- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YCP vs BJP: బతుకు బీజేపీలో... బత్తెం వైసీపీలో!
ఆంధ్రప్రదేశ్‌లో కొందరు కమలనాథుల 'బతుకు బీజేపీలో, బత్తెం వైసీపీలో' ఉన్నట్లుంది. బీజేపీలో వుంటూ వైసీపీ వద్ద బత్తెం తీసుకొంటూ వైసీపీ బాగు కోసం పనిచేస్తున్నా, బీజేపీ అధిష్టానం కూడా పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఎందుకంటే వారికి కూడా వైసీపీ బలోపేతం కావడమే కావాలి. అందుకే కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్ నాయకులు ఆ పార్టీలో ఇమడలేక వారి దారి వారు చూసుకుంటున్నారు. కొందరు బీజేపీ నాయకులు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. అందుకే వైసీపీని విమర్శించే బీజేపీ నాయకులను బీజేపీ నుంచి తరిమేసే బాధ్యతను బీజేపీ పేటిఎమ్ బ్యాచ్‌కి అప్పగించింది జగన్ అండ్ కొ. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇటీవల ఒక వర్గం వారితో సన్మానాలు చేయించుకుంటూ వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి కృష్ణాజిల్లాకు రంగా పేరుపెట్టాలన్న వాదన తెరపైకి తెచ్చారు. అన్నింటికి ఎన్టీఆర్, వైఎస్ పేర్లేనా అంటూ ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ట్వీట్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ ఎజెండానే అమలు చేస్తూ కాపులను రెచ్చగొట్టి వైసీపీకి మేలు చేసే బాధ్యతను జీవీఎల్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సొంతంగా వార్డు మెంబరుగా కూడా గెలవలేని పార్టీ అధ్యక్షుడు వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం మాదే అని సవాళ్లు విసరడం చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకొంటున్నారు. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణు వర్ధన్ రెడ్డి మరికొందరు బీజేపీలో వున్నా వారు పని చేసేది మాత్రం వైసీపీ బలోపేతం కొరకే పనిచేస్తున్నారని చిన్న పిల్లలకు సైతం అర్థం అవుతుంది.
రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీతోనే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెబుతున్నారు. ఏపీకి ఘోర అన్యాయం చేయడమే కాకుండా, రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటింగ్ లేని బీజేపీ, 7 శాతం ఓటింగ్ వున్న జనసేనతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి ఎలా వస్తారో వారికే తెలియాలి. మరో పక్క రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న బీజేపీతో జనసేన ఎలా కలుస్తుందో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తోంది. పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా, అదెంత వివాదాస్పద అంశమైనా వైసీపీ ఎంపీలు జై కొడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం తు.చా తప్పక అమలు చేస్తోంది. పైగా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినా, కేంద్రాన్ని ఏమాత్రం ఇబ్బందిపెట్టకుండా జగన్ సహకరిస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించినా, విభజన అంశాలు, హామీలు అమలు చేయకపోయినా కేవలం విజ్ఞాపన పత్రంతో చేతులు దులుపుకొంటున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని కేంద్రం ఆదేశిస్తే బీజేపీ రాష్ట్రాల కంటే ముందుగానే ఏపీలో అమలు చేశారు. బీజేపీ అధిష్టానం కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో పార్టీలో కొందరి నాయకుల హవా కొనసాగుతోంది. కేంద్రంలో తొమ్మిదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్నా రాష్ట్రంలో ఆ పార్టీ ఏమాత్రం పుంజుకోక పోగా మరింత బలహీనపడటానికి కారణం వైసీపీకి అండగా నిలబడటమే అని చెప్పాలి.
ఆయన భుజంపై తుపాకీ పెట్టి..
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఏనాడు పట్టించుకోని ఎరుగరు. మరోపక్క ఆధిపత్యం కోసం అంతర్గత కుమ్ములాటలతో పార్టీ పటిష్ఠత, నిర్మాణంపై దృష్టి పెట్టకుండా తెలుగుదేశాన్ని దెబ్బతీసేందుకు వైసీపీకి సహకరిస్తోంది బీజేపీ అధిష్టానం. ప్రతిపక్ష తెలుగు దేశాన్ని అణచివేసే బాధ్యతను వైసీపీకి అప్పగించింది బీజేపీ అధిష్టానం. అందుకే అరాచక పాలన చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ, ప్రతిపక్షం సభలను, రోడ్ షోలను అడ్డుకుంటూ నిర్బంధించడం అందులో భాగమే. కేంద్రం అండదండలు లేకుండా ఇంత నిరంకుశంగా పాలన సాగించలేరు. జగన్ భుజంపై తుపాకీ పెట్టి తెలుగుదేశాన్ని కాల్చాలని చూస్తోంది బీజేపీ అధిష్టానం. ముందు చంద్రబాబుని దెబ్బతీస్తే, జగన్ రెడ్డిని ఎప్పుడైనా దెబ్బతీయవచ్చని బీజేపీ ఆలోచన. అంతేకాకుండా జగన్ రెడ్డి వేధింపులు, ప్రతీకారం తట్టుకోలేక చంద్రబాబు తమ వద్దకు వచ్చి లొంగిపోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే రాష్ట్రంలో ఫాసిస్టు పాలనకు అండగా నిలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కుటుంబ పార్టీలతో పొత్తులు పెట్టుకోం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. 0.7 శాతం ఓట్ల శాతం వున్న పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి ఎవ్వరూ పరుగులు తీయడం లేదు రాష్ట్రంలో. గుడ్డి కన్నుమూస్తే ఎంత తెరిస్తే ఎంత అన్న సామెతను సోము వీర్రాజు గుర్తు తెచ్చుకోవాలి.
