- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పక్షపాత పాలనలో టీఆర్ఎస్! సాక్ష్యాలివే అంటోన్న బండి సంజయ్
మాటలతో పబ్బం గడిపేవారికి బుద్దిచెప్పడానికి విజ్ఞులైన తెలంగాణ ప్రజలు కదం తొక్కుతున్నారు. కేసీఆర్ కుటుంబ పాలన చూస్తుంటే ''అన్నపురాసులు ఒక చోట... ఆకలి మంటలు ఒక చోట. సంపదలన్నీ ఒక చోట... గంపెడు బలంగంబొక చోట'' అని సమాజంలో అసమానతలను ఎలుగెత్తిన ప్రజా కవి కాళోజీ మాటలు గుర్తురాక మానవు. తెలంగాణ అభివృద్ధి కోసం అలమటిస్తుంటే ఆ మూడు నియోజకవర్గాల బొజ్జలనే నింపుతున్నరు. ఈ వివక్ష పూరిత కుటుంబ పాలనను, సవతి ప్రేమను గుర్తించి అర్థం చేసుకొని ఇప్పటికయినా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం బయటకు రావాలే. 'సాలు దొర... సెలవు దొర' అని దండం పెట్టి సకల జనులు కలలు కన్న తెలంగాణ కోసం పునరంకితం కావాలే.
నీళ్లు, నిధులు, నియామకాలలో జరుగుతున్న అన్యాయాలు, తెలంగాణ ప్రాంతం పట్ల చూపుతున్న వివక్షత కారణంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చింది. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలోనే అభివృద్ధి జరుగుతోంది. మిగతా 116 అసెంబ్లీ నియోజకవర్గాల పట్ల సవతి తల్లి ప్రేమ, వివక్షత కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకత్వం కల్పిస్తోంది. తెలంగాణ వస్తే మన పల్లె బాగుపడ్తది, మన ఇల్లు బాగుపడ్తదని కలలు కన్నం. మన బతుకులు బాగుపడ్తయని మన అక్కాచెల్లెండ్లంతా కలిసి బతుకమ్మ ఆడిన్రు. మనకు ఉద్యోగాలొస్తయని అన్నదమ్ములంతా ప్రాణాలకు తెగించి కొట్లాడిన్రు, అమరులయిన్రు.
ఎన్నో త్యాగాల తర్వాత తెలంగాణ వచ్చినా మన పొలాలకు నీళ్లు రాలే. మన పిల్లలకు కొలువులు రాలే. మన పల్లెలు పచ్చగ గాలే. కానీ, కేసీఆర్ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట నియోజకవర్గాలు మాత్రం అన్నిరకాలుగా అభివృద్ధి చెందినయ్. అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలని కదా సకలజనులు పోరాటం చేసింది? ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నిధులన్నీ కుప్పం తీస్కపోతున్నరని, వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నిధులన్నీ పులివెందులకు తీస్కపోతున్నరని కేసులు వేసింది టీఆర్‌ఎస్ నాయకులే కదా? మరి ఈ రోజు మీరు చేస్తున్నదేంటి? నాడు ఆంధ్రా వలస దోపిడీ గురించి ఎలుగెత్తిన మీరు, ఈ ఎనిమిదేండ్లుగా మీ కుటుంబం చేస్తున్న దోపిడీ సంగతేంటి? సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలలో ఉన్న అభివృద్ధి తెలంగాణలో మిగిలిన 116 నియోజకవర్గాలలో ఎందుకు లేదని ప్రజలు అడుగుతున్న ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉన్నదా? ప్రమాణ స్వీకారం నాడు రాగ ద్వేషాలకు అతీతంగా పాలన చేస్తమని చెప్పిన మీరు, ఈ రోజు ఆ ప్రమాణాన్ని ధిక్కరించి యావత్ తెలంగాణకు అన్యాయం చేస్తున్నరు.
సమానత్వం ఎక్కడ?
ప్రభుత్వం అన్ని చోట్ల సమాన సౌకర్యాలు, అవకాశాలు, వనరులు అందించాలని ఆదేశిక సూత్రాలలోని 38 వ అధికరణం చెబుతున్నది. మన రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేసీఆర్ కుటుంబం తాలూకు నియోజకవర్గాలలోనే నిధుల వరద పారుతున్నది. ఆ మూడు నియోజకవర్గాలలోనే విద్యాసంస్థలు, పరిశోధక సంస్థలు, పరిశ్రమలు, విశాలమైన రోడ్లు, కాలువలు, సాగునీరు, ట్యాంక్ బండ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, అర్హులందరికీ ఆసరా పించన్లు అందిస్తున్నరు. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలిస్తున్నరు. టీఆర్‌ఎస్ ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మరీ అధ్వానంగా ఉన్నయి. ప్రజాసంగ్రామ పాదయాత్రలో అడుగడుగునా అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యపు జాడలు కనిపించినయ్. బలహీనవర్గాల ఎమ్మెల్యేలను బానిసలుగా చూడటం వలననే అక్కడ అభివృద్ధికి అతీగతీ లేకుండా పోయింది.
ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను కూడా పట్టించుకుంటలేరు. టీఆర్‌ఎస్ సవతి తల్లి ప్రేమతో తెలంగాణ గోసవడ్తున్నది. పథకాలు, పార్కులు, పరిశ్రమలు, కాలేజీలు, రోడ్లు, సాగునీటి కాలువలు, పరిహారాలు, జీతాల కోసం సిరిసిల్ల, సిద్ధిపేట గజ్వేల్ నియోజకవర్గాలలో ఎంత ఖర్చు చేసిన్రో? మిగిలిన నియోజకవర్గాలలో ఎంత ఖర్చు చేసిన్రో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉన్నదా? మన ఊరు, ప్రాంతం బాగుపడాలంటే తెలంగాణలో ఇప్పుడు మూడే ఆప్షన్లు ఉన్నయ్. ఒకటి మన ఎమ్మెల్యే సీఎం కావాలే. లేదంటే సీఎం కొడుకో, అల్లుడో మనకు ఎమ్మెల్యేగా ఉండాలే. మూడోది కనీసం ఉపఎన్నిక అయినా రావాలే. ఉపఎన్నిక వస్తేనే కేసీఆర్‌కు అభివృద్ధి గుర్తుకొస్తది. కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి అడుగు బయటపెడ్తరు. నిధులిస్తరు. రాత్రికి రాత్రే రోడ్లేయిస్తరు. కమ్యూనిటీ భవనాలు కట్టిస్తరు. అర్హులందరికి పింఛన్లు ఇస్తరు. దళితబంధు అమలు చేస్తరు. గొర్లు పంచుతరు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తరు. దుబ్బాక, నాగార్జునసాగర్, హుజురాబాద్‌లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజానీకం కళ్లారా చూసింది.
అలా అయితేనే నిధులు
రాజీనామా చేస్తేనే మునుగోడు అభివృద్ధి సాధ్యం అని నమ్మిన మా సహచరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలు నిజమైతున్నయి. ఆయన రాజీనామా చేసినంకనే చేనేత బీమాపై చలనం వచ్చింది. మునుగోడులోలో పంచాయతీ భవనాలు, రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, యువజన సంఘాల భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులకు క్లియరెన్స్ వస్తున్నది. సీసీ రోడ్లకు ప్రతిపాదనలు వస్తున్నయి. మిషన్ భగీరథ పనులు మొదలైతున్నయి. పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నరు. సర్పంచుల బిల్లులకు మోక్షం లభిస్తున్నది. హామీలూ క్లియర్ అయితున్నయ్. ఇవన్నీ ఉపఎన్నిక ద్వారా సాధించిన విజయం కాదా? మీ పక్షపాత పాలనకు ఇంతకు మించిన సాక్ష్యాలు ఏం కావాలే? ఇంకో సంవత్సరమయితే ఎన్నికలుండే, ఎవరి సంక్షేమం కోసం ఈ ఉపఎన్నిక తీసుకొచ్చిన్రని కేసీఆర్ చిలుకపలుకలు పలుకుతున్నరు. మునుగోడు అభివృద్ధి కోసం ఈ ఉపఎన్నిక వచ్చిందని మేధావులందరికీ తెలుసు.
ఇది ఉపఎన్నిక కాదు, ధర్మ యుద్ధం. ఈ మహాయాగంలో బీజేపీని గెలిపించడానికి జనమంతా దీక్ష పూనుతున్నరు. 2018లో ముందస్తు ఎన్నికలకు పోయి వేల కోట్ల ప్రజాధనం వృథా చేసిన కేసీఆర్‌కి ఈ ఉపఎన్నిక గురించి వంకరగా మాట్లాడే హక్కే లేదు. దేశ చరిత్రలో ఎక్కడైనా రాజీనామా చేస్తే అది పోరాటమో, రిఫరెండమో అయ్యింది. తెలంగాణలో మాత్రం అభివృద్ధి కోసం రాజీనామా చేయాల్సి వస్తున్నదంటే, దానికి కేసీఆర్ ప్రభుత్వం సిగ్గుపడాలి. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాజీనామా చేయించకుండా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోట్లాది రూపాయల ముడుపులిచ్చి టీఆర్‌ఎస్‌లో చేర్చుకొన్నారు. వారి నియోజకవర్గాలలో కొంచెమైన అభివృద్ధి జరిగిందా? ప్రజాతీర్పుకు విలువ ఇవ్వకుండా ద్రోహం చేసిన ఆ ఎమ్మెల్యేలు ఆత్మవిమర్శ చేసుకోవాలే. ఆ పన్నెండు మంది రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లి ఉంటే, ఆ నియోజకవర్గాలు కూడా గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట నియోజకవర్గాల్లాగా మెరిసిపోయేవి.
