కామన్ మ్యాన్ డైరీ: మనసు చెదిరి గూడు వదిలిన పెద్దాయన కథ..

by Ravi |   ( Updated:2022-11-21 19:15:29.0  )
కామన్ మ్యాన్ డైరీ: మనసు చెదిరి గూడు వదిలిన పెద్దాయన కథ..
X

మహారాష్ట్రలోని పుణె సమీపాన రంజన్‌గావ్ వెళ్లే రహదారి అది. మంగళవారం ఉదయం 11 గంటలు. దేశం నలుమూలల నుంచి అష్టవినాయక దర్శనాల కోసం వస్తున్న భక్తులతో బిజీగా ఉంది. ఓ తుఫాన్ వాహనం దాబా దగ్గరకు వచ్చి ఆగింది. 'దర్శనం అయిపోయింది కదమ్మా, టిఫిన్ చేద్దాం' అంటూ బండి దిగాడు నవీన్. అతడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇటీవలే రెసిషన్ కారణంగా ఉద్యోగం పోయింది. ఓ నెల రోజులు ఇండియాలో ఉండిపోదామని స్వస్థలం కరీంనగర్ జిల్లాకు వచ్చాడు. వేములవాడలో ఓ జ్యోతిష్యుడిని సంప్రదించగా ఆర్థిక ఇబ్బందులు, అస్థిరత్వం ఉన్నదని, అష్టవినాయక దర్శనంతో తొలగిపోతాయని చెప్పాడు. దీంతో తుఫాన్ వెహికిల్ ఎంగేజ్ చేసుకొని కుటుంబ సమేతంగా పుణే చేరుకున్నారు. అక్కడే ఓ హోటల్ గది అద్దెకు తీసుకొని మూడు రోజుల పాటు అష్టవినాయక క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తొలి రోజు ఓ ఆలయ దర్శనం తరువాత, టిఫిన్ చేసి రెండో టెంపుల్ వెళ్దామనుకుంటూ ఈ దాబా వద్ద ఆగారు.

అంతలోనే ఓ వీళ్లు కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చాడు వెయిటర్. 'క్యాహోనా సాబ్, ఇడ్లీ, వోడా, దోశా' అంటూ సౌత్ టిఫిన్ల పేర్లకు మరాఠా స్లాంగ్ జోడించి అడుగుతున్నాడు. కౌంటర్ మీద ఓ పెద్దాయన కూర్చున్నాడు. తెలుగుతనం ఉట్టిపడుతున్నది. హోటల్ మాత్రం మరాఠాలది. ఆర్డర్ ఇచ్చేశారు. అందరూ టిఫిన్లు కానిచ్చారు. బిల్లు చెల్లించేందుకు కౌంటర్ దగ్గరకు వెళ్లాడు నవీన్. వచ్చిరానీ హిందీలో 'బిల్ క్యాహై' అడిగాడు. 'అదేదో తెలుగులో అడుగొచ్చుకదా, ఏమేం తిన్నారు?' అడిగాడు పెద్దాయన. తడుముకోకుండా గబగబా చెప్పాడు నవీన్. మరాఠీ భాషలో సర్వర్‌తో క్రాస్ చెక్ చేసుకొని రూ. 540 అయ్యిందన్నాడు పెద్దాయన.

నవీన్‌తోపాటు కౌంటర్ దగ్గరకు వచ్చిన నవీన్ తల్లి రాజేశ్వరికి మాత్రం ఆయనను చూడగానే తమ ఇంటి పక్కనే ఉన్న కిష్టారెడ్డి గుర్తుకొచ్చిండు. అట్లే ఉన్నాడు. భర్తకు చెప్పింది. అడుగుదామా? ఏమనుకుంటడో ఏమో? అనుకుంటూనే 'బాపూ మీది ఏ వూరే' అన్నది. 'మాది కూడా ఆంధ్రనే. 20 యేండ్లయితుంది ఇటే వచ్చిన' అన్నడు. 'ఈ హోటల్ మీదేనా? అడిగింది. 'ఇప్పటికైతే నాదే' అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశాడు. 'ఏ ఊరు' అని అడిగే ప్రయత్నం చేసింది. 'ఏదో ఓ ఊరులే అమ్మా. పోనీ' అంటూ విసుక్కున్నాడు. 'అమ్మా ఇంకెంత సేపు? మనం మరో రెండు గుడులు దర్శనం చేసుకోవాలంటూ' నవీన్ అరుపుతో పరుగు పరుగున వెళ్లింది రాజేశ్వరి. బండి స్టార్టయింది. మోరేగావ్ వినాయక ఆలయానికి వెళ్తున్నారు. రాజేశ్వరికి మదిలో తన ఇంటికి సమీపంలో ఉండే కిష్టాగౌడే యాదికి వస్తున్నడు.

