మిడిల్ క్లాస్ పై 'క్రెడిట్'నైఫ్​

by Ravi |   ( Updated:2022-09-03 15:19:41.0  )
మిడిల్ క్లాస్ పై క్రెడిట్నైఫ్​
X

ఓ రోజు బ్యాంకు రికవరీ సభ్యుల బృందం ఇంటికి రానేవచ్చింది. 'పైసల్ కట్టు' అంటూ నానా దుర్భాషలాడారు. కస్తూరి టెన్షన్ పడుతున్నది. పిల్లలిద్దరూ ఏడుపందుకున్నారు. వారు ఆగడం లేదు. ఒకరు బండి లాగుతున్నారు. కస్తూరి కాళ్లావేళ్లా పడి బతిమిలాడింది. పుస్తెల తాడు అమ్మి రేపటి వరకు కట్టేస్తానన్నా వినలేదు. ఇప్పుడే కావాలని భీష్మించారు. తాళికి పసుపుదారం కట్టుకొని పుస్తెలతాడు తీసి ఇచ్చింది. అమ్మితే రెండు లక్షలు వచ్చాయి. అవి తీసుకుని 'ఇంకా లక్షా 10 వేలు బాకీ. వచ్చే నెల క్లియర్ చేయాలే, లేకుంటే సీరియస్‌గా ఉంటదంటూ' వార్నింగ్ ఇచ్చి వెళ్లారు.

మేశ్‌ది మహబూబ్‌నగర్ జిల్లా. ఓ దినపత్రికలో ఉప సంపాదకుడిగా ఉన్నాడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు. తొలి రోజులలో జిల్లా కేంద్రంలోనే పనిచేశాడు. ఐదు వేల హైక్ రావడం, పిల్లల చదువుల అవసరాలు కలగలిసి రమేశ్‌ను హైదరాబాద్ బాట పట్టించాయి. 15 వేల జీతంతో ప్రారంభమైన రమేశ్​కెరీర్ రూ.35 వేలకు చేరింది. టోలీచౌకీలో ఠికాణా పెట్టాడు. అక్కడి నుంచి బంజారాహిల్స్‌లో ఉన్న పత్రిక కార్యాలయానికి బైక్‌పై వచ్చి వెళ్తుంటాడు. నెలకు ఠంచనుగా రూ.35 వేలు ఖాతాలో పడుతుండటంతో బ్యాంకర్ల నుంచి ఫోన్లు మొదలయ్యాయి. '

సర్ మీకు క్రెడిట్ కార్డు ఆఫర్ ఉంది. జీరో పర్సెంట్ సర్వీస్ చార్జీ, 3 లక్షల వరకు క్రెడిట్ లిమిట్, ప్లీజ్ సర్ తీసుకోండి' అంటూ అవతలి వ్యక్తి బతిమాలసాగాడు. 'ఊరుగాని ఊరొచ్చాం, పిల్లలున్నారు, ఏ రాత్రి ఏ ఆపద వస్తుందో, ఎవరి దగ్గర చేయి చాచుతాం. ఓ క్రెడిట్ కార్డు ఉండటం మంచిదే' అనుకుని ఓకే చెప్పాడు రమేశ్. బ్యాంకు ప్రతినిధులు ఇంటికి వచ్చి చెక్ చేసుకున్నారు. వారం రోజులలో క్రెడిట్ కార్డు కొరియర్‌లో రానే వచ్చింది.

మెల్లమెల్లగా అవసరాలకు

ఎండలు మండుతున్నాయ్. కూలర్ కొందామంటే బడ్జెట్ సపోర్ట్ చేయదు. క్రెడిట్ కార్డుతో కొనేసి 40 రోజులలో కడితే వడ్డీయే ఉండదు అనుకున్నాడు. భార్య కస్తూరిని తీసుకొని షోరూంకు బయల్దేరాడు. షాపులోకి వెళ్లగానే 'క్రెడిట్ కార్డుతో ఏసీ కొనుగోలు చేసిన వారికి ధరలో 10 శాతం రాయితీతో పాటు ఇన్ స్టాలేషన్ ఉచితం' అనే ఓ బోర్డు కనిపించింది. ఏసీ ఎంతుందో కనుక్కొనే ప్రయత్నం చేశాడు. 35 వేలని చెప్పాడు బాయ్. సింఫనీ కూలర్ 12 వేల నుంచి 15 వేల దాకా ఉంది. ఏసీ తీసుకుందాం అనుకున్నాడు. కరెంటు బిల్లు ఎక్కువొస్తుందని భార్య కస్తూరి వారించింది. 'ఏం కాదులే' అంటూ ఏసీ కొనుగోలు చేశాడు.

