- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిన్ను తిట్టంగా నేనెంత వాడను దురాత్మ..

నిన్ను తిట్టంగా నేనెంత వాడను దురాత్మ.. / ఏడేడు లోకాల భాషలకే శోషోచ్చి మూర్చిల్లురా.. / మహా బండ బూతులు తలల్వంచు నీ ముందు పాపాత్ముడా... అంటూ సాగే ఈ తిట్ల దండకం మూడు దశాబ్దాల క్రితం వచ్చిన 'ష్.. గప్ చుప్' సినిమాలోనిది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావు, ఇతర నాయకులు చేస్తున్న ప్రస్తుత తిట్ల దండకం చూస్తే ఆ పాట వారికి పూర్తిగా వర్తిస్తుందని చెప్పక తప్పదు.
తన అవినీతిపై నమోదైన కేసును ఊటంకిస్తూ లొట్టపీసు కేసు... లొట్టపీసు ముఖ్యమంత్రి.. పీకలేరు.. వంటి పదాలతో కేటీఆర్ తన నోటిని మూసీ నది కన్నా మురికిగా గతంలోనే మార్చేశారు. మరో వైపు ఆయన బావ హరీశ్ రావు 'ముఖ్యమంత్రికి మంచి భాష నేర్పుదాం' అంటూ ఆ మధ్య మరో పత్రికలో పెద్ద వ్యాసమే రాశారు. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, రాజకీయ భాష, పరిణితి కల రాజకీయ నేతల లక్షణాలపై సదరు వ్యాసంలో హరీశ్ రావు తెగ బాధపడిపోయారు. ముఖ్యమంత్రికి మంచి భాష నేర్పడం తర్వాతి విషయం... ఇప్పుడు తన బావమరిది వాడే భాషపైన, తాను వాడే భాషపైన హరీశ్ రావు ఏం చెబుతారు.. తమ కిరాయి సైన్యంతో ముఖ్యమంత్రిని సోషల్ మీడియా వేదికగా తిట్టించడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు?
ఈ హీనమైన భాష దేనికి?
రాజకీయాల్లో నీచ, హీన భాషకు ఆద్యుడు కేసీఆర్ అనే విషయం తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు. ఎందరో నాయకులను నోటికొచ్చినట్లు బూతులు తిట్టిన చరిత్ర ఆయనది. ఆయన వారసులుగా రంగప్రవేశం చేసిన కేటీఆర్, హరీశ్ రావు అదే బాటలో సాగుతున్నారు. ఆ వరవడినే మిగతా బీఆర్ఎస్ నేతలు కొనసాగిస్తున్నారు. 2009లో తొలిసారిగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఎమ్మెల్యే లయ్యారు. 2014 తర్వాత తండ్రి నీడలో పదేళ్ల పాటు హద్దుల్లేని అధికారాలను కేటీఆర్ అనుభవిస్తే.. ఆ కాలమంతా ప్రజా సమస్యలపై పోరాటాల్లో రేవంత్ రెడ్డి మునిగిపోయారు. పదేళ్లు రాష్ట్రంలో అధికారం తమ కుటుంబం సొంతమని.. కేటీఆర్, హరీశ్‌రావు, వారు ఆడింది ఆట.. పాడింది పాటగా పాలన సాగింది. 2023 ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో కేసీఆర్, ఆయన వారసుల కాళ్ల కింద భూమి కంపించిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు... అక్రమాలు ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకుం టుండడంతో ఓ వైపు భయంతో వణికిపోతూ.. మరోవైపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నీచ భాష ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసి నిత్యం ముఖ్యమంత్రిపై, ఆయన కుటుంబ సభ్యులపై నోటితో చెప్పలేని, చెవులతో వినలేని, చేతితో రాయలేని హీనమైన భాష ప్రయోగిస్తున్నారు.
కవి చౌడప్పను మించిన బూతు
80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకున్న కేసీఆర్ ఏ కవులను ఉటంకించారో లేదో తెలియదు కానీ వందల సార్లు మాత్రం కవి చౌడప్పను మించిన సాహిత్యాన్ని ప్రజలకు వినిపించారు. ఇదేం నీచ భాషంటూ విమర్శలు వస్తే కడుపు మండిన వాళ్లం ఎన్నో అంటామంటూ ఉద్యమ భావోద్వేగాలను కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలు కవచంగా వాడుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేసీఆర్ తీరు మారలేదు.. మహిళలని చూడకండా కుక్కలని నీచ భాష వాడారు. ఓ కేంద్ర మంత్రిని పట్టుకొని ఆయనో మంత్రా... ఓ రండ (వ్యభిచారి) అంటూ బజారు భాషతో నోరుపారేసుకున్నారు. ఇవే కాదు.. కేసీఆర్ వాడిన కుక్కలు, కిరికిరి పెట్టే నా కొడుకులు, అఖిల పక్షం.. తోక పక్షం....జోగడు, బాగడు, జోకేటోడు... తోక గాంధీ.. తొడెం గాంధీ...సన్నాసులు, రండలు.. ఇలా ఆయన బహిరంగ సభల్లో వాడిన పరమ కంపు పదజాలమంతా ప్రజలకు గుర్తే ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను శాసనసభకు పీకనీకి వచ్చారా అంటూ అత్యంత నీచ భాష వాడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌నే... ఇప్పుడు ఆయన స్థానాన్ని ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీశ్ రావు ప్రెస్‌మీట్లలో రోత మాటలు, X (గతంలో ట్విట్టర్) లో చెత్త రాతల ద్వారా భర్తీ చేస్తున్నారు.
నోటికి పనిచెప్పితే ఫలితమిదే..!
పదేళ్ల కేసీఆర్ కుటుంబ పాపాలకు గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఓటు రూపంలో శిక్ష వేశారు. తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యుల తీరు మారకపోవడంతో లోక్‌సభ ఎన్నికల్లో గుండు సున్నాకు పరిమితం చేశారు. ప్రజల్లో తమకు ఏ మాత్రం సానుకూలత లేదని భావించిన కేసీఆర్ శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపే సాహసం చేయలేదు. ఉద్యమ సమయంలో, వారు నీచ భాష వినియోగం మానుకోవాలి. దురదృష్టవశాత్తు కేసీఆర్.. హుందాతనం రెండు వ్యతిరేక పదాలై పోయాయి.. ఆయన బాటలోనే ఆయన కుటుంబ సభ్యులు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు అనుసరిస్తూ ముఖ్యమంత్రిపై నిత్యం దుర్భాషలు ఆడుతూ వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలతో ప్రతిపక్షంలో రాణిస్తారే తప్ప నోటికి పని చెప్పడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదనే విషయం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు గుర్తుంచుకుంటే మేలు.. లేకుంటే లోక్‌సభ ఎన్నికల ఫలితాలే రానున్న రోజుల్లోనూ ఆ పార్టీకి పునరావృతమవుతాయి.
చామల కిరణ్ కుమార్ రెడ్డి,
లోక్‌సభ సభ్యులు, భువనగిరి