గిడుగును అందుకు స్మరించుకోవాలి..

by Vinod kumar |   ( Updated:2023-08-31 19:30:37.0  )
గిడుగును అందుకు స్మరించుకోవాలి..
X

ప్రభుత్వం గిడుగు రామ్మూర్తిని స్మరించుకోవడం గొప్ప విషయం. అయితే దాన్ని 'వ్యవహారిక భాషా దినోత్సవం' అని అంటే బాగుండేది. కనీసం 'వ్యవహారిక తెలుగు భాష దినోత్సవం' అన్నా బాగుండేది. ‘తెలుగు భాషా దినోత్సవం’ అన్నారు. గిడుగు రామ్మూర్తి కన్నా అనేక శతాబ్దాల ముందే తెలుగు భాష పుట్టింది. తెలుగును మనం ప్రాచీన భాషల్లో ఒకటి అంటున్నాం. గిడుగు ప్రత్యేకత ఏమంటే నియత విద్యా వ్యవస్థలో పాఠ్యాంశాలను వ్యవహారిక భాషలో బోధించడానికి మహత్తర కృషి చేశారు. పశ్చిమదేశాల్లో ఇటాలియన్ భాష వినడానికి సొంపుగా ఉంటుంది అంటారు. తూర్పుదేశాల్లో తెలుగు వినడానికి అంత సొంపుగా ఉంటుంది. తెలుగు నేర్చుకున్నందుకు, తెలుగులో రాస్తున్నందుకు నాలాంటివాళ్ళకు చాలా ఆనందంగా గర్వంగా ఉంటుంది.

వ్యవహారిక భాషలో కూడ ఒక ప్రామాణికీకరణ (స్టాండర్డైజేషన్) సాగింది. విజయవాడ కేంద్రంగా, సినిమా మాధ్యమంలో ఇది పెరిగింది. ఆ స్థాయిని దాటి స్థానిక యాసలో రాసే ధోరణి వచ్చింది. నిజానికి యాస ధోరణి ఉత్తరాంధ్రాలో మొదలయింది గానీ తెలంగాణ ప్రాంతంలో ఇది ఒక ఉద్యమ స్థాయికి చేరింది. ఇప్పుడు రాయలసీమ రచయితలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. అలాగే గోదావరి జిల్లాలవారూ ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు ఒక్కటేనా వ్యవహారిక భాష! మొన్నటి ప్రభుత్వ ఉత్సవాన్ని కొందరు 'మాతృభాషా దినోత్సవం' గా కూడ ప్రకారం చేశారు. రాష్ట్రంలో ఇంకో 15 వ్యవహారిక భాషలు, మాతృభాషలు ఉంటాయి. వాటికి ఉత్సవాలు జరపదా ప్రభుత్వం? ఇది ఏ సంకేతాన్ని ఇస్తుంది, ఆ భాషల గతి ఏంకానూ? ఆ భాషల్లో ఇటీవలి కాలంలో వచ్చిన పరిణామాల గురించి మాట్లాడరా ఆ భాషల్ని అధికారికంగా నిర్దయగా చంపేస్తారా?

ఒకరు దేశప్రజలందరూ హిందీలో (మాత్రమే) మాట్లాడాలంటారు. మరొకరు తెలుగులో (మాత్రమే) బోధించాలంటారు. ఇంకొకరు తమ మతాన్ని మాత్రమే అనుసరించాలంటారు. ఇవన్నీ అతివ్యాప్తి దోషాలు. ఆధిపత్యవాదనలు. ఒక భాషను అధికార భాషగా గుర్తిస్తే మిగిలిన భాషలు శ్రామిక భాషలైపోతాయన్న తర్కం ఇతరులకు తెలియకపోవచ్చు కానీ ప్రజాస్వామిక వాదులకు, నూతన ప్రజాస్వామిక వాదులకు స్పష్టంగా తెలుసు. వాళ్ళూ ఈ వరదలో కొట్టుకుపోతున్నారు.

నియత విద్యలో ప్రవేశానికి, తరగతి గది సంస్కృతి అలవాటు కావడానికి ప్రాధమిక దశలో మాతృభాషలో బోధన చాలా అవసరం. అక్కడయినాసరే ఎవరికి ఎవరి మాతృభాషలో బోధించాలనే ప్రశ్న కూడ తలెత్తుతుంది. ప్రాధమిక విద్య స్థాయిలో ప్రతి ఒక్కరికి కనీసం మూడేళ్ళయినా వారివారి మాతృభాషలల్లో మాత్రమే బోధించాలి. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాలి. అవసరం అయితే ఉద్యమించాలి.

