- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిజంగానే బిల్డర్లకు, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాన్ని పడగొట్టేంతా శక్తి ఉందా? బీఆర్ఎస్ నేత వ్యాఖ్యల్లో నిజమెంత?

ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు.. ఇదే సామెత ఇప్పుడు తెలంగాణ రాజకీయానికి సందర్భోచితంగా ఉంటుందేమో? తమకు ప్రయోజనకరంగా లేదనే ఉద్దేశంతో శాసనసభ్యులను కొనుగోలు చేసైనా రాష్ట్రంలో కాంగ్రెస్ బిల్డర్లకు, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాన్ని పడగొట్టేంతా శక్తి ఉందా? కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం ఎంత? బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కోరుతున్నారని, ఆ ఎమ్మెల్యేల కొనుగోలుకు అందుకు అవసరమైన ఖర్చును తాము భరిస్తామని చెబుతున్నారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థపై చర్చకు దారితీశాయి. దేశంలో ఇంత బలహీనమైన వ్యవస్థ అమల్లో ఉందా..? అనే ప్రశ్నను లెవనెత్తాయి.
ఆయన ఈ వ్యాఖ్యలను సరిచేసుకునే క్రమంలో మళ్లీ డబ్బు గురించే ప్రస్తావించారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదని, తమ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి రియల్ ఎస్టేట్ వాళ్లు, వ్యాపారవేత్తలు అవసరమైన డబ్బు సాయాన్ని చేస్తామంటున్నారని ప్రభాకర్ రెడ్డి సర్దుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఈ సమర్థించుకుంటున్న వ్యాఖ్యల్లోనూ తాము అధికారంలోకి రావడానికి రియల్ ఎస్టేట్ మాఫియా సాయం చేస్తుంది అనే కదా అర్థం. కానీ ఎందుకోసం? వారికి కావాల్సిన రాయితీలు, అనుమతులు, నిబంధనలు, మార్గదర్శకాలను మార్చడానికి, వారికి అనుకూలంగా వ్యవహరించడం కోసమేనా? ఇక్కడ ప్రజలు, ప్రజల ప్రయోజనాలు అవసరం లేదా?
ఈ వర్గాలే ప్రభుత్వాన్ని కూల్చితే..
రాజకీయాలను శాసించేది ప్రజలు కాదు, ప్రజా సమస్యలు కాదు.. డబ్బున్న వారేనా..? ఈ ప్రచారాన్ని వ్యాప్తిలో పెట్టడమే రియల్ ఎస్టేట్ మాఫియా లక్ష్యమా..? అందుకేనా ఒక ఎమ్మెల్యేతో మిగిలిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయవచ్చు అని చెప్పిం చారా..? ఇది తన తోటి ప్రజాప్రతినిధులను అవమానించడమా, లేక నిజంగానే ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారా..? డబ్బున్న వర్గాలు ప్రభుత్వాలను కూల్చితే ఇక ఎన్నికలు ఎందుకు..? ఎన్నికల కమిషన్ ఎందుకు..? ఇంత వ్యయప్రయాసాలు అవసరమా..? రాజరిక వ్యవస్థ వైపు పోతే సరిపోతుంది కదా.. రాజరికం మాదిరిగా ఒకే కుటుంబం పాలించవచ్చు కదా. మన దేశంలో వందల కోట్లు ఆస్తి ఉన్న వ్యక్తి ఓటు విలువ, రోజుకు తినడానికి తిండి లేని ఓటు విలువ ఒకటే. దేశంలో పీహెచ్‌డీలు చేసిన వారి ఓటు విలువ, నిరక్ష్యరాసుల ఓటు విలువ ఒకటే. అంతటి ప్రాధాన్యతను ఇచ్చింది ఓటు హక్కు. కానీ దాని విలువను తీసే విధంగా ప్రభుత్వాలను పడగొట్టడం అంటే సాహసం చేయడమే. అవసరమైతే దీనిపై ప్రజలు తిరుగుబాటుకు సిద్దంగా ఉంటారు. ప్రజలు ఎన్ను కున్న ప్రభుత్వాలను కూల్చినప్పుడు తిరుగుబాటు చేసి తమకు ఇష్టమైన ప్రభుత్వాలను తిరిగి అధికారంలోకి తెచ్చుకున్న ఘనత భారతదేశానిది.
