింపి పల్లె వీధుల్లో ఆగిన విద్యను సెకండరీ దశకు చేరేలా చూడాలి. సబ్జెక్టు టీచర్లకు బదులు ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో తరగతికో ఉపాధ్యాయుడి ఉండేలా చూడాలి. గత కొంతకాలంగా సంక్షేమ పథకాలు ప్రజల కళ్ల కు గంతలు కట్టాయి. అందువల్లే మహోత్క్రుష్టమైన భాషా సౌందర్యం కలిగివున్న తెలుగు భాష మాధ్యమమే అంతర్ధానమైతే కూడా మౌనం దాల్చిన నేపథ్యంలో ఎవరు ఎవరిని చైతన్య పరచాలి? 16 వేలతో అట్టహాసంగా ప్రకటింపబడిన డీఎస్సీ ప్రక్రియను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాల్సిన ప్రభుత్వం మౌనం వీడాలి. బాధ్యతాయుత విధానాల పునాదులే ప్రభుత్వాల నిబద్ధతను ఋజువుచేస్తాయి.

- మోహన్ దాస్,

ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు

94908 09909

Advertisement

Next Story