ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేది ఎప్పుడు?

by Ravi |   ( Updated:2024-07-13 01:15:26.0  )
ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేది ఎప్పుడు?
X

రైతాంగ సాయుధ పోరాటం, భూదానోద్యమం లాంటి గొప్ప చరిత్ర గల తెలంగాణలో కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు అనే చందంగా భూ సమస్యలు కేసీఆర్ మానస పుత్రిక ధరణి పోర్టల్ ద్వారా పెరిగాయి. దొరలు, భూస్వాముల గడీలు, పటేల్ పట్వారీ వ్యవస్థ నుండి విముక్తి పొందిన తెలంగాణలో ధరణి పోర్టల్ రైతుల సమస్యలను తీర్చలేదు. నీళ్లు - నిధులు - నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిజాయితీగా పాలించాల్సిన పాలకులు ధరణి పోర్టల్ ద్వారా భూ కుంభకోణాలకు తెర లేపారు.

ధరణిని నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (NIC) లాంటి ప్రభుత్వ వెబ్సైట్‌లను నడిపే వాటికి కాకుండా డూడూ బసవన్నలా తలూపే ప్రైవేట్ కంపెనీ చేతికి ధరణి పోర్టల్‌ను అప్పజెప్పారు. నమస్తే తెలంగాణలో ధర్మగంట పేరుతో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్ఓ)లకు అవినీతి అధికారులు అని ముద్ర వేసి రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి గ్రామాల్లో ప్రజలకు దూరం చేశారు. 2018లో ల్యాండ్ రికార్డు అప్డేట్ ప్రోగ్రామ్ (LRUP) ద్వారా అనేక అక్రమాలకు తెరలేపి కబ్జాదారుని కాలం ఎత్తివేసి ల్యాండ్ సీలింగ్ చట్టం లాంటి అనేక భూ చట్టాలను తుంగలో తొక్కి తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ చట్టం 2020 తీసుకొచ్చి దొరలకు, భూస్వాములకు మళ్లీ వేల ఎకరాలు పట్టా పాస్‌బుక్‌లు ఇచ్చి అమాయక రైతుల వేల ఎకరాల అసైన్డ్ భూములు కొల్లగొట్టారు. అలా అక్రమంగా కొల్లగొట్టిన భూములను సక్రమం చేయడానికి అదనంగా రైతుబంధు పేరున హక్కులు కల్పించారు. తెలంగాణలో నిజాం సర్వే చేసిన భూములే ఇప్పటికీ ఆధారాలు కాబట్టి మళ్ళీ సమగ్ర భూ సర్వే చేసి గెట్టు పంచాయతీ లేకుండా చేస్తా అని చెప్పినవారు డిజిటల్ ల్యాండ్ సర్వేను అటక ఎక్కించారు.

ఆ మాటే ప్రభుత్వాన్ని కూల్చేసింది

ధరణి పోర్టల్ వలన అనేక సమస్యలు పెరిగాయి ఉదాహరణ విస్తీర్ణంలో తేడా, సర్వే నంబర్ మిస్సింగ్ వంటివి. ఇలాంటి తప్పుల వలన ఉన్న విస్తీర్ణం కంటే రికార్డులలో విస్తీర్ణం పెరిగింది. లేఔట్లు చేసిన భూములు కూడా మళ్లీ వ్యవసాయ భూములుగా మారాయి. లేఅవుట్లకు కూడా రైతుబంధు ఇప్పించి అనేక వివాదాలకు ఆజ్యం పోసిన ఘనత ధరణి పోర్టల్‌ది. భూ సంస్కరణలలో భాగంగా భూ రికార్డుల సాంకేతికత ఆహ్వానించదగ్గదే కానీ 33 రకాల లోపభూయిష్టమైన మాడ్యూల్స్ ద్వారా రైతులను తహసీల్దార్ కార్యాలయాల నుండి కలెక్టర్ కార్యాలయం, సీసీఎల్ఏ వరకు చెప్పులు అరిగేలా తిరిగినా సమస్యలు పరిష్కారం కాకుండా రైతులను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టిన ఘనత ధరణి పోర్టల్‌ది. గతంలో రేవంత్ రెడ్డి 'మేము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతాము, సమగ్ర భూ సర్వే చేసి గెట్టు పంచాయతీ లేని తెలంగాణ నిర్మిస్తాం' అనడం కొంత మానసికంగా ఊరట కలిగించింది. ఆ మాటనే ఓట్ల రూపంలో గత ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేలా తోడ్పడింది.

ధరణి కమిటీ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి ఆధ్వర్యంలో భూ చట్టాల న్యాయ నిపుణులు భూమి సునీల్, కేసీఆర్ మానస పుత్రిక ధరణి పోర్టల్ తప్పుల తడక అని వ్యతిరేకించిన ఏకైక రెవెన్యూ అధికారి తహసీల్దార్ లచ్చిరెడ్డి, రెవిన్యూ చట్టాల నిపుణుల ఆధ్వర్యంలో ధరణి పోర్టల్‌కు శస్త్ర చికిత్స చేసే బాధ్యత అప్పగించారు. ఈ కమిటీ అనేక సూచనలు చేసినా ఇప్పటివరకు భూ సమస్యల పరిష్కారంలో ఆశించినంత ఫలితాలు రావడం లేదు. దానికి కారణం గత ప్రభుత్వం తెచ్చిన తలా తోక లేని కొత్త రెవెన్యూ చట్టమే. అభివృద్ధి చెందిన దేశాలలో అమలవుతున్న, కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ సూచించిన టైటిల్ గ్యారంటీ లాంటి చట్టం తెచ్చి ఉంటే తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉండేవి కావు అని భూ చట్టాల న్యాయ నిపుణుల అభిప్రాయం.

ధరణి పోర్టల్‌పై ప్రజాగ్రహం

అందుకే ప్రస్తుతం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ముఖ్యంగా రైతులు ఈ ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో ఎప్పుడు కలుపుతారు అని ఎదురుచూస్తున్నారు. సమగ్ర భూ సర్వే చేసి పటిష్టమైన రెవెన్యూ చట్టం తీసుకొచ్చి 2014 జూన్ 2కి ముందు ఉన్న ప్రభుత్వ భూములు (నోషన్ ఖాతా, అసైన్డ్), సాదా బై నామ సమస్యలు, GO 59 రెగ్యులరైజేషన్ ద్వారా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల పరిరక్షణతోపాటు రెవెన్యూ వ్యవస్థకు పునర్వైభవం తెచ్చి భూ సమస్య లేని తెలంగాణ రాష్ట్రంగా మొత్తం దేశంలో 28 రాష్ట్రాలకు ఒకవైపు రైతుల భూములు ఇంకోవైపు ప్రభుత్వ భూములు భద్రంగా ఉండే ఆదర్శ తెలంగాణను నిర్మిస్తారని ప్రస్తుత ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వ చర్యలు కూడా ఆ దిశగా ఉంటాయని ఆశిస్తున్నారు.

బందెల సురేందర్ రెడ్డి,

మాజీ సైనికుడు

83749 72210

Advertisement

Next Story

Most Viewed