బీజేపీతో జాగ్రత్త పవన్
అట్లాగే రెండు నాలుకల ధోరణితో ప్రజలను దగా చేస్తున్న బీజేపీతో కలిస్తే ప్రమాదమని పవన్ కళ్యాణ్ గుర్తించాలి. బీజేపీతో చేతులు కలపడం అంటే పాముకి పాలు పోసినట్లే అవుతుందని గ్రహించాలి. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు, అధికారంలో వాటా పొందేందుకు ఏ పార్టీ ప్రయత్నం చేసినా అది అంతిమంగా ఆ పార్టీ పతనానికే దారితీస్తుంది. గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రానికి బీజేపీ అనేక అంశాల్లో ద్రోహం చేస్తూనే వుంది. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. తానే చట్టసభల్లో, బహిరంగ సభల్లో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా ఆంధ్ర ప్రజలను అవమానించింది. రాష్ట్రంలోని అధికార పార్టీని తన అదుపులో పెట్టుకొని రాష్ట్రాన్ని వినాశనం వైపు నడిపిస్తోంది. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రంలో బలపడాలని చూస్తోంది.
ఏపీని చెరబట్టిన జగన్‌కే సపోర్ట్
కేంద్ర ప్రభుత్వ అండ లేకుండా జగన్ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి అప్పులు మీద అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాళా తీయించే పనికి పూనుకోలేదు. దొంగచాటుగా కేంద్రం కళ్ళు కప్పి, రిజర్వ్ బ్యాంక్ కళ్ళు కప్పి, ఇష్టానుసారం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా కేంద్రం కన్నెర్ర చేయకుండా అదనపు అప్పులు తెచ్చుకోవడానికి అనుమతులు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ చెరబట్టి అన్నీ విధాలా నాశనం చేస్తున్నా పైశాచిక ఆనందం పొందుతున్నారు తప్ప కేంద్రం కల్పించుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో వైసీపీని మోస్తున్నది బీజేపీనే. తన అత్యంత ఆప్త మిత్రుడు జగన్ రెడ్డిని అధికారంలోకి తీసుకు రావడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ ముఖ్యమంత్రి ఒక్కడే కేంద్రానికి అండగా నిలుస్తున్నారు. బీజేపీకి కావాల్సింది వారి చెప్పుచేతల్లో వుండేవారు. ఆడమన్నట్లు ఆడే జగన్ రెడ్డి వంటి వారిని బీజేపీ ఎందుకు వదులు కొంటుంది?
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి, అరాచకం. విధ్వంసం రాజ్యమేలుతోంది. జగన్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకంపై కేంద్రం ఒక్క మాట మాట్లాడలేదు. ఎన్నికల ప్రచార సభల్లో ఆర్థిక నేరస్థులను సహించేది లేదన్న మోడీ విస్పష్ట హెచ్చరిక పస లేనిదిగా, పనికిరానిదిగా మిగిలిపోయింది. తొమ్మిదేళ్లుగా ఆర్థిక నేరగాళ్ల అంతు చూసే దిశగా మోడీ అడుగులు పడలేదు. ఆర్థిక నేరస్థులను నిర్మూలించే మాట దేవుడెరుగు, ఆర్థిక నేరస్థుల మోచేతి నీళ్లు తాగుతున్నారు. జగన్ కేసుల విచారణ ఇంకెన్నేళ్ళు కొనసాగిస్తారో అర్థం కావడం లేదు. జగన్ అవినీతి చీకటి కోణాలను ఏకరువు పెట్టి జగన్ రెడ్డి అవినీతి నిగ్గు తేల్చకపోవడానికి కారణం కూడా బీజేపీ -వైసీపీ మధ్య క్విడ్-ప్రోకో ఒప్పందమే అని చెప్పాలి. రాజకీయ అవసరాల కోసమే జగన్‌పై ఈగ వాలనీయడం లేదు. కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తూ ప్రధాన కేసులను సీబీఐ నీరు కారుస్తున్నది.
కులాలను రెచ్చగొడుతున్న బీజేపీ నేతలు
రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇవ్వకపోయినా జగన్-కేంద్ర ప్రభుత్వంతో పోరాడే పరిస్థితి లేక రాష్ట్ర ప్రయోజనాలే తాకట్టు పెడుతున్నారు. కేంద్రం రాష్ట్రానికి న్యాయం చెయ్యకపోగా, రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేస్తున్న జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నది. కొందరు బీజేపీ నాయకులు వైసీపీ వద్ద ప్యాకేజీ తీసుకొని కులాలను రెచ్చగొడుతున్నారు. అందుకే కొందరు నాయకులు బీజేపీలో బతుకుతూ వైసీపీ వద్ద బత్తెం తీసుకొంటూ కులాల మధ్య చిచ్చు పెడుతూ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు. అందరి కన్నా మాది విలక్షణమైన రాజకీయ పార్టీగా చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కమల నాధులు అందరికంటే ఎక్కువ రోత రాజకీయాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆగం కావడానికి ప్రధాన ముద్దాయి బీజేపీనే అని చెప్పాలి.
నీరుకొండ ప్రసాద్
9849625610
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read...