మీకు నచ్చినట్లు..సీబీఐ విచారణ చెయ్యాలా?

by Ravi |   ( Updated:2023-07-27 23:46:01.0  )
మీకు నచ్చినట్లు..సీబీఐ విచారణ చెయ్యాలా?
X

వివేకానందరెడ్డి హత్య విషయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర బహిరంగ రహస్యమే, అయినా వివేకా హత్యతో తనకు ఏ సంబంధం లేదని బుకాయిస్తూ సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాయడం విడ్డురంగా వుంది. వివేకా హత్య జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపించిన వైసీపీ ఇప్పుడు వివేకా కుమార్తె సునీత దంపతులను దోషులుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. వివేకా హత్య కేసులో తనకు సంబంధం లేకపోతే కోర్టులో వాదనలు వినిపించుకోవాలి తప్ప సీబీఐకి లేఖలు రాయడం ఏమిటి? ఈ హత్యతో జగన్‌కు ఏ సంబంధం లేదని ప్రజలను మభ్యపెట్టడానికే ఈ లేఖల డ్రామాలా?

ఆధునిక సాంకేతికతను వినియోగించి..

వివేకా హత్యపై సీబీఐ విచారణలో వెల్లడైన వాస్తవాలను తప్పుపడుతూ అవినాష్ రెడ్డి సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాయడం సిగ్గుచేటు. దర్యాప్తు మేము చెప్పిన కోణంలో కాకుండా ఎస్పీ రాంసింగ్న నన్ను, మా నాన్నను ఈ కేసులో ఇరికించారు అంటూ ఆరోపణలు చేశారు అవినాష్. కానీ సీబీఐ మీరు చెప్పిన కోణంలోనే కాదు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, వందల మందిని ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసి,ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేకరించిన ఆధారాలతో అవినాష్ రెడ్డే కుట్ర దారుడుగా తేల్చిందని సీబీఐ వెల్లడించింది. అయితే ఇదంతా సీఎం అండ లేకుండానే ఒక ముద్దాయి సీబీఐకి హుకుం జారీ చేయడం సాధ్యమా?

కుటుంబ సభ్యులే వివేకాను హత్య చేసింది ఎవరో చెబుతుంటే, ఆస్తిని కాపాడుకోవడానికి సునీతారెడ్డి, భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డే వివేకాను హత్య చేయించారని. ఈ కేసు నుంచి భర్తను కాపాడుకోవడానికే ఆమె తన కుటుంబాన్ని టార్గెట్‌ చేశారని అవినాశ్‌ లేఖ రాశారు. అయితే సీబీఐ ఈ కేసు విచారణ కోసం గూగుల్ టేకౌట్ ద్వారా జీపీఎస్‌ లొకేషన్‌, గూగుల్‌ మీట్‌ ఇతర ఆన్‌లైన్‌ యాక్టివిటీని గుర్తించి, నిందితులు ఏ సమయంలో ఎక్కడున్నారో జీపీఎస్ ద్వారా పసిగట్టి వివేకాతో బలవంతంగా రాయించిన లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు ప్రయత్నం చేస్తోంది. అట్లాగే వివేకా రెండో పెళ్లి, ఆస్తుల వివాదం నేపథ్యంలో కుమార్తె, అల్లుడే ఆయనను చంపించి ఉంటారని అవినాశ్‌ రెడ్డి ఆరోపణ. కానీ ఆ కోణంలో వివేకా రెండో భార్యను కూడా సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. కానీ వివేకా కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి పాత్రపై ఎలాంటి అనుమానాలు లేవని, ఆధారాలు లభించలేదని సీబీఐ తాజాగా దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటులో స్పష్టం చేసింది.

వాస్తవాలను ఎందుకు బుకాయిస్తున్నారు!