35 వేల జీతంలో నెల రోజులకే 31,500 కట్టడం సాధ్యం కాదు. నెల గడిచింది. క్రెడిట్ కార్డు బిల్లు ఇంటికి వచ్చింది. అన్ని చార్జీలు కలిపి 34 వేలు బిల్లు. మినిమం పేమెంట్ 3 వేలు. ఇప్పటికిప్పుడు గండం గట్టెక్కలేం. అందుకే రూ. 3 వేలు కట్టాడు. ఆఫీసుకు వెళ్లే క్రమంలో ఓ రోజు రమేశ్​మొబైల్ ఫోన్ పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. '15 వేలలో మంచి ఫోన్ కొనుక్కోండి క్రెడిట్ కార్డు వద్దని' చెప్పింది. సరే అన్నాడు రమేశ్. రాత్రి నిద్ర రాకపోవడంతో భార్య ఫోన్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ల కోసం వెతకసాగాడు. ఐ ఫోన్‌పై ఆఫర్ కనిపించింది. 80 వేల రూపాయల ఫోన్ 49,999 అని ఉంది. ఎగిరి గంతేశాడు. కొనేద్దామని డిసైడ్ అయ్యాడు. క్రెడిట్ కార్డు వాడి కొనేశాడు.

చివరకు అదే ఆధారం

చిన్నా, చితకా అవసరాలకు కూడా క్రెడిట్ కార్డు వాడుతున్నాడు. మినిమం పేమెంట్ చేసుకుంటూ పని నడిపిస్తున్నాడు. ఇంతలోనే కరోనా విలయం ప్రారంభమైంది. పత్రిక యాజమాన్యం రమేశ్‌ను ఉద్యోగంలోంచి తీసేసింది 'అవసరం ఉన్నప్పుడు పిలుస్తాం' అన్నాడు హెచ్‌ఓడీ. అర్ధంతరంగా కొలువు పీకేస్తే ఎలా? అంటూ తొలగించబడిన ఉప సంపాదకులు గొడవకు దిగారు. వారికి సర్ది చెప్పి ఆఫీసు నుంచి పంపించేసింది యాజమాన్యం. గంటలోనే ఇంటికి తిరిగి వచ్చిన రమేశ్‌ను ఏమైంది? అంటూ ఆదుర్దాగా అడిగింది కస్తూరి. 'ఈ రోజు నుంచి కొలువు లేదు. నాతోపాటు చాలా మందిని తీసేశారు' అంటూ సోఫాలో కూలబడిపోయాడు.

పరిస్థితిని భార్యకు వివరంగా చెప్పాడు. ఇద్దరూ అయోమయంలో పడ్డారు. వేరే కొలువు కోసం ప్రయత్నిద్దామంటే లాక్ డౌన్ నడుస్తున్నది. కష్టాలు పెరిగాయి. క్రెడిట్ కార్డే దిక్కయింది. సరుకులు, కూరగాయలు, అన్నింటికీ క్రెడిట్ కార్డునే వాడుతున్నారు. లాక్‌డౌన్ ఎత్తేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన మారటోరియం పీరియడ్ పూర్తయింది. క్రెడిట్ కార్డు మీద ఉన్న లిమిట్ మొత్తం వాడేశాడు రమేశ్. ఇప్పుడు మినిమం పే 20 వేలు కట్టాలి. దానికి తోడు ఇంటి అవసరాలు. అంతలోనే ఫోన్ మోగింది. 'మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నం, మీ పేమెంట్ లాస్ట్ డేట్. ఎందుకు పే చేయలేదు? రోజుకు వెయ్యి రూపాయలు ఫైన్ పడుతుంది, అర్జంటుగా కట్టండి' అన్నాడు అవతలి వ్యక్తి. 'సరే కడ్తాను సర్ మర్చిపోయాను' అన్నాడు రమేశ్. రెండు గంటల వ్యవధిలో ఆరు ఫోన్లు వచ్చాయి.