*

20 యేండ్ల కిందకు వెళితే, కిష్టారెడ్డికి ఇద్దరు సంతానం. పదెకరాల మాగాణి. చెరుకు తోటలు. వరి పొలం. ఉదయం నుంచి రాత్రి వరకు రికామ్ లేకుండా ఉండేవాడు. కూరగాయలు సైతం పండించేవాడు. 'ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే' సిద్ధాంతాన్ని నమ్ముకున్న కిష్టాగౌడ్ తన హర్క్యూలెస్ సైకిల్‌ను నమ్ముకున్నాడు. అది కూడా డైనమో ఉండే సైకిల్. దానికి ఓ కర్ర ఉండేది. రాత్రనక పగలనక బాయికాడికి (పొలం) పోవడం, నీళ్లు పారించడం చేసి పంటలను సాగు చేస్తూ ఉండేవాడు. కొడుకు నరేశ్‌కు ఎంపీడీఓ కొలువు వచ్చినా తను మాత్రం వ్యవసాయం వదల్లేదు. అందులోనే ఆనందాన్ని చూస్తున్నాడు​.

ఊరికి సమీపంలోనే ఉద్యోగం కావడంతో నరేశ్ స్కూటర్ మీద కొలువుకు పోయొస్తున్నాడు. కిష్టారెడ్డి భార్య పద్మ గృహిణి. నరేశ్​ కొడుకులు రమేశ్, సురేశ్‌కు పద్ధతి నేర్పేవాడు తాత కిష్టాగౌడ్. ఓ రోజు రాత్రి బాయికాడి నుంచి ఇంటికి వచ్చిన కిష్టారెడ్డికి చిందరవందరగా పడి ఉన్న వస్తువులు కనిపించాయి. సందె వేళ దాటినా ఇల్లు ఊడ్వలేదు. టీవీ చూస్తున్న భార్యను చూసి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'నేను యేండ్ల నుంచి చెబుతున్నా మీరు మారరా? ఇదేం ఇల్లు' అంటూ తిట్ల దండకం అందుకున్నాడు.

*

కొద్ది సేపు అలాగే ఉన్న పద్మ కూడా ఆగ్రహంతో ఊగిపోయింది. పరిస్థితి చేయిదాటుతుందనుకున్న కిష్టారెడ్డి కర్రందుకుని భార్యను కొట్టబోయాడు. మనుమలు రమేశ్, సురేశ్​ అడ్డుపడ్డారు. అంతలోనే ఇంటిలోకి వచ్చిన నరేశ్​ తండ్రితో వాదనకు దిగాడు. '60 యేండ్లు దాటినయ్. చాదస్తం పెరిగిపోయింది. మిమ్మల్ని భరించడం మా వల్ల కాదంటూ' తండ్రిని తోసేశాడు. కింద కూలబడిపోయిన కిష్టారెడ్డి కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. 'నేను చెబుతున్నది వీళ్ల కోసమే కదా? నేనేమైనా తప్పు చేశానా?' అనుకుంటూ భోరున ఏడ్చాడు. చుట్టుపక్కల వాళ్లు గొడవను వింటున్నా ఎవరూ తలుపులు తీయడం లేదు. ఇంట్లోకి రావడం లేదు. డోర్ తీసుకొని బయటికి వచ్చాడు కిష్టాగౌడ్. కాసేపు అరుగు మీద కూర్చున్నాడు. మనసు చెదిరింది. ఇంట్లోంచి వెళ్లిపోయాడు.

'ఆ ఆఆ.. మహా అయితే బాయికాడికి పోతడు పొద్దునే వస్తాడు లే' అనుకున్నారంతా. ఉదయం 9 దాటినా తండ్రి రాకపోవడంతో టెన్షన్ పడ్డ నరేశ్​పొలం దగ్గరకు వెళ్లి చూశాడు. తండ్రి లేడు. చుట్టుపక్కల వాళ్లను అడిగాడు. రాలేదని చెప్పారు. టెన్షన్‌తో కామారెడ్డిలో ఉంటున్న చెల్లెకు ఫోన్ చేశాడు. వాళ్లూ రాలేదన్నారు. బంధువులను వాకబు చేశారు. ఫలితం లేకపోయింది. నరేశ్​ ఇద్దరు కొడుకులకు ఉద్యోగాలు వచ్చాయి. పెళ్లిళ్లు అయిపోయాయి. పద్మ ఆరోగ్యం క్షీణించింది. పక్షవాతంతో కన్నుమూసింది. నరేశ్‌కు ప్రమోషన్ రావడంతో కరీంనగర్‌కు మకాం మార్చాడు. ఊళ్లో ఉన్న ఇంటిని కిరాయికి ఇచ్చారు. సారవంతంగా ఉండే పొలం వెంచర్‌గా మారిపోయింది. కిష్టారెడ్డి మిస్సింగ్ మిస్టరీ మాత్రం వీడలేదు.