ఇంట్లో ఉర్దూ మాట్లాడుకునే ముస్లిం పిల్లలు స్కూళ్లలో తొలి దశలో తెలుగు మాధ్యమాన్ని తట్టుకోవడానికి ఇబ్బందులు పడతారు. ఒక అదనపు భాషను నేర్చుకుంటున్నందుకు వాళ్లను మెచ్చుకోవాలి. కానీ, అలా ఎవ్వరూ చేయరు. పైగా, ఉర్దూ ప్రభావిత ఉఛ్ఛారణతో తెలుగు మాట్లాడుతున్నందుకు అవహేళనకు గురిచేస్తారు. ఈ వివక్ష కారణంగా వాళ్ళు మొత్తం నియత విద్యనే మానేస్తారు. ఈ సమస్య ముస్లింలకు మాత్రమేకాదు; అధికార భాషేతర సమూహాలందరికి ఉంటుంది.

భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి దాదాపు 70 ఏళ్ళు అవుతున్నాయి. పార్లమెంటులో చర్చలు, ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల్లో వాదనలు తీర్పులు, జాతీయ టీవీల్లో డిబేట్లు అన్నీ ఇంగ్లీషులోనే కొనసాగుతున్నాయి. అంటే ఇంగ్లీషు మన రాజభాష అన్నమాట. ఇంగ్లీషును రాజభాషగా తొలగించి హిందీను రాజభాషగా మార్చేందుకు సంఘపరివారం ప్రయత్నిస్తున్నది. ఈ మధ్య భారత శిక్షాస్మృతికి హిందీ పేర్లు పెట్టడం ఒక వివాదంగా మారింది. హిందీ బెల్టులోతప్ప మిగిలిన భారత దేశంలో హిందీకన్నా ఇంగ్లీషే అనుసంధాన భాషగా వుంటుంది. ఎక్కడో అరుదుగా ఓ అధికారి ప్రయోగాత్మకంగా తెలుగులో ఉత్తర్వులు జారీచేసిన సంఘటనలుంటాయి. అందులో కఠిన గ్రాంధిక భాష వుంటుంది. అది సామాన్య ప్రజలకు అర్ధంకాదు. ఆ కృతక తెలుగు భాషకన్నా ఇంగ్లీషే మేలేమో అనిపిస్తుంది. అది గిడుగుకు అపచారం. మొన్నటి తెలుగు భాషాదినోత్సవానికి ప్రచురించిన ఆహ్వానపత్రంలోనే అనేక తప్పులున్నట్టు సోషల్ మీడియాలో విమర్శలొచ్చాయి.

ఇప్పుడున్న వాస్తవ పరిస్థితుల్లో, ఓ మూడేళ్ళ ప్రాధమిక విద్య ముగియగానే అందరూ ఇంగ్లీషు మీడియంకు మారిపోవడమే మేలు. ఎవరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారతదేశంలో ఇంగ్లీషు ఒక సామాజిక పెట్టుబడి. దానికి గొప్ప మారకపు విలువవుంది. దాన్ని సరుకు అన్నా తప్పుకాదు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న సైన్స్ టెక్నాలజీ మొత్తం ముందు ఇంగ్లీషులోకి మారుతుంది. దాన్ని వెంటనే తెలుగులోనికి మార్చే యంత్రాంగం మనకు లేదు. ఆ మేరకు తెలుగు మీడియంలో చదివినవాళ్లు వెనుకబడిపోతున్నారు. పైగా సంభావిత (conceptual) వ్యక్తికరణకు తెలుగులో చాలా పరిమితులున్నాయి. కృతకంగా అనువాదం చేసినా అవి చాలామందికి అర్ధం కావు. మాతృభాషా వేరు; బోధన భాష వేరు, బతుకు తెరువు భాషా వేరు. చాలా మంది వీటిమధ్య తేడాను గమనించలేకపోతున్నారు. నియత విద్య బతుకు తెరువు కోసమే ఉంటుంది. ఏ కోర్స్‌ను ఏ మీడియంలో చదివితే ఉద్యోగాలు సులువుగా వస్తాయో ఆ సబ్జెక్టులనే విద్యార్థులు ఎంచుకుంటారు. అభిరుచి మేరకు కొన్ని నియత విద్యలు చదివేవారు చాలాచాలా అరుదుగా వుంటారు.

