- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నదాతలకు కరువైన భరోసా
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. వ్యవసాయం దండుగ అనే గత పరిస్థితులను సమూలంగా మార్చి వ్యవసాయాన్ని పండుగ చేస్తూ రైతన్నలకు అడుగడుగునా వెన్నుదన్నుగా నిలుస్తున్నామని, 53 నెలల్లో రూ.1,75,007 కోట్లు రైతన్నలకు సాయం అందించామని, వైఎస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ సాయాన్ని పుట్టపర్తిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని దిన పత్రికలలో ఏపీ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. ప్రభుత్వ ప్రకటన అంటే దానికి గణాంక ఆధారాలు ఉండాలి. కానీ బాధ్యత లేకుండా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా అర్ధ సత్యాలతో ప్రకటనలు ఇస్తూ ప్రజా ధనాన్ని దారుణంగా దుర్వినియోగం చేస్తోంది. నిజానికి రాష్ట్రంలో రైతుల పరిస్థితి గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు మెరుగయ్యిందా? వ్యవసాయం దండుగ అనే పరిస్థితి నుండి పండుగగా మారిందా? జగనన్న ప్రభుత్వం రైతన్నలకు అందించిన మొత్తం సాయం రూ.1,75,007 కోట్లు అంటూ గోబెల్స్ ప్రకటన.
కేంద్రం డబ్బుతో సొంత ప్రచారం
రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం, ఇతర పంటలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో కొనుగోలు చేసి దానిని తాను రైతులకు చేసిన ఆర్థిక సహాయం కింద చూపడానికి కనీసం సంకోచించని పాలకులను ఏమనాలో అర్థం కావడం లేదు. పంటల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.67,566 కోట్లు రైతులకు సాయంగా ప్రభుత్వం పేర్కొన్నదంటే నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులను కొని డబ్బు చెల్లించినా సాయమేననడం దివాలాకోరు విధానం. రాష్ట్రంలో మొత్తం 79 లక్షల 50 వేల 844 రైతు ఖాతాలు ఉండగా, ఎన్నికల ముందు 64.06 లక్షల మందికి రైతులకు, 16 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా వర్తింపచేస్తానని హామీ ఇచ్చిన వై ఎస్ జగన్ ప్రస్తుతం 53 లక్షల 53 వేల మంది రైతులకు, 1,58,123 మంది కౌలు రైతులకు రైతు భరోసా వర్తింపజేసి, తర్వాత 20-21 లో కౌలు రైతులను 1,40,000 లకు కుదించడం ( ఆర్‌టిఐ సమాచారం) ఏవిధమైన నిబద్ధతో ఆయనే సెలవీయాలి. ఎన్నికల సమయంలో కౌలు రైతులందరిని ఆదుకుంటామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి అధికారం చేపట్టాక కౌలు రైతులలో కులాలు ఎంచి ఎస్సీ,ఎస్టీ,బీసీ ,మైనార్టీ, ఆర్ఓఎఫ్ఆర్ రైతులకే భరోసా పరిమితం చేసి, వారిలో కూడా కౌలు కార్డులు లేవంటూ 80 శాతం మందికి మొండిచేయి చూపిస్తున్నారు.
బటన్ నొక్కుడు లెక్కల్లో నిజమెంత?
ఇక ‘రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం’ క్రింద బటన్ నొక్కి 53 నెలల్లో 53 లక్షల 53 వేల మంది రైతన్నలకు బదిలీ చేశామంటున్న మొత్తం రూ.33,210/- కోట్లలో సుమారు రూ.18 వేల కోట్లు మాత్రమే (అందులో దాదాపు రూ.5 వేల కోట్లు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నుంచి ఖర్చు) రాష్ట్ర నిధులు. కేంద్రం నేరుగా రైతు ఖాతాల్లో జమ చేసిన రూ.15 వేల కోట్లు (42%) పీఎం కిసాన్ నిధులను కూడా వెరపు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది. గత చంద్రబాబు హయాంలో రైతు రుణ ఉపశమనం క్రింద రూ.15,700 కోట్లు, చివరి ఏడాదిలో అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా ఇచ్చిన రూ.5 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.21 వేల కోట్లు ప్రభుత్వం రైతులకు సాయం అందించింది. కానీ 2019 లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇవ్వవలసిన 4-5 విడతల రుణమాఫీ పథకాన్ని రద్దు చేసి రైతాంగానికి తీరని ద్రోహం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.20 వేల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన జగన్ రెడ్డి, తన ప్రభుత్వంలో దానిని రూ.15 వేలకు తగ్గించారు. దానా దీనా మొత్తం పంటల కొనుగోలు, పీఎం కిసాన్ సంబంధించిన రూ.82,566 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదనేది సుస్పష్టం.
వ్యవసాయం.. పండగా, దండగా?