డెలివరీ బాయ్‌గా చేరి

ఏం సమాధానం చెప్పాలో తెలియక ఫోన్ స్విచాఫ్​ చేశాడు. రికవరీ టీం ఇంటి మీదకు వస్తే పరువేం కాను. భార్యకు చెబితే టెన్షన్ పడుతుంది. కానీ, చెప్పాలి. లేకుంటే ఇంటి మీదకు వస్తే పెద్ద సమస్యే కదా, అనుకున్నాడు. చెప్పేశాడు. 'టెన్షన్ పడకండి, పాప చైన్ ఇస్తాను అమ్మి కట్టేయండి' అన్నది. చైన్ అమ్మేశాడు. 25 వేలు వచ్చాయి. మినిమం పే 20 వేలు కట్టేశాడు. మరో ఐదు వేల రూపాయలు ఖర్చులకు ఉంచుకున్నాడు. 20వ తేదీ దాటుతున్నది. యజమానికి అద్దె అడుగుతున్నాడు. బ్యాంకువాళ్ల దగ్గర ఉన్న నంబర్ తీసేసి కొత్త సిమ్ తీసుకున్నాడు. బావమరిని 50 వేలు అప్పు అడిగాడు. యజమానికి ఇచ్చి ఇల్లు ఖాళీ చేశాడు. కుత్బుల్లాపూర్ వైపు మారిపోయాడు. బ్యాంకువారికి తన అడ్రస్ దొరకడం కష్టమనుకొన్నాడు. స్విగ్గిలో డెలివరీ బాయ్‌గా చేరాడు. రోజూ ఎనిమిది వందల వరకు సంపాదిస్తున్నాడు. 'పూలమ్మిన చోట కట్టెలమ్మాల్సిన దుస్థితి' క్రెడిట్ కార్డు బిల్ మెయిల్‌లో వచ్చింది. ఈసారి మినిమమ్ పే 30 వేలకు చేరింది. 'మన కేం కాదులే, ఆ నంబరు లేదు. అడ్రస్ కాదు' అంటూ ధీమాగా ఉన్నాడు.

ఓ రోజు బ్యాంకు రికవరీ సభ్యుల బృందం ఇంటికి రానేవచ్చింది.'పైసల్ కట్టు' అంటూ నానా దుర్భాషలాడారు. కస్తూరి టెన్షన్ పడుతున్నది. పిల్లలిద్దరూ ఏడుపందుకున్నారు. వారు ఆగడం లేదు. ఒకరు బండి లాగుతున్నారు. కస్తూరి కాళ్లావేళ్లా పడి బతిమిలాడింది. పుస్తెల తాడు అమ్మి రేపటి వరకు కట్టేస్తానన్నా వినలేదు. ఇప్పుడే కావాలని భీష్మించారు. తాళికి పసుపుదారం కట్టుకొని పుస్తెలతాడు తీసి ఇచ్చింది. అమ్మితే రెండు లక్షలు వచ్చాయి. అవి తీసుకుని 'ఇంకా లక్షా 10 వేలు బాకీ. వచ్చే నెల క్లియర్ చేయాలే, లేకుంటే సీరియస్‌గా ఉంటదంటూ' వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. దిక్కుతోచని స్థితిలో ఇల్లు చేరాడు. మరుసటి రోజు ఊరికెళ్లి అక్కకు చెప్పి బోరున ఏడ్చాడు. తమ్ముడికి భరోసా ఇచ్చిందా అక్క. మరుసటి రోజు ఉదయమే బావ రూ. 2 లక్షలు ఇచ్చాడు. లక్షా 10 వేలు కట్టేశాడు. 90 వేలున్నాయి. అందులో బావమరిదికి ఇవ్వాల్సిన 50 వేలను ఇచ్చేశాడు. పిల్లల ఫీజులు కట్టి, కిరాణా సామాన్ తెచ్చాడు. జర్నలిస్టుగా పట్నం వచ్చిన రమేశ్​ ఇప్పుడు స్విగ్గీలో డెలివరీ బాయ్. కాలచక్రం రమేశ్​బతుకును బజారుకీడ్చింది.

ఎంఎస్‌ఎన్ చారి

79950 47580

Advertisement

Next Story