- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలకృష్ణను చూడాల్సింది రెండో వైపే!
1974 సంవత్సరం ఆగష్టు 30న మొదలైన నందమూరి బాలకృష్ణ నట ప్రయాణం 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో సెప్టెంబర్ 1న వేడుక నిర్వహించనున్న విషయం తెలిసిందే. నటనలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నటులు చాలామంది ఉండి ఉంటారు. కానీ ఇప్పటికీ కథానాయకుడిగా కొనసాగుతూ ఉండడం బాలకృష్ణ ప్రత్యేకతగా నిర్వాహకులు భావించి ఉంటారు. ఇక్కడ నా వ్యాస ఉద్దేశ్యం ఆయన ఈ 50 ఏళ్లలో నటించిన సినిమాల ప్రత్యేకత గురించి కాదు, ఆయన “రెండోవైపే’’.
ట్రోలింగ్ బారినపడినా..
సోషల్ మీడియాలో లైకుల కోసం విన్యాసాలు చేస్తూ ప్రాణాలు పొగొట్టుకుంటున్న వారు, కామెంట్లు రావడం లేదని కుమిలిపోయేవారు, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయనో, ట్రోలింగ్ చేస్తున్నారనో మనోవ్యధకు గురై మంచం పట్టేవారి గురించి ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇలాంటి వారందరూ తెలుసుకోవాల్సింది, చూడాల్సింది బాలకృష్ణ రెండోవైపే. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అబద్దాలు, అర్థ సత్యాలకు అమరులైన దేశనాయకుల నుంచి నటులు, ప్రముఖుల అందరికంటే ముందే వీటి బారినపడి బాలకృష్ణ వ్యక్తిత్వ హననానికి గురయ్యారు. సెల్‌ఫోన్లలో ఎస్‌ఎంఎస్‌లు మొదలైనప్పుడే దారుణంగా ట్రోలింగ్‌కు గురైన ఏకైక వ్యక్తి బాలకృష్ణ. కేవలం అతడి వ్యక్తిత్వాన్ని కించపరచడానికి, ప్రతిష్టను దెబ్బతీయడానికి, కనీస జ్ఞానం, అవగాహన లేని వ్యక్తిగా ప్రజలముందు నిలపెట్టడానికి, అతని అభిమానులు అని చెప్పుకోవడానికే సమాజంలో సంకోచించే పరిస్థితి కల్పించడానికి కొందరు వ్యక్తులు ఈ దుష్ప్రచారం పనికట్టుకొని చేశారు. ఓ సమయంలో అభిమానులు కూడా అవి ఎంతోకొంత నిజమేనేమో అని భావించే పరిస్థితి కొచ్చారు. అయితే, తనమీద దారుణమైన కథనాలు పుట్టిస్తున్నా, ట్రోలింగ్‌లు జరుగుతూ ఉన్నా బాలకృష్ణ కుంగిపోవడం, బాధపడటం కాదు కదా కనీసం స్పందించలేదు.
ఎదిగిన కొద్దీ ఒదగమని...
