- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దావోస్ సమావేశాలు ప్రపంచ దేశాలకు "ఉచ్చు"

దావోస్ సమావేశాల్లో పాల్గొనే ప్రపంచ దేశాల నాయకులు తమ పెట్టుబడులకు నూతన మార్గాలు, ప్రదేశాలను, అవకాశాలను వెతుక్కుంటారు. అంతకు ముందే ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా ఊదరగొట్టిన ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పదాలను అందమైన బ్రోచర్‌లలో ప్రచురించడంతో అవి తీపి కోటింగ్ చేసిన చేదు మాత్రల్లాగే ఉంటాయి. ఇక్కడ మనం ఆలోచించవలసింది పెట్టుబడి ప్రాథమిక లక్ష్యం లాభాలు ఆర్జించడం. కానీ దీన్ని తలకిందులు చేసి దేశాల అభివృద్ధిగా ప్రచారం చేస్తుంటారు. పైగా అభివృద్ధి చెందుతున్న దేశాలలోకి థర్డ్ గ్రేడ్ టెక్నాలజీ తరలింపు వలన పర్యావరణం సమస్య తీవ్రంగా ఉంటుంది. ప్రపంచ దేశాలకు ఇది శోచనీయమైన విషయం.
దావోస్ సమావేశాలను వరల్డ్ ఎకానమీ ఫోరమ్(W.E.F), ప్రభుత్వేతర సంస్థలు(N.G.O) సంయుక్తంగా 1971 జనవరి 24న స్విట్జర్లాండ్‌లో స్థాపించాయి. గత ఐదున్నర దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం జనవరి చివరి వారంలో స్విట్జర్లాండ్‌లోని దావోస్ ప్రాంతంలో గ్లోబల్ ఎజెండాతో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ వస్తున్నది. అయితే ఇక్కడ ప్రభుత్వ ప్రైవేటు సహకారం కోసం లాబీయింగ్ చేయడం జరుగుతుంటుంది. ఈ సంవత్సరం జనవరి 20 నుండి 24 వరకు దావోస్‌లో ఈ సభలు జరుగుతున్నాయి.
నుమాయిష్‌ను తలపించే సభ
ప్రపంచ స్వరూప స్వభావాలు ఆధునిక యుగం నుంచి అత్యాధునిక యుగంలోకి మారుతున్న అవసరాల సంక్షోభ సంధి కాలంలో మిగతా సంస్థల కన్నా మెరుగైన ఎజెండాతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏర్పడినది. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, చర్చనీయమైన అంశాలను దావోస్ సభలలో చేర్చడం జరుగుతుంది. ఈ సమావేశాల లక్ష్యాలు కూడా ప్రపంచ ప్రాంతీయ, పరిశ్రమల ఎజెండాలను రూపొందించడం కోసమే. వ్యాపార, రాజకీయ ప్రతినిధులను విద్యావేత్తలను, సమాజంలోని ఇతర నాయకులను ఈ సమావేశాలలో భాగస్వాములు అయ్యేలా చూడడంతో ఈ సమావేశాలను అంతర్జాతీయ వర్తమాన స్థితిని మరింత మెరుగుపరచడంగా అభివర్ణిస్తారు. అందువలన ఈ సభలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్లను ఆయా దేశాల రాజకీయ ప్రతినిధులను ఆకర్షిస్తుంటాయి. అప్పటికే పనిచేస్తున్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థల కార్యకలాపాలలో కేవలం ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉండేవి. అంటే అప్పు అవసరం ఉన్న దేశానికి ఈ ఆర్థిక సహాయం చేసే సంస్థలకు మధ్య ఒడంబడికలు మాత్రమే జరిగేవి. అందుకు భిన్నంగా స్విట్జర్లాండ్‌లో వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, విభిన్న ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల యజమానులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొనేలా సమావేశాల ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలను ఈ సంస్థలు తీసుకుంటాయి. ఈ సమావేశాల్లో ప్రధాన భాగస్వామ్యం అభివృద్ధి చెందిన దేశాలదే ఉంటుంది. వీటి ప్రాథమిక, మౌలిక, స్వరూప, స్వభావాలు, గమ్యాలు, లక్ష్యాలు, తీరుతెన్నులు అన్నీ ఆర్థిక లావాదేవీలు గానే ఉన్నాయి. అయితే ఈ సమావేశంలో పాల్గొనే ప్రతినిధులందరూ.. ఎవరి ప్రయాణాల ఖర్చులు వారే భరించాల్సి ఉంటుంది. ప్రవేశ, ఇతర వ్యయాల రుసుములు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒక విధంగా ఇది మన హైదరాబాద్ "నుమాయిస్"ను తలపిస్తుంది. ఈ సమావేశ ఆహ్వానాలను ఆ స్థానిక మీడియాలో ప్రత్యేకంగా చెప్పుకుంటుంటారు.
సంపద పోగేసుకోవడం కోసం..
