మందికి నీతి చెప్తాం కానీ..

by Ravi |   ( Updated:2023-11-12 01:01:07.0  )
మందికి నీతి చెప్తాం కానీ..
X

నదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాలక్రమంలో అనేక కొత్తపార్టీలు పుట్టుకు వచ్చాయి. నాయకులు ఏ పార్టీ వారైనా, వారికి ఆ పార్టీల సిద్ధాంతాలకు, ఆదర్శాలకు, నైతిక విలువలకు, కట్టుబాట్లకు లోబడి మమేకమై చిత్తశుద్ధితో పనిచేసేవారు. పార్టీ లక్ష్యాలు, వ్యక్తుల నిర్ణయాలు వేరువేరుగా ఉండేవి కావు. ఆనాడు పార్టీలకు ప్రజాసేవే లక్ష్యంగా ఉండేవి. రాజకీయ పదవుల కోసం వెంపర్లాడేవి కావు. విపక్షాల విమర్శలు పార్లమెంటు, శాసన సభల్లోనూ... బయటా కూడా సహేతుకంగా గౌరవ భాషలో సూటిగా విమర్శలు చేసేవారు. సభకు వెళ్ళేటప్పుడు చర్చకు వచ్చే విషయాలపై ఇంటి వద్ద బాగా అధ్యయనం చేసి వెళ్ళేవారు. గణాంకాలతో, సంయమనంతో, ప్రజా సమస్యలను ఘాటుగా ప్రస్తావించేవారు. అప్పటికీ, ఇప్పటికీ కాలం ఎంతో మారిపోయింది. ఇప్పుడు అన్నిపార్టీలలో కూడా పాతకాలంనాటి విలువలు, ఆదర్శలు, గౌరవాలు, చక్కటి భాష అన్నీ అంతరించాయి. అన్నిపార్టీల నాయకులు స్వచ్ఛందంగా వాటిని వదిలేసుకున్నారు.

నిబద్ధతకు మారుపేరైన బీజేపీ నేడు..

ఒకప్పుడు వామపక్షాల తరువాత అంతటి నిబద్ధత, క్రమశిక్షణ గల పార్టీగా బీజేపీ ఉండేది. గతంలో ఈ పార్టీ పేర్లు వేరు రూపాలతో ఉన్నా సిద్ధాంతం ఒక్కటే. ఒకప్పుడు బీజేపీలో చేరాలంటే అంత సులువు కాదు. ఆ పార్టీ నియమ నిబంధనలు చక్కగా పాటించి, ఆచరించ గలిగిన వారికే అవకాశం ఉండేది. వారికి ప్రధానంగా ఆర్‌ఎస్‌ఎస్ పునాది ఉండేది. మొదటి నుంచీ ఆర్‌ఎస్‌ఎస్‌లో క్రమశిక్షణ ఉండేది. అఖండ భారత్ నిర్మాణ పునాది, గోల్వార్కర్ తాత్విక పునాది ఉండేది. శిశుమందిర్‌లో భారతీయత, హిందుత్వం గురించి బోధన ఉండేది. దీనిలో శిక్షణ పొందిన వారే క్రమంగా బీజేపీలో కార్యకర్తల నుండి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ఎదిగేవారు. పదవులు, హోదాలు వచ్చినా, రాకున్నా బాధపడేవారు కాదు. పార్టీ విస్తరణ కోసం, పార్టీ భావజాల వ్యాప్తి కోసం నిరంతరం శ్రమించేవారు. ఇందుకు ఉదాహరణ వెంకయ్యనాయుడు.

ఇప్పుడు పార్టీ పరిస్థితులు లక్ష్యాలు, ఆచరణ పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం ఎవరైనా స్వేచ్ఛగా పొందగలుగుతున్నారు. ఆయారాం, గయారాంలకు నిలయంగా మారింది. ఇప్పుడు ఎవరైనా, ఎప్పుడైనా బీజేపీలోకి ఏ పార్టీ నుండైనా వచ్చి చేరవచ్చు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా బీజేపీలో చేరటం ఎంత తేలికో అంతే వేగంగా, స్వేచ్ఛగా బీజేపీని వదిలి నాయకులు ఇతర పార్టీలలోకి ఫిరాయించగలుగుతున్నారు. మా పార్టీలో చేరిన వారు మా విధానాలను అంగీకరించాల్సి ఉంటుంది. అందువల్ల ఎందరు చేరినా మాకు పెద్దగా నష్టం లేదు అని కొద్ది సంవత్సరాల క్రితం అప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా చెప్పారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌కూ, బీజేపీకీ గుణగణాలలో పెద్ద తేడా ఏమీ లేదు. ఎవరు ఏ పార్టీలోనైనా, ఎప్పుడైనా చేరవచ్చునని కాలక్రమంలో మరింత రుజువై పోయింది.

ఈ చేరికలు ఉత్సాహపరిచినా..

ఒకప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి బీజేపీలో అంత త్వరగా చోటు దక్కేది కాదు. ఇప్పుడు... బీజేపీ సిద్ధాంతాలను గౌరవించిన వారు 'తమ జీవితమే బీజేపీ' అనుకున్న వారు ఆ పార్టీలో కూడా ఇమడలేకపోతున్నారు. ఇతర పార్టీలలోకి సంకోచం లేకుండా పార్టీ ఫిరాయిస్తున్నారు. ఇంతవరకు పార్టీ ఫిరాయింపు సంస్కృతి కాంగ్రెస్‌కు ఇతర పార్టీలకు పరిమితమయిన జాఢ్యం. కానీ, ఈ మధ్య బీజేపీ కూడా ఈ పార్టీ ఫిరాయింపు సంస్కృతిని బాగా ఆకళింపు చేసుకుని ఒక కళగా అభివృద్ధి చేసింది. ఉదాహరణకు, బీజేపీ కంచుకోట అయిన మధ్యప్రదేశ్‌లో పార్టీ విజయం సాధించేందుకే కాక... కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకు ఆ పార్టీ నేతల్ని పెద్ద ఎత్తున బీజేపీ లోకి ఆహ్వానం పలికారు. అప్పటి కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాను ఓడించేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలు ఆ తర్వాత సింధియాను, అతని అనుచరులతో సహా బీజేపీలోకి చేర్చుకుంది. సింధియా వర్గీయులకు శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో స్థానం కూడా దక్కింది. దీనివల్ల బీజేపీ తత్కాలికంగా బలపడినట్లు పైకి కనిపిస్తుంది. కానీ క్రమంగా బీజేపీ బలహీన పడిందనేది తెలుసుకోవాలి. ఎందుకంటే వారు వచ్చింది బీజేపీ విధానాలను, ఆదర్శాలను చూసి, నచ్చి, మెచ్చి కాదు. కేవలం పదవులు ఆశించి వచ్చారు. అలాగే, సింధియాతో పాటు బీజేపీలో చేరిన వాళ్లలో అనేకమంది బీజేపీ పార్టీలో నిలకడగా ఎక్కువ కాలం కొనసాగకపోవడానికి ప్రధాన కారణం మధ్యప్రదేశ్‌లో తిరిగి కాంగ్రెస్ పుంజుకుంటుందని గ్రహించడమే. దీంతో వారంతా బీజేపీ నుండి పోలో అంటూ పలాయనం చిత్తగించి మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలాంటి విధానాలతో బీజేపీ దీర్ఘకాలంలో నష్టపోతుందే గానీ బావుకొనేదేమీ ఉండదు. ఈ విషయాన్ని బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం ఎంత తొందరగా గుర్తిస్తే అంతమంచిది.

బీజేపీయే... బీజేపీని ఓడిస్తుంది

గతంలో ‘కాంగ్రెస్సే కాంగ్రెస్‌ను ఓడిస్తుంది’ అని ఆ పార్టీ నేతలు చెప్పుకొనేవారు. ఇప్పుడు అవే లక్షణాలు బీజేపీ గ్రూపు రాజకీయాలలో ప్రవేశించింది. కాంగ్రేస్‌లో ఉండే ముఠా తగాదాలు, సీనియర్ నేతలను లక్ష్యపెట్టకపోవడం, ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ప్రకటించుకోవడం. తమ గ్రూప్ వారితో జేజేలు కొట్టించుకోవడం... ఎన్నికల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రవర్తించటం, సొంత గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం, ఇతర పార్టీల్లోకి నిలకడ లేకుండా ఫిరాయింపులు చేయడం.. అధిష్టానం అనుమతులు లేకుండా పార్టీ ఎజెండాలు, వరాలు ప్రకటించటం, తమ పార్టీ నాయకుల పైనే వ్యక్తిగత విమర్శలు చేయటం ఇవి 'కాంగ్రెస్ బ్రాండ్' లక్షణాలుగా ఉండేవి. వాటిలో కొన్ని అవలక్షణాలు బీజేపీకి వచ్చి చేరాయి. ఇప్పుడు ‘బీజేపీయే... బీజేపీని ఓడిస్తుంది’ అనే స్థితికి వచ్చింది. అదే విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి 'కైలాశ్ విజయ్ వర్గీయ' వంటి నేతలు కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అంతర్గత తగాదాలు కూడా ఆ పార్టీ ఓటమికి బలమైన కారణంగా గుర్తించాలి.