తన హయాంలో వ్యవసాయం పండుగగా మారిందని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి మరి తన పాలనలో ప్రస్తుత ఖరీఫ్‌లో 85.97 లక్షల ఎకరాల్లో పంట వేయాల్సి ఉంటే 60.22 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితం కావడానికి కారణం చెప్పగలరా? 25.75 లక్షల ఎకరాల్లో (30 శాతం మేర) పంట వేయకపోవడానికి కారణం ఏమిటి? పంట సాగు ఇంత భారీ స్థాయిలో తగ్గడం వలన పంట ఉత్పత్తి, రైతు ఆదాయం తగ్గడమే కాక, రైతు కూలీలకు కోట్ల పని దినాలు తగ్గిపోతాయి. ఆంధ్రప్రదేశ్‌లో సాగుభూమి 2 కోట్ల 10 వేల ఎకరాలుంటే తెలంగాణలో కోటి 49 లక్షల 39 వేల ఎకరాలు మాత్రమే. కానీ 2019-20లో 1.78 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసిన తెలంగాణా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి ఇప్పుడు 2.71 కోట్ల టన్నులకు పెరిగితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గుతున్న పరిస్థితికి కారణం ఏమిటనేది అంచనా వేయకుండా ప్రభుత్వం స్కోత్కర్ష చేసుకుంటే ప్రయోజనం శూన్యం. ఇక ఏపీలో రైతు భరోసా కేంద్రాల పనితీరు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గతేడాది తెలంగాణలో 1.31 కోట్ల టన్నుల ధాన్యం సేకరించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన 1.29 కోట్ల టన్నులలో 49.54 లక్షల టన్నుల (39%) ధాన్యం మాత్రమే సేకరించింది. మిగిలిన 79.46 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు అయినకాడికి మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి.
రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానం
ధాన్యం ఉత్పత్తి, సేకరణలో నాలుగేళ్ల క్రితం వరకు ముందంజలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వెనుకబడి పోవడానికి ప్రస్తుత ప్రభుత్వ విధానాలే కారణం. కేంద్ర ప్రభుత్వ ధరల నిర్ణాయక కమిటీ (సిఏసిపి) ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఒక మెట్రిక్ టన్నుపై ఎంఎస్‌పి రూ. 2,183 కన్నా రూ. 230 తక్కువకు అమ్ముకున్నారని తెలిపింది. ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.3000 కోట్లు, ప్రకృతి విపత్తుల సహాయ నిధి కోసం రూ.4000 కోట్లు కేటాయిస్తానంటూ ఇచ్చిన వాగ్దానాలు గాలిలో కలిపిన ‘రైతుల తరఫున నిలబడిన బిడ్డ జగన్’. ఖరీఫ్, రబీలో కలిపి ఎకరాకు 70 బస్తాలు దిగుబడి వస్తే మద్దతు ధర లేక బస్తాకు రూ. 230 తక్కువకు అమ్ముకున్న రైతుకు ఎకరాకు రూ.16 వేలు నష్టం వాటిల్లుతోంది. రెండు ఎకరాలున్న సన్న చిన్నకారు రైతుకు ఏడాదికి రూ.32 వేలు, జగన్ హయాం ఐదేళ్లలో రూ.1,60,000/- నష్టం. ప్రభుత్వ ప్రకటనలోనే పేర్కొన్న విధంగా రైతు భరోసా - పీఎం కిసాన్ ద్వారా రూ.65.500 లబ్ది జరిగినా, అది పోను రెండెకరాలున్న సన్నకారు రైతుకు జగన్ ప్రభుత్వంలో వాటిల్లిన నష్టం రూ.94.500. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గిందో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానం, రైతు ఆత్మహత్యల్లో మూడవ స్థానంలో ఎందుకున్నాం అనే ఆత్మవిమర్శ పాలకులు చేసుకోవాలి.
పడకేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు
పంటలకు గిట్టుబాటు ధర, ఇన్ పుట్ సబ్సిడీ, పంటల బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, సున్నా వడ్డీ రుణాలు, డ్రిప్ ఇరిగేషన్ వంటి పథకాల అమలులో చిత్తశుద్ధి లేకపోవడం, ఈ - క్రాప్ నమోదులో నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దాదాపు రూ. 31 వేల కోట్లు, అంటే ఒక్కొక్క రైతు రూ. 2.53 లక్షలు నష్టపోయారు. వ్యవసాయ యాంత్రీకరణ పధకాలను నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ ఎరువుల పంపిణీ పధకాలను సైతం అటకెక్కించింది. ఇక ప్రభుత్వం చెబుతున్న విద్యుత్ సబ్సిడీ కన్నా ఎనిమిది సార్లు వడ్డించిన విద్యుత్ ఛార్జీలు ఎక్కువ. అసలే అప్పులతో సతమతమౌతున్న రైతుల వెన్ను విరిచేలా, కేంద్రం ఇచ్చే అప్పుల్లో రెండు శాతం అదనం కోసం, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తును ఎత్తివేసేందుకు జి ఓ నెం.22 తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు రూ.72 వేల కోట్ల ఖర్చుతో 23 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి 4.34 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 27.67 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగితే, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రివర్స్ టెండరింగ్ వల్ల ఆంధ్రుల జీవనాడి పోలవరం పడకేసింది, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. ముందు చూపుతో తెలుగుదేశం హయాంలో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ప్రస్తుత వర్షాభావ పరిస్థితిలో కృష్ణా డెల్టాకు వరంగా మారింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి రైతాంగానికి శాపంలా పరిణమించి రైతులు, ఆక్వా రైతులు క్రాప్ హాలిడే దిశగా పయనిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 93.2 శాతం రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయని, ఒక్కో కుటుంబంపై సరాసరి రూ.2,45,554 అప్పు ఉందని జాతీయ గణాంకాలు వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సాగు వ్యయం ఏడాదికేడాది పెరిగిపోవడం, ప్రభుత్వ విధానాల వల్ల గిట్టుబాటు ధర లభించకపోవడంతో అంచనాలకు మించి పంట దిగుబడులు వచ్చినప్పటికీ నికరంగా రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయం పండుగగా మారిందంటూ మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మభ్య పెట్టడం కాకుండా చిత్తశుద్ధితో రైతు సమస్యల పరిష్కారం కోసం, అన్నదాతల మోములో ఆనందం వెల్లివిరియడం కోసం ప్రభుత్వం కృషి చేయాలి.
లింగమనేని శివరామప్రసాద్
79813 20543