- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టెట్‌తో పాటు.. టీఆర్టీ నిర్వహించాలి!
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షను(టెట్) మరోసారి నిర్వహించాలని విద్యాశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తాజాగా నిర్ణయించింది. పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2011 జూన్‌లో మొదటిసారి, 2012 జనవరిలో రెండవసారి, 2012 మే నెలలో 3వ సారి టెట్‌పరీక్ష జరిగింది. 2012 ఆగస్టులో 21 వేల టీచర్ పోస్టులకు అప్పటి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించింది. ఆ తర్వాతి ఏడాది 2013 సెప్టెంబర్‌లో 4వ టెట్ నోటిఫికేషన్‌తోపాటే, 20 వేల పోస్టులకు డీఎస్సీ తేదీలను వెల్లడించింది. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో డీఎస్సీ రద్దు అయ్యి, 2014 మార్చి 16న 4వ టెట్ జరిగింది. రాష్ట్రం ఏర్పడ్డాక, ప్రభుత్వం టెట్ పరీక్షలు పెడుతూ కాలయాపన చేస్తున్నది. 2016 మే 22న తెలంగాణ తొలి టెట్ నిర్వహించింది. రెండోది 2017 జులై 23న నిర్వహించింది. అదే ఏడాది అక్టోబర్ 22న 8,792 పోస్టులకు టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కాలయాపన చేయడంతో.. అభ్యర్ధులు కోర్టుకు వెళ్ళగా, రిక్రూట్‌మెంట్ జరిపింది. కానీ 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక, నాలుగేండ్ల పాటు టెట్, డీఎస్సీ, టీఆర్టీ ఊసే ఎత్తకుండా అభ్యర్థుల ఆందోళనలతో 2022 జూన్ 12 న టెట్ పరీక్ష నిర్వహించింది. కానీ ఇప్పటివరకు టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా మరోసారి టెట్ నిర్వహిస్తామంటున్నారు.
నిజానికి టెట్ ఒక అర్హత పరీక్ష మాత్రమే. పైగా ఈ స్కోర్ వ్యాలిడిటీ లైఫ్‌టైమ్! ఉమ్మడి రాష్ట్రం, స్వరాష్ట్రంలో నిర్వహించిన టెట్లతో కలిపి ఇప్పటికి 4 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించి టీచర్ పోస్టుల కోసం ఆశగా చూస్తున్నారు. కేవలం మరో రెండు లక్షల మంది మాత్రమే టెట్‌లో పాస్ కానివారు ఉన్నారు. అయితే, తాజాగా ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోని టెట్ ప్రకటన ఇచ్చి, ఏదో భారీ స్థాయిలో ఉద్యోగ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్భాటంగా చెబుతుంది. ఈ ఏడాది అక్టోబర్‌లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ఈలోపే టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయినా, కాకున్నా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు అనుమతిచ్చి టీఆర్టీ లేదా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని 4 లక్షల మంది అభ్యర్థులు కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేది. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒకే ఒక్క టీఆర్టీని విడుదల చేశారు. స్కూళ్ళలో టీచర్లు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో.. లక్షలాది మంది నిరుద్యోగుల ఇబ్బందులు తీర్చడంతో పాటు సర్కారు బడిలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు నోటిఫికేషన్జారీ చేయాలి.
-రావుల రామ్మోహన్‌రెడ్డి,
రాష్ట్ర అధ్యక్షుడు, బీఎడ్, డీఎడ్అభ్యర్థుల సంఘం
93930 59998