ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని చంపేశారు!

by Ravi |   ( Updated:2023-07-19 00:45:52.0  )
ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని చంపేశారు!
X

వందమంది నేరస్థులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనేది రాజ్యాంగ ఉవాచ! కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తప్పు చేసిన ఉపాధ్యాయుడితో పాటు తప్పు చేయని వ్యక్తికి శిక్ష వేస్తున్నారు. మానవతా విలువలు పక్కకుపెట్టి రాక్షసత్వానికి నిజరూపమిచ్చి చీమకు కూడా హానిచేసే స్వభావం తెలీని ఓ ఉపాధ్యాయుడిని కుట్రలో ఇరికించి తగలబెట్టారు. పాఠశాలలో విద్యార్థి కటింగ్ పై వాడిన ఓ అసాంఘిక పదంతో అక్రమాలను ప్రశ్నిస్తున్న అతనిపై కుట్రపన్ని అక్కడ విద్యార్థినిని వేధించిన వ్యవహారంలో ఒక వెధవకు పడాల్సిన శిక్షను సంబంధం లేని మరొకరికి వేశారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఏబీవీపీ సంఘాలు తోడయ్యాయి. యూట్యూబ్‌లు..తమకు పేరు తెచ్చుకునేందుకు బరితెగించి వ్యవహారించి వాస్తవాలకు ముసుగులు తొడిగి, అసత్యాలకు రంగులద్ది ఓ కథను, కథనాన్ని వేగంగా వ్యాపింపజేయడంలో శక్తివంచన లేకుండా శ్రమించారు.

ఉపాధ్యాయుడిపై హత్యాయత్నం

పోలీసుల కళ్లెదుటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే, విధి నిర్వహణలో వున్న ఉపాధ్యాయుడికి లైంగిక వేధింపులు అంటగట్టి జనాలను ఉసిగొల్పితే.. వారు వెంటపతుంటే ప్రాణభయంతో పారిపోతున్నా అతనిని చంపేసే అంత పని చేశారు. పోలీసుల రక్షణలో వున్నప్పటికీ అల్లరిమూకలు, మహిళా స్రష్టలు కొందరు పోలీసులను పక్కకు లాగి మరీ కొట్టారు. మహిళలపై పరంపరగా సాగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో తెర వెనుక కుట్రను ఛేదించడానికి బదులు కేసు బిగించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుడిపై హత్యాయత్నం జరిగింది. మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. మరి చట్టం ఎవరికి చుట్టరికం చేస్తుందో చూద్దాం.

అతనో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు..ఉద్యోగంలో చేరిన నాటి నుంచి బాధిత ఉపాధ్యాయుడితో నాకు పరిచయం ఉంది. చక్కని పనితీరును కలిగిన నేపథ్యం ఆయనది. తన ఇద్దరు పిల్లలను కూడా అదే పాఠశాలలో చదివించుకొంటున్నాడు. పది మందితో కూడిన ఏపిటిఎఫ్ బృందం ఆదివారం పాఠశాలను, గ్రామాన్ని సందర్శించిన అనంతరం సేకరించిన వాస్తవాల ఆధారంగా ఈ వ్యాసం రాస్తున్నా.ఇప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. కానీ తప్పు చేయని ఉపాధ్యాయునికి సంబంధించిన వాస్తవాలు చీకట్లో ఉండిపోకూడదనే ఉద్దేశ్యంతో ఆ వాస్తవాలను సమాజం ముందుంచుతున్నా.

నేరంలోకి ఉపాధ్యాయుడిని లాగి..

తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ బంగారు పేట ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన యదార్థ సంఘటన ఇది. అనివార్య కారణాల రీత్యా పేర్లు ప్రస్తావించడం లేదు. బాధిత ఉపాధ్యాయుడు. ఆ పాఠశాలలో నిర్వహణ లోపాలను ప్రశ్నించడం మొదలు పెట్టాడు. ఒక ఉపాధ్యాయుడు బాలికల పట్ల అనుచితంగా వ్యవహరించడాన్ని ప్రశ్నించాడు. మరో టీచర్ స్థానికుడు. ఊరంతా కలియతిరిగి ఉన్నదీ లేనిది ప్రచారం చేసి తీరిక సమయంలో బడిలో ఉంటాడు. ప్రధానోపాధ్యాయుడు నాడు- నేడు పనుల నిధులు భోంచేశారు. అందులో అధికారికి స్థానిక నాయకుడొకరికి వాటా ఇచ్చాడు. వీటన్నింటిని బాధిత ఉపాధ్యాయుడు ప్రశ్నించాడు. ఈ విషయం నా దృష్టికి తేవడంతో నేను సర్వ శిక్షా అభియాన్ ఉన్నతాధికారుల దృష్టికి, జిల్లా విద్యా శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కొన్ని గంటల్లో చర్యలు తీసుకున్నారు. దీంతో బాధిత ఉపాధ్యాయుడిని టార్గెట్ చేసి.. సహ ఉపాధ్యాయుల నుంచి వెలి వేయించారు. బాలికల పట్ల అసహ్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారు.ఇంతటితో సమస్య ముగిసిపోయిందనుకున్నారు. కానీ పాఠశాల పునఃప్రారంభం లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

అంతా సక్రమంగా ఉన్న సమయంలో.. గత వారం బాధిత ఉపాధ్యాయుడు ఏడో తరగతి చదివే ఒక బాలుడిని క్రాప్ సరిలేదని సరి చేయించుకుని రాకపోతే టీసీ ఇచ్చి పంపుతామని హెచ్చరించారు. ఆ సందర్భంగా నోరు జారి ఒక తప్పు పదం వాడారు. మధ్యాహ్నం ఆ పిల్లాడి తల్లి పాఠశాలకు వచ్చి మా కొడుక్కి కాదు టీసీ ఇచ్చేది, నిన్నే ఈ బడిలో లేకుండా చేస్తామంటూ హుంకరించి, అదే బడిలో తన చెల్లిలి కుమార్తె చదువుతుండడంతో ఆమెను ఉసిగొల్పింది. బోధనలో భాగంగా అప్పుడప్పుడూ ఆయన అనే మాటలను ఊరంతా ప్రచారం చేశారు.ఇందులో స్థానికుడైన ఒక ఉపాధ్యాయుడిదే కీలక పాత్ర. తన బిడ్డ నడుము గిల్లాడని చెల్లెలు అక్కకు తోడు నిలిచింది. తన సామాజిక వర్గానికి చెందిన వారిని రెచ్చగొట్టింది. యువకులను ప్రేరేపించారు. ఆ మరుసటి రోజే తమకు కంటిలో నలుసుగా ఉన్న ఉపాధ్యాయుడిని నేర చట్రంలోకి లాగారు. విలేకరులను రప్పించారు. యూట్యూబ్ ఛానెళ్ల వారు గుమికూడారు. ఒక విద్యార్థి సంఘం ముసుగులో అల్లరి మూకలు తోడయ్యాయి. గణితం సబ్జెక్టులోకి కన్వెర్షన్ కోసం నెల్లూరుకు వెళ్ళాల్సి ఉన్న ఉపాధ్యాయుడికి హెడ్మాస్టర్ ద్వారా ఫోన్ చేత ఫోన్ చేయించి రప్పించారు. పాఠశాలకు రాకపోతే ఇంటికి వచ్చి తంతామని బెదిరించారు. పాఠశాలలో నిర్భయంగా అడుగుపెట్టిన ఉపాధ్యాయుడిని చుట్టుముట్టి కొట్టారు. చేతులతో, చెప్పులతో చావబాదారు. ఇదొక రకంగా హత్యాయత్నం. ప్రాణ భయంతో పరుగులు తీసిన వెంటబడి కొట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో ప్రస్తుత హెడ్మాస్టర్ పోలీసులు రప్పించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆయన్ను రక్షించే క్రమంలో పోలీసులకు కూడా దెబ్బలు తగిలాయి. ఉపాధ్యాయుడి మోటార్ బైకును సైతం తగులబెట్టారు. కనీసం గంట సేపు జరిగిన ఈ రాక్షస క్రీడకు కర్త కర్మ క్రియ ఎవరనేది అందరికీ తెలిసిందే! స్థానికుడైన ఎంఈఓ, ప్రధానోపాధ్యాయుడి ఆధిపత్యాన్ని, అక్రమాలను ప్రశ్నిస్తే పరిస్థితి మరోలా ఉండదు కదా! ఎంఈఓ అక్రమాల మీద ఎవరో సమాచార హక్కు చట్టాన్ని ప్రయోగించారు. ఈ టీచర్ ప్రోద్భలంతో ఇవన్నీ జరుగుతున్నాయని భ్రమపడిన అధికారి అన్ని వర్గాలను కూడగట్టి తుదముట్టించే ప్రయత్నం చేశారు.