రాజకీయ కోణంలోనే హత్య జరిగిందంటూ అవినాశ్‌రెడ్డి [ఏ-8]తో పాటు ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి[ఏ-7]ని, ఆయన సన్నిహితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి[ఏ-6]ని నిందితులుగా చేర్చుతూ సీబీఐ అనుబంధ ఛార్జిషీటు వేయడం, అందులో తన బాగోతం బయట పడటంతో దానిని కప్పిపుచ్చుకోవడం కోసం అవినాశ్‌రెడ్డి సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. అలాకాకుండా చంపిన వారే తమపై విచారణ చేయాలని కోర్టుల చుట్టూ తిరుగుతారా? ఒకవేళ సునీత భర్త హత్య చేసి ఉంటే వారే ఈ హత్య పై నిష్పక్షపాత దర్యాప్తు కోసం ఎందుకు పోరాటం చేస్తారు? సునీతా రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి చంపినట్లు మీ వద్ద ఆధారాలు ఉంటే నాలుగేళ్లుగా మీరు అధికారంలో ఉండి సునీత భర్తను ఎందుకు అరెస్టు చేయలేదు? మీకు సంబంధం లేకపోతే ఈ కేసు దర్యాప్తును ఎందుకు ముందుకు సాగనీయలేదు? ఈ హత్యలో మీ పాత్ర లేనప్పుడు కోర్టులో సీబీఐ విచారణను ఆపాలని ఎందుకు కోర్టులో అఫిడవిట్ వేశారు? ఒక అబద్ధం ఆడినవారు దానిని నిజం చేయడానికి మరో 100 అబద్దాలు ఆడలేరా? అధికారం అండతో, కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులతో, అబద్దాల లేఖలతో బయట పడాలని చూస్తున్నారు. నిజం నిప్పులాంటిది. ప్రజలను ఎల్లకాలం మోసం చెయ్యడం సాధ్యం కాదు. వివేకా హత్య కేసులో తనపై సీబీఐ చార్జి షీట్ ఎలా వేయాలో ఏ-8 ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డి చెబుతారా? ప్రతిపక్షంలో ఉండగా వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరిన వైసీపీ నేడు సీబీఐ విచారణ చేసి వాస్తవాలు వెల్లడిస్తూ అనుబంధ చార్జిషీటు వేస్తే నిబంధనలకు విరుద్ధంగా స్వయంగా విచారణ జరిపారని ఆరోపణలు చేస్తున్నారు. మీకు సంబంధం లేకపోతే కుటుంబ సభ్యులు ఇచ్చిన వాగ్మూలాలకు ఎందుకు సమాధానం చెప్పరు? నాడు గ్యాగ్ ఆర్డర్ తేవడం నుంచి నేడు సీబీఐ విచారణ వద్దనడం,నేడు సీబీఐ విచారణ తప్పుపట్టడం వరకు వివేకా హత్య కేసులో అన్నీ అనుమానాలే! వివేకా సొంత ఇంట్లో హత్య చెయ్యబడితే రక్తపు మరకలు తుడిచి వేసి సాక్ష్యాధారాలు లేకుండా ఎందుకు చేయాల్సి వచ్చింది? మీకు సంబంధం లేకపోతే ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా సాక్ష్యాలు ఎందుకు తారుమారు చేయాల్సి వచ్చింది? సంబంధం లేకపోతే సాక్ష్యాలు ఎందుకు తుడిపేశారు? గొడ్డలి పోటు అని తెలిసినా గుండె పోటుగా ఎందుకు చిత్రించారు? నాటి ప్రతిపక్ష నాయకుడిగా వివేకా హత్య విషయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేసిన వీరు, నేడు సీబీఐ దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలను ఎందుకు బుకాయిస్తున్నారు.

తప్పుడు లేఖలతో తప్పుదోవ..

అబద్దాలతో ప్రజలను కొంతకాలమే మాయ చేయగలరు. ఎల్లకాలం సాధ్యం కాదని అవినాష్ రెడ్డి గుర్తించాలి. వివేకా హత్యపై నానా యాగీ చేసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి చుట్టి 2019 జరిగిన ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందారు.ప్రతిపక్షంలో ఉండగా బాబాయి హత్యపై సీబీఐ విచారణ కోరాలని గగ్గోలు పెట్టిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక సిబీఐ దర్యాప్తు విషయంలో యూటర్న్‌ తీసుకున్నది వాస్తవాలు బయటికి వస్తాయనే కదా? నాడు సీబీఐ విచారణ కోరినా వీరు, నేడు సీబీఐ దర్యాప్తులో దోషులు ఎవరో వెల్లడి అయినా సీబీఐ దర్యాప్తుపై బుకాయిస్తున్నారు. అసలు గొడ్డలి పోటునే గుండె పోటుగా డ్రామా ఆడిన వారు ఇంకెన్ని డ్రామాలు అయినా ఆడగలరు. మీకు మీరు పవిత్రులుగా చెప్పుకొన్న మాత్రానా మీరు పునీతులు అవుతారా? విచారణలో మీకు అనుకూలంగా చార్జి షీటు వేస్తే దర్యాప్తు నిష్పక్షపాతంగా చేసినట్లు, విచారణలో సీబీఐ మీకు వ్యతిరేకంగా చార్జి షీటు వేస్తే దర్యాప్తు నిష్పక్షపాతంగా విచారణ జరగనట్లా? ఈ హత్యలో మీ పాత్రపై బలమైన ఆధారాలున్నందునే అవినాశ్‌రెడ్డి తోపాటు ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఆయన సన్నిహితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ని నిందితులుగా చేర్చుతూ సీబీఐ అనుబంధ చార్జిషీటు వేసిన వాస్తవాన్ని మరుగు పరచి సీబీఐ డైరెక్టర్‌కి లేఖ రాయడం ఏమిటి? వివేకా హత్య తాలూకా దారుణాలు, దురాగతాలు బయట పడటంతో దిక్కుతోచక బాధితుల మీదనే బండలు వేస్తూ సీబీఐకి లేఖలు రాస్తున్నారు. చేసిన పాపానికి పశ్చాత్తాపం చెందాల్సింది పోయి తప్పుడు లేఖలతో ప్రజల్ని తప్పుదారి పట్టించాలని చూడటం ఏమిటి?

నీరుకొండ ప్రసాద్

98496 25610

Advertisement

Next Story

Most Viewed