- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూమి ఉన్నంత వరకు అంబేద్కర్ నామస్మరణ తప్పనిసరి!
అంబేడ్కర్ లేకుంటే ఈ దేశ ముఖ చిత్రం లేదు. అలాంటిది ఆయనను కేవలం ఓ సమూహానికి నాయకునిగా చిత్రీకరిస్తూ... ఆయన కీర్తిని తక్కువ చేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అంబేడ్కర్ అనే మహనీయుడు లేకుంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజల బతుకులు మరింత అద్వానంగా ఉండేవి. ఓ నిమ్న కులానికి చెందిన వ్యక్తిగా ఆయన కీర్తిని గౌరవించడంలో మనసు రాకపోవచ్చు కానీ ఆయనను అవమానిస్తూ తమ రాజకీయాలను నడపాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అంబేడ్కర్ ఈ దేశానికి ఊపిరి. అటువంటి మహనీయునిడిపై నిండు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడడం ఈ దేశాన్ని అవమానించడమే అవుతుంది.
అంబేడ్కర్ నామ స్మరణే ఇప్పుడు ఈ వ్యవస్థలో ప్రజలకు రక్షణగా మారింది. ఆయనను స్మరించుకోవడం అంటే ఈ దేశం పట్ల మరింత బాధ్యతను కలిగి ఉండడం. అటువంటిది ఎవరి మీదనో రాజకీయ విమర్శల కోసం అంబేడ్కర్ పేరును వ్యంగ్యంగా ఉచ్చరించడం నిజంగా సిగ్గుమాలిన చర్య. ఈ దేశం పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతలు కలిగిన వ్యక్తులు ఇటువంటి అగౌరవ వ్యాఖ్యలు చేయరు. రాజకీయ లబ్ధి కోసం అంబేడ్కర్ నామ స్మరణ చేసి ఆ తర్వాత ఆ యోధుడిని విస్మరించడం నిజంగా బాధాకరం.
భారత రాజ్యాంగ ప్రదాత
పార్లమెంటు ఈ దేశ ప్రజల పవిత్రమైన దేవాల యం. దేశ ప్రజల తలరాతలు మారే నిర్ణయాత్మక చట్టాలు చేసి వాటి ద్వారా ఈ దేశ ప్రజల జీవన ప్రమాణాలు ఉన్నతంగా తీర్చిదిద్దే వేదిక. అటువంటి వేదిక అంబేడ్కర్ శ్రమతో తయారైంది. ఈ దేశానికి సొంత విలువలతో కూడిన రాజ్యాంగ వ్యవస్థ ఉండాలని ఎంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని రాజ్యాంగాన్ని అందించారు. రాజ్యాంగ రూపకల్పనలో ఆయన ఏ ఒక్క స్థాయిలో మనసు మార్చుకున్నా రాజ్యాంగంలోని ఇంత గొప్ప విధానపరమైన హక్కులు భారతదేశంలో కన్పించి ఉండేవి కావు. అటువంటి మహనీయుడి త్యాగాన్ని అగౌరవపరచడం అన్నా.. రాజకీయ విమర్శల కోసం ఆయన పేరును వ్యంగ్యంగా ఉచ్చరించడమన్నా ఈ దేశ పౌరులను కించపరచడమే అవుతుంది.
మనసు లోపల విషం దాచుకొని..
అంబేడ్కర్ లేకుంటే నేనెక్కడ ఉండేవాడిని అంటూ అనేకసార్లు మోడీ సందర్భాన్ని బట్టి గుర్తు చేశారు. రాజకీయ ప్రచారాలలో అంబేడ్కర్ పేరును తలుచుకుంటూ ఓట్ల రాజకీయం కోసం ప్రయత్నాలు చేశారు. కానీ అదంతా పైపై మాటలేనని వాస్తవం బయటపడుతోంది. మనసు లోపల అంబేడ్కర్ మీద విషం దాచుకొని ఉన్నారనే దానికి ఈ మధ్య పార్లమెంట్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిజంగా ఈ భారతదేశ ప్రజలను అవమానించినట్లే. రాజకీయాల అవసరాల కోసం అధికార పార్టీగా బీజేపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా సమంజసం కాదు. పార్లమెంట్ సాక్షిగా రెండు జాతీయ పార్టీలు ముష్టి యుద్ధానికి దిగడం విచారకరం. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో ఈ దేశంలో ఏ ఒక్కరి జీవన విధానాలు మెరుగుపడవు. కేవలం అంబేడ్కర్ హక్కులను ఆచరణాత్మకంగా అవలంభించిన నాడే అది సాధ్యం అవుతుంది. అలా చేయకుండా ప్రజల మనోభావాలపై రాజకీయ గాయం చేయడం మంచిది కాదు. 76 ఏళ్లు దాటిన స్వాతంత్ర్య భారతదేశంలో ఇంకా అంబేడ్కర్ అంటే ఏదో మూలన విషం దాగి ఉందనడానికి పార్లమెంటు వేదికగా జరిగిన మాటలే బలంగా కన్పిస్తున్నాయి. రాజకీయం కోసం ఎంతకైనా దిగజారే విలువలు లేని వ్యక్తులు ఉన్నారు కానీ ఈ దేశంలో మహిళల కోసం హిందూ కోడ్ బిల్లు అమలు చేయకపోతే ఆనాడే తన మంత్రి పదవికి రాజీనామా చేసిన త్యాగమూర్తి అంబేడ్కర్. అటువంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా ఈ దేశానికి మంచిది కాదు.
అంబేడ్కర్ ఉనికిని ఇలా వాడతారా?
ఈ దేశంలో ఓ పక్క ఆకలి మరోవైపు నిరుద్యోగం తాండవిస్తోంది. అటువంటి వాటిపై కనీస విధానపరమైన నిర్ణయాల అమలు కోసం ఆలోచించకుండా కేవలం తమ రాజకీయ ఉనికి కోసం జాతీయ పార్టీల ఆరాటం ఎక్కువైంది. రాజకీయ ఎత్తుగడలో కోసం అంబేడ్కర్ పేరును ఉచ్చరించాలనుకోవడం నిజంగా మూర్ఖత్వం అవుతుంది. పార్లమెంట్ విధాన నిర్ణయాలకు వేదికగా ఉండాలి అటువంటిది పార్లమెంటు సభ్యులే సహనం కోల్పోయి తీవ్ర గాయాల పాలు చేసుకునేలా ఆందోళనకు దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు. ఈ దేశానికి గుండెలా ఉండాల్సిన పార్లమెంట్ నేడు రాజకీయ కక్షలతో నిండుకున్నదే తప్ప సామాన్యుని బతుకు మారే చర్చకు ఎక్కడా చోటు కన్పించడం లేదు. భారత రాజ్యాంగానికి లోబడి పని చేస్తానని నిండు పార్లమెంట్‌లో ప్రమాణం చేసి.. మరో వైపు ఆ రాజ్యాంగ నిర్మాతపై విషం చిమ్మే నాయకులను ఎలా అర్థం చేసుకోగలం? భారతదేశం భౌగోళికంగా ఉన్నంత కాలం ఆయన నామస్మరణ చేస్తూ ముందుకు సాగాల్సిందే. అంబేడ్కర్ పేరును తక్కువ చేయాలని ఎన్ని కుట్రలు చేసినా అది భారతదేశ కీర్తిని తగ్గించుకోవడమే అవుతుంది. అంబేడ్కర్‌ను ప్రజల మెదళ్లలో నుంచి తొలగించాలనుకోవడం ఈ దేశ ఊపిరి తీసినట్లే అవుతుంది.
సంపత్ గడ్డం
78933 03516