తొలగింపు ప్రమాదమే

by Ravi |   ( Updated:2022-09-03 14:53:43.0  )
తొలగింపు ప్రమాదమే
X

విద్యార్థులకు యువ దశలోనే పౌర విజ్ఞానం అందిస్తే సమాజంలో సానుకూల భాగస్వామ్యం పెరిగి ప్రభుత్వ పథకాలు విజయవంతం అవుతాయి. ప్రజా సంక్షేమం ఫరిడవిల్లుతుంది. ప్రభుత్వ ప్రగతి పథకాలలో ప్రజల క్రియాశీల భాగస్వామ్యం పెరిగి సామాజిక, ఆర్థిక పంపిణీ, న్యాయం వంటివి ఇంకా సమాజానికి అందుతున్నాయంటే దానికి కారణం పౌరశాస్త్రం చదివిన ఐఏఎస్‌ అధికారులే. పాలకులకు రాజనీతిశాస్త్ర జ్ఞానం లేకున్నా కలెక్టర్లు సివిల్స్‌లో చదివిన పొలిటికల్ సైన్స్ జ్ఞానంతో సమాజానికి ఈ మాత్రం మేలైనా జరుగుతోంది. సాంకేతిక వృద్ధి పేరుతో సమాజానికి కావాల్సిన సబ్జెక్ట్‌లను తొలగించకండి. కావాలనుకుంటే దానికే సాంకేతికతను జోడించండి. ఇంటర్ బోర్డు కూడా కోర్సు రద్దును విరమించుకొని, ఉపాధి దోహద కోర్సులు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు ప్రవేశపెట్టాలి.

తెలంగాణ ఇంటర్ బోర్డు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పౌరశాస్త్రం కోర్సును రద్దు చేయబోతోంది. దాని స్థానంలో ఎలక్ట్రానిక్, కంప్యూటర్ కోర్సులను ప్రవేశ పెట్టడానికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఉత్తమ పౌరులను తయారు చేసే పౌరశాస్త్రం కోర్సును రద్దు చేస్తే అది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంటర్ హెచ్ఈసీ, సీఈసీ కోర్సులలో లక్షలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు చెందిన గ్రామీణ ప్రాంతాలవారే ఉన్నారు. ఇంటర్ బోర్డు నిర్ణయం వారిని చదువుకు దూరం చేసే విధంగా ఉన్నది. రాష్ట్రంలో 1,905 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఎన్నో కళాశాలలలో పౌరశాస్త్రానికి సంబంధించిన కోర్సులు ఉన్నాయి. వీటిని తొలగిస్తే అందులో పనిచేస్తున్న వేలాది మంది సివిక్స్ అధ్యాపకులు ఉద్యోగాలు కోల్పోతారు. వారి కుటుంబాలకు జీవన భద్రత కరువవుతుంది.

సివిక్స్, చరిత్ర, సోషియాలజీ మెదలగు మానవీయ కోర్సులపై చిన్న చూపు తగదు. సాంకేతిక వృద్ధి పేరుతో వీటిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. మానవీయ, నైతిక విలువలు తగ్గితే సమాజానికి పలు సవాళ్లు ఎదురవుతాయి. ఈ కోర్సు వలన ప్రతి పౌరుడు సమాజంలో తన హక్కులు. బాధ్యతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు, ఓటింగ్ హక్కు, చట్టసభల పనితీరు పట్ల అవగాహన పెంపొందించుకుంటాడు. మానవుల సాధకబాధకాలు, సామాజిక, రాజకీయ సమస్యల పరిష్కార మార్గాలు, సమాజాభివృద్ధికి చెందిన పలు విషయాలు, సామాజిక శాస్త్రంలో భాగం. సివిల్స్ పరీక్షలలో, రాష్ట్రస్థాయి గ్రూప్ పరీక్షలలో పౌరశాస్త్రము ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఉంది. ఉద్యోగాల కోసం ఉపయోగపడుతుంది. పౌర చట్టాలు, సివిల్ కోడ్. ప్రభుత్వ కార్యకలాపాలు పర్యవేక్షణ, సామాజిక విలువలు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, పౌర స్వేచ్ఛ, సంస్థాగత మార్పులు, సౌభ్రాతృత్వం, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి, ప్రాదేశిక సమగ్రతపై చైతన్యం కలుగుతుంది.

నేటి తరానికి తెలియాలంటే

విద్యార్థులకు యువ దశలోనే పౌర విజ్ఞానం అందిస్తే సమాజంలో సానుకూల భాగస్వామ్యం పెరిగి ప్రభుత్వ పథకాలు విజయవంతం అవుతాయి. ప్రజా సంక్షేమం ఫరిడవిల్లుతుంది. ప్రభుత్వ ప్రగతి పథకాలలో ప్రజల క్రియాశీల భాగస్వామ్యం పెరిగి సామాజిక, ఆర్థిక పంపిణీ, న్యాయం వంటివి ఇంకా సమాజానికి అందుతున్నాయంటే దానికి కారణం పౌరశాస్త్రం చదివిన ఐఏఎస్‌ అధికారులే. పాలకులకు రాజనీతిశాస్త్ర జ్ఞానం లేకున్నా కలెక్టర్లు సివిల్స్‌లో చదివిన పొలిటికల్ సైన్స్ జ్ఞానంతో సమాజానికి ఈ మాత్రం మేలైనా జరుగుతోంది.

సాంకేతిక వృద్ధి పేరుతో సమాజానికి కావాల్సిన సబ్జెక్ట్‌లను తొలగించకండి. కావాలనుకుంటే దానికే సాంకేతికతను జోడించండి. ఇంటర్ బోర్డు కూడా కోర్సు రద్దును విరమించుకొని, ఉపాధి దోహద కోర్సులు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు ప్రవేశపెట్టాలి. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతగా అభివృద్ధి చెందినా, మన దేశ సంస్కృతిలో పెనుమార్పులు సంభవిస్తూ సంప్రదాయాలు కనుమరుగవుతున్న తరుణంలో వాటి గురించి నేటి తరానికి తెలియాలంటే సామాజిక, మానవీయ శాస్త్రాల అధ్యయానాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. మేధావులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, విద్యారంగ నిపుణులు, ఇంటర్ బోర్డు అధికారులతో, విద్యాశాఖతో చర్చలు జరపాలి.

నేదునూరి కనకయ్య

అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం

సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక

94402 45771

Advertisement

Next Story

Most Viewed