అధికార దర్పానికి బలైన టీచర్!

ఒక కాకి అసువులు బాస్తే వంద కాకులు అశ్రువులు రాలుస్తాయి. కానీ ఇక్కడ ఒక టీచర్‌కు అన్యాయం జరిగితే అధికార దర్పానికి ఎదురు పడలేక, బయట గోడల కింద తారాడుతూ పాపం! ఉపాధ్యాయుడు అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. నిర్దోషికి శిక్ష పడకూడదన్న రాజ్యాంగ సూత్రం ఇక్కడ అమలు కాలేదు.! ఇటువంటి కలుషిత సమాజంలో ఉపాధ్యాయుల జీవితాలు గాలిలో దీపాలయ్యాయి. పని వేళల్లో అక్రమంగా ప్రాంగణంలోకి ప్రవేశించడమే కాకుండా దాడులు చేస్తున్న వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించలేదు. విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుడిపై అల్లరిమూకలు పెట్రేగినా అధికారులు స్పందించడం లేదు. నిజంగా పొరపాటు ఉంటే చట్ట పరిధిలో శిక్షించండి. పొట్టకూటి కోసం ఉపాధ్యాయులుగా జీవితాలు సాగిస్తున్న సన్న, మధ్య తరగతి వారు దెబ్బతింటే ఆయా ఉపాధ్యాయుల జీవితాలు ముగిసిపోతే వారి వెనుకున్న కుటుంబాలకు దిక్కెవరు? పోలీసు అధికారులు ఈ కుట్ర కోణాన్ని ఛేదించాలి. బాధితుడికి న్యాయం చేయాలి. ఇక ఉపాధ్యాయులు సైతం నైతిక విలువలకు కట్టుబడాలి.

నేర సమాజం, మీడియా ప్రభావంతో ఊగిపోతున్న వారిని సంస్కరించడం మన వల్ల కాని పని. తల్లిదండ్రులు సైతం పిల్లలను సన్మార్గంలో పెట్టాలనే ఆలోచన నుంచి వైదొలిగారు. వారు ఉపాధ్యాయులు అనే ఉత్క్రుష్ట భావన నుంచి పక్కకు మళ్లారు. అందుకే ఉపాధ్యాయులను బోనెక్కించడానికి వారు సంశయించడం లేదు. ఒకవైపు భోధన విధుల నుంచే అలసిపోతుంటే బోధనేతర విధులు, సమాచార హక్కు చట్టం పేరుతో బెదిరింపులు, విధి నిర్వహణలో తీవ్ర వత్తిళ్ళు ఉపాధ్యాయుల మానసిక స్థితిని కుంగదీస్తున్నాయి. ఇంత శ్రమించి పనిచేస్తున్న వారికి సమాజం ద్వారా లభిస్తున్న పురస్కారాలు ఈ విధంగా ఉంటున్నాయి. ఇది దురదృష్టకర సంఘటన. అయినా అంతిమంగా మూల్యం చెల్లించుకోవలసింది సమాజమే!

-మోహన్ దాస్, రాష్ట్ర కౌన్సిలర్,

ఏపీటీఎఫ్ 1938.

94908 09909

Advertisement

Next Story

Most Viewed