- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కామన్ మ్యాన్ డైరీ:విధి రాజును దొంగను చేసింది
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రాజు పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఇక చదివే స్థోమత లేక పట్నం బాట పట్టాడు. అమీర్‌పేటలోని ఓ హోటల్ లో సర్వర్‌గా చేరాడు. అక్కడి మాస్టర్ కృష్ణ చేస్తున్న వంటకాలను తదేకంగా గమనించేవాడు. సమయం చిక్కినప్పుడల్లా కిచెన్‌లో దూరి వంటకాలు ఎలా చేస్తున్నాడో చూశాడు. కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన కృష్ణ పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. టిఫిన్లు తయారు చేయడంలో కృష్ణది అందెవేసిన చేయి. రాజు ఓనర్‌ను ఒప్పించి కృష్ణకు సహాయకుడిగా చేరిపోయాడు. ఇద్దరూ కలిసి పసందైన వంటకాలను తయారు చేస్తూ కస్టమర్లకు అందిస్తున్నారు.
ఇంతలో కూకట్‌పల్లిలోని ఓ హోటల్‌లో రాజుకు చెఫ్‌గా అవకాశం వచ్చింది. గురువు కృష్ణకు విషయం చెప్పాడు. ప్రమోషన్ కాబట్టి వెళ్లమన్నాడు కృష్ణ. దీంతో రాజు డ్యూటీ కూకట్‌పల్లికి షిప్ట్ అయ్యింది. కొత్తగా పెట్టిన హోటల్‌లో మాస్టర్ చెఫ్‌గా మారాడు. నెలకు పాతిక వేల వరకు జీతం వచ్చేది. అంతలోనే నాగర్‌కర్నూలుకు చెందిన రమతో రాజుకు వివాహం జరిగింది. అప్పటి వరకు బ్యాచిలర్ జీవితం గడిపిన రాజు ఓ ఇంటివాడయ్యాడు.
*
పదోతరగతి పూర్తి చేసిన రాజు తమ్ముడు శ్రీను ఖాళీగా ఉంటున్నాడు. భార్యను, తమ్ముడిని తీసుకొని వచ్చి ఎల్లమ్మబండలో కాపురం పెట్టాడు రాజు. తమ్ముడిని తాను పనిచేస్తున్న హోటల్‌లోనే చేర్పించాడు. కొత్త కావడంతో జీతం పెద్దగా ఇవ్వడం లేదు. అలా సంసార నౌకను నెట్టుకొస్తున్నాడు. ఇంటి పక్కన ఉండే బ్యాంకు ఉద్యోగిని లక్ష్మితో రమకు పరిచయం ఏర్పడింది. తాను బ్యాంకులో 'ముద్ర' లోన్ ఇప్పిస్తానని రాజు టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే బాగా సంపాదించుకోవచ్చని సలహా ఇచ్చింది. రమకు సంతోషం వేసింది. రాత్రికి ఇంటికి వచ్చిన భర్తతో విషయం చెప్పింది. ఆయన సరేనన్నాడు.
లక్ష్మి చొరవతో కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో రమ టిఫిన్ సెంటర్ ఏర్పాటైంది. అన్నదమ్ములిద్దరితోపాటు రమ కూడా టిఫిన్ సెంటర్ పనులలో తలమునకలవుతోంది. రోజూ ఐదు వేల రూపాయల వరకు గిరాకీ అవుతున్నది. రుచికరంగా ఉండటంతో రోజురోజుకూ గిరాకీ పెరుగుతున్నది. డైలీ కలెక్షన్ 10 వేలకు చేరింది. ముద్ర లోన్ పూర్తిగా కట్టేశారు. అప్పులన్నీ తీరిపోయాయి. కొడుకు, కూతురును మిషనరీ స్కూల్లో జాయిన్ చేశాడు రాజు. తమ్ముడికి కూడా పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.
*
అంతలోనే కరోనా మహమ్మారి ప్రవేశించింది. ఆంక్షలు మొదలయ్యాయి. జనం అవుట్ సైడ్ ఫుడ్ తినడం లేదు. గిరాకీ తగ్గిపోయింది. తయారు చేసుకున్న చట్నీని, పిండిని పారబోయాల్సి వస్తున్నది. కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఆరు నెలలకు సరిపడా డబ్బులున్నాయి. రాజు, శ్రీను, రమ, ఇద్దరు పిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు. మడిగె కిరాయి నెలకు రూ. 10 వేలు కడుతున్నారు. పనేమీ చేయకుండా కుటుంబాన్ని వెళ్లదీయడం కష్టంగా మారింది. పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రీను ఊరిలో ఏదో పని చేసుకుంటానంటూ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు.
