గోప్యతా హక్కు.. అంతా హంబక్కు!

by Ravi |   ( Updated:2023-06-14 23:00:45.0  )
గోప్యతా హక్కు.. అంతా హంబక్కు!
X

ప్రజలకు కరోనా టీకా అందించడానికి ఉపయోగించిన కోవిన్ యాప్ నుండి వ్యక్తుల వివరాలన్నీ లీక్ అయ్యి టెలిగ్రామ్ యాప్‌లో ప్రత్యక్షమయ్యాయన్నది ప్రస్తుతం నడుస్తోన్న వివాదం. అధికారిక ఖాతా నుండే ఇలా వివరాలు బజారులోకి ప్రవహిస్తే సమాచార గోప్యతకు, డేటా రక్షణకు పూచీ ఏమిటన్నది అందరి ఆందోళన. అలా కోవిన్ ద్వారా లీక్ కాలేదు... ఆ వివరాలన్నవి ముందే లీక్ అయి ఉండొచ్చన్నది ప్రభుత్వ వివరణ. ఎలా అయినా సరే ఒకటి మాత్రం నిజం. ప్రస్తుత అంతర్జాల యుగంలో సైబర్ స్పేస్‌లో డాటాకి ఎలాంటి భద్రతా లేదు. ఒక ప్లాట్ ఫామ్ కాకపోతే మరొకటి. ప్రభుత్వానిది కాకపోతే ప్రయివేట్‌ది. ఎలాగోలా వ్యక్తిగత సమాచారం అన్నది రక్షణ, భద్రత లేనిది. ఒకసారి సైబర్ స్పేస్‌లోకి వెళ్లిన సమాచారం వీధిలో ఉన్నట్టే. అయితే అలా జరగకుండా ఉండడానికి ప్రభుత్వం చేయాల్సినదంతా చెయ్యాలి. అనుమతి లేకుండా, ఒకరి సమాచారం వీధిలో పెడితే బాధ్యుల్ని శిక్షించాలి. నియమాలు కఠినతరం చేయాలి. ఆ దిశగా ప్రయత్నాలు వేగంగా జరగడం లేదన్నదే ఆందోళన.

2017లో సుప్రీంకోర్టు వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుకోవడం పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తించింది. అంటే ఆ హక్కుని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ తీర్పు స్ఫూర్తితో డేటా పరిరక్షణ చట్టం ఇప్పటికే అమలులో ఉండాల్సింది. అయితే అలా జరగలేదు. ఐదు సంవత్సరాలు గడుస్తున్నా, సంబంధిత బిల్లు పార్లమెంట్ మెట్లెక్కలేదు. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అయినదానికీ, కానీ దానికీ వ్యక్తుల వివరాలన్నీ వివిధ సంస్థలు సేకరిస్తున్నాయి. వాటిని జాగ్రత్త పరిచే బాధ్యత, భయం ఆ సంస్థలకు లేదు. దుర్వినియోగం చేసినా ఏమీ చేయలేని స్థితి. లేదా చిన్న చిన్న శిక్షలు జరిమానాలతో సరి. ఇప్పుడున్న స్థితిలో అంతర్జాతీయ సంస్థలు తప్పుచేసినప్పుడు కట్టడి చేయడం అసాధ్యం. కాబట్టి డేటా పరిరక్షణ చట్టం వెంటనే పట్టాలకెక్కాలి. యూరప్ దేశాలు మంచి పకడ్బందీ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. వాటన్నింటినీ పరిశీలించి మన దేశం కూడా సమర్ధవంతమైన వ్యవస్థను ఏర్పరుచుకోవాలి. అన్ని లావాదేవీలకు, వ్యవహారాలకు సైబర్ స్పేస్ కీలకమైన వేళ, డేటా సురక్షితంగా ఉంచాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రమాదం.

డా. డి.వి.జి.శంకర రావు

మాజీ ఎంపీ,

94408 36931

Advertisement

Next Story

Most Viewed