చట్టం ఉన్నోడికి చుట్టమా..!

by Ravi |   ( Updated:2024-04-19 01:16:07.0  )
చట్టం ఉన్నోడికి చుట్టమా..!
X

ఈ మధ్య కాలంలో తెలంగాణలోని మీడియా, సోషల్ మీడియాను కుదిపేసి హాట్ టాపిక్స్‌గా వైరల్ అయిన, అదే విధంగా పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచిన లిక్కర్ స్కాం, డ్రగ్స్ కేసు, ఫోన్ ట్యాపింగ్ వంటి కేసుల్లో నిందితులందరు ఉన్నత స్థాయికి చెందిన రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు, పోలీసు అధికారులు ఉన్నారు. అయితే ఇందులో మనం క్షుణ్ణంగా గమనించాల్సింది, వీరిని అరెస్ట్ చేస్తున్నప్పుడు పిడికిలి బిగించి అభివాదం చేస్తున్న సంకేతాలు, విక్టరీ సింబల్స్ చూపిస్తూ నవ్వుతూ ఎటువంటి బెరుకు లేకుండా సదరు దర్యాప్తు సంస్థ అధికారులు సైతం గౌరవంగా తీసుకెళ్లే వీడియోలు, ఫోటోలు సామాన్యులను విస్తుగొలిపించాయి. అదే సామాన్యులనైతే ఇలా గౌరవంగా తీసుకెళ్లగలరా?

సామాన్యులు తప్పు చేస్తే.. రోడ్ల మీద కొట్టుకుంటూ, ఈడ్చుకెళ్లిన సందర్భాలు కోకొల్లలు. ఇలాంటి ఘటనల మీద కనీసం కంప్లైంట్ కాదు కదా మాట్లాడే ధైర్యం చెయ్యలేని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఒకవైపైతే, సుమోటోగా తీసుకోని విచారించే బాధ్యత కలిగిన కోర్టులు సైతం తమకేమీ పట్టనట్టు ఉన్నా, ఒకవేళ ఏవైనా ఒకటో, అరో సుమోటోగా తీసుకున్నా ఆ ఒక్క రోజు హడావిడే తప్ప సదరు అధికారుల మీద చర్యలు ఏం తీసుకున్నారో సాధారణ జనాలకు తెలిసే అవకాశమే లేదు. అలాగే మానవ హక్కుల కమిషన్ దృష్టికి వెళ్లినవి కొద్దో గొప్పో ఉండడం గమనార్హం. స్వతంత్ర పోరాటంలోనో లేదంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనో ఇలాంటివి ప్రజలకు ఉద్యమ స్ఫూర్తి నింపుతాయి కానీ వారి వ్యక్తిగత కేసులు ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇలా చేయడం బహుశా చట్టాలను, న్యాయస్థానాలను పరిహాసం చేయడమే కాబోలు..

లీగల్ లిటరసీ లేనందుకేమో..

ఇది ఇలా ఉంటే సమాజంలో సామాన్యులకు చిన్న చిన్న విషయాలకు ఏదైనా తగాదాలకు సంబంధించి పోలీస్ స్టేషన్ నుండి ఓ చిన్న ఫోన్ కాల్ వస్తేనో, లేదంటే ఖాకీ డ్రెస్సులో ఇంటి ముందుకు పోలీసు వస్తేనో అవమాన భారంతో కుమిలిపోతున్న జనం పరిస్థితి దయనీయం.! అయితే ముఖ్యంగా పేద మధ్యతరగతి వారికే మాత్రమే ఈ అవమానం అనే ఆభరణం ఉంటుందా లేక రాజ్య వ్యవస్థ ఈ జనాలను భయబ్రాంతులకు గురిచేసి చెప్పుచేతుల్లో పెట్టుకోవడానికి పోలీసు, న్యాయ వ్యవస్థలను పుట్టించాయేమో అనే అనుమానం రాక మానదు.! దీనికి ముఖ్య కారణం బహుశా అనేక సర్వేలు నివేదికలు ఇచ్చినట్టుగా దాదాపు ఎనభై శాతం పైచిలుకు భారతీయులకు 'లీగల్ లిటరసీ' లేనందుకేనేమో.! లెఫ్టిస్టులు విమర్శిస్తున్నట్టు పోలీసు, న్యాయ వ్యవస్థ లు, చట్టాలు చేసుకున్నది కేవలం పాలక వర్గాల ప్రయోజనాలకోసమేనేమో..

అధికార పార్టీకి గులాములుగా ఉంటూ..

ఇక్కడ విస్తుగొలిపించే ఇంకో అంశం ఏమిటంటే, అధికారం ఉన్నన్ని రోజులు ఏ పోలీసూ కనీసం కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ధైర్యం చెయ్యరు కానీ ఒక్కసారిగా అధికారం కోల్పోగానే పదవిలో ఉన్నన్ని రోజులు చేసిన ఒక్కో తప్పులను భూతద్దం పెట్టి వెతుకుతూ అంటే పాత కేసులను తోడే పనిలో పోలీసులు నిమగ్నమై ప్రభుభక్తిని పొందే పనిలో ఉండడం, వీరి ట్రాన్స్ఫర్‌లు పూర్తిగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రుల ఆధీనంలో ఉండడం చూస్తున్న ప్రజలకు అధికార పార్టీకి పోలీసులు గులాములనే విషయం క్షుణ్ణంగా అర్థమైపోతుంది. కేవలం చట్టాన్ని అమలు చేయడానికే పోలీసు వ్యవస్థ ఉందని, శిక్ష విధించే అధికారం కేవలం ఒక్క కోర్టుకు మాత్రమే ఉందన్న విషయం బహుశా పోలీసులు కూడా రాజకీయ ఒత్తిళ్లలో పడి మరిచిపోతుంటారేమో.. గద్దర్ ఒక పాటలో 'ఏ చట్టం మీకిచ్చిన హక్కులివీ చెప్పారాద' అంటూ సూటిగా ప్రశ్నించిన సందర్భాలు లేకపోలేదు. పోలీస్ కంప్లైంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని, అందులో జిల్లా స్థాయి అథారిటీ కానిస్టేబుల్ నుండి డీఎస్పీ వరకు, రాష్ట్ర స్థాయి అథారిటీ ఎస్పీ నుండి పై స్థాయి అధికారులపై వచ్చే ఫిర్యాదులను విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించినా రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేసింది. అలాగే పోలీసు భద్రతా కమిషన్ కూడా వెయ్యాలని ఆదేశించింది. ఇదే విషయమై ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.

వీరికి మాత్రం వేరు న్యాయమా?

ఇకపోతే న్యాయస్థానాల్లో సంపన్నులు బెయిల్ కోసం అడిగే సాకులు చూస్తుంటే చట్టాల్లో ఉన్న వెసులుబాటులను ఎలా దుర్వినియోగం చెయ్యాలో వీరికి బాగా తెలుస్తోంది అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎనభై శాతం పైచిలుకు అంగవైకల్యం ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా లాంటి బుద్దిజీవుడు నీళ్లు తాగడానికి స్ట్రా కోసం పర్మిషన్ ఇవ్వకపోగా, విచారణ పేరుమీద ఎంతో మంది బుద్ధిజీవులు, ఆదివాసుల విలువైన జీవితాలను కారాగారాల్లోనే ఖర్చు చేయిస్తున్నారు. కానీ అదే న్యాయస్థానాలు ఒకవైపు, బంగారు ఆభరణాలు ధరించే వెసులుబాటులు, పడుకోవడానికి విలాసవంతమైన పరుపు, ఇంటి బోజనాలను తెప్పించుకునే అర్హత కేవలం డబ్బున్న లాయర్లను పెట్టుకుంటే వస్తుందేమో.! లేదంటే రాజకీయ పలుకుబడి ఉన్నోళ్లకు, ఆర్ధిక నేరగాళ్లకు మాత్రమే న్యాయస్థానాలు కల్పిస్తాయేమో.!!

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను ఉద్దేశించి 'సామాన్యులకైనా సీఎం కైనా న్యాయం ఒకటే' అన్నట్లు వ్యాఖ్యానించిది కానీ, వీఐపీల పేరు మీద వీళ్లకు ఉన్న వసతుల్లో కనీసం ఒకటో వంతైనా సామాన్యులకు ఉన్నాయా అనేది ప్రశ్నార్ధకమే..

న్యాయానికి పెరుగుతున్న ఖరీదు!

న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా 5 కోట్ల పైచిలుకు సివిల్, క్రిమినల్ కేసులు పేరుకుపోతుండగా, అందులో కేవలం సివిల్ కేసులే 1.1 కోట్లకు పైగా పెండింగ్ లో ఉండడం చూస్తుంటే న్యాయస్థానాల పనితీరు ప్రశ్నార్థకంగా అనిపించక మానదు. ఈ మధ్య కాలంలో ఒకేసారి 600 మంది న్యాయవాదులు కలిసి సిజేఐకి లేఖ రాస్తూ న్యాయవ్యవస్థను తప్పు పట్టేందుకు మీడియా అనేక కథనాలు రాస్తోంది, వీటివల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని, కోర్టులే ప్రజాస్వామ్యనికి మూలస్తంబాలుగా ఉండేలా చూసి, రాజకీయ ఒత్తిళ్ల నుంచి న్యాయవ్యవస్థను కాపాడుకునే అవసరం ఉందని వాపోయారు. న్యాయం కూడా కాలంతో పాటు ఖరీదు అవ్వడం కాకతాళీయమే అయినప్పటికీ, కోర్టుల్లో సరైన వసతులు కల్పించి, పెద్దమొత్తంలో నియామకాలు చేపట్టి, న్యాయవాదుల్లో కొత్త తరానికి చేయూతనిస్తూ, మనలాంటి ప్రజాస్వామిక దేశంలో పేద ప్రజలకు న్యాయాన్ని తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండేలా చూడడం ప్రభుత్వ బాధ్యత.

-ముఖేష్ సామల

అడ్వకేట్

97039 73946

Advertisement

Next Story