కారుణ్య నియామకాలపై సందేహలు.. సమాధానాలు..

by Ravi |   ( Updated:2024-10-08 15:49:48.0  )
కారుణ్య నియామకాలపై సందేహలు.. సమాధానాలు..
X

ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండగానే అకాల మృత్యువాత పడినప్పుడు, అంతవరకు అతని/ఆమె ఆర్జనపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు సామాజిక భద్రతా సూత్రాలకు అనుగుణంగా, కుటుంబ పోషణ నిమిత్తం, అర్హతలు గల కుటుంబ సభ్యులలో ఒకరికి నియమ నిబంధనల మేరకు ఉద్యోగ అవకాశం కల్పించడం కారుణ్య నియామకాల వెనుక ఉన్న సత్ సంకల్పం.

అందుకే ప్రభుత్వం, కారుణ్య నియామక పద్ధతిలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగాన్ని కల్పించాలి. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. దరఖాస్తు చేసుకున్నా నిరీక్షణ తప్పడం లేదు. అయితే ఇటువంటి నియామకాలకు ఎవరు అర్హులు? ఎటువంటి ధ్రువపత్రాలు సమర్పించాలి? ఎటువంటి విద్యార్హతలు కలిగి ఉండాలి? తదితర అంశాల పట్ల డీడీఓలకు, బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన అవసరం.

ఎవరు అర్హులు..

జీవో.687 తేదీ: 3.10.1997 ప్రకారం, చనిపోయిన ఉద్యోగి కుటుంబంలో ఇతరత్రా సంపాదనపరులు లేనప్పుడు భార్య/భర్తపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు వారి అర్హతల మేరకు ఉద్యోగం పొందుటకు అర్హులు. ఉద్యోగి చనిపోయిన తేదీ నుంచి ఒక సంవత్సరం లోపల ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలి. జూనియర్ అసిస్టెంట్ స్కేలుకు మించకుండా ఉన్న పోస్టులలోనూ లేక అంతకంటే తక్కువ స్కేలులో ఉన్న పోస్టులలోనూ నియామకాలు జరుపుతారు. ప్రభుత్వ మెమో నం.140733 తేదీ: 14.11.2003 ప్రకారం, ఈ పథకం కింద ఉద్యోగం పొందుటకు భార్య/భర్తకు అవకాశం కల్పిస్తారు. వారు ఈ నియామక ఉద్యోగం తనకు వద్దు అని అనుకుంటేనే తన సంతానంలోని కొడుకును/కూతురిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వారికి ఉంటుంది.

అయితే ఈ నియామకానికి అర్హులు.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, కుమారుడు లేక అవివాహిక కుమార్తె, ఆధారపడి జీవిస్తున్న విధవరాలైన కూతురు, నియమ నిబంధనల మేరకు అర్హులైన చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, దత్తపుత్రుడు, దత్తపుత్రికకు, వివాహిత అయిన ఒకే కూతురు ఉన్నా లేదా ఇద్దరు వివాహిత కూతుర్లలో ఒకరికి కారుణ్య నియామకాల అవకాశం కల్పించవచ్చు. అలాగే ఉగ్రవాదుల ఘాతకాల వల్ల చనిపోయిన ఉద్యోగి, అసాంఘిక శక్తుల దుశ్చర్యల వల్ల చనిపోయిన ఉద్యోగి, ఉద్యోగంలో ఉంటూ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి, ఏడు సంవత్సరాల నుండి ఆచూకీ తెలియకుండా అదృశ్యమైన ఉద్యోగి కుటుంబ సభ్యులకు ఈ పథకం ద్వారా ఉద్యోగం కల్పించవచ్చు.

వయస్సు, చదువు అర్హతలు..

