ఓటర్లకు అసెంబ్లీ వేరు.. పార్లమెంట్ వేరు

by Ravi |   ( Updated:2024-01-10 01:00:27.0  )
ఓటర్లకు అసెంబ్లీ వేరు.. పార్లమెంట్ వేరు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. బీఆర్ఎస్‌ను ఓడించి 64 స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ఆ పార్టీపై భరోసా ఉంచారు. ఇదే జోష్‌తో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో కనీసం 10-15 చోట్ల విజయకేతనం ఎగరేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది.

కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి బరిలో ఉంటే విజయం వరించినట్టేననే భావన చాలా మంది లీడర్లలో ఏర్పడింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి! అయితే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయని చరిత్ర చెబుతోంది. ‘అధికారం’ ఉందన్న భావనతో లోక్‌సభ ఎన్నికలను లైట్ తీసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని గ్రహించాలి.

గత ఎన్నికల్లో..

తెలంగాణ రాష్ట్రంలో 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు దక్కించుకుని అధికారం నిలబెట్టుకోగా, కాంగ్రెస్ 19 సీట్లు, ఎంఐఎం 7 సీట్లు సాధించాయి. ఒకే ఒక్క సీటుతో బీజేపీ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాతి ఆరు నెలలకు అంటే 2019 మేలో లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో టీఆర్ఎస్ 9 సీట్లు, బీజేపీ 4 సీట్లు, కాంగ్రెస్ 3 సీట్లు, ఎంఐఎం ఒక స్థానంలో గెలుపొందాయి. అనూహ్యంగా బీజేపీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక సీటు సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో 4 సీట్లు సాధించింది. ఇతర రాష్ట్రాల్లోనూ అంతే.. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 114 సీట్లు గెలిచిన కాంగ్రెస్, తర్వాతి పార్లమెంట్ ఎన్నికల్లో ఒకే సీటు గెలిచింది. అలాగే రాజస్థాన్‌లోనూ 99 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ సాధించినా, ఇక్కడ బీజేపీ పార్లమెంట్ సీట్లను క్లీన్‌స్వీప్ చేసింది. ఛత్తీస్‌ఘడ్‌లోనూ 68 స్థానాల్లో గెలిచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం 2 ఎంపీ సీట్లే సాధించుకుంది.

ఓటర్లలో.. స్పష్టత

భారత ప్రజాస్వామ్యంలో సమాఖ్య స్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తున్నా.. అవి పని చేసే విధానం వేరువేరుగా ఉంటుంది. అందుకే ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు వేరువేరుగా స్పందిస్తారు. ఇదే గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో ఏడింటికి ఏడు స్థానాల్లో విజయాన్ని సాధించి బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఏడాది తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో నుంచి 62 స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి ప్రభంజనాన్ని సృష్టించింది. పార్లమెంట్‌కు ఎవరిని ఎన్నుకోవాలి, అసెంబ్లీకి ఎవరిని పంపించాలనే దానిపై ఢిల్లీ ఓటర్లు పూర్తి స్పష్టతతో వ్యవహరించారు. 2019లో ఒరిస్సాలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో పార్లమెంట్ కోసం బీజేపీ అభ్యర్థులని, అసెంబ్లీ కోసం బీజేడీ అభ్యర్థులను ప్రజలు ఎన్నుకున్నారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటర్ల వ్యవహార శైలి, స్పందించే తీరు వేరువేరుగా ఉంటుందని అర్థం చేసుకోవాలి..

గుణపాఠాలు నేర్చుకోవాలి..

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల విజయంతో జోరు మీదున్న కాంగ్రెస్.. అవే ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లో అధికారాన్ని కోల్పోయిందని, మధ్యప్రదేశ్‌లోనూ చావు దెబ్బతిన్నదని గుర్తించుకోవాలి. వీటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే.. కేంద్రంలో మళ్లీ ఓటమిని చవిచూసే అవకాశమున్నది. 2018-19లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో పాటు, 2020లో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఏదైనా పార్టీ చిత్తశుద్ధితో కలిసి కష్టపడితే రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చేయొచ్చనేది స్పష్టమవుతోంది. దీంతో గెలిచిన చోట గర్వానికి పోకుండా.. ఓడిన చోట కుంగిపోకుండా.. ముందుకు సాగితేనే కాంగ్రెస్‌కి మంచి ఫలితాలు వచ్చే అవకాశముందని గుర్తించాలి.

- ఫిరోజ్ ఖాన్,

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,

96404 66464

Advertisement

Next Story