ఈ ఎన్నికలలో కరివేపాకు బీఆర్ఎస్

by Ravi |
ఈ ఎన్నికలలో కరివేపాకు బీఆర్ఎస్
X

ధర్మరాజు జూదంలో సర్వస్వం కోల్పోయి, చివరికి ద్రౌపదిని పందెంలో ఒడ్డిన తర్వాత ఆమెను పాండవుల ధర్మపత్నిని కౌరవ నిండు సభలోకి తీసుకు వచ్చినప్పుడు సభలో ఆసీనులైన పెద్దలను ఉద్దేశించి ప్రశ్నించినట్టే, ఇప్పుడు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తీరుతెన్నులను పరిశీలిస్తే సరిగ్గా ఇలాంటి ప్రశ్న తలెత్తుతుంది. తమ ఓటమికి ప్రజలే కారణం అనే అహంభావ ధోరణిని బీఆర్ఎస్ అధినేత వదులుకోకపోవడం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది.

అపవాదును తొలగించుకున్న బీజేపీ

రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక్కడే అన్ని చోట్ల తానై లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలను పార్టీకి కట్టబెట్టే బాధ్యత తీసుకున్నారు కానీ బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలూ లోపాయికారీ సంబంధాలు పెట్టుకోవడంతో కాంగ్రెస్ స్థానాలు తగ్గిపోయాయని విశ్లేషకుల వ్యాఖ్య. పైగా మీనమేషాలు లెక్కించకుండా అభ్యర్థులను ఎంపిక చేసిన బీజేపీ, ఆయా స్థానాల్లో ప్రచారం, టీం వర్క్ సమన్వయంతో పని చేయడం ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లింది. కవితను అరెస్టు చేయడం వలన గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిన అపవాదును తొలగించుకునే ప్రయత్నంలో బీజేపీ సత్ఫలితాలు సాధించింది.

డబ్బులకు ఓట్లను దండుకోవచ్చని..

బీఆర్ఎస్ అధినేత, నాయకత్వ టీమ్ ఇప్పటికీ తన అహంభావ వైఖరిని పోగొట్టుకోకపోవడం ఆ పార్టీ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. తమ ఓటమికి ప్రజలే కారణం అన్నట్లు అధినాయకుడు నుంచి ద్వితీయ శ్రేణి ముఖ్య నాయకుల వరకు మాట్లాడారు. ఎప్పటి మాదిరిగానే డబ్బులతో ఓట్లను దండుకోవచ్చనే వ్యూహంతో ప్రణాళికతో పనిచేశారు. ప్రజలు దీన్ని హర్షించలేదు కాబట్టే ఎలాంటి ఎన్నికలు జరిగినా సరే... బీఆర్ఎస్ బరిలో, గురిలో లేకుండా పోతోంది. అన్నిటికంటే మించి బీఆర్ఎస్‌కి చెందిన ఓటర్లను ఆ పార్టీ నాయకత్వం దారి మళ్లించి బీజేపీకి పడేలా చేసిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తం మీద ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కరివేపాకు అయిపోయింది అనిపిస్తుంది. ఈసారి ఓటర్లు జాతీయ పార్టీల వైపు రాష్ట్రంలో సరి సమానంగా మొగ్గుచూపారని కౌంటింగ్ ధోరణులను పరిశీలిస్తే అవగతం అవుతున్నది. అందుకనే ముందే అన్నట్టుగా తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా అనే శేష ప్రశ్న బీఆర్ఎస్ ముందు నిలుస్తోంది.

-జూకంటి జగన్నాథం,

కవి ,రచయిత

94410 78095



Next Story