జీవో.113 తేదీ: 6.10.2009 ప్రకారం, గుర్తింపు పొందిన ఎయిడెడ్ సంస్థలకు కారుణ్య నియామకాల పథకంను పునరుద్ధరించారు. దీని ప్రకారం కారుణ్య నియామకాలు అట్టి సంస్థలలో కాకుండా జిల్లా పరిషత్తు, మండల ప్రజా పరిషత్తు ప్రభుత్వ కార్యాలయాల్లో చేపట్టవలసి ఉంటుంది. ఈ నియామకాల్లో 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిని అదే విధంగా 34 సంవత్సరాలకు మించి వయసున్న వారిని కూడా ఉద్యోగంలో నియమించుటకు అవకాశం లేదు. అయితే భార్యభర్తల విషయంలో ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. జీవో.144 తేదీ: 15.6.2004 ప్రకారం భార్య/భర్త ఉద్యోగం చేయదలచినపుడు వారికి గరిష్ట వయోపరిమితిని 45 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఉద్యోగి కుటుంబ సభ్యులలో ఉద్యోగార్హత కలిగిన వ్యక్తి మైనర్‌గా ఉన్నప్పటికీ 16 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ ఉద్యోగానికి అర్హుడు. కానీ 18 సంవత్సరాలు నిండిన తర్వాతే ఉద్యోగం ఇస్తారు. మైనారిటీగా ఉన్న వ్యక్తి సదరు ఉద్యోగి చనిపోయిన వెంటనే దరఖాస్తు చేయవలసి ఉంటుంది. జీవో.612 తేదీ: 30.10.19 91 ప్రకారం శాఖాధిపతుల కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి కనీస విద్యార్హతగా డిగ్రీ ఉండాలి. శాఖాధిపతి కార్యాల యం కాకుండా సబార్డినేట్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ నియామకాలకు కనీస విద్యార్హత ఇంటర్మీడియ ట్‌గా నిర్ణయించడం జరిగింది.

కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే..

జీవో.969 తేదీ: 27.10.1995 షరతులతో కూడిన కారుణ్య నియామకాలు పొందిన అభ్యర్థులు నిర్దేశిత కాల వ్యవధిలో విద్యార్హతలు సకాలంలో పాస్ కానిచో అలాంటి ఉద్యోగులను అటెండర్‌గా గానీ అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగాల్లో గాని అతని అభీష్టం తెలుసుకున్న తర్వాత మరల ఉద్యోగంలో నియమించ వలసి ఉన్నది. ప్రభుత్వ మెమో.నం.58226 తేదీ: 1.5.2001 ప్రకారం కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందిన వ్యక్తి కుటుంబ సభ్యుల పోషణ భారం వహించాలి. కావున ఆ వ్యక్తికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం కల్పించే ముందు అతని నుంచి కుటుంబ సభ్యులను పోషిస్తానని నిర్లక్ష్యం చేయనని వాగ్దాన పత్రం తీసుకోవాలి. కుటుంబ సభ్యులను పోషించకపోయినా, నిర్లక్ష్యం చేసిన అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తారని పై ఉత్తర్వులు సూచిస్తున్నాయి. జీవో.612 తేదీ: 30.10.1991 ప్రకారం దివంగత ఉద్యోగి దత్తత తీసుకున్న పుత్రుడు/ పుత్రిక కొన్ని షరతులకు లోబడి కారుణ్య నియామకాలు అర్హులు. దత్తత స్వీకారం ఉద్యోగి చనిపోక ముందు కనీసం ఐదు సంవత్సరాల ముందు చట్టబద్ధంగా స్వీకరించి ఉండాలి. జీవో.350 తేదీ: 30.7.1999 ప్రకారం అవివాహిత కూతురు ఉద్యోగం పొందుటకు దరఖాస్తు చేసుకున్న పిదప నియామక ఉత్తర్వులు పొందేలోపు ఆమెకు వివాహం జరిగినా ఈ పథకం కింద ఉద్యోగానికి అర్హురాలుగా పరిగణిస్తారు. జీవో.166 తేదీ: 31.3.2005 ప్రకారం ఉద్యోగంలో ఉంటూ మరణించిన ఉద్యోగ కుటుంబ సభ్యులలో సంపాదనపరులు ఎవరూ లేనప్పుడు భార్య/ భర్త కారుణ్య నియామక అవకాశాన్ని వినియోగించుకోనపుడు అట్టి కుటుంబానికి ప్రభుత్వం పారితోషకం చెల్లిస్తుంది. ఈ పారితోషకం నాలుగో తరగతి ఉద్యోగులకు నలభై వేలు, నాన్ గెజిటెడ్ అధికారులకు అరవై వేలు, గెజిటెడ్ ఉద్యోగులకు ఎనభై వేల చొప్పున చెల్లిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మొత్తాన్ని ఐదు, ఎనిమిది, పది లక్షలకు పెంచారు.

