భూభారతి.. రైతుకు పట్టాలి హారతి!

by Ravi |   ( Updated:2024-12-24 01:16:00.0  )
భూభారతి.. రైతుకు పట్టాలి హారతి!
X

ఉమ్మడి రాష్ట్రంలోనే భూ సమస్యలతో రైతులు అనేక అవస్థలు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక భూముల సమస్య లకు పరిష్కారం చూపుతామని అప్పటి ప్రభుత్వం చెప్పి భూ సర్వే చేపట్టింది. అంతేనా.. అన్ని సమస్యలకు ధరణి ఓ చక్కని పరిష్కారమని చెప్పింది. కానీ.. ధరణి వచ్చిన తర్వాత ఉన్న సమస్యలకు కొత్త సమస్యలు తోడయ్యాయి. దీంతో రైతుల పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడ్డట్టయింది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో పడేస్తున్నామని, ఆర్వోఆర్ చట్టం తీసుకొస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించింది. అన్నట్లే ఇటీవల అసెంబ్లీలో భూ భారతి పేరిట ఆర్వోఆర్-2024 చట్టాన్ని ఆమోదించింది.

రైతులు ధరణి దరిద్రం పోయిందని, భూభారతి తమకు హారతి పడుతుందని రైతులు సంబరపడుతున్నారు. అయితే కొత్త ఆర్ఓఆర్ చట్టం రైతులకు చుట్టంలా మారి.. ప్రతి సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. ఏ సమస్యా పరిష్కారం కాలేదనడానికి లేకుండా.. ప్రతి రైతు భూమికి పక్కా హక్కులు కల్పించినప్పుడే ధరణి దరిద్రం పోయినట్లని రైతులు భావిస్తున్నారు.

ధరణితో చిక్కులే ఎక్కువ

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. రాష్ట్రంలో భూముల వివరాలు పక్కాగా ఉండాలని, ప్రతి రైతు భూమిని ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని, ప్రతి రైతు భూమికి హక్కులు కల్పిస్తామని చెప్పింది. దీంతో రైతులంతా సంబరపడ్డారు. అదే సమయంలో భూ సర్వే పేరిట ప్రతి మండలం, ప్రతి గ్రామంలో సర్వే చేశారు. పరిష్కారానికి నోచని, అపరిష్కృతంగా ఉన్న భూములకూ పట్టాలు కల్పిస్తారని రైతులు ఎంతో సంతోషించారు. కానీ పరిస్థితిలో ఏ మార్పు కనిపించలేదు. గతంలో ఉన్న పట్టా పాసుపుస్తకాల ఆధారంగానే కొత్త పాసు పుస్తకాలు జారీ చేశారు. అసంఖ్యాక సమస్యలకు ఏకైక పరిష్కారం ధరణి అని గొప్పలు చెప్పారు. మ్యూటేషన్లతో పాటు వెంటనే రిజిస్ట్రేషన్లు చేయొచ్చని ప్రభుత్వం చెప్పింది. కానీ రాతపూర్వక రికార్డులంటూ ఏమీ లేకుండాపోయాయి. అంతా ఆన్‌లైన్ చేయడంతో కనీసం పేరు మార్పు, ఇతర వివరాలకు కూడా రైతులు నోచుకోలేకపోయారు. ఆన్‌లైన్‌లో సమాచారం ఉన్నవాడిదే భూమి అన్నట్లు తయారైంది. కాస్తుకాలం లేకపోవడంతో కాస్తులో ఉన్న వారు ఫలాలు అందుకోలేకపోయారు. అసలు కాస్తు చేసే రైతునే పట్టించుకోలేదు. పైగా గతంలో పరిష్కారంలో ఉన్న భూములనే ఆన్‌లైన్ చేశారే తప్ప.. సమస్యల పరిష్కారానికి మార్గం చూపించలేదు. భూ సర్వేలో వెలుగు చూసిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావించినా.. ఆశలు అడియాసలయ్యాయి.

కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు..

ధరణి వల్ల రైతులు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. చిన్న చిన్న సమస్యలకు కూడా ఆన్‌లైన్‌లో పరిష్కారం లభించలేదు. తహసీల్దార్లు కూడా పరిష్కారం చూపే ప్రయత్నం చేయలేదు. ప్రతి సమస్యను పై అధికారులకే విన్న వించుకోవాలని చెప్ప డంతో రైతులు తిరిగి తిరిగి విసిగి వేసారిపోయారు. భూమి సమస్యలపై సాక్షాత్తు అప్పటి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం సమస్యలు ఎదుర్కొన్నా.. పరిష్కారం కాలేదంటే ధరణితో పడ్డ బాధలెలా ఉన్నాయో అర్థ౦ చేసుకోవచ్చు. మరోవైపు చిన్న చిన్న సమస్యలకు కూడా ఆన్‌లైన్‌లో ఆప్షన్లు లేకపోవడంతో ఐదేండ్లుగా రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టారు. పాసుపుస్తకం తప్ప పహానీ పొందలేకపోయారు. ఇక నిషేధిత జాబితా 22(ఏ)లో ఉన్న భూములకు పరిష్కారమే చూపలేదు. దీంతో రైతులు హక్కులకు నోచుకోకుండాపోయారు. భూదాన్, పోరంబోకు, సీలింగ్ భూములకు రైతులు హక్కులు పొందలేకపోయారు. గతంలో జాగీర్దార్ల ద్వారా పొందిన భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఇప్పటికీ హక్కులు లేకుండాపోయాయి. సాదా బైనామా ద్వారా, పార్ట్ -బీలో ఉన్నవాటికి ఇంకా పరిష్కారం లభించలేదు. వీటికి పరిష్కారం గ్రామ స్థాయిలోనే లభిస్తుంది. అటువంటి వాటిని ప్రభుత్వం పరిష్కరించి రైతులకు పూర్తిస్థాయి హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది.

ఆచరణలోనూ చేసి చూపించాలి!

భూ భారతి పేరిట ఆర్‌ఓఆర్ చట్టం-2024ను తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. గతంలో ధరణి తీసుకొచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని కొత్త సమస్యలు సృష్టించింది. ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటి ప్రభుత్వం అలా కాకుండా కొత్తవి, పాతవి అన్ని సమస్యలకు పరిష్కారం చూపాలి. అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యలను సత్వరం పరిష్కరించాలి. అందుకు కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామస్థాయిలో సగం సమస్యలు పరిష్కరం అయ్యేలా మిగతావి రెవెన్యూ అధికారులు పరిష్కరించేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తే మరీ బాగుంటుందని రైతుల అభిప్రాయం. గతంలో ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. దాన్ని పునరుద్ధరించడం ద్వారా రెవెన్యూ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే రెవెన్యూ అధికారులు రైతులను తిప్పించుకోకుండా, అవినీతికి పాల్పడకుండా చూసేందుకు గ్రామస్థాయిలో అధికారులతో కమిటీలు వేసి ఉన్న సమస్యలు తెలుసుకునేలా అవకాశాలు కల్పించాలి. అప్పుడే కొత్త ఆర్ఓఆర్ చట్టంతో రెవెన్యూ వ్యవస్థకు జవసత్వాలు అందించడంతో పాటు రైతు సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యేలా భూభారతి.. రైతులకు హారతి పడుతుంది. అప్పుడే రైతుల మోముల్లో సంతోషం వెల్లివిరుస్తుంది.

-వామన్ మామిళ్ల,

సీనియర్ జర్నలిస్టు,

99085 56358

Advertisement

Next Story

Most Viewed