తన సహనటులు చార్టర్డ్ ఫ్లయిట్స్‌లో విహారాలు చేస్తున్నా, నిన్న మొన్నటి కుర్రహీరోలు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడం తమ హక్కుగా భావిస్తున్నా, నేటికీ సినిమా షూటింగ్‌లకి ఎకానమీ క్లాస్‌లో విమాన ప్రయాణం చేస్తున్న నటుడు బాలకృష్ణ. టి.వి. సీరియల్ నటులు కూడా కారవాన్ వాహనంలో సేదదీరటానికి తహతహలాడుతుంటే ఇప్పటికీ టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని చేతిలో పుస్తకంతో కుర్చీలో సేదతీరే బాలకృష్ణ నుంచి నేర్చుకోవాల్సింది... ఎదిగిన కొద్దీ ఒదగడం అనేది మాటల్లో కాదు ఆచరణలో ఉండాలనే. ఇచ్చిన దానం గురించి, చేసిన సాయం గురించి తనకు తానుగా ఏనాడూ చెప్పుకోకపోవడం బాలకృష్ణ లక్షణం. కేవలం సినిమా నటుడిగానే కాదు... దశాబ్దాల పాటు అధికారం తమ కుటుంబంతో కొనసాగుతున్నప్పటికీ అవినీతి, అధికార దర్పం కాదు కదా కనీసం ఆ ఆలోచనలు కూడా దరిచేరనివ్వలేదు. పెద్ద పేరున్న సినిమా నటుల నుండి గల్లీ లీడర్ల వరకు ప్రైవేటు సైన్యంలా బౌన్సర్లను రక్షణ పేరిట వెంటేసుకుని తిరగడం స్టేటస్ సింబల్‌గా భావిస్తున్న ప్రస్తుత సమయంలో ఏకకాలంలో ఎన్నో పాత్రలు, మరెన్నో కార్యక్రమాలు నిజ జీవితంలో పోషిస్తున్న బాలకృష్ణ తనకు తానే రక్షకుడు.
పైకి చెప్పుకోని వితరణశీలి..
బురదజల్లడమే పనిగా పెట్టుకున్న అల్పులు అలా కాలం దొర్తిస్తూ ఉండగానే మెజారిటీలు పెంచుకుంటూ ముచ్చటగా మూడోసారి హిందూపురం నుంచి శాసన సభ్యుడిగా గెలుపొందారు. తన తండ్రి ఆశయాల కొనసాగింపుగా తల్లిపేరుమీద ఏర్పాటైన బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా ఎందరో చిన్నారుల ప్రాణాలను నిలబెట్టి వారి గుండెల్లో దేవుడిగా నిలిచాడు. అసలు మాట్లాడడమే రాదని ట్రోలింగ్‌లకు గురైనవాడు ‘‘నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు’’ అంటూ అనితర సాధ్యం అనేంతగా మెప్పించి దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన టాక్‌షోగా తన ‘‘అన్‌స్టాపబుల్’’ని నిలిపాడు. ఇప్పుడు క్లబ్‌లు, పబ్బులే కాదు, క్రికెట్ స్టేడియాల నుంచి విదేశాల్లోని యూనివర్సిటీల దాకా ఇప్పుడు మార్మోగుతున్న నినాదం జై బాలయ్య. సినిమాల్లో బాలకృష్ణ గురించి ప్రస్తావించే సీన్లు పెట్టుకోవడం చిన్న సినిమాలకు నయా ట్రెండ్.
చిన్నపిల్లల మనస్తత్వానికి ప్రతిరూపం
ఎవరూ జీవితంలో పరిపూర్ణులు కారు. ఏ ఒక్కరూ విమర్శలకు అతీతులు కాలేరు. ఆ రెంటి మధ్య ఉన్న జీవన గమనం ఎలా ఉన్నది, దాని నుంచి మనమేం నేర్చుకోగలం అన్నదే ముఖ్యం. తన సహనటుడు మెగాస్టార్‌గా ప్రశంసలందుకుంటున్న చిరంజీవి నుంచి తన ప్రస్తుత చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు బాబీడియోల్ వరకు ఆయన్ని దగ్గర నుంచి పరిశీలించిన అనేకమంది చెప్పేది... బాలకృష్ణ చిన్న పిల్లల మనస్తత్వం కలవాడని.. అది నూరుపాళ్ల నిజం. ‘ఏ ఈర్ష్య, ద్వేషం, అసంతృప్తి, అహం లేకుండా పూర్తి తృప్తితో జీవితాన్ని ఆస్వాదించడం చిన్న పిల్లల లక్షణం'. అదే బాలకృష్ణ నైజం.
(బాలకృష్ణ 50 వసంతాల నట ప్రయాణంపై వేడుక సందర్భంగా)
నరసింహ ప్రసాద్ గొర్రెపాటి
94407 34501