వారు బయటకు రావాలే
టీఆర్‌ఎస్ అప్రజాస్వామికంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మింగేసింది. అయినా కాంగ్రెస్, వామపక్ష నాయకులు ఒక్క మాటా మాట్లడలే. కేవలం తమ కుటుంబాల నియోజకవర్గాలనే కేసీఆర్ అభివృద్ధి చేసుకుంటున్నరు. అయినా సరే ఈ ఎర్ర గులాబీలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే కాంగ్రెస్ నాయకులు నోరు మెదపలే. ఈ రోజు బీజేపీని చూపిస్తూ నయా నిజాంగా ఖ్యాతి గడిరచిన కేసీఆర్‌కు తమ కార్యకర్తల నమ్మకాన్ని, త్యాగాన్ని తాకట్టుపెట్టిన వామపక్ష నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతరు. 2017లో తన పదవికి రాజీనామా చేయకుండానే రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నరు. దీంతో కాంగ్రెస్ ఎలాంటి వారికి ఆశ్రయం ఇస్తున్నదో ప్రజలు అర్థం చేసుకున్నరు. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ వ్యక్తికి ఏకంగా పీసీసీ పదవినే అప్పగించిన పార్టీకి అంతకు మించి నైతిక విలువలు ఉంటాయనుకోవడం అత్యాశే అవుతుంది. టీఆర్‌ఎస్ బలహీనవర్గాల ఆకాంక్షలను వ్యక్తం చేసే పార్టీ కాదని ఉద్యమ సమయంలోనే ఎంతోమంది మేధావులు మొత్తుకున్నా ఎవ్వరూ వినలే. అధికార పీఠం ఎక్కినంక టీఆర్‌ఎస్ వికృత రూపం కళ్లారా చూస్తున్నరు.
కేసీఆర్ వినసొంపైన తెలంగాణభాష మాట్లాడతరు. బహిరంగ సభలలో అరచేతిలో వైకుంఠం చూపిస్తరు. తెలంగాణ వస్తే దళితుడు ముఖ్యమంత్రి అయితడన్న అబద్ధాలకోరు కేసీఆర్. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ ఉచిత విద్య, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, రైతులకు రుణమాఫీ, ఉచిత ఎరువులు, దళితులకు మూడెకరాల భూమి ఇట్లా ఎన్నో హామీలతో ఆశలు పెట్టి, అన్నీ నాశనం చేసిన ద్రోహి కేసీఆర్. మాటలతో పబ్బం గడిపేవారికి బుద్దిచెప్పడానికి విజ్ఞులైన తెలంగాణ ప్రజలు కదం తొక్కుతున్నారు. కేసీఆర్ కుటుంబ పాలన చూస్తుంటే ''అన్నపురాసులు ఒక చోట... ఆకలి మంటలు ఒక చోట. సంపదలన్నీ ఒక చోట... గంపెడు బలంగంబొక చోట'' అని సమాజంలో అసమానతలను ఎలుగెత్తిన ప్రజా కవి కాళోజీ మాటలు గుర్తురాక మానవు. తెలంగాణ అభివృద్ధి కోసం అలమటిస్తుంటే ఆ మూడు నియోజకవర్గాల బొజ్జలనే నింపుతున్నరు. ఈ వివక్ష పూరిత కుటుంబ పాలనను, సవతి ప్రేమను గుర్తించి అర్థం చేసుకొని ఇప్పటికయినా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం బయటకు రావాలే. 'సాలు దొర... సెలవు దొర' అని దండం పెట్టి సకల జనులు కలలు కన్న తెలంగాణ కోసం పునరంకితం కావాలే.
Also Read : మునుగోడులో బీజేపీ సీక్రెట్ ఆపరేషన్.. రహస్యంగా నేతల కదలికలు
బండి సంజయ్‌కుమార్
ఎంపీ, కరీంనగర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు