యువత కోసం ఈ యాత్ర! ప్రభుత్వ వైఫల్యాలపై బండి సంజయ్ స్పెషల్ ఎడిటోరియల్

by Ravi |   ( Updated:2022-09-03 15:14:23.0  )
యువత కోసం ఈ యాత్ర! ప్రభుత్వ వైఫల్యాలపై బండి సంజయ్ స్పెషల్ ఎడిటోరియల్
X

జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో నిరుద్యోగ యువత చదువుకోవడానికి 'ఇ-లైబ్రరీ'లు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌, ఆనాటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, నేటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ ఇచ్చిన హామీ ఏమైంది? గ్రంథాలయాలలో మౌలిక సౌకర్యాలు, పుస్తకాలు, జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు ప్రతి నెలా రూ.15 లక్షలు కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు పుస్తకాలు, మరుగుదొడ్ల వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. జీహెచ్‌ఎంసీకి వస్తున్న ఆస్తిపన్నులో ఎనిమిది శాతం కేటాయిస్తామని చెప్పారు. 2014 నుంచి ఇప్పటివరకు రూ.700 వందల కోట్లు కేటాయించకుండా చోద్యం చూస్తున్నారు. బిస్వాల్‌ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో 1 లక్షా 91 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ, 80,039 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన లక్షలాది మంది నిరుద్యోగులను నిరాశకు గురిచేసింది.

తెలంగాణ రాష్ట్రంలో విద్య, ఉపాధి అవకాశాలు పెంపొందాలని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న యువతకు భరోసా ఇచ్చే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నది. ఆగస్టు రెండు నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభం కానుంది. 24 రోజులపాటు ఉమ్మడి నల్గొండ, వరంగల్‌ జిల్లాలలోని 125 గ్రామాలలో 328 కిలోమీటర్ల వరకు సాగే ఈ పాదయాత్ర వరంగల్‌ భద్రకాళి గుడి వద్ద భారీ బహిరంగ సభతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎనిమిదేండ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేసిందో క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ పని తీరును నిలదీస్తాం. విద్యారంగం పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వలన విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొవిడ్‌ కాలంలో రెండేండ్లు విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. తల్లిదండ్రులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. దీంతో వారు పెరిగిన ఫీజులు కట్టలేక అష్టకష్టాలు పడుతున్నారు.

కనీస వసతులు లేక

ప్రభుత్వ పాఠశాలలలో మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్‌, కరెంటు, అదనపు తరగతి గదులు, భవనాల మరమ్మత్తులు వంటి సౌకర్యాల కల్పన కోసం రూపొందించిన 'మన ఊరు-మన బడి' కార్యక్రమానికి కేంద్రం అందిస్తున్న నిధులే ఎక్కువ. ఈ పథకానికి అవసరమైన నిధులను సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ), రేగా (ఎంజీఎన్‌‌ఆర్‌ఈజీఏ), ఐసీడీఎస్, నాబార్డ్‌, ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌, జిల్లాపరిషత్‌, మండల పరిషత్‌, గ్రంథాలయ సంస్థల నుంచి సేకరిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 26,065 పాఠశాలలలో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.7,289.54 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. బడ్జెట్‌‌లో మాత్రం ఈ పద్దు ఎక్కడా కన్పించలేదు.

'సొమ్ము ఒకరిది, సోకు ఇంకొకరిది' అన్న చందంగా మొదటి దశలో ఈ విద్యా సంవత్సరం 9,123 బడులలో 12 రకాల పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓ నం. 4) ఇచ్చింది. వసతుల కల్పనకు మొదటి దశలో ఖర్చు చేసే రూ.3,497.62 కోట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లకు పైగా ఇస్తుంది. సుమారు 12 వేల పాఠశాలలకు అదనపు తరగతి గదులు కావాలని, 300 పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కేంద్రం నిధులు ఇచ్చినా ఈ పనులు పూర్తి చేయడానికి టీఆర్‌ఎస్‌కు మనసు రావడం లేదు.

బడా బాబుల సేవలో

'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో బడా బాబులకు టెండర్లు దక్కడం కోసం మొదట నిర్ణయించిన రూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే మార్చేసింది. కొటేషన్స్‌ పెంచి టెండర్లను బడాబాబులకు అప్పగించే ప్రయత్నం చేసింది. రూ.1,539 కోట్ల పనుల విలువలను ఏకంగా రూ.1,954 కోట్లకు పెంచింది. గ్రీన్‌ చాక్‌బోర్డు రూ.164 కోట్ల నుంచి రూ.215 కోట్లకు, డ్యూయల్‌ డెస్క్‌ రూ.360 కోట్ల నుంచి రూ.511 కోట్లకు, ఫర్నిచర్‌ రూ.195 కోట్ల నుంచి రూ.328 కోట్లకు, భవనాలకు రంగులు రూ.820 కోట్ల నుంచి రూ.900 కోట్లకు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. కొన్ని పనులలో ఏకంగా 60 శాతం ఎక్కువ కోట్‌ చేస్తూ బిడ్లలను దాఖలు చేశాయి. ఈ టెండర్లను సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్రీయ భండార్‌, జెనిత్‌ మోటా ప్యాప్స్‌, వి-3 ఎంటర్‌ప్రైజైస్‌ తదితర సంస్థలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. హైకోర్టు విచారణ జరిపి ఈ టెండర్లను రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడంతో నాలుగు టెండర్లను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. టెండర్లను బడా సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేయడంలో టీఆర్‌ఎస్‌ ఆంతర్యం ఏమిటో అర్థమవుతోంది.

సర్కారు నిర్లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లలో విద్యారంగం పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఫలితంగా విద్యాశాఖలో సుమారు రూ.9,456 కోట్లు ఖర్చు చేయలేదు. 'దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు' అన్నట్లుగా పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలలను ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం నిధులిచ్చినా ఖర్చు చేయకపోవడం కేసీఆర్‌ అసమర్థతకు నిదర్శనం. బడులుప్రారంభమై 45 రోజులు గడిచినా నేటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందలేదు.

రాష్ట్రవ్యాప్తంగా 31.24 లక్షల మంది విద్యార్థులకు రూ.2.10 కోట్ల ఉచిత పాఠ్యపుస్తకాలు అందించాల్సిన అవసరం ఉంది. నేటికి 80 శాతం పాఠ్య పుస్తకాలు మాత్రమే జిల్లా కేంద్రాలకు చేరాయి. రాష్ట్రంలో 20.19 లక్షల మంది విద్యార్థులకు యూనిఫామ్‌ అందివ్వాలి. ఇంకా చెప్పాలంటే గత సంవత్సరం విద్యార్థులకు యూనిఫామ్‌ ఇవ్వకుండానే ఇచ్చామని అసెంబ్లీ సమావేశాలలో చెప్పడం అత్యంత దుర్మార్గం.

పోషకాహారం అందకుండా

విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మధ్యాహ్న భోజన పథకాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదు. కేంద్రం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్‌) అమలులో తెలంగాణ వెనుకబడింది. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలలో 75 శాతం విద్యార్థులు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. 25 శాతం మంది ఈ పథకానికి దూరమయ్యారు. హైస్కూళ్లలో 29 శాతం మందికి మధ్యాహ్న భోజన పథకం అందడం లేదని కేంద్రం నిర్వహించిన సర్వేలో తేలింది. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్నా ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది.

2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ. 900 కోట్లు, 2021-22కు సంబంధించి రూ.2,300 కోట్లు స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు అలాగే ఉన్నాయి. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటంతో విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు. బాసర ట్రిపుల్‌ ఐటిలో విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని, ఖాళీగా వున్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలని నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని విద్యార్థులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు. దీన్ని అభినందించాల్సింది పోయి ప్రభుత్వం విద్యార్థులపై కక్ష సాధింపు చేపట్టింది. క్యాంపస్‌లో సెల్‌ఫోన్ల వాడకంపై నిషేదాజ్ఞలు విధించడం వారి నియంతృత్వ ధోరణికి నిదర్శనం.

యువత అండగా నిలవాలి

జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో నిరుద్యోగ యువత చదువుకోవడానికి 'ఇ-లైబ్రరీ'లు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌, ఆనాటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, నేటి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌ ఇచ్చిన హామీ ఏమైంది? గ్రంథాలయాలలో మౌలిక సౌకర్యాలు, పుస్తకాలు, జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు ప్రతి నెలా రూ.15 లక్షలు కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు పుస్తకాలు, మరుగుదొడ్ల కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. జీహెచ్‌ఎంసీకి వస్తున్న ఆస్తిపన్నులో ఎనిమిది శాతం కేటాయిస్తామని చెప్పారు. 2014 నుంచి ఇప్పటివరకు రూ.700 వందల కోట్లు కేటాయించకుండా చోద్యం చూస్తున్నారు.

బిస్వాల్‌ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో 1 లక్షా 91 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 80,039 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన లక్షలాది మంది నిరుద్యోగులను నిరాశకు గురిచేసింది. 7,651 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ను విధులకు తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి నెలలు గడుస్తున్నా వారిని విధులకు తీసుకోకపోవడం శోచనీయం. హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం రాష్ట్రప్రభుత్వం లెక్క చేయకపోవడం దుర్మార్గం. తెలంగాణ భవిష్యత్తు యువత చేతులలోనే ఉంది. అలాంటి విద్యార్థులు, నిరుద్యోగ యువత నేడు నిరాశా నిస్పృహలతో ఉండటం తెలంగాణ సమాజానికి శ్రేయస్కరం కాదు. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే సంకల్పంతో బీజేపీ సంగ్రామ పాదయాత్ర తలపెట్టింది. యువతీ, యువకులంతా ఈ ప్రజా సంగ్రామ పాదయాత్రకు సంఫీుభావంగా నిలవాలని కోరుతున్నాం.

బండి సంజయ్‌‌కుమార్‌

ఎంపీ, కరీంనగర్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

Advertisement

Next Story