స్థూలంగా ఈ సమావేశాలు తమ పెట్టుబడులకు నూతన మార్గాల ప్రదేశాల అవకాశాలను వెతుక్కుంటాయి. ఆయా దేశాల ప్రభుత్వ ప్రతినిధులు తమ తమ ప్రాంతాలలో పెట్టుబడి పెడితే అనేక రాయితీలతో సౌకర్యాలను సమకూరుస్తామని వివిధ కార్పొరేట్ సంస్థ లను ఆహ్వానిస్తుంటాయి. తాము కల్పించే సౌకర్యాలను బ్రోచర్ల ద్వారా సమావేశాల ద్వారా ప్రైవేటు ప్రభుత్వ ప్రతినిధుల మధ్య చర్చలు జరుపుతుంటారు. కొంచెం అటూ ఇటుగా షరతులు ఆమోదం అయితే ఈ మేరకు అవగాహన ఒప్పందాల(MOU)ను చేతులు మార్చుకుంటారు. ఈ తరుణంలో ఆలోచన పరులు గమనించవలసిన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అభివృద్ధి చెందిన దేశాల అధినేతలు ఆయా దేశాల మేధావులతో, విషయ నిపుణులతో అనేక చర్చలు జరిపి ఆలోచనలు చేసి అన్నింటిని క్రోడీకరించుకొని ఒక స్థిర నిర్ణయానికి వచ్చాయి. సంపదను పోగేసుకోవడం గురించి మాత్రమే కదా యుద్ధాలు చేసింది. అందు కోసం ప్రాణ నష్టం లేని రక్తరహిత విధానంతో ఒక ప్రణాళికను రచించుకున్నాయి. వాటి ఫలితంగానే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, అంతర్జాతీయ ఆర్థిక ఫోరమ్‌లు ఏర్పాటు చేసి అభివృద్ధి చెందు తున్న దేశాలను తమ ఉత్పత్తి స్థావరాలుగా మార్చుకొని అక్కడి నుండి ఇతర దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. తద్వారా తక్కువ కూలీకి మానవ వనరు లభించడమే కాకుండా ఆయా ప్రాంతాలలోని సహజ వనరుల పైన అధికారాన్ని చేజిక్కించుకుంటాయి. కాదు కూడదని ఆయా దేశాల ప్రభుత్వ ప్రతినిధులు వ్యతిరేకిస్తే అగ్రరాజ్యం అనేక రకాల ఒత్తిడిలు తెచ్చి షరతులను ఒప్పుకునేలా చేస్తుంటాయి.
ప్రపంచ స్థితిని మెరుగుపరచడానికి అంటూ..
అగ్రరాజ్యాలు ఆయుధాలను ఉత్పత్తి చేయడమే కాకుండా, యుద్ధాలను కూడా ఉత్పత్తి చేయడం ప్రారంభించడంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడడానికి మూలకారణం అయ్యాయి. ప్రస్తుత ప్రపంచ దేశాల దుస్థితికి తిరిగి అభివృద్ధి చెందిన దేశాలే.. ఒక విధంగా కారణభూతమని చెప్పవలసి వస్తున్నది. ఎందుకంటే ప్రపంచవ్యాపంగా పరిశ్రమల ఎజెండాలను రూపొందించడానికి వ్యాపార, రాజకీయ నాయకులను, విద్యావేత్తలను, సమాజంలోని ఇతర రంగాలలో నిపుణులను దావోస్ సమావేశాలలో పాల్గొనేలా చేయడం ద్వారా ప్రపంచ స్థితిని మరింత మెరుగుపరచడంగా వ్యాఖ్యానిస్తారు. బహుళ జాతి సంస్థల ప్రాజెక్టులకు, వారి కార్యకలాపాలకు సహకరించడానికి ప్రైవేటు ప్రభుత్వాలకు ఒక వేదికను ఏర్పాటు చేసి దావోస్ సభలు అందుబాటులో ఉంచుతున్నాయి. ఇక్కడ ఓ విషయం తెలియజేస్తాను.. ఒకప్పుడు అరబ్బులు పెట్రో డాలర్స్‌ను బ్యాంకుల నుండి విత్ డ్రా చేసుకుంటే అమెరికా ఆర్థిక రంగం తలకిందులై పోయేది. అయితే గత రెండు దశాబ్దాల కాలంలో అగ్ర రాజ్యం జిత్తుల వ్యూహాల వలన అరబ్బు దేశాల ప్రతినిధులు నేడు ఆయా ప్రపంచ ఆర్థిక సంస్థలపై ఆధారపడవలసిన దయనీయ స్థితిలోకి నెట్టివేయబడ్డాయి.
మేధావులు సమాజాన్ని అప్రమత్తం చేయాలి!
2025 వార్షిక సమావేశం మేధో యుగంలో సహకారంపై కేంద్రీకృతమై ఉన్నది. ఇప్పుడు గొప్ప ప్రమా దంతో పాటు గొప్ప అవకాశాలు గల కాలంలో జీవిస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ వాతావరణ కాలుష్యం తదితరాలు తగ్గించడానికి చర్చలు తావిస్తాయని ఈ సంవత్సరం దావోస్ సభలు చెబుతున్నాయి. అయితే, నాలుగు దశాబ్దాల నుండి నూతన పదాలు మన ఎరుకలోకి వస్తున్నాయి. అప్పు అభివృద్ధికి చిహ్నమని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ డెవలప్మెంట్ తదితర సాంకేతిక కొత్త పద బంధా లను తరచుగా వింటున్నాం. ఇందులో భాగంగా గ్యారంటీ వారంటీ లేని సేవల రంగం విస్తరిస్తుంటుంది. వీటివల్ల సమాజం, పర్యావరణం మును పెన్నడూ లేనంత విధ్వంసానికి లోనవ్వడం జరుగుతూనే వుంది. ఈ తరహా అభివృద్ధి నమూనాలో ప్రజల మధ్య, దేశాల మధ్య పూడ్చలేని అగాథాలు, అంతరాలు, అసమానతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మాన వ సంబంధాల విచ్ఛిన్నత కొనసాగుతూనే ఉన్నది. అభివృద్ధి చెందిన దేశాలు పన్నిన ఈ పెట్టుబడి మయసభ "ఉచ్చు" స్థితిని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్న ఆలోచనపరులు మేధావులు ఆయా దేశాల బాధిత సమాజాలను అప్రమత్తం చేయడమే కాకుండా మేల్కొల్పాల్సిన అవసరం ఎంతయినా ఉన్నది.
-జూకంటి జగన్నాథం,
కవి, రచయిత
94410 78095