1970వ దశకంలో బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలు బాగా పెరిగాయి. అందరూ కామర్స్ చదివి బికాం డిగ్రీ పట్టుకుని చదివి బ్యాంకుల్లో చేరేవారు. 1985 తరువాత ఐటి ఉద్యోగావకాశాలు పెరిగాయి. అందరూ అటుకేసి పరుగులు తీస్తున్నారు. జావా, సి ప్లస్ ప్లస్, పైథాన్, రూబీ, స్విఫ్ట్, రస్ట్ మొదలయిన ఓ ఇరవై కొత్త సాంకేతిక భాషలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) వచ్చింది. దాని వెనుక పరుగులు మొదలయ్యాయి. అందులో తెలుగు ఇంకా అభివృధ్ధి కాలేదు. సరైన ఇన్‌పుట్ లేకుండా మేలైన అవుట్‌పుట్ రాదు. తెలుగు ఇన్‌పుట్ చేయడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేం.

ఇంగ్లీషు మాధ్యమానికి ఉద్యోగావకాశాలు ఎక్కువ కాబట్టి మెరుగైన జీవితం కోసం పేదలు సహితం తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చేరుస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల్ని తట్టుకోలేక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని చాలా కాలంగా కోరుతున్నారు. అది చాలా సమంజసమైన కోరిక. అదొక అవసరమైన ఉద్దీపన చర్య. ప్రభుత్వ రంగంలో అయినా ప్రైవేటు రంగంలో అయినా ఇప్పటి ఉపాధ్యాయులకు వుండే నైపుణ్యం ఒక్కటే; పరీక్షల్లో ఎక్కువ మార్కుల్ని సాధించే చిట్కాల్ని విద్యార్ఢులకు బోధించడం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతున్నారనగానే ఇంగ్లీషు మాధ్యమంలో బోధించలేని ప్రభుత్వ ఉపాధ్యాయిలకు హఠాత్తుగా తెలుగు భాషాభిమానం గుర్తుకు వచ్చింది. నిజానికి వారిలో చాలామందికి తెలుగు బోధించడం కూడా సరిగ్గా రాదు.

ఈ మధ్యన ఒక తెలుగు భాషాభిమాని వాలంటీర్ల వ్యవస్థమీద పడ్డారు. వాళ్ళు ఇంటర్మీడియట్ లో సెకండ్ లాంగ్వేజ్‌గా సంస్కృతం చదివి వచ్చారు గాబట్టి వారికి సంస్కృతంలో పరీక్షలుపెట్టాలని ఓ సవాలు విసిరారు. ఇంటర్మీడియట్ పాసై 5 వేల రూపాయలకు కూలీపని చేస్తున్న వాలంటీర్స్‌ను సంస్కృతంలో పరీక్షలు పెట్టమనడం దేనికీ? తెలుగు ఎంఏ చదివి నెలకు లక్ష రూపాయల జీతం తీసుకుంటున్న ప్రభుత్వ తెలుగు టీచర్లను ‘మణిపూర్‌లో జాతిహననం’, ‘ఉమ్మడి పౌర స్మృతి’, ‘హిండేన్ బర్గ్ రిపోర్టు’ వంటీ ఏదో ఒక బర్నింగ్ టాపిక్ మీద మంచి వ్యవహారిక తెలుగు భాషలో వెయ్యి పదాల వ్యాసం ఒకటి రాయమంటే పోలా ఎవరికి ఎంత తెలుగు తెలుసో తేలిపోతుంది.

భాషోత్సవాల్లో గిడుగు పేరిట కవులను ఎందుకు సత్కరిస్తారో నాకు అర్థంకాదు; అందులో పద్యకవులను కూడ సత్కరిస్తుంటారు. గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ‘ప్రజామిత్ర’ కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ “ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను” అన్నారు. కవిత్వ రచన అంతరించిపోతున్న ప్రక్రియ. కథ, నవల, వ్యాసాలు మాత్రమే ఆధునిక సాహిత్య ప్రక్రియలు. గిడుగును తెలుగుకు మాత్రమే పరిమితం చేయడం ఇంకో చారిత్రక అపచారం. ఈనాటి మన సంకుచిత ఆలోచనలకన్నా గిడుగు రామ్మూర్తి గొప్ప విశాల హృదయులు. లిపిలేని సవర భాషకు లిపిని సృష్టించారు. సవర భాషలో బోధించారు. అందుకు వారిని ప్రత్యేకంగా స్మరించుకోవాలి.

డానీ,

సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు

90107 57776





Advertisement

Next Story

Most Viewed