డబ్బుతో.. రాజకీయం సాధ్యమా?
రాజకీయం చేయడానికి డబ్బు కావాలి.. కానీ డబ్బుతోనే రాజకీయం చేయడం సాధ్యం కాదు. డబ్బుతోనే రాజకీయం చేయవచ్చు అనుకుంటే దేశానికి ప్రధానులుగా మొరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్, వాజ్‌పేయి, నరేంద్ర మోడీ లాంటి వారు ప్రధానులు కాలేరు. డబ్బే ప్రధానం అనుకుంటే అంబానీల కుటుంబం, ఆదానీ లాంటి మరికొందరు డబ్బున్న కుటుంబాలే ప్రధాని, ముఖ్యమంత్రి పదవుల్లో కూర్చునే వారు. కానీ అలా జరగలేదు. అదే ప్రజాస్వామ్యం గొప్పతనం. ఇక్కడ డబ్బుది నామమాత్రపు పాత్ర మాత్రమే. ఇప్పటికే డబ్బుతోనే రాజకీయం చేయడం కుదరదని, అనేక ఎన్నికల్లో నిరూపితమైంది. డబ్బున్న అనేక మంది డబ్బు లేని, అతి తక్కువ డబ్బున్న అభ్యర్థుల చేతిలో ఓటమిపాలయ్యారు. డబ్బుతో ఏదైనా సాధ్యం అనుకుంటే.. ముఖ్యమంత్రులు, మంత్రుల చుట్టూ తమ పనుల కోసం పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఎందుకు తిరుగుతారు..? వారే అధికార పీఠం ఎక్కలేరా..? డబ్బుతోనే అధికారం సాధ్యం కాదనేది అనేక ఉదంతాలు చెప్పాయి.
ఈ వ్యాఖ్యలపై విచారణ అవసరం!
ప్రజల ఓటుకు విశ్వసనీయత ఎక్కువ. ప్రజా ప్రతినిధులు ప్రజలకే బాధ్యులు, ప్రజా ప్రతినిధులకు ప్రవర్తన నియామళి ఉంది. ఇలాంటి డబ్బు వ్యవహారాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. తోటి ప్రజా ప్రతినిధులను డబ్బుతో కొనవచ్చు అని ఆ ప్రజా ప్రతినిధి చెప్పాడంటే తొటి వారిని అవమానపర్చడమే కదా. ఐపీఎల్‌లో ఆటగాళ్ల రేట్లు పలికినట్లుగా, ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్)లో ఎమ్మెల్యేల రేటు ఎంత..? రియల్ ఎస్టేట్ మాఫియా ప్రభుత్వాలను కూల్చే స్థాయికి, తమకు అనుకూలమైన పార్టీలను అధికారంలోకి తీసువచ్చే స్థాయికి ఎదిగిందంటే ఆ మాఫియా దగ్గర ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఆ డబ్బుంతా నిబంధనల ప్రకారమే సంపాదించిందా..? లేక అక్రమ మార్గంలో సంపాదించిందా..? అనేది తెలియాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు నిజంగా ఎవరి చేతిలో ఉన్నాయి? రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలోనేనా లేక ప్రజల చేతులోనా..? దీనిపై సమ గ్ర విచారణ జరగకపోతే ప్రజల్లో అనేక ప్రశ్నలు ఉత్పన్నమతాయి. కాబట్టి ప్రభుత్వం ఈ అంశంపై విచారణ జరిపించాలి. చివరగా ఈ దేశంలో పలు సందర్భాల్లో.. ఎమ్మెల్యేలు పార్టీ మారడం ద్వారా ఉన్న ప్రభుత్వాలు కూలాయి. కొత్త ప్రభుత్వాలు వచ్చాయి కానీ అవి ఒక్క డబ్బు కోసం కాదు. దానికి ఇతరత్రా ఎన్నో కారణాలు ఉన్నాయి. కేవలం డబ్బుల కోసమే ప్రభుత్వాలు మారిన సందర్భాలు లేవనే చెప్పవచ్చు.
నెలకుర్తి శ్రీనివాస రెడ్డి,
దిశ బ్యూరో చీఫ్
98488 85505