దరఖాస్తు విధానం..

ప్రభుత్వ మెమో.నం.28967 తేది:22-06-2004 ప్రకారం, కారుణ్య నియామకాల క్రింద విధవరాళ్లైతే, వారు ఎక్కడైతే క్షేమంగా ఉండగలరో అక్కడ నియమించాలి. స్వంత జిల్లాలు, చనిపోయిన ఉద్యోగి పనిచేసిన స్థలము, ఏ జిల్లాలో అయినా ప్రెషిడెన్షియల్ ఆర్డరుకు లోబడి ఆమె కోరిన జిల్లాకు పోస్టింగు ఇవ్వవచ్చు. ప్రభుత్వ మెమో.నం.427 తేది 01-07-1991 కారుణ్య నియామకం కింద, మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కల్పించు సందర్భంలో జిల్లాలో ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ ఖాళీ పోస్టులు లేనపుడు, ఆర్థిక సంవత్సరంలో 5 పోస్టుల వరకు సృష్టించుటకు జిల్లా కలెక్టర్‌కు అధికారం ఉన్నది. అంతకు మించి పెంచాలంటే ప్రభుత్వ అనుమతి పొందవలసి ఉంటుంది. ప్రభుత్వం మెమో.3548 తేది: 24-03-2012 ద్వారా కారుణ్య నియామకాలు పొందడానికి కుటుంబంలో ఎవరూ సంపాదనపరులు లేరనే దరఖాస్తుతో పాటు ధ్రువీకరణ పత్రం కూడా జతపరచాలి. సర్వీసులో ఉంటూ ఉద్యోగి చనిపోయిన సందర్భాలలో.. పదవీ విరమణ చేసిన తల్లిదండ్రులలో ఎవరైనా సర్వీసు పెన్షను పొందుచున్న సందర్భాలలో, వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులెవ్వరూ కారుణ్య నియామకానికి అర్హులు కారు. కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేయు సందర్భంలో దరఖాస్తుతో పాటు మరణ ధ్రువీకరణ పత్రము, చట్టబద్ధత హక్కు పత్రము, విద్యార్హత పత్రములు, పుట్టిన తేదీ వివరాలు తెలుపు పత్రము, దరఖాస్తు చేయు అభ్యర్థి కుటుంబంలో సంపాదనపరులు ఎవరూ లేరంటూ ఇచ్చే స్వయం ధ్రువీకరణ పత్రం, భార్య/భర్త తమ సంతతిలో ఎవరికి ఉద్యోగం ఇవ్వాలనే విషయంలో ఇచ్చే అంగీకార పత్రం, రెవిన్యూ డివిజనల్ అధికారి జారీ చేసిన ఆర్థిక స్థితిని తెలియజేసే పత్రం జత చేయాల్సి ఉంటుంది. కారుణ్య నియామకారుల కోసం దరఖాస్తును ఉద్యోగి ఏ కార్యాలయంలో అయితే చివరగా పనిచేస్తూ మరణించాడో ఆ కార్యాలయపు అధికారికి సమర్పించాలి.

సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747

Advertisement

Next Story