*

అష్ట వినాయక క్షేత్రాల దర్శనం ముగించుకొని వస్తున్న రాజేశ్వరికి మాత్రం కిష్టారెడ్డే మదిలో మెదులుతున్నాడు. ఈ విషయం వాళ్ల కుటుంబానికి చెప్పాలనుకుంటున్నది. అంతలోనే రాజేశ్వరి అన్న మహేశ్​చెల్లెలి దగ్గరకు వచ్చాడు. ఆ విషయం తన అన్నకు చెప్పింది. కిష్టారెడ్డి కొడుకు నరేశ్​తనకు టచ్‌లో ఉన్నాడంటూ చెల్లిని తీసుకొని నరేశ్ ఇంటికి వెళ్లాడు. విషయం చెప్పారు. తన కొడుకు సెల్‌ఫోన్‌లో బంధించిన ఫొటోను చూపారు. ఆ ఫొటోను చూసిన నరేశ్​ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. తన తండ్రే. ఏ మాత్రం సందేహం లేదు. 20 యేండ్ల క్రితానికీ ఇప్పటికీ ఎంతో మారిపోయాడు.

వెంటనే ఊళ్లో ఉన్న తన మేనమామకు, చిన్నాన్నకు కబురు పెట్టాడు. అర్జంటుగా రమ్మన్నాడు. ఆ రోజు రాత్రే బయల్దేరారు. మరుసటి రోజు మధ్యాహ్నం పుణే చేరుకున్నారు. ఓ హోటల్‌లో కాలకృత్యాలు తీర్చుకొని రంజన్‌గావ్ బయల్దేరారు. తన తండ్రి పని చేస్తున్నట్టు చెప్పిన హోటల్‌కు వెళ్లారు. కౌంటర్ మీద వేరే వ్యక్తి ఉన్నాడు. కాసేపు వెయిట్ చేశారు. వెయిటర్ వచ్చి 'సాబ్ క్యా హోనా' అని అడుగుతున్నాడు. ఏదో ఒకటి చెప్పారు. 'బిల్' అంటూ మరోమారు వచ్చాడు. కట్టేశారు. తన తండ్రి మాత్రం కనిపించడం లేదు.

*

టెన్షన్ పెరిగిపోతున్నది నరేశ్‌కు కాసేపు అక్కడే వెయిట్ చేశారు. అంతలోనే పాత బజాజ్ చేతక్ మీద రానే వచ్చాడు పెద్దాయన. మరాఠీలో సర్వర్లకు ఆదేశిస్తూ లోపలికి వెళ్లాడు. పక్కాగా తన తండ్రే. కౌంటర్ మీద ఉన్నతను తాను వెళ్తున్నట్టు చెప్పగానే తలాడించాడు కిష్టాగౌడ్. కౌంటర్ మీద కూర్చున్నాడు. తమ్ముడిని, కొడుకును, బావమర్దిని గమనించడం లేదు. వాళ్లు కౌంటర్ దగ్గరకు రాగానే ముఖంలో ఛేంజెస్ కనిపించాయి. డౌట్ రాకుండా 'బోలియే, క్యా చాహియే' అన్నాడు. అలా అంటున్నప్పుడు గొంతు వణికింది. 'నేను నాన్నా నరేశ్‌ను' అంటూ భోరుమన్నాడు. కాసేపు కాదంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు కిష్టాగౌడ్. కానీ, రక్త సంబంధీకులను చూసేసరికి కంటనీరు ఆగలేదు. బోరున ఏడ్చేశాడు.

హోటల్‌కు వచ్చిన వారంతా ఒక్కసారిగా అక్కడ గుమిగూడారు. విషయమంతా చెప్పి వారిని కన్విన్స్ చేశారు. ఈ హోటల్ తనది కాదని, ఇప్పటిదాకా చెయిర్‌లో కూర్చున్నాయనవాళ్ల నాన్నదని చెప్పాడు. ఆయన దగ్గరే తాను ఉద్యోగానికి చేరానని, ఆయన తనను తమ్ముడిలా ఆదరించాడని, తను కాలం చేయడంతో వాళ్ల కొడుకు మెయింటెన్ చేస్తున్నాడన్నాడు. ఇంటికి వెళ్లాం పద అంటే రెండు రోజుల తర్వాత అన్నాడు. అప్పటి వరకు అక్కడే ఉన్నారు. చివరకు ఒప్పించి, మెప్పించి 20 యేండ్ల కింద ఇల్లు విడిచిన నాన్నను తీసుకొచ్చారు. కానీ, ఇప్పుడు వ్యవసాయం లేదు. భార్య పద్మ లేదు. అన్నిటికీ మించి ఉంటున్నది స్వగ్రామమూ కాదు. బిడ్డ అప్పడప్పుడు వస్తున్నా, ఆ గాయం మాత్రం అందరినీ వెంటాడుతూనే ఉన్నది.


ఎంఎస్‌ఎన్ చారి

79950 47580

Advertisement

Next Story

Most Viewed