ఊసరవెల్లి సైతం... సిగ్గుపడేలా!

by Ravi |   ( Updated:2024-02-01 00:45:56.0  )
ఊసరవెల్లి సైతం... సిగ్గుపడేలా!
X

మన రాజకీయ నాయకులు చొక్కాలు మార్చినంత సులభంగా పార్టీలు మారడం మన దేశ రాజకీయాల్లో నిత్యం చూస్తూనే ఉన్నాం. మన దేశంలో కేవలం అధికారం కోసం, తద్వారా ఆర్థిక ప్రయోజనం కోసం పార్టీలు మార్చే నితీష్ కుమార్ లాంటి వాళ్ళను చూసి ఊసరవెల్లి సిగ్గుపడదా?

మన రాజకీయ నాయకులు చొక్కాలు మార్చినంత సులభంగా పార్టీలు మారడం మన దేశ రాజకీయాల్లో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇలాంటివారిని ఊసరవెల్లిలా రంగులు మార్చేవారని అంటాము. అయితే నిజంగా ఊసరవెల్లి రంగులు మారుస్తుందా? అంటే శత్రుదాడి నుంచి తప్పించుకోవటానికో, లేదా సంతానోత్పత్తికి సిద్ధంగా ఉన్నప్పుడు దానిలోని పిగ్మెంట్లలో జరిగే రసాయనిక ప్రక్రియలో భాగంగా ఊసరవెల్లి శరీరంలోని రంగులు మార్చుకుంటుంది. కానీ మన రాజకీయ నాయకులు నీతి నియమాలు మాని నిర్లజ్జగా అధికారం కోసం ఎందుకు పార్టీలు మారుస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న.

ఆదినుంచి అవకాశవాదమే!

జనవరి 28న బీహార్ 9వ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన నితీష్ కుమార్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు మారుపేరుగా మిగిలారు. విద్యార్థి దశలో స్టూడెంట్ ఫెడరేషన్‌లో పనిచేసిన నితీశ్ తర్వాతి కాలంలో జనతా పార్టీ ప్రభంజనంలో 1985లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తదనంతరం లాలూ ప్రసాద్ ఆధిపత్యాన్ని ధిక్కరించి జార్జి ఫెర్నాడజ్‌తో కలిసి సమతా పార్టీని ఏర్పర్చి బీజేపీ సహకారంతో 2000లో ముఖ్యమంత్రిగా పీఠమెక్కాడు. ఆ తర్వాత 2005 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేయగా 88స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. 2010 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేయగా జేడీయూ పార్టీకి 115 స్థానాలు దక్కి నితీశ్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. 2013లో లండన్‌లో జేడీయూ ఎంపీ ఎన్‌కే సింగ్ ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీలో నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ పాల్గొని పిచ్చాపాటీ సంభాషణలో నితీశ్ కుమార్ భవిష్యత్తులో ప్రధాని అయ్యేందుకు అర్హతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దాంతో ప్రధాని పదవిపై నితీశ్‌కి ఆశలు పెరిగాయి.

ఎంత గడ్డి తినయినా సరే...

2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఎన్టీయే కన్వీనర్‌గా చేయడంతో నితీశ్ ఆశలకు గండిపడింది. హిందుత్వ వాది మోడీతో కలిసి పనిచేయలేనని సీఎం పదవికి రాజీనామా చేశారు. 2015లో లాలూ, కాంగ్రెస్‌తో కలిసి మహాఘటబంధన్ ఏర్పాటుచేసి అఖండ విజయం సాధించి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో రాజకీయ పరిస్థితులను అంచనా వేసి మళ్ళీ మోడీ ప్రభుత్వం వచ్చేలా ఉందనే అంచనాతో ఉప ముఖ్యమంత్రిగా వున్న లాలు కుమారుడు తేజస్వి యాదవ్ అవినీతిని భరించలేననే సాకుతో రాజీనామా చేసి మళ్ళీ బీజేపీతో జతకట్టి ముఖ్యమంత్రి అయ్యారు. 2020లో బీజేపీతో ఎన్నికలకు వెళ్లి 43 స్థానాల్లో మాత్రమే గెలిచినా మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2022లో బీజేపీతో తెగతేంపులు చేసుకొని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో జత కట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సారి లాలు కుటుంబ పాలనను భరించలేననే సాకుతో రాజీనామా చేసి మళ్ళీ బీజేపీతో జతకట్టి ముఖ్యమంత్రి అయ్యారు.

ప్రధాని పదవిపై కొండంత ఆశలు

ఇంతలా ఊసరవెల్లి కంటే అధికంగా కూటమిలను మారుస్తూ తన అధికారదాహానికి కుంటిసాకులు చెబుతూ నీతినియమాలు లేకుండా నితీశ్ కుమార్ వేస్తున్న ఈ కుప్పిగంతుల వెనుక ప్రధానమంత్రిగా కావాలనే బలీయమైన కోరిక దాగుంది. దాని సాధనకే కాలికి బలపం కట్టుకొని మమతా బెనర్జీని, కేజ్రీవాల్‌ను, అఖిలేష్‌ను, శరద్ పవార్‌ను, సోనియా గాంధీని, ఆఖరుకు కేసిఆర్‌ని సైతం కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో చురుకైన పాత్ర పోషించాడు. కానీ కూటమిలో మమత అలాగే కేజ్రీవాల్ సైతం ప్రధాని పదవిపై కన్నేశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎన్డీఏ కూటమి సమావేశంలో మిగతా కూటమి భాగస్వామి పార్టీలను సంప్రదించకుండానే ఏకపక్షంగా ఖర్గేను కన్వీనర్‌గా ప్రకటించారు. దీనితో కూటమిలో తన స్థానం ఏమిటో నితీశ్‌కు తెలిసిపోయింది. పైగా ఇటీవల అయోధ్యలో రాంలల్లా ప్రతిష్టతో మోడీ గ్రాఫ్ పెరిగింది. తన ఆశలు నెరవేరేలా కనిపించకపోవటంతో కనీసం భవిష్యత్‌లో ముఖ్యమంత్రి పదవిని కొనసాగించుకునే ప్రణాళికలో భాగంగానే నిన్నటి కుప్పిగంతులకు పాల్పడ్డారు నితీశ్.

ఇక్కడ బీజేపీ స్వార్ధ రాజకీయాలను కూడా నిశితంగా పరిశీలించాలి. 2022 లో బీజేపీతో నితీశ్ తెగతెంపులు చేసుకొన్న సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక భీకర ప్రకటన చేశారు. భవిష్యత్‌లో నితీశ్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రసక్తే ఉండదని. మరిప్పుడు షా ప్రకటనలో కానీ, చావనైనా చేస్తాను గాని బీజేపీతో కలవనన్న నితీశ్ ప్రకటనలో గానీ ఏమైనా నీతి నిజాయితీ వున్నాయా? అటు బీజేపీకి గాని ఇటు జేడీయూకు కానీ నిబద్ధత, సిద్ధాంతాలు ఉన్నాయా? అని బీహార్ ప్రజలు నిలదీయాల్సిన అవసరం వుంది. అంతే కాదు 2024 ఎన్నికల్లో ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా వుంది.

- డా. కె. సుధాకర్ రెడ్డి

రిటైర్డ్ సీనియర్ లెక్చరర్

98497 45636

Advertisement

Next Story