ఏడాది గడిచింది. కిరాయి కట్టకపోవడంతో టిఫిన్ సెంటర్ సామగ్రి యజమాని స్వాధీనం చేసుకున్నాడు. పైగా తనకు డబ్బులివ్వాలంటూ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు. చేబదుళ్లు తీసుకున్న వారు తిరిగి అడగడం మొదలు పెట్టారు. దీంతో ఎన్టీఆర్‌నగర్‌కు మకాం మార్చాడు రాజు. చిన్న రేకుల ఇంటిలో ఉంటున్నాడు. రమ చెవి దుద్దులు అమ్మి ఆ ఇంటికి అడ్వాన్సు కట్టడంతో పాటు కిరాణా సామాగ్రి తెచ్చుకున్నారు. స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి. టీసీ ఇచ్చేందుకు పాఠశాలవారు ఇబ్బంది పెడుతున్నారు. గత ఏడాది పెండింగ్ ఫీజు కట్టాలని డిమాండ్ చేశారు. దీంతో పిల్లలను బడికి పంపడం లేదు. పూట గడవడమే భారమైంది.
*
ఇంటి పక్కనే ఉంటున్న రవితో పరిచయం ఏర్పడింది. తన బాధనంతా చెప్పాడు రాజు. 'టెన్షన్ పడకన్నా మనం బయటికి వెళ్దాం పద' అంటూ తీసుకెళ్లాడు. 'టెన్షన్ నుంచి బయటపడాలంటే ఓ పెగ్గేస్తేనే బెటర్' అంటూ ప్రోత్సహించాడు. తూలుకుంటూ ఇల్లు చేరాడు రాజు. రమ గుండె ఆగినంత పనైంది. అసలే తిండికి పైసల్లేవంటే తాగేందుకు పైసలెక్కడివంటూ నిలదీసింది. ఏడుస్తూనే భర్తకు అన్నం పెట్టింది. ఆ రాత్రికి రాజు అలా నిద్రలోకి జారిపోయాడు. బారెడు పొద్దెక్కాక లేచాడు. పని వెతుక్కుంటానంటూ రవితో కలిసి బయటికి వెళ్లాడు. ఎక్కడా పని దొరకలేదు.
ఇద్దరూ అలా వస్తుంటే ఓ పాడుబడ్డ షెడ్డు కనిపించింది. అందులో ఇంటి పైకప్పు రేకులున్నాయి. చుట్టుపక్కల ఎవరూ లేరు. వాటిని ఓ రిక్షాలో వేసుకొని తెచ్చి స్క్రాప్దుకాణంలో అమ్మేశారు. రెండు వేల రూపాయలొచ్చాయి. తలా వెయ్యి తీసుకున్నారు. ఇద్దరు కలిసి మందు కొట్టారు. 500 రూపాయలు తీసుకొని ఇంటి బాట పట్టాడు రాజు. భార్య చేతిలో డబ్బులు పెట్టి తాను ఓ హోటల్ లో చేరానని రోజుకు రూ. 500 ఇస్తున్నారని చెప్పాడు.
*
'దేవుడు ఓ దారి చూపించాడని' సంతోషపడింది రమ. ఇలా రోజూ కొంత డబ్బు తీసుకొని ఇల్లు చేరుతున్నాడు రాజు. ఓ రోజు కూరగాయల కోసం పిల్లలను తీసుకొని మార్కెట్ కు వెళ్లింది రమ. చాలా మంది గుమికూడారు.. ఎవరినో కరెంటు పోల్‌కు కట్టేసి కొడుతున్నారు. అటుగా నడిచింది రమ. కొడుతున్నది తన భర్తనే. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. 'ఎందుకు కొడుతున్నారు. జర ఆగండన్నా మీ కాళ్లు మొక్కుతా' అంటూ ప్రాధేయపడింది. పిల్లలు ఏడుపందుకున్నారు. 'వీడు దొంగ.. బా...' అంటూ తిడుతున్నారు. అప్పుడే అటుగా వచ్చిన కృష్ణ మాస్టర్ రాజును చూసి చలించిపోయాడు.. 'ఆపండి, ఇతను మంచి చెఫ్, నా దగ్గరే నేర్చుకున్నాడు. పోలీసులకు అప్పజెప్పొద్దంటూ' ప్రాధేయపడ్డాడు. కృష్ణ వెంట వచ్చిన హోటల్ యజమాని సైతం అందరికీ సర్ది చెప్పి పంపించి వేశాడు.
'రాజు ఏమైందిరా గిట్ల తయారైనవ్' అని అడిగాడు. టిఫిన్ సెంటర్ ఏర్పాటు మొదలు, కరోనా లాక్ డౌన్ వరకు జరిగిన విషయం చెప్పాడు. తాగుడుకూ బానిసయ్యాడంటూ రోదించింది రమ. 'రేపు నా దగ్గరికి రా, మా హోటల్‌లోనే పనిచేద్దువు' అంటూ వెళ్లిపోయాడు కృష్ణ. 'మమ్మల్ని బజారున పడేయకు' అంటూ రోదించింది రమ. పిల్లలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. చలించిన రాజు వారిని అక్కున చేర్చుకున్నాడు. తప్పులు జరిగిపోయాయని బాధపడ్డాడు. హోటల్ లో చెఫ్‌గా చేరిపోయాడు. రూ. 20 వేల జీతం ఇస్తామని చెప్పాడు హోటల్ యజమాని. విధి ఆడిన వింత నాటకంలో రాజును దొంగయ్యాడు. కృష్ణ మాస్టర్ చొరవతో మళ్లీ పాత జీవితం ప్రారంభించాడు.
ఎంఎస్ఎన్ చారి
79950 47580