రాష్ట్రాల్లో విస్తరించేందుకు అనుసరించిన విధానాలు బీజేపీకి, కాంగ్రెస్‌కు తేడా లేకుండా చేశాయి. అంతేకాదు, కాంగ్రెస్‌ను మించిన ఘోరాలకు బీజేపీ పాల్పడేలా చేశాయి. 2014–21 మధ్య పార్టీ ఫిరాయింపుల మూలంగా అత్యధికంగా లాభపడిన పార్టీ బీజేపీయే. అదే దుష్ట సంప్రదాయాన్ని ఇప్పటికీ అది కొనసాగిస్తుంది. ఉదాహరణకు మాజీ కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల్లో మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, అనుబంధ సంస్థల నేతలు, మాజీ అధికార ప్రతినిధులతో సహా ఎవ్వరినీ బీజేపీ వదలడం లేదు. అన్ని స్థాయిల్లో బేరసారాలు జరిపేందుకు రకరకాల శక్తుల్ని రంగంలోకి దింపారు. ఈ పాడు యజ్ఞంలో ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థల సేవలను కూడా బీజేపీ పార్టీ ప్రయోజనాల కోసం వాడుకుంది. ఇతర పార్టీల నాయకులపై ఈ సంస్థలతో దాడి చేయించి, వారి ఇండ్లపై, కార్యాలయాలపై పెద్ద ఎత్తున సోదాలు జరిపించి వారిని అవినీతిపరులుగా ముద్రవేసి, జైలుకు పంపుతామనీ బెదిరించి మరీ పార్టీలో కలుపుకున్నారు. ఆ తరువాత వారిపై విచారణ, వేధింపులు లేకుండా 'పదవుల పందారం' కూడా బీజేపీ చేసింది. అంటే ఒక వైపు అవినీతి పరులకూ, వారసత్వ రాజకీయాలకూ బీజేపీ తెరలేపింది.

ఏక వ్యక్తి కేంద్రీకృత అధికారం..

బీజేపీ వ్యూహంలో భాగంగా రాష్ట్రాల్లో విపక్ష ప్రభుత్వాలను పడగొట్టేందుకే కాక, కాంగ్రెస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు బీజేపీ అన్నికుయుక్తులను ఉపయోగించుకుంది. మోదీ ఇచ్చిన ‘కాంగ్రెస్ విముక్త భారత్’ నినాదానికి అనుగుణంగా వివిధ దశల్లో పార్టీ నేతలు రంగంలోకి దిగారు. కాని ఈ క్రమంలో భాగంగా బీజేపీయే తన అస్తిత్వం, వ్యక్తిత్వం,పవిత్రతను కోల్పోయింది. కాంగ్రెస్‌లో ఏ అవలక్షణాలు ఉన్నాయని సంవత్సరాల తరబడి బీజేపీ విమర్శలు చేసిందో సరిగ్గా అవే అవలక్షణాలను బీజేపీ సొంతం చేసుకుంది. ఇదే అదునుగా, కాంగ్రెస్ తన సర్వశక్తులూ కూడదీసుకుని సాధ్యమైనంత సంఘటితంగా తమను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోందని కమలనాథులు గ్రహించలేకపోయారు. కాంగ్రెస్ గతంలో అధిష్టాన సంస్కృతిని,'ఏక వ్యక్తి ' కేంద్రీకృత అధికారాన్ని పెంచి పోషించింది. ఇప్పుడు ఈ సంస్కృతిని బీజేపీ కూడా అలవరుచుకుంది. బీజేపీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మోదీ–అమిత్ షా లేనని, మిగతా వారంతా డమ్మీలేనని ప్రతి ఒక్కరికి అర్థమయింది. ఎన్నికల ప్రచారంలో మోదీ దిగితే తప్ప పార్టీకి గెలుపూ...ఊపు రాని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఇందిరాయే ఇండియా...ఇండియా అంటే ఇందిరా అని దేవకాంత్ బారువా అనేవారు. ఇప్పుడు ప్రతిదానికీ మోదీ నామజపమే పార్టీ శ్రేణులకు తారక మంత్రం అయింది. ఇప్పుడు ప్రతిచోటా...ఇంటా...బయటా..మోదీ, మోదీ నినాదాలే బీజేపీకి దిక్కయ్యాయి. వ్యక్తి పూజ, విగ్రహారాధన ఆదర్శమైంది.

చివరగా... భారతదేశ రాజకీయాల్లో పార్టీలు తమ విశిష్టతనూ, సైద్దాంతిక అస్తిత్వాన్నీ కోల్పోయాయి. అన్ని పార్టీలనూ ఒకే రకమైన వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. ప్రజలు ఏ పార్టీని ఎన్నుకోవాలో తెలియని సందిగ్ధంలో పడిపోయారు. చివరకు ఏ పార్టీనైతే ఏమిటి పళ్ళూడగొట్టుకోవడానికి అనే స్థాయికి దిగజార్చబడ్డారు.

డా. కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Advertisement